సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఘనాదేశము
ఘనాదేశము :
స్థానము, వి స్తీర్ణము : ఆఫ్రికా ఖండములో గినియా తీరముననున్న దేశములలో ఘనా అనునది దాదాపు మధ్య గతముగ నున్నది. ఈ దేశమునకు తూర్పుగా ఫ్రెంచి టోగోలెండు (French Togoland) కలదు. దానికావల ఫ్రెంచి దహోమీ (French Dahomey) విస్తృతమైన నైగీరియా సమాఖ్యయు (Federation of Nigeria) కలవు. పశ్చిమముగా ఫ్రెంచి ఐవరీ కోస్టు (French Ivory Coast), లైబీరియా రిపబ్లిక్ (Liberia Republic), బ్రిటిష్ సైర్రాలియోన్ (British SierraLeone), ఫ్రెంచి గినియా, (French Guinea) అను దేశములు కలవు.
ఈ రాజ్యములన్నియు సముద్ర తీరమువరకు విస్తరించి యున్నవి. కాని వాటి లోతట్టు ప్రదేశపు (inland) సరిహద్దులపై సామూహికముగా ఫ్రెంచి పశ్చిమ ఆఫ్రికా అనబడు విశాల ప్రాంతమునకు చెందిన ఇతర రాజ్యము లున్నవి. ఈ లోతట్టు ప్రదేశములలో నొకటియైన 'ఫ్రెంచి అప్పర్ వోల్టా' (French upper volta) 'ఘనా' అను దేశముయొక్క ఉత్తరపు సరిహద్దు వెంబడిగా నున్నది.
సముద్ర తీరమునుండి లోగర్త ప్రదేశములో ఉత్తర మున అక్షాంశము 11° వరకును 'ఘనా' దేశము వ్యాపించి యున్నది. ఇట్లది దక్షిణమునుండి ఉత్తరమునకు సుమారు 420 మైళ్ళ దూరము ఆక్రమించియున్నది. ఈ విశాలతమమైన భాగమున కడ్డముగా తూర్పునుండి పశ్చిమమునకు గల దూరము స్వల్పము. అనగా రేఖాంశ వృత్తము 11/2° తూర్పునకును, రేఖాంశవృత్తము 31/2° పశ్చిమమునకును నడుమగల దూరము సుమారు 334 మైళ్లు మాత్రమే. బ్రిటిష్ సామ్రాజ్యకూటము (British Commonwealth) లో 'ఘనా' అను నొక్కదేశము మాత్రమే స్వతంత్రమైన పశ్చిమ ఆఫ్రికను దేశమై యున్నది. ఈ దేశముయొక్క మొత్తము వైశాల్యము 91,843 చ. మైళ్లు. 1948 సంవత్సరములో జరిగిన జనాభా లెక్కలనుబట్టి అందలి జనాభా 4,118,450 మంది.
గినియాతీరమునందలి ఇతర భాగములకువలెనే ఘనా యొక్క దక్షిణతీర వైశాల్యమునకు ప్రబలమైన సముద్రపు పోటు తగులుచున్నది. ఓడలు సురక్షితముగా లంగరు వేసికొనగల సహజ నౌకాశ్రయములు లేని సముద్రపు ఒడ్డుకు ఎడ తెగని ఈ సముద్రపు పోటువలన దెబ్బ తగులు తున్నది. కావున ఎక్కువ ధన వ్యయముతో కృత్రిమము లైన (artificial) నౌకాశ్రయ నిర్మాణములుగల టాకోరడీ (Takoradi), టెమ (Tema) అను తావులందు తప్ప, సముద్ర ప్రయాణముచేయు ఓడలు సముద్రతీరమునకు సమీపముగా అరమైలు దూరమున లంగరువేసికొన వలసివచ్చుచున్నది. చిన్నసైజు సర్ఫ్ బోట్లు (surf boats) మాత్రమే ఒడ్డునకును, గర్జించుచున్న అలలకు అవల నున్న లోతైన, ప్రశాంతమయిన నీటికిని నడుమ ప్రమాదభరితమైన ప్రయాణము చేయగలుగు చున్నవి.
రాజకీయ పరిణామము : ఈ దేశము 1957 వ సంవత్సరము మార్చి 6 వ తేదీన స్వాతంత్ర్యమును పొంది 'ఘనా’ అను ప్రాచీననామము ధరించినది. దీనికి 'గోల్డు కోస్టు' అని ఇంగ్లీషుపాలకులు పేరుపెట్టి యుండిరి.
బహుకాలమువరకు 'గోల్డు కోస్టు' అను పదము, స్థానిక ప్రజలు అందజేయు బంగారముతో యూరపియనులు వర్తకముచేయుసముద్రతీర ప్రదేశమునకుమాత్రమే వర్తించెను. 'గోల్డు కోస్టు' అను పదము మిక్కిలి సముచితముగ నున్నది. ఎందుకనగా, బానిస వర్తకము తదితర వ్యాపారముల నెల్లను అతిశయించుటకు పూర్వము, యూరపియనులకు ఈ రేవులనుండి లభించు ముఖ్యమైన వర్తకపు సరకు బంగారమై యుండెను. తీరప్రదేశమున కావల 'ఆశాంతి' యను రాజ్య ముండెను (kingdom of Ashanthi). దాని కుత్తరపు సరిహద్దున ఐరోపావాసు లెరుగని రాజ్య మొకటి యుండెను.
పూర్వము వలసప్రాంతము (colony)గా వ్యవహరింప బడిన ప్రదేశములో పెక్కురాజ్యము లుండెను. స్వతంత్ర ప్రతిపత్తి గలిగి (autonomous) నేటికి అవి స్వతంత్రాధికారము ననుభవించుచుండెను.
'ఆశాంతి' యందు మాత్రమే ప్రజలలో చాలవరకు ఐక్యత ఉండియుండెను. ఆ దేశమందు శక్తిసంపన్నులైన 'ఒసెయ్‌టుటు' (Oseitutu) ప్రభృతిరాజులు క్రమముగా అనేక రాష్ట్రములను ఏక ఖండముగా (unit) సంఘటించిరి. దానికి 'అశాంతి సమాఖ్య' (Ashanthi Confederacy) అని పేరిడిరి. ఈ సమాఖ్య అధినేతలు, సమీపమున గల రాష్ట్రములను జయించి, స్వీయరాజ్యమున కలుపుకొనుట యందు నిమగ్నులై యుండిరి. నేడు ఘనా యందు 108 దేశీయసంస్థానములు (native states) కలవు. ఒక్కొక్క సంస్థానము యొక్క వైశాల్యము 25 నుండి 2000 చ. మైళ్లవర కుండును. ఒక్కొక్క దాని జనాభా 2000 నుండి 228,000 వర కుండును. ప్రతి సంస్థానమునకును ప్రధానాధికారి (paramount chief) యొక డుండును. ఆతని క్రింద చిన్న అధికారులు అనేకులుందురు.
వర్తమాన శతాబ్ది ఆరంభము వరకును పశ్చిమ ఆఫ్రికా యందలి పెక్కు భాగములందు వలె ఈ దేశమందును యుద్ధములు సాధారణములై యుండెను. బలీయమైన ప్రభుత్వములో సభ్యత్వమును సంపాదించుకొనుటయే శత్రుదాడులనుండి ఆత్మరక్షణమొనర్చుకొనుటకు మిక్కిలి శక్తిమంతమైన మార్గమై యుండెను.
పరస్పరముగ స్పర్థించు ఐరోపియన్ ప్రభుత్వముల దుర్గములు సముద్రతీరమువెంబడి యుండుటచే, సమీపమున గల రాజ్యములలో కొన్నిటి యందు చీలిక లేర్పడుటకు కారణమయ్యెను.
బ్రిటిష్ ప్రభుత్వముచే ప్రవేశపెట్టబడిన పరోక్ష పరిపాలనా పద్ధతి ననుసరించి కొందరు తెగ నాయకులు (chiefs) స్థానిక ప్రభుత్వపు ఏజెంట్లుగా నియమింపబడిరి. ఈ పద్ధతి ఆ దేశమున స్వదేశ సంస్థానముల వ్యవస్థ కొనసాగుటకును, స్థిరపడుటకును దోహదమొనర్చెను. మండలములుగా వ్యవహరించు విశాల పాలిత ప్రాంతములలో చిన్న చిన్న రాజ్య సమూహములు ఏర్పడెను. ఈ మండలములు మరల ' కాలనీ', 'ఆశాంతి', 'ఉత్తర పరగణాలు', 'టోగో లెండు' అను బహు విశాలములైన రాజ్యములలో రాష్ట్రములుగా అంతర్భూతము చేయబడెను.
దీనివలన ఫలమిది. దేశీయ సంస్థానములు సాధారణ పరిపాలనా విభాగములందు అంతర్గత భాగములుగా సమీకరింపబడి, అవి ఆక్రా (Accra) అను రాజధానీ నగరము నుండి పరిపాలింపబడునట్లొనర్ప బడినవి. కావున దేశీయ సంస్థానములు నిలిచియున్నను, వాటికి లోగడ నున్న స్వాతంత్ర్యము నశించెను.
నేడు పరిపాలనా సౌకర్యము కొరకు దేశము ఆరు ప్రాంతములుగా విభజింపబడినది. 1. ప్రాక్పశ్చిమ ప్రాంతములు. ఇది పూర్వపు 'గోల్డుకోస్టుకాలనీ' యొక్క తూర్పు, పశ్చిమ విభాగములకు ప్రతియైనవి (corres ponding); 2. ఆశాంతి- బ్రాంగ్ - అహాఫో (Ashanthi - Brong - Ahafo) ప్రాంతములు. వీటికి పూర్వము 'ఆశాంతి' అని పేరుండెడిది. 3. ఉత్తరప్రాంతము . ఇది పూర్వపు ఉత్తరమండలములకును (Northern territories), టోగోలెండుయొక్క ఉత్తరభాగమునకును ప్రతిగా నున్నది. 4. వోల్టా ప్రాంతము (Volta Region). ఇది టోగోలాండు యొక్క దక్షిణభాగమున నున్నది. ప్రభుత్వాధికారము రాజధానీనగరమగు ఆక్ర్ (Accra) యందున్న పార్లమెంటు (National Assembly) నందు కేంద్రీకరింపబడెను. కాని పూర్వము ప్రతి ప్రాంతమునందును ఒక ప్రాంతీయ శాసనసభ యుండెడిది. అది కొన్ని ప్రాంతీయ వ్యవహారములను చూచు చుండెను. ఇప్పటికిని దేశీయ సంస్థానములు గుర్తింపబడు చున్నవి. వాటికి ప్రాతినిధ్యము వహించిన ప్రముఖులతో వేర్వేరు ప్రాంతములందు 'ప్రముఖుల సభలు' (Houses of chiefs) ఏర్పడుచున్నది.
దేశాంతర్గతములైన వాయుమార్గములు (inter air transport), న్యాయస్థాన వ్యవహారములు మున్నగు విషయములందు కూడ ఈ రాజ్యములు పరస్పర సహకారముతో వ్యవహరించెను. ఫ్రెంచి వారితోను, పశ్చిమ ఆప్రికాయందలి ఇతర ప్రాంతములవారితోను సంబంధములు పెట్టుకొనబడెను. అనేకములయిన సాంకేతిక విషయములలోను, శాస్త్రవిషయములలోను వివిధ ప్రభుత్వములమధ్య తరచుగా సంప్రతింపులు జరుగు చుండెను. అట్టి సాంకేతిక శాస్త్రీయ విషయములలో 'ట్సెట్సి' (Tsetse) అను వ్యాధిని నిర్మూలన మొనర్చుట, మిడతలను ఇతరములయిన తెవుళ్ళను స్వాధీనములోనికి తెచ్చుట మొదలగునవి పేర్కొనదగినవి.
శీతోష్ణస్థితి : ఘనాఉన్న ఆఫ్రికా ప్రాంతమునందు రెండు ప్రధానములయిన వాయుమండలము లున్నవి. (1) ఈశాన్యవర్తక పవనములు. వీటికి స్థానికముగా హర్‌మట్టన్(Harmattan) అని వ్యవహారము. ఈ పవనములు అధికములయిన ఉష్ణోగ్రతలు(temperatures)గల సహారా ఎడారినుండి వీచును. ఈ పవనములు వేడిగాను, పొడిగాను ఉండును. వీటికి ప్రతికూలముగా సముద్రమునుండి నైఋతి పవనములు వీచును. యథార్థమునకీ పవనములు భూమధ్యరేఖను దాటిన మీదట ప్రక్కకు తిరిగిన ఆగ్నేయ వర్తక పవనములే. నైఋతి పవనములు సముద్రమున కడ్డముగా ప్రయాణించుట వలన, చల్లగను, తేమగలవి గను ఉండును.
సంవత్సరము పొడుగునను అన్ని తావులందు తరతమ భావములచేగల అధికోష్ణోగ్రతలు; దక్షిణమునుండి ఉత్తరము వరకు వర్షఋతువునందు ప్రాంతీయ పరిస్థితినిబట్టి వర్ష పాతములో హెచ్చుతగ్గులు ; సముద్రము నుండి గల దూరభారములనుబట్టి శీతాకాలము యొక్కయు, వేసవి కాలముయొక్కయు, పరిమాణము అధికము, తీక్ష్ణమునగు సూచనలు పొడసూపుట — ఇవి ఘనాదేశమందలి శీతోష్ణస్థితి యొక్క ప్రధాన లక్షణములు.
ఘనాదేశమందు ఎక్కువ ప్రాంతములో అత్యధికమయిన దైనిక, మాసిక, ఉష్ణోగ్రతయందలి సగటు ముమ్మరము (mean maximum) మార్చి నెలలో గాని, ఫిబ్రవరి నెలలోగాని ఘటిల్లును. కనిష్ఠములయిన ఉష్ణోగ్రతలు ఆగస్టు నెలలో కలుగును.
ఎసియామా (Esiama) అను కావున గరిష్ఠ వర్షపాతము - అనగా సంవత్సరమునకు 80 అంగుళములకు పైగా ఉండును. వర్షపాతము ఉత్తర ప్రాంతమునకు పోయిన కొలదియు క్రమముగా సంవత్సరమునకు 40-50 అంగుళముల వరకు తగ్గును .
నదీమండలములు : ఘనాయందు విశేష ప్రాంతమున అనేకములయిన కాలువలును, నదులును అల్లిబిల్లిగ ప్రవహించుచున్నవి. ఇవన్నియు సంవత్సరము పొడుగున ప్రవహింపవు. అధికమైన చెమ్మగల ప్రాంతములలో గూడ తీక్షణమైన వేసవులయందు చిన్న నదులన్నియు ఎండి పోవుటయో లేక ప్రవాహము బాగుగా తగ్గిపోవుటయో జరుగును. వర్షములు ప్రారంభమగుటతో మరల ఈ నదులు నిండుగా ప్రవహించును. ఆదేశమందు నదులు సమృద్ధిగా నుండుటచే రోడ్ల నిర్మాణము, వాటిపోషణము మిగుల వ్యయశీలముగ నుండును. 'వోల్టా' యనునది ఘనా దేశముయొక్క మహానది. దీని నిడివి 1000 మైళ్లు. ఈనది వంకర టింకరగా ప్రవహించుటచే 15 వ శతాబ్దిలో పోర్చుగీసువారు దీనికి 'వోల్టా' అని పేరిడిరి. ఆ దేశమందలి నీటిపారుదల విధానము ప్రధానముగా ఈ నది మూలముననే జరుగుచున్నది. దేశ వైశాల్యములో 67 శాతము ఈ నదిక్రింద పారుదల యగుచున్నది.
వ్యవసాయము : ఘనాలో వ్యవసాయము ప్రధానమైన వృత్తిగా నున్నది. శ్రామికులలో 70 శాతమునకు పైగా వ్యవసాయము వలన జీవించుచున్నారు. శేషించిన వారిలో గొప్ప నగరములందు నివసించు అత్యల్ప సంఖ్యాకులైన ప్రజలు భూములను పూర్తిగా కోల్పోవుటేకాక, కనీసము తమ పెరడులయందు కూరగాయలను పండించుకొను అవకాశమును కూడ కోల్పోయిరి.
ఆ దేశమున ప్రధానమైన పంట కోకో. అన్ని ప్రదేశములందును ఈపంట పండించబడు చున్నది. ఈ పంటను పండించు ప్రాంతములో స్థానికోపయోగమునకై పెండలమువంటి దుంప పదార్థము (yans), అరటిపండ్లు, బొంత అరటి కాయలు (bananas), కోకోయమ్స్ (cocoyams), 'కాస్సవా' (cassava) అను ఒక జాతి దుంపలు, మొక్కజొన్న, వరి, మిరియములు, గ్రుడ్లు, ఓక్రాస్ (okras), ఉల్లి, టొమాటోలు, ఆవోకడో బేరీపండ్లు, నారింజలు, అనాసపండ్లు అను వివిధములైన ఫలములు ఉత్పత్తి యగుచున్నవి.
కోకో పంటకు వచ్చుటకు అయిదారు సంవత్సరములు పట్టును. పిదప అది అనేక సంవత్సరముల వరకు కాచుచునే యుండును. ఇట్లు కోకో వ్యవసాయము పైరు మార్చి పైరువేయు స్థిరవిధానమునకు గాని, లేక బీడు పెంపకమునకు కాని అవకాశము కల్గించును. ఈ పద్ధతి ననుసరించి ఒక పొలములో రెండు మూడు సంవత్సరములు కోకో వ్యవసాయము చేయబడి, అనంతరము ఆభూమియందే రెండు మొదలు పదిసంవత్సరములవరకు బీడు పెట్టబడును. పిదప ఎప్పటివలె అది మరల సేద్య యోగ్యమగును.
సాధారణముగా ఒకటి రెండెకరములు లేక అంతకంటె తక్కువ విస్తీర్ణముగల పొలములలో కోకో పండించ బడును. ఈ వ్యవసాయము సామాన్యముగా మోటారు రోడ్లవద్ద చేయబడును. అందుచే పండిన పంటను సులభముగా విక్రయ కేంద్రములకు చేర్చ వీలగును. మైదాన ప్రాంతములందు గడ్డి మొదలుగాగల పశుగ్రాసము అధికముగా లభించుటచే, అచ్చోట పంటలను పండించుటకంటె, పశువులను పెంచుటయందే ఎక్కువ శ్రద్ధ చూపబడును. వోల్టానదీ ముఖమువద్దనున్న తేమభూములను సమీపించు వరకు కనుపారునంత ప్రదేశమున పంటపొలములు ప్రముఖముగా దృష్టి గోచరము కావు. వోల్టా డెల్టా తూర్పుభాగమున కేటా, ఆన్ లోగా (Keta and Anloga) నడుమ గబ్బిలముల యొక్కయు, చేపల యొక్కయు మలము సాయమున చిన్నరకపు ఉల్లిగడ్డలు (shallots) విరివిగా ఉత్పత్తిచేయబడును. గొఱ్ఱెలు, మేకలు, పందులు, కోళ్ళు మొదలగునవి స్థానికోపయోగముకొరకు మైదానముల యందంతటను పెంచబడును. యథార్థమునకు గృహజంతువులే గణనీయమైన పశుసంపదగా భావింప బడుచున్నది. 'ట్సీట్సి' (tsetse) అను విషజాతికి సంబంధించిన ఈగలు అంతగా లేనందున ఈగృహజంతువులను విరివిగా పెంచుటకు వీలగుచున్నది.
సముద్రతీరమున గల పచ్చిక బయళ్లయందు పశుసంపద అధికముగా నున్నను సంకీర్ణ వ్యవసాయము యత్నింప బడుటలేదు. స్థానిక ప్రజలే సాధారణముగా పైరు పంటలను పండింతురు. ఉత్తర ప్రాంతీయులైన పశువుల కాపరులు పశుపోషణమును నిర్వహించుచుందురు. ఈ రెండు వ్యాసంగములు (వ్యవసాయము, పశుపోషణము) పూర్తిగా భిన్నములైనవి.
స్థానిక ప్రజల యుపయోగము కొరకు తీరమున గల పసరిక బయళ్లలో బాహుళ్యముగా కూరగాయలు పెంచ బడుచున్నవి.
ఆక్రా (రాజధాని నగరము) పొలిమేరల యందు గల విశాలమగు తోటలలో ప్రజాసామాన్యమున కవసరమగు కూరగాయలు విరివిగా పండించబడుచున్నవి. ఇచ్చటి నుండి నగరవాసులకు దోసకాయలు, క్యారటు, మున్నగు పెక్కు రకముల కూరలు సరఫరా యగును.
చేపలు పట్టుట : ఘనలో దాదాపు అన్ని ప్రాంతములందును చేపలు పట్టబడును. చేపల పరిశ్రమలో 44,000 మంది ప్రజలు నిమగ్నులై యున్నారు. చేపలు పట్టుటలో మూడు విధానములున్నవి. (1) సముద్రములో చేపలు పట్టుట; (2) లోతులేని మడుగులలోను, చెరువులలోను, సరస్సులలోను చేపలు పట్టుట; (8) నదులలో చేపలు పట్టుట. అన్నిటి కంటెను సముద్రపు చేపలను పట్టుట ముఖ్యమైన పరిశ్రమగా నున్నది. సాలునకు సగటున 20.000 టన్నుల సముద్రపు చేపలు లభ్యము లగుచున్నవి. తీరమున గల పల్లెవాసులు, నగరవాసులు చేపలు పట్టుటలో నిమగ్నులై యుందురు.
సముద్రములో చేపలు పట్టుటకు లోతైన దోనెలవంటి పడవలను ఉపయోగించెదరు. అవి అరణ్య ప్రాంతములో తయారుచేయబడి, బెస్తవాడల యందు తుదిరూపము తీర్చిదిద్దబడును. సముద్రతీరము పొడుగున నున్న లోతులేని మడుగుల యందుగూడ చేపలు పట్టుదురు. ఈ మడుగు లందు లభ్యమగు చేపలు సముద్రపు చేపలకంటె మిగుల చిన్నవి. గండుమీనులు (carps) అనునవి సాధారణ తరగతికి చెందినవి. లోతులేని మడుగులలో అడుగున నున్న బురదనుండి అవి బుట్టల సాయమున పట్టుకొనబడును.
నదులనుండి చేపలు విరివిగా పట్టుబడుచున్నవి. ఘనాదేశములోని నదులలో అనేక రకములగు చేపలు సమృద్ధిగా నున్నవి. ఇవి గాలములు సాయమున పట్టబడును. ఒక్కొక్కప్పుడు చేపలను చంపుటకు విషప్రయోగము చేయుదురు. చేపలలో ముఖ్యములైన రకములు ఆఫ్రం (Afrom), వోల్టా (Volta) నదుల ఎగువ, దిగువ భాగములయందు లభించుచున్నవి.
ఘనాలోని దట్టమయిన 25,000 చ.మైళ్ళ విస్తీర్ణము గల అడవులలో ఉత్తమజాతికి చెందిన పదార్థములు లభించును. ఇవి ఎగుమతుల కొరకును, స్థానికావసరముల కొరకును ఉపయోగింపబడుచున్నవి. కలప ఈ పదార్థములలోకెల్ల ముఖ్యమైనది. దేవదారువు (mahogany), ఓడమ్ (odem), వావా (Wawa), సాపిల్ (Sapele), బాకు (Baku), యూటైల్ (Utile), ఎమైర్ (Emire), అనునవి ఈ కలప జాతులలోకెల్ల ముఖ్యమైనవి.
ఇతర కలపకంటె దేవదారువు తేలికగ నుండును. సురూపమైన దాని నిర్మాణము, మనోహరమైన దాని గోధుమవర్ణము ఆకర్షణీయముగ నుండును. ఈ కారణముచే ప్రజలు దేవదారు కలపనే అధికముగా వాడెదరు. కుర్చీలు, బల్లలు, బీరువాలు మున్నగు సామానులను తయారుచేయుటకీ కలప విరివిగా ఉపయోగపడుచున్నది. తక్కువజాతి కలపతో తయారగు వస్తువులకు బాహ్యాకర్షణమును కూర్చుటకై, దేవదారువునుండి అతి పలుచగా కోయబడు పొరలను వాటిపై అమర్చి తాపటము చేయుదురు.
కలప ఎక్కువగా మొద్దుల రూపములో ఎగుమతి చేయబడును. చెక్కలు, కడ్డీలు, సన్నని పొరలు (plywood) గూడ హెచ్చు పరిమాణములో ఎగుమతి చేయబడుచున్నవి. పశ్చిమ ప్రాంతముననున్న సాంరెబోయ్ (Samreboi) అనుచోట 'యునైటెడ్ ఆఫ్రికాకంపెనీ ఫ్యాక్టరీ'లో ఈ ప్లైవుడ్ (పొరలు) తయారుకాబడు చున్నది.
వ్యవసాయము తరువాత గనుల పరిశ్రమ, దేశాదాయమునకు ప్రధానమైన సాధనముగ పరిగణింపబడు చున్నది. ఘనాలో బంగారము (దీనిని బట్టియే 'గోల్డు కోస్టు' అని ఈ దేశమునకు పేరుకల్గినది.) ప్రధానమైన ఖనిజము. దీని ప్రాముఖ్యము గత 500 సంవత్సరముల నుండి కొనసాగుచున్నది. మాంగనీసు (manganese), వజ్రములు, బాక్సైటు (bauxite) అనునవి మరికొన్ని ప్రముఖమైన ఖనిజములు. ఇనుము, క్రోమైటు (chromite), అస్‌బెస్టాస్ (Asbestas), తగరము, సున్నపురాయి, ఉప్పువంటి అనేక ఖనిజములు గూడ లభ్యము లగు చున్నవి. ఇవన్నియు దేశమందు వివిధభాగములలో కనుగొనబడి యున్నవి.
ఘనాదేశమున రవాణా ప్రప్రథమముగా, సమర్థవంతముగ పరిష్కరింపబడవలసిన సమస్యమై యుండెను. 1887 వ సంవత్సరమున ప్రభుత్వము సేకొండి (Sekondi) అను ఓడ రేవునుండి టార్ క్వా (Tarkwa) వరకు రైలు మార్గమును నిర్మించుటకు నిశ్చయించెను. ఆన్‌కోబ్రా అను నది ఎగువమార్గమున ఆక్సిమ్ నుండి టామెంటో వరకు సర్ఫ్‌బోట్ల మీదను, అటుపిమ్మట టార్ క్వా వరకు రోడ్డుమీదను ఆలస్యముగను, నష్టముతోడను చేర్చబడు చున్న సామగ్రులు, నేడు అట్టి చిక్కులు లేక యే, ఈ రైలుమార్గమున శీఘ్రముగను, భద్రముగను చేర్చబడు చున్నవి.
స్థానికులైన ప్రజలు యూరపియను కంపెనీలలో పనిచేయుటకు ఇష్టపడక పోవుటచే తరుచుగా కార్మిక క్లేశము లేర్పడుచువచ్చెను. కాని ఘనాయొక్క ఉత్తర ప్రాంతమునుండి కార్మికులను తీసుకొనివచ్చుటచే పరిస్థితులు మెరుగయ్యెను.
1914 వ సం. వరకును బంగారపు పరిశ్రమయే దేశములో ప్రముఖస్థాన మలంకరించి యుండెను. టార్‌క్వాకు రెండు మైళ్ళు దక్షిణమునగల న్సూటా (Nsuta) వద్ద 1914 లో (మొదటి ప్రపంచ యుద్ధారంభమున) మాంగనీసు ఖనిజము కనుగొనబడెను. యుద్ధము కారణముగా ఉక్కునకు గొప్ప గిరాకి ఏర్పడెను. ఈ కారణము వలనను, మాంగనీసు ముతక లోహము టార్ క్వా- సే కొండీ రైలుమార్గమునకు సమీపమున నుండుటవలనను మాంగనీసు పరిశ్రమాభి వృద్ధికి శీఘ్ర దోహదము కలిగెను.
1919 వ సంవత్సరములో కిబి (Kibi) అను తావునకు వాయవ్య దిశయందు బిరిమ్‌నదీ ప్రాంతమున మొట్ట మొదట వజ్రపు గనులు కనుగొనబడెను.
ఏనాహిన్, సెఫ్ విబెక్ వాయ్‌లవద్ద బాక్సైట్ (bauXite) ఖనిజము విరివిగా కనుగొనబడెను. అల్యూమినియము (aluminium) ను కరుగుటకు జలశక్తి (water power) చే చౌకగా ఉత్పత్తి చేయబడు విద్యుత్తు గొప్ప మొత్తములో కావలసి యుండెను. అందుచే అంతవరకు ఉత్పత్తి చేయబడిన బాక్సైటు అంతయు ముడిలోహ రూపముననే రవాణా చేయబడ వలసియుండెను.
ప్రతి సంవత్సరము ఘనానుండి ఎగుమతియగు సరకుల మొత్తము ఆదాయములో దాదాపు 25 శాతము గనుల పరిశ్రమనుంచి సంక్రమించుచున్నది. ఈ పరిశ్రమయందు దాదాపు 37,000 మంది కార్మికులు పనిచేయుచున్నారు.
వస్తూత్పత్తి పరిశ్రమలు (Manufacturing Industries): ఘనాయందు వస్తూత్పత్తి పరిశ్రమలు భారీయెత్తుపై లేవు. చలనశ క్తిని కలిగించు బొగ్గు, నూనె వంటి పారిశ్రామిక క్షేత్రములు (bases of industrialization) లేకుండుటయే కొంతవరకు దీనికి కారణము. నైపుణ్యముతో కూడిన కార్మికశక్తియు, ఇట్టి పరిశ్రమల కవసరమైన పెట్టుబడియు లుప్త మగుట మరియొక కారణము. విదేశీయుల పెట్టుబడి ద్రవ్యములో విశేష భాగము బంగారము, మాంగనీసు, వజ్రములు, బాక్సైటు, కలప, కోకో వంటి ముడిపదార్థముల అభివృద్ధికొరకు వినియోగ మగుచున్నది. ఈ ముడిపదార్థములు ప్రగతి నొందిన పారిశ్రామికదేశము లందలి ఫ్యాక్టరీల పోషణకొరకై పంపబడుచున్నవి.
అయితే ఈ దేశములో అనేకములగు లఘుపరిశ్రమలు గలవు. వీటిలో కొన్నిటికి గొప్ప చరిత్ర కలదు. అవి స్థానికావసరములను మాత్రమే తీర్చగలవు. ఎగుమతి చేయగలిగినట్టి భారీపరిశ్రమలు ఆ దేశమున స్వల్పముగనే యున్నవి.
రొట్టెలు, పిప్పరమెంటు మున్నగు పంచదార బిళ్ళలు (confectionary) తయారు చేయుట ; అనేక రకములైన ఆహార పదార్దములు చేయుట; కుర్చీలు, బల్లలు, బీరువాలు, తోళ్ళ సామానులు సిద్ధము చేయుట; రక రకములైన బుట్టలను, అల్లిక సామానులను, ఇటుకలను, పెంకులను, కుమ్మర సామగ్రిని తయారు చేయుట; స్థానికముగా లభించు నూలుతోను, దిగుమతి యగు నూలుతోను సంప్రదాయసిద్ధమైన వస్త్రములు నేయుట ; దిగుమతియైన మేలుజాతి, నాజూకు వస్త్రములను (textiles and fabrics) ఉడుపులుగా తయారు గావించుట ; స్థానికముగా ఉత్పత్తియైన బంగారమును, దిగుమతియైన వెండిని స్థానికశిల్పులు చిన్న నగలను చేయుటకై ఉపయోగించుట; స్థానికముగా కరుగబడిన ఇనుమునుండి గాని లేక ఈనాడు విదేశములనుండి అధికముగా దిగుమతి యగుచున్న ఇనుప రేకులు, ఇనుప కడ్డీలనుండి గాని సామాన్యములైన పరికరములను, తుపాకులను చేయుట కూడ లఘుపరిశ్రమల క్రిందకు రాగలవు.
నిన్న మొన్నటి వరకు విడి భాగములను చేర్చి రైల్వే ఇంజనులను తయారుచేయుట, మరమ్మతులు గావించుట, రైలుపెట్టెలను సిద్ధము చేయుట ఆ దేశమందు భారీ పరిశ్రమలుగా నుండెడివి. ఈ పరిశ్రమలలో మొదటిది టాకురాడీ వద్ద నున్న కర్మాగారములలో నడుపబడు చున్నది. రంపపుకోత పరిశ్రమగూడ భారీపరిశ్రమగా పరిగణింపబడుచున్నది.
ఇటీవల సంరెబాయ్ సమీపమున ప్లైవుడ్ ఫ్యాక్టరీ యొకటి నిర్మింపబడెను. ఇది పశ్చిమ ప్రాంతములో నున్న మిక్కిలి ప్రసిద్ధికెక్కిన పరిశ్రమ. ఇది 'యునై టెడ్ ఆఫ్రికా కంపెనీ' యాజమాన్యమున పనిచేయుచున్నది.
ప్రభుత్వమునకు చెందిన "పారిశ్రామికాభివృద్ధి సంఘము" (Govt. owned Industrial Development Corporation) యొక్క అధ్వర్యవమున గూడ అనేక ఫ్యాక్టరీలు ఆక్రా, సేకోండి- టకోరడి (Sekondi-Takoradi), కుమసీ, కడే, న్కావ్‌కావ్ అను ప్రదేశము లందును, ఇతర స్థలముల యందును నెలకొని యున్నవి. వీటియందు పొగచుట్టలు, సిగరెట్లు తయారు చేయుట, భోజనమున కుపయోగపడు నూనెశుద్ధిచేయుట, మేకులను, అగ్గిపెట్టెలను తయారుచేయుట, ఇటుకలు, పెంకులు, కొయ్యసామానులను తయారుచేయుట, యంత్ర సహాయమున గనులనుండి రాళ్ళెత్తుట, టైర్లను రీమౌల్డు చేయుట, రంపపుకోత మున్నగు పరిశ్రమలు పేర్కొన దగినవి.
ఘనాదేశములో 23 కోట్ల పౌనుల ధనముతో నిర్మింపదలచిన 'వోల్టా అల్యూమినియం ఫ్యాక్టరీ' పారిశ్రామిక ప్రణాళికలోకెల్ల గొప్పదని చెప్పవచ్చును. ఈ ఫ్యాక్టరీని, స్థాపించుటకు అజెనా అను ప్రదేశము నొద్ద వోల్టానది మీద ఆనకట్ట నిర్మాణము అవసరమని భావింపబడినది. ఇందువలన 617,000 కిలో వాట్లు విద్యుత్తు ఉత్పత్తియగు నని అంచనా వేయబడినది. ఈ విద్యుత్తులో విశేషభాగము క్పాంగ్ అనుతావున నిర్మింపబడనున్న కరగుడుయంత్రము ద్వారా సంవత్సరమునకు 210,000 టన్నుల అల్యూమినియమును ఉత్పత్తి చేయుటకై ఉపయోగింపబడగలదు.
జనాభా : దాదాపు ఘనాలో నివసించు ప్రజలందరును 'సుడాను నీగ్రోలు' అను జాతికి చెందినవారు. వీరు పశ్చిమాఫ్రికాయందంతటను కలరు. ఆఫ్రికా మహాఖండమున గల అయిదు ప్రధానములైన జాతిగణములలో వీరొకరు. సుడాను నీగ్రోలలో కొందరు, ముఖ్యముగా 'రెయిన్ ఫారెస్టు జోను' (Rain Forest Zone) నందలివారు, అనేక శతాబ్దముల వరకు కలితిలేని స్వచ్ఛమగు జాతిగా పరిగణింపబడిరి. కాని పశ్చిమాఫ్రికాలో ఉత్తరప్రాంత మం దున్నవారు సహారాలోను, ఉత్తరాఫ్రికాలోను నివసించు హమెటిక్ (Hametic), సెమిటిక్ (Semitic) జాతులలో కలసిపోయిరి. వారి అవయవ నిర్మాణములో ఈ సమ్మేళన చిహ్నములు గోచరించును. వారి పెదవులు పలుచగాను, ముక్కులు కొంచెము సన్నముగను, నిడుపుగను, సూటిగను ఉండును. ఈ సంకర జాతులలో ఫులానులు అనువారు కొందరు కలరు. వీరు సాధారణముగా ఘనాదేశమునకు ఉ త్తరమున నివసించు చుందురు.
ఈ ఫులానులలో అధికసంఖ్యాకులు ఉత్తరమునుండియే వచ్చిరి. కొందరు తూర్పు నుండి గూడ వచ్చినట్లు విశ్వసింపబడుచున్నది. ఉత్తరమునుండి వచ్చినవారు ఒకప్పుడు ప్రాచీన ఘనా సామ్రాజ్యములో చేరియుండిరి. క్రీ. శ. 1000 వ ప్రాంతమున అత్యుచ్ఛ దశయం దుండిన ఘనా సామ్రాజ్యము నైగర్ నది వంపునకును (Niger bend), గాంబియా నది (Gambia River) ని నడుమ గల విస్తృతమైన ప్రాంతమును ఆక్రమించియున్నది. ఈ సంబంధమే (ఇది ఇంకను చారిత్రకులలో వివాదాంశముగనే యున్నది) స్వాతంత్ర్యము సిద్ధించినది మొదలు ఘనా దేశమునకు అంతకు పూర్వము గల 'గోల్డుకోస్టు' (gold-coast) అను పేరును మార్చి దానికి బదులుగా 'ఘనా' అను అసలు పేరును పెట్టుటకు కారణమైనది.
ఘనాలో ప్రజలు నివాసమేర్పరచుకొని జీవింప నారంభించుట ఎంతోకాలము క్రింద కాదు. ఇటీవలనే అచ్చటి ప్రజలు వివిధములైన తెగలుగా ఏర్పడియుండిరి. 19 వ శతాబ్ది చివర వరకు ఆ దేశమున నివసించు ప్రజలలో అనేకులు తమ రాజ్యములను స్థిరీకృత మొనర్చుకొనుట యందును, విస్తృతమొనర్చుకొనుటయందును నిమగ్నులై యుండిరి.
అన్ని తెగలలోను ఆకనులు (Akans) అను జాతివారు అధికసంఖ్యాకులుగా నున్నారు. ఆశాంతి అను ప్రాంత మందును, ప్రాక్పశ్చిమ భాగమందునను దాదాపు ఈ జాతివారే నివసించుచున్నారు. ఆగ్నేయ దిశాగ్రమునందు మాత్రము ఈవులు (Ewes), గా-అడాంగ్‌మీలు (Ga-Adangmes) అను జాతులవా రున్నారు. ఆకన్ జాతివారితో దగ్గిర సంబంధము గల గ్యూయనులు (Guans) అను మరియొక తెగవారు ఆకనులకు తూర్పు పార్శ్వ మందును, ఉత్తరపార్శ్వమందును విశాలమైన చంద్రవంక ఆకారమున వ్యాపించి యున్నారు.
ప్రస్తుత శతాబ్దికి పూర్వము నేటికంటె మిక్కిలి తక్కువ ప్రమాణములో జనాభా పెరుగుదల జరిగియుండెను. యుద్ధములు, బానిసత్వము, వ్యాధులు, మరణములే ఇందుకు గల కొన్ని కారణములు. 20 వ శతాబ్దిలో నేర్పడిన ప్రశాంతపరిస్థితులు, ఆరోగ్యవిషయమున చేకూరిన అభివృద్ధి, నేటి శీఘ్రజనాభివృద్ధికి విశేషముగా దోహద మొనర్చినవి.
ఆ దేశపు ప్రజలు రకరకములైన కర్రలతోడను, కొయ్యచెక్కలతోడను మొట్టమొదట గృహములను నిర్మించుకొనెడి వారు. అరటి ఆకులు, తాటియాకులు, గడ్డి, రెల్లు మొదలగు పదార్థములు ఇండ్లకప్పులకు సాధనములుగా నుండెడివి. ఈనాడు అరణ్య ప్రాంతములలో మారుమూల గ్రామముల యందలి గృహములును, సముద్రతీరమున చేపలుపట్టువారు తాత్కాలికముగ నిర్మించు గృహములును మాత్రమే ఇట్టి వస్తువులచే నిర్మింపబడుచున్నవి. కాని ఈ కాలమున కాల్చిన పెంకులును, ఇటుకలును, కాంక్రీటు బ్లాకులును, ఆస్బెస్టోస్ సిమెంటు రేకులును గృహోపకరణములుగా ఉఉపయోగింపబడుచున్నవి.
ఘనాలో క్రొత్తగా ఏర్పరచుకొనబడిన కొన్ని జనావాసములు (Settlements) మాత్రమే యధార్థములైన నగరములనబడుచున్నవి. ఈ జనావాసములలో ఎక్కువ భాగము గ్రామములు. నాగరికలక్షణములుగల ఈ జనావాసములుకూడ పెక్కులు విశేషముగా గ్రామీణ చిహ్నములను కలిగియున్నవి. అందుచే వాటిని గ్రామీణ నగరములనియే (rural towns) చెప్పవలెను.
స్థూలముగా చెప్పవలెనన్న ఘనాలోని నగరములు, గ్రామీణ నగరములు, 3000 కాని, అంతకంటె ఎక్కువ జనాభాగాని కల సెటిల్ మెంటుల సముదాయములో చేరును. అంతకంటె తక్కువ జనాభాగల సెటిల్ మెంటులు మామూలు పల్లెటూరు లక్షణములు కలవిగానే భావింప బడును. మొత్తముపై అట్టి పెద్ద సెటిల్ మెంట్లు ఘనాలో 90 ఉన్నవి. వీటిలోని జనాభా 665, 990 మంది. ఈ జనాభా దేశమందలి మొత్తము జనాభాలో 16 వ శాతముగ నున్నది.
రెండవ ప్రపంచ మహా సంగ్రామమునకు పూర్వము ఆ దేశములో రవాణా సౌకర్యములు చెప్పదగినంతగా లేవు. కాని శత్రువులు మధ్యధరాసముద్రములోను, సూయజ్ కాలువ మార్గములోను ప్రవేశించుటవలన, ఉత్తర ఆఫ్రికాలోకూడ వారు దండయాత్రలు సాగించుట వలన, పశ్చిమ మిత్రమండలివారు తమ యుద్ధతంత్ర వ్యూహములను కొనసాగించుటకు పశ్చిమాఫ్రికా అనుకూలమైన ప్రాంత మయ్యెను. అందుచే యూరపును, అమెరికాను, మధ్య, దూరప్రాచ్య దేశములను, ఆఫ్రికా యందలి అనేకములైన విమానాశ్రయములను కలుపు నట్టి విమాన మార్గములకు ఆ ప్రాంతము ప్రధాన కేంద్రమయ్యెను. ఈ విమానముల రవాణా అభివృద్ధి యగుటచే ఆఫ్రికా విమానాశ్రయములకు ప్రత్యేక లాభము చేకూరెను. దాని రహదారులు పొడిగించబడి, అనేకములైన క్రొత్త మార్గము లేర్పరచబడెను.
మరియు ఆక్రా, సెకొండి, కుమాసి, టామలె అను ప్రదేశములందు కూడ విమాన మార్గము లున్నవి. అవన్నియు మధ్యగతమైన (internal) రహదారులచే కలుపబడినవి.
విమానములలో ముఖ్యముగా యాత్రికులు, తపాల సంచులు తీసికొనిపోబడును. విలువ కలిగి ఎక్కువచోటు నాక్రమింపని వజ్రములు, బంగారమువంటి వస్తువులును, శీఘ్రