సకలనీతిసమ్మతము/పుట 36

వికీసోర్స్ నుండి

ఆ. ఆస్తరణములందు నరయఁ బైచీరల
ధూమమండలములు దోచుచుండు
తంతుపక్షరోమతాపరిభ్రంశన
మగు విషప్రదిగ్ధ మైనయపుడు.266

క. లోహముల మణులయందును
వాహములం గజగురుత్వవర్ణస్పర్శ
వ్యాహతియును మఱి పంకవి
దేహము నుదయించు విషదేహం బైనన్. 267

ఉ. ఊరకయుండి యల్లనగుచుండెడి నోరును నావలింతలున్
నేరనిమాటలున్ నడవనేరక తాఁ గడు మైఁ జెమర్చుటల్
వారక దిగ్విలోకన మవారితకంపము వేగిరింపు దు
ర్వారనిజస్థలోద్యదనవస్ధితియున్ విషదాయిచిహ్నముల్. 268

క. జనపతి యన్నముఁ బానము
గొనుచోట్లను నౌషధములు గొనియెడుచోటన్
అనుదినము దత్పరీక్షక
జనములతోఁ గూడికొనుట సద్బుద్ధియగున్. 269

క. విపులప్రసాధనంబులు
సుపరీక్షకు లైన హితులు శోధించుటయున్
నృపపరిచారికు లెల్లన్
నృపతికి నీవలయుఁ గడు వినిర్మలబుద్ధిన్. 270

క. హితజనులు సేరి యల్లన
యితరులు పుత్తెంచినవి పరీక్షింపఁదగున్
ఇతరస్వజనపరీక్షిత
పతిఁ గడు రక్షింపవలయుఁ బరమాప్తులకున్. 271

కామందకము



క. పరనృపతులు పుత్తెంచిన
పరవస్తుచయంబు ముట్ట వలవదు విషదు
స్తరమంత్రయంత్రమాయా
పరిశుష్కాస్పదము లగుటఁ బార్థివుఁ డర్థిన్. 272

పురుషార్థసారము



క. తనయెఱుగువాఁ డొనర్చిన
తనయెఱిఁగెడి వాహనములు తగు నెక్కంగాఁ
దనయెఱుఁగని మార్గంబుల
ఘనసంకటమార్గములను గా దరుగంగన్. 273

గీ. ఇతఁడు వంశక్రమాగతుఁ డితఁడు హితుఁడు
ఇతఁడు దుర్జనుఁ డనుమతి నెఱుకపఱచి
సుజను లగువారి సత్కృపఁ జూడవలయు
నెపుడు నాసన్నవర్తుల నృపవరుండు. 274

క. క్రూరులను దుష్టదోషుల
భూరినిరాకృతుల నకృతపుణ్యులఁ బతి దా
దూరమున విడువవలయును
వైరిసమీపముననుండి వచ్చినవారిన్. 275