సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/చిన్నయసూరి
చిన్నయసూరి పరవస్తు :
ఆధునికాంధ్ర గ్రాంథిక భాషా ప్రపంచమునకు మూలస్తంభ మనదగినవాడు పరవస్తు చిన్నయసూరి. పరవస్తు వారి యింటిపేరు. 'సూరి' అతని బిరుదము. 'చిన్నయ' యనునది ఆతనిపేరు. చిన్నయసూరి మదరాను రాష్ట్రమునందలి చెంగల్పట్టు జిల్లాలో శ్రీ పెరుంబుదూరు గ్రామమున క్రీ. శ. 1806 వ సంవత్సరమున జన్మించెను. చిన్నయసూరి తండ్రి పరవస్తు వేంకటరంగయ్య, తల్లి శ్రీనివాసాంబ. వీరు తమిళదేశమున స్థిరనివాసము కల ఆంధ్రులు. పరవస్తువారు చాత్తాద (సాతాని) వైష్ణవులు.
చిన్నయసూరి బాల్యమున విద్యాభ్యాసమునందు కొంతకాలము శ్రద్ధలేక అల్లరిచిల్లరగా తిరిగినను, తరువాత అమిత శ్రద్ధాసంక్తులతో తన తండ్రియొద్దను, శ్రీ కంచి రామానుజాచార్యుల యొద్దను, శ్రీ రామశాస్త్రులను విద్వాంసునికడను విద్యాభ్యాసము గావించి, వ్యాకరణ, తర్క, మీమాంసాలంకారాది శాస్త్రము లందును, వేదమునందును చక్కని పరిచయమును సంపాదించెను. సంస్కృతాంధ్ర ప్రాకృతములందును, అరవమునందును చిన్నయ గొప్ప పరిశ్రమగావించి, వాని యందు చక్కని పాండిత్యము సంపాదించుకొనెను. ఇంతేకాక చిన్నయసూరి, తరువాతి కాలమున ఆంగ్లభాషను గూడ కొంత నేర్చికొనియెను. చిన్నయసూరి చిరుతవయసుననే మంచి పాండిత్యమును సంపాదించు కొనుటయే కాక, హయగ్రీవ మంత్రోపాసకుడై దైవ బలమును గూడ సంపాదించెను.
చిన్నయసూరి తండ్రిగారు చెన్నపురిలో అప్పటి ప్రభుత్వముచేత న్యాయాధికారులుగా నియమింపబడినందున, సూరియు వారితోపాటుగా మదరాసు చేరుకొనెను. కొంతకాలమునకు సూరిగారి జనకులు మరణించిరి. అప్పుడు చిన్నయసూరి ఉద్యోగమునకయి వెదుక నారంభించెను. మొదట నాతనికి చెన్నపురిలో అప్పను మిషన్ పాఠశాలయందు కొలదిపాటి వేతనముగల యొక చిన్న యుపాధ్యాయ పదవి లభించెను. మరియొకవైపు సూరి తనకున్న కొలదిపాటి యాంగ్లభాషా పరిచయముతో క్రిష్టియను మిషనరీలకు తెలుగుభాషను బోధించు చుండెను. ఇంకొకవైపు పండితపరీక్షలకు వెళ్ళువారికి వేరుగా భాషా విషయములను బోధించుచుండెను. తరువాత కొన్నినాళ్ళకు సూరి పచ్చయప్ప పాఠశాల యందు పండితుడుగా నియమింపబడియెను. అప్పటి కింకను మదరాసు విశ్వవిద్యాలయము స్థాపితము కాలేదు. ఆ పిదప పది సంవత్సరములకు మదరాసు విశ్వవిద్యాలయమును, దానితోపాటుగా నేటి మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలయు అవతరించెను. చిన్నయసూరి ఆ కళాశాల యందు పండితులుగా నియమింపబడి, 1861 వ సంవత్సరము వరకును అచటనే ఆ యుద్యోగమున నుండిరి. ప్రెసిడెన్సీ కళాశాలయే మదరాసు విశ్వవిద్యాలయమునకు ముఖ్య కళాశాల కనుక, చిన్నయసూరియే మదరాసు విశ్వవిద్యాలయ ప్రధాన పండితులుగా పరిగణింప బడుచుండిరి. ఆ నాడు మొదట ప్రెసిడెన్సీ కళాశాలకు అధ్యక్షుడుగను, తరువాత మదరాసు విశ్వవిద్యాలయ కార్యదర్శిగను నుండిన ఏ. జే. ఆర్బత్‌నట్ దొరయే చిన్నయ పాండిత్య విశేషములు కలరి వారికి 'సూరి' యను బిరుదమును, తత్సూచకమగు సువర్ణ పతకమును బహూకరించిరట ! నాడు మొదలు చిన్నయ 'చిన్నయసూరి' యయ్యెను. 1861 సం.న రాచపుండు పుట్టి సూరి కళాశాలోద్యోగమును వదలివేయవలసివచ్చెను. ఆ మరుసటి సంవత్సరమే యాతడు జీవయాత్ర చాలించెను ఇది యాతని సంగ్రహ జీవితము. ఇక చిన్నయసూరి రచనములను గూర్చి పరిశీలింతము.
