సంపూర్ణ నీతిచంద్రిక/అతి సంపాదనేచ్ఛచే వింటిదెబ్బతగిలి మరణించిన నక్కకథ
అతి సంపాదనేచ్ఛచే వింటిదెబ్బతగిలి మరణించిన నక్కకథ
కల్యాణకటకమను పట్టణమున భైరవు డనెడి బోయవాడు గలడు. వా డొకనాడు వేటకై యడవి కేగెను. అచట నొక మృగమును వేటాడి చంపి దానిని బుజముపై మోచికొని వచ్చుచుండగా నొక యడవిపంది యాతనికి గనబడెను.
ఆతడు బుజము మీది లేడిని క్రిందికి దించి వెల్లెక్కు వెట్టి బాణము సంధించి యా వరాహముం గొట్టెను. అదియు మిక్కిలి కోపముతో ఘర్ఘురధ్వని చేయుచు గొమ్మున వానిం గొట్టగా నాదెబ్బకాతడు మొదలు నఱకిన చెట్టువలె నేలమీద గూలి ప్రాణములు విడిచెను. బాణపు దెబ్బచేత నడవిపందియు మరణించెను. అచ్చట నొక సర్పము కిరాత సూకరముల కాలి త్రొక్కిడికి నలిగి చచ్చెను.
ఇంతలో దీర్ఘరావ మను నొకనక్క యాయడవియందాహారమునకై తిరుగుచు నచటికివచ్చి చచ్చిపడియున్న బోయవానిని, సర్పమును, వరాహమును జూచి యిట్లాలోచించెను.
"నాకిపుడు గొప్పయాహారము దొరకినది. ప్రాణులకు దు:ఖము లేనివిధముగా ననుకొననిదే కలుగుచుండునో దైవశమున సుఖములును నట్లే సంభవించుచుండును. నా కీయాహారము మూడు నెలలవఱకును సరిపడును. ఈ కిరాతునిమాంస మొక నెలకు జాలును. లేడిమాంసముతో నింకొక నెలయు బంది మాంసముతో మఱియొకమాసమును గడుపవచ్చును. సర్పమాంస మొక్కరోజునకు జాలును. ఈవింటినారి నరము దిని మొదటియాకలి దీర్చుకొందునుగాక" యని తలచి యావింటి చేరువకు బోయి నారి గొఱుకగనే బెట్టువదలి వింటికొన గాటముగ ఱొమ్మున దగిలి ప్రాణములు దీసెను.
అతిలోభ మెంత హానికరమో చూడుము. దానమునకు భోగమునకు వినియోగపడినది మాత్రమే స్వధనము. అట్లుపయోగింపక కూడ బెట్టినది యితరులపా లగును. గతించిన దానికి విచారమేల? పండితులు రానిదానికై ప్రాకులాడరు; పోయినదానికి విచారింపరు. ఆపదవచ్చినను గలత నొందరు. కావున నీవెప్పుడు నుత్సాహము గోలుపోవకుము. శాస్త్రములెన్ని చదివినను గ్రియాశూన్యుని బండితు డనుట చెల్లదు. ఔషధమెంతమంచి మందైనను బేరుచెప్పినంతమాత్రాన రోగులకు సుఖమొసగదు గదా! ఉత్సాహములేనివానికి బాండిత్యము గ్రుడ్డివానికి దనచేతియందలి దివ్వియవలె నిరుపయోగము. కావున నోరిమి వహింపుము. పరస్థలమునకు వచ్చితినని చింతింపకుము.
రాజు, కులస్త్రీ, మంత్రులు, దంతములు, కేశములు, నఖములు, నరులు స్థానభ్రష్టులైన శోభింప రను వాక్యము కాపురుషుల విషయమున మాత్రమే వర్తించును. సింహములు, సత్పురుషులు, గజములు, సర్వదేశములందు సంచరించి కీర్తినొందుట లేదా? మఱియు గాకములు, మృగములు, కాపురుషులు స్థానమునుండి కదలజాలక యచటనే నశింతురు. అభిమానధనుడగు వీరునకు దనదేశమనియు, బరదేశమనియు భేదములేదు. ఎచటికేగిన నచటనే తనసామ ర్థ్యముచేత ఖ్యాతిగాంచును. నిండిన చెఱువును మండూకములు సేరినట్లు సర్వసంపదలు నుత్సాహవంతుడగు పురుషుని బొందును.
దేహికి సుఖదు:ఖములు కాలక్రమమున సంభవించుట సహజము. సంపదగలిగినపుడు గర్వము, నాపద గలిగినపుడు ఖేదము దగవు. ధనములేకున్నను వీరుడు గౌరవము సంపాదింపగలడు ఎంతధనమున్నను నీచునకు గౌరవ మించుకయైన గలుగదు. కుక్కకు బంగరునగ లెన్నితొడిగిననను సింహమునకుండు సహజతేజస్సు గలుగదు గదా! మేఘముల చాయము, ఖలుల ప్రీతియు, యౌవనము, ధనము గొలది కాలముమాత్రము నిలిచియుండును. పుట్టించినప్రాణు లందఱకు నాహారము దేవుడే యేర్పఱుపక మానడు. కాబట్టి యాహారమునకై యంతప్రయాసపడ నక్కఱలేదు. ధనము లేవిధమున జూచినను దు:ఖ కారణములే యగుచున్నవి. ముందు ముందు సంపాదించుట కష్టము. పిదప దానివలన గలుగు గర్వము కలిగించు దు:ఖము లనంతములు. సంపాదించిన ధనములకు హాని గలిగిన నెట్టిదు:ఖము గలుగునదియు వర్ణింప జాలము.
ధర్మకార్యములపేరు చెప్పి ధనము సంపాదించుటయు ననవసరము. అడుసు ద్రొక్కనేల? కాలుకడుగ నేల? ఆకసమున బక్షులచేతను, నేలమీద బులులచేతను, జలములందు మకరములచేతను నామిషము భక్షింప బడుచుండును. ధనికు నందఱు నన్నివిధముల వేధించుకొని తినుచుండుదురు. దేహిని మృత్యువు బెదరించునట్లు, రాజు, జలము, నగ్ని, స్వజనులు ధనికు నెల్లపుడును బాధించుచుందురు. ధన సంపాదనమే కష్టము. ఆర్జించిన దానిం గాపాడుకొనుట మఱియు గష్టము. దానికి హాని గలిగెనా మృత్యుబాధ గలుగును. కావున దానిపై నాశవీడుట మేలు. తృష్ణ ప్రసరించినవాని శిరముపై దాస్యము తాండవించుచుండును. అది వీడిననాడు ధనికుడనియు, దరిద్రుడనియు భేదభావము గలుగదు. నెఱవేఱుచున్న కొలదియు గోరికల కంతమే యుండదు. కావున నిచ్చట నుండి కాలము గడపుము." ఈవిధముగా బలికిన మంథరుని మాటలు విని లఘుపతనకు డిట్లెనెను.
"మంథరా! ధన్యుడ నైతిని. నీగుణములు కొనియాడ దగినవి. బురదలో దిగబడిన యేనుగులను లేవనెత్తుట కేనుగులే సమర్థము లయినట్లు సత్పురుషుల కాపద గలిగినపుడు సన్మిత్రులే దానిని దొలగింపగలరు. మహాత్ముల స్నేహము లామరణాంతములు: కోపములు క్షణికములు; త్యాగములు జంకులేనివి. యాచకుని, శరణాగతుని, నెవరు నిరాశతో వెడలింపరో వారే సకలగుణములకు నాలవాల మగుదురు."