సంస్కృతన్యాయములు/విన్నపము

వికీసోర్స్ నుండి

విన్నపము

మిత్రుల ప్రోత్సాహముచే "లక్ష్మీగ్రంథమండలు" యను నొండు గ్రంథమండలి స్థాపించితిని. కేవల మీయది వృత్తిగా బెట్టుకొని గ్రంథముల మూలమున ధన మార్జించ వలయునని తలంపుగాదు. లోకోత్తరపురుషులచే వ్రాయబడి జీర్ణములైయున్న గ్రంథములను, సర్వజనోపయోగములగు పుస్తకములను బ్రకటించి, నా నేర్చినంత, ఆంధ్ర భాషామతల్లికి సేవచేయవలయునను సంకల్పమే నన్నీకార్యమునకు బురికొల్పినది.

కొన్ని సంవత్సరములనుండి "సంస్కృతన్యాయములు, సంస్కృత లోకోక్తులు, తెలుగు జాతీయములు, తెలుగు సామెతలు" పుస్తకరూపముగా బ్రకటించవలయునని యత్నించుచు, అందులకు వలయు కొంత సామగ్రిని సంపాదించి, నా మిత్రులగు, విద్వాంసుల కెరింగించితిని. వారును సంతసించి కొంతవరకు దోడ్పడిరి. అందు ముఖ్యులు శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి సొదరులు.

గ్రంథమండలియం దాదరముంచి సుప్రసిద్ధులు, మధురకవులునగు శ్రీ నాళం కృష్ణరావుగారు, వా రెన్నియో సంవత్సరములనుండి సేకరించుచున్న, కొన్ని సంస్కృతన్యాయములు, తెలుగు జాతీయములు, తెలుగు సామెతలు మాకు బ్రసాదించియుండిరి. ఆధునికకవులు, శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారు బి.ఏ., బి.యిడి. (Deputy Inspector of schools) నా యందభిమానముంచి, కొన్ని సామెతలు, జాతీయములు నిచ్చియుండిరి. వీ రిరువురకు నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు.

ప్రప్రథమమున "లోకోక్తిముక్తావళి" యను పేరుతో తెలుగు సామెతలు ప్రకటింతుమని వెల్లడిజేసితిని. కాని పండితులు "సంస్కృతన్యాయములు" ప్రకటించవలసినదని నుడువగా నీయది ప్రకటించితిని. అచిరకాలమున తెలుగు జాతీయములు, సామెతలు ప్రకటింపబడును.

నాయం దాదరభావము వహించి సంస్కృతన్యాయములు, జాతీయములు, సామెతలు కూర్చి వ్యాఖ్యానములు వ్రాసి యిచ్చుచుండిన, శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, వారి సొదరులు ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రిగార్లకు నా ధన్యవాదములు.

ఆంధ్రమహాశయు లెల్లరు మా గ్రంథమండలియం దాదరభావము వహించి, చందాదారులుగా జేరి ప్రోత్సహింప బ్రార్థితులు.

లక్ష్మీగ్రంథమండలి, విధేయుడు,

తెనాలి. పి. యల్. నారాయణ.

24-11-39 సంపాదకుడు.