చిన్నయసూరి పేరు తలచినంతనే, మనకు స్ఫురించునవి ఆతని 'బాలవ్యాకరణము, నీతిచంద్రికలు ' సూరి బాలవ్యాకరణము 1858 వ సం. మొదటి మారుగా ముద్రితమయి ప్రకటింపబడియెను. నీతి చంద్రిక యంతకు ముందే 1853 వ సం.న రచితమయి ప్రకటింపబడినది. చిన్నయసూరి కీర్తిని ఆంధ్రవాఙ్మయ చరిత్రమున శాశ్వతముగా నిలుపునవి పై రెండు గ్రంథములే యనుటలో సందేహము లేకపోయినను, సూరి రచించిన ఉత్తమ గ్రంథము లింకను బెక్కులుగలవు. చింతామణి వృత్తి, పద్యాంధ్రవ్యాకరణము, సంస్కృతసూత్రాంధ్రవ్యాకరణము, శబ్దలక్షణ సంగ్రహము, విభక్తి బోధిని, ఆంధ్ర ధాతుమాల, అక్షరగుచ్ఛము, ఆంధ్రశబ్దశాసపము, బాలవ్యాకరణము, బాలవ్యాకరణ శేషము, ఆంధ్ర కౌముది యనునవి సూరి వ్యాకరణ రచన అయినట్లు తెలియుచున్నది. ఇదికాక ఆదిపర్వవచనము, నీతి చంద్రిక, ఆంధ్ర కాదంబరి, ఇంగ్లీషు లా చట్టముల భాషాంతరీకరణము, మున్నగు వచనరచనలును, విశ్వనిఘంటు టీక, అకారాది నిఘంటువు మున్నగు నై ఘంటిక రచనలును, పచ్చయప్ప నృపయశోమండనము, చాటుపద్యములు మున్నగు పద్యరచనలును చిన్నయసూరి వెలయించెను. వీటిలో కొన్ని సగములోనే విడువబడిన రచనలు ; మరికొన్ని సంకలన గ్రంథములు; కొన్ని యాంధ్రీకరణములు. ఇవియన్నియును కాక సూరి 'సుజన రంజని' యను నొక సాహిత్య పత్రికను గూడ స్థాపించి కొంతకాలము నడిపెనట. సూరి వ్రాయనారంభించిన ఈ గ్రంథము లన్నియు పూర్తి యయియున్నచో, ఆంధ్రభాషకు అవి అమూల్యాలంకారములయి యుండుననుటలో సందేహము లేదు.
చిన్నయసూరి రచనలలో వ్యాకరణమును గురించినవే యెక్కువ. కొలదిగానున్న ఆతని పద్యములను పరిశీలించినచో సూరి మహాకావ్య నిర్మాణము నొకదానిని చేసి యుండిన, ఆతని కదియును గొప్ప కీర్తిని కలిగించియుండుననిపించును. సూరి సంస్కృతాంధ్రములు రెంటను రసవత్కవిత వ్రాయగల నేర్పరి. అంతేకాదు, సూరి యెందులకోగాని, తాను వ్రాయదలచుకొన్న సూత్రాంధ్రవ్యాకరణమును సైతము సంస్కృతములోనే ఆరంభించినాడు.
ఈ సూత్రాంధ్రవ్యాకరణమును, బాలవ్యాకరణమునకు పూర్వమే సూరి రచించెను. అయినను ఇది విద్యార్థి జనులకు భాషాలక్షణమును సులభముగా తెలుపజాలనిదని భావించి, సూరి అందలి సూత్రములనే కొన్నింటిని తెనిగించి బాలోపయోగముగా బాలవ్యాకరణమును ముందుగా ప్రకటించెనట. ఈ విషయమును చిన్నయసూరి,
“మును మదుపజ్ఞం బగుచుం
దనరిన వ్యాకృతిని సూత్రతతి యొక కొంతం
దెనుగించి యిది ఘటించితి
ననయము బాలావబోధమగు భంగి దగన్."
అని బాలవ్యాకరణము చివర వచించెను. సూత్రాంధ్ర వ్యాకరణమును ఆతడు పూర్తిచేసి ప్రకటనానుకూలముగ
సిద్ధముచేసినట్లు కానరాదు. ఇందు బాలవ్యాకరణ సూత్రములకు మూలము లయిన సూత్రము లనేకములు కలవు. ఇందుగల కొన్ని సూత్రములకు బాలవ్యాకరణమునం దనువాదములు కనుపింపవు. కొన్ని సూత్రములు ప్రౌఢ వ్యాకరణ సూత్రములకు మూలములా ? అనదగినవిగా గనుపట్టుచున్నవి. ఇందు గ్రంథారంభమున సూరి “శాసన మిదం దిక్ప్రదర్శకమ్" అని సూత్రించి, "అజ్ఞాత దిశందేశం జిగమిషోః పాన్థస్య మార్గం పృచ్ఛతః పురుషేణ కేన చి దేవం యా హాతి హస్త నిర్దేశేన దిశోదర్శనవ దిదం శాసనమధి జిగమిషూణాం ప్రథమ ప్రవృత్తా వుపకారకం భవతీత్యర్థః" అని దానిని వివరించినాడు. అనగా శాస్త్రము దిక్ప్రదర్శనమే కాని సమగ్రముగా శాసకము కాదనుట. ఇందు సూత్రములు, సూత్ర వివరణములు కొన్ని యెడల నుదాహరణములు మాత్రమే కాక, అక్కడక్కడ కొన్ని శ్లోక రూప కారికలును గలవు. సూరిరచిత వ్యాకరణములలో మరియొక విస్తృత ప్రణాళికగల గ్రంథము ఆంధ్ర శబ్దానుశాసనము.
ఆంధ్రశబ్దానుశాసనమునందు సంజ్ఞ, సంధి, తత్సమ, ప్రకీర్ణకక్రియా, తద్భవ పరిచ్ఛేదములు కలవు. ఇది చింతామణి సంప్రదాయములను బాలవ్యాకరణము కంటె ఎక్కువగా పాటించి రచించిన వ్యాకరణము. ఇందు యశ్రుతియును, గ్రామ్యముతోగూడ భాషకు చతుర్విధత్వమును. హలంత శబ్దములలో గుణవదాన్య గుణవదాది విభజనమును గాననగును. సూత్రాంధ్ర వ్యాకరణములోని సూత్రములకు అనువాద సూత్రములును, చింతామణి సూత్రానువాదములును ఇందు గలవు.. అయినను ఇందు కొంత స్వతంత్రత లేకపోలేదు. కొన్ని సూత్రములు బాలవ్యాకరణ సూత్రములను పోలియే యున్నవి. కాని వాటికి బాలవ్యాకరణ సూత్రముల కున్నంత బిగువు కానరాదు. అయినను ఆ బిగువును సాధించుటకు చిన్నయసూరి కావించు ప్రయత్న మిందు కాననగును.
చిన్నయసూరి మరియొక పద్యాంధ్ర వ్యాకరణమును రచించెను. దీనిలో నలువదియెనిమిది పద్యములు గలవు.
ఇది అసమగ్రము. మొత్తముమీద బాలవ్యాకరణము కాక, ఇతడు ఎనిమిది తొమ్మిది వ్యాకరణములను
అంతకుముందు రచించినట్లు తెలియుచున్నది. ఇట్లెంతో కాలము వ్యాకరణరచనమునకు తన శక్తిని వినియోగించినవా డగుటచేతనే, చిన్నయసూరి బాలవ్యాకరణమును అంత చక్కగా రచింపగల్గెనట.
బాలవ్యాకరణ రచనమే చిన్నయసూరికి ఆంధ్ర వ్యాకర్తలలో ప్రముఖస్థానము నొసంగి, ఆతనిని లాక్షణిక సార్వభౌముని గావించినది. నేడాంధ్రవ్యాకరణ గ్రంథములలో దేనికిని బాలవ్యాకరణమున కున్నంత ప్రచారము లేదు. దానిపై వ్రాయబడినన్ని వ్యాఖ్యలు తెనుగు వ్యాకరణములలో ఏ యితర గ్రంథములపైనను వ్రాయబడ లేదనినచో, దాని వైశిష్ట్యము కొంత తెలియును. ప్రాచీనాంధ్ర వ్యాకరణముల యందు ఆంధ్రశబ్ద చింతామణి ఇతర వ్యాకరణముల ప్రచారమును తగ్గింపజేసినట్లే, బాల వ్యాకరణము తనకు ముందు ప్రచారమున నున్న వాని నొక్కమారుగా వెనుకకు నెట్టివేసినది. అంతే కాదు. ఆనాడు మొదలు చిన్నయసూరి యొప్పుకొన్న పదమే సాధువుగను, ఆత డనుశాసింపని రూపము అసాధువుగను భావింపబడజొచ్చినది. అయినను బాలవ్యాకరణ విరుద్ధములయిన ప్రాచీన ప్రయోగములు లేకపోలేదు. సత్యమునకు, బాల వ్యాకరణకర్త ఆంధ్రభాషా సర్వస్వమును తన వ్యాకరణమునకు లొంగిపోవలె నని యాశింపను లేదు.
"దిక్ప్రదర్శనముగఁ దెలిపెద నిందు ల
క్షణముగానఁ బూర్వకవుల లక్ష్య
ములను లాఁతి లక్ష్యముల గాంచి తక్కు ల
క్షణ మెఱింగికొనుఁడు చతురమతులు"
అని చిన్నయసూరి తన గ్రంథము భాషా సామాన్యపు స్వరూపమును మాత్రమే చూపగలదనియు, ప్రయోగ
విశేషముల సాధనమునకు ఇది యుద్దేశింపబడలేదనియు, అట్టి వాని నెరుగగోరువారు ఇతర గ్రంథముల నరయ
వలయుననియు వచించియున్నాడు. బాల వ్యాకరణము, దాని పేరును బట్టియే విద్యార్థులకు సులభముగా భాషా
నియమములను దెలిపి సలక్షణమయిన వచనరచనమును అలవడజేయుటకు ఉద్దేశింపబడినదని యెరుగనగును. ఈ విషయమునే చిన్నయసూరియును బాల వ్యాకరణ వీఠిక యందు స్పష్టముగా జెప్పియున్నాడు. విద్యార్థులకు సులభముగా బోధించుటయే గ్రంథకర్త లక్ష్యము గనుక తదను గుణముగనే చిన్నయసూరి ఈ బాల వ్యాకరణ రచనము సాగిపోయినది.
తనకున్న సంస్కృతాంధ్ర వ్యాకరణములందలి పాండిత్యమును, రచనానై పుణిని ఉపయోగించుకొని, చిన్నయ సూరి బాల వ్యాకరణములోని సూత్రములను మిక్కిలి చక్కగా రచించెను. అంతేకాక, సంస్కృతమున భట్టోజీ దీక్షితులు కూర్చిన సిద్ధాంత కౌముది పద్దతి ననుసరించి సూత్రములును, సూత్ర వివరణములును, ఉదాహరణములును క్రమముగా నుండునట్లు రచనము సాగించెను. అక్కడక్కడ సంస్కృతవ్యాకరణ మర్యాదలను ప్రవేశపెట్టెను. సంజ్ఞాది పరిచ్ఛేదములుగా గ్రంథమును విభజించెను. తాను పూర్వము రచించిన వ్యాకరణములనుండియు, అంతకుపూర్వమే రచింపబడి ప్రచారమందుండిన అనేక ఇతర ఆంధ్ర వ్యాకరణములనుండియు తనకు వలసిన విషయములను గ్రహించెను. తన ప్రణాళికకు అనుగుణములు గాని వానిని వదలివేసెను. ఇవియన్నియు కలిసి బాలవ్యాకరణమున కొక విశిష్ట స్వరూపము నొసగి, దాని బహుళ ప్రచారమునకు కారణమయ్యెను. ఇది యంతయు సూరి తన ప్రతిభచే సాధించిన విజయమేకాని అన్యము కాదు .
సూరి బాలవ్యాకరణము, హరికారికలకు అనువాద మను నొక వాదము కొంతకాలముక్రింద కొందరిచే ప్రచారము చేయబడెను. కాని వీరేశలింగము మొదలగువారు ఆ వాదమును ఖండించి, హరికారికలే బాలవ్యాకరణ సూత్రములకు సంస్కృతీకరణము లని సహేతుకముగా నిరూపించియున్నారు. ఏమయినను ఈనాటి గ్రాంథి కాంధ్ర భాషాస్వరూపమును తీర్చిదిద్దిన ఘనత బాలవ్యాకరణ కర్త దనుట యథార్థము.
లక్షణకర్తగా చిన్నయసూరికి ఘనమయిన యశస్సు నొసగినది బాలవ్యాకరణము కాగా, రచయితగా, ఆతని కీర్తిచంద్రికలను వ్యాపింపజేసినది 'నీతిచంద్రిక'.
నీతిచంద్రిక సంస్కృత పంచతంత్ర, హితోపదేశము లాధారముగా తెలుగు భాషలో వెలసిన స్వతంత్ర గ్రంథము. ఆంధ్రవచనము ఎంత బిగువుగానడవగలదో రుచిచూపిన యుత్తమ రచన యది. సంస్కృతములోని హితోప దేశమునకుగాని, పంచతంత్రమునకుగాని రచనమునం దింతబిగువు కానరాదు. ఆ విధానము వేరు; ఈ విధానము వేరు. చిన్నయసూరి నీతిచంద్రికలోని వచన రచనమును ఆంగ్లభాషయందు వ్యాసకర్తగా సుప్రసిద్ధుడయిన బేకన్ మహాశయుని ఆంగ్లవచనముతో పోల్చవచ్చును. బేకన్ మహాశయుని రచనయందు చిన్నచిన్న వాక్యములు కానవచ్చును. ఆ చిన్న వాక్యములందే ఎంతో లోకానుభవమును, జ్ఞానమును నిండియున్నవిగా గనుపట్టును. అందులోని భాష ప్రాచీనతను బ్రకటించును. ఒక్కొక్క వాక్యమొక నీతివచనమయి, లోకో క్తిగా బ్రయోగింప దగియుండును. మధ్యమధ్య లాటిను వాక్యములు, లాటిను పదవిధులును పానకములోని మిరియములవలె వచ్చుచుండును. తెనుగున చిన్నయసూరి వచనరచనయు నిట్టిదే. చిన్న చిన్న వాక్యములు, ఒక్కొక్క వాక్య మొక్క లోకోక్తిగా నుండుట, మధ్యమధ్య సంస్కృత వాక్యములు, సంస్కృత పదముల పలుకుబడులు, భాషలో ప్రాచీనత - ఇవి యన్నియు కలిసి చిన్నయసూరి వచనమున కొక విశిష్టత నొసంగినవి. నీతిచంద్రికలోనివాక్యములలో సూత్రకర్తయయిన చిన్నయసూరి గోచరించుచుండును.
చిన్నయసూరి నిత్యజీవితము మిక్కిలి నిరాడంబర మయిన దయ్యును, మిక్కిలి నియమబద్ధ మయినదని విందుము. ఆతడు స్ఫురద్రూపిగానుండెనట ! కలువలపల్లి రంగనాథశాస్త్రిగారను సుప్రసిద్ధ పండిత న్యాయమూర్తుల యింట చిన్నయసూరి యుద్ధండ పండితులముందు నిలచి, పూర్వసంసిద్ధత లేకుండగనే అలంకారశాస్త్రమును గురించి ఒకనాడు గంటల తరబడి శ్రుతిరంజనముగా నుపన్యసించెనట! ఆ వినువారు సాయంకాలమయినను, భోజన సమయమయినను, కాలమునే మరచిపోయి సూరిగారి ఉపన్యాసమున మునిగిపోయిరట ! ఇది ఈ తరము వారికి వినికిడి వలన నెరుగదగినదే కాని, నీతిచంద్రిక వచన రచన చూచినచో అట్టిది చిన్నయసూరికి సహజమే యని తోచకమానదు. సూరి నీతిచంద్రికలో మిత్రలాభ, మిత్రభేదములను రెండు ప్రకరణములనే రచించెను. కడమ వానిని కందుకూరి వీరేశలింగముగారును, కొక్కొండ వేంకటరత్నము పంతులుగారును వేరువేరుగా రచించి పూరించిరి. ఆంధ్రభాష యున్నంతకాలము నిలిచియుండగల కీర్తిమూర్తి చిన్నయసూరి.
అ. రా. శ.