సడిసేయకో గాలి సడిసేయబోకే

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

రాజమకుటం (1960) సినిమా కోసం దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన లలితగీతం.


పల్లవి :

సడిసేయకో గాలి సడిసేయబోకే

బడలి ఒడిలో రాజు పవ్వళించేనే ... సడిసేయకే


చరణం 1 :

రత్నపీఠిక లేని రారాజు నా స్వామి

మణికిరీటము లేని మహరాజు గాకేమి

చిలిపి పరుగులు మాని కొలిచిపోరాదే ... సడిసేయకే


చరణం 2 :

ఏటి గలగలకే ఎగిరి లేచేనే

ఆకు కదలికలకే అదరి చూసేనే

నిదుర చెదరిందంటే నే నూరుకోనే ... సడిసేయకే


చరణం 3 :

పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే

నీలిమబ్బుల దాగు నిదుర తేరాదే

విరుల వీవన పూని విసిరిపోరాదే ... సడిసేయకే