సంస్కృతన్యాయములు/తొలిపలుకు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తొలిపలుకు

రత్నాకరమువలె నతిగంభీరమైన గీర్వాణభాషయందు సుందరతరములవు శ్లోకములను సరముల గొలికిపూస లన జను న్యాయము లెన్ని యున్నవో యెరింగికొనుట కడుంగడు దుర్ఘటము. అవ్వానివిలువ విజ్ఞఉలకుమాత్రమే విదితము.

కొందరు సుమనసు లతి శ్రమ కోర్చి చాలవరకు న్యాయములను తగు వ్యాఖ్యానములతో బ్రకటించి దేశోపకార మొనరించియుండిరి. అందగ్రస్థానము వహింపగల గ్రంథములును లేకపోలేదు. అట్టివి చాలవరకు సంస్కృతాది భాషలలో నున్నవి. వానియందును న్యాయజాల మంతయు సమగ్రముగ నున్నట్లు కన్పట్టదు. తత్కృతికర్తలు తామిడుకొనిన సరణి కనువవువానిని మాత్రము గ్రహించియుండిరి.

ఎన్నియో సంవత్సరములనుండి లౌకిక, వైదిక న్యాయము లొకచో గూర్చి తగువ్యాఖ్యానములతో నాంధ్రమున సహృదయులమ్రోల నిడవలయు ననుకుతూహలమున దత్ప్రయత్న మొనర్చుచుంటిమి. ఈ యుద్యమమున మాకు దోడ్పడినమామిత్రులు మధురకవులు శ్రీ నాళం కృష్ణరావుగారి కెంతయు గృతజ్ఞఉలము.

దైవానుగ్రహమున నేటికి మాప్రయత్న మొకింత ఫలించినది. తప్పొప్పు లటుండ నిండు, పుస్తకరూపముగ సుమారు పండ్రెండువందలు న్యాయకుసుమములు పాఠక మహాశయుల కరములయం దిడుచున్నాము. ఇయ్యది రెండు భాగములు. మొదటిభాగమున వైదిక, లౌకిక న్యాయములు గూర్పఁబడినవి. వేదాంతవ్యాకరణాది పరిభాషలనుండియు, లోకోక్తులనుండియు వెలువడినవియు, కేవలము పరిభాషా స్వరూపముగనే యుండునవియు, నవున్యాయములు ద్వితీయ భాగముగ గూర్చితిమి. అట్ళు విడివిడిగ నుండు టాయా విషయముల గృషిసేయువారల కెంతయు లాభము గలిగించునని మా యాశయము. మొత్తము రెండు భాగములును గలిపి యొకే సంపుటముగఁ జేసితిమి.

ప్రయత్నము మాత్రము చాలకాలమునుండి జరుగుచున్నను, ముద్రణముమాత్రమ వ్యవధిగ జరుగుటచే వ్రాతప్రతిని తిరిగి సరిగ వ్రాయకయే ముద్రింపించితిమి. అందు వలన ప్రమాదము లటనట సంభవించినవి. అవన్నియు త్వరలో రానున్న ద్వితీయముద్రణమున సవరించువారము.

శ్రమయన కందందు సోదాహరణముగ న్యాయచయ స్వరూపప్రయోగములను వివరించిన మహనీయుల కెంతయు గృతజ్ఞఉలము.

ప్రమాదవశమున సంభవించిన ప్రమాదములను, మా సాహసమును బుధులు మన్నింతురుగాక.

మాయం దనుగ్రహముంచి, తమ యభిప్రాయముల నొసంగిన మహాపురుషులకు మా ధన్యవాదములు.

ఆదరమున మా పుస్తకమును బ్రకటింప బూనుకొనిన లక్ష్మీగ్రంథమండలి వారెంతయు బ్రశంసనీయులు.


కొల్లూరు విధేయులు,

                     శాస్త్రి సోదరులు
                     వ్యాఖ్యాతలు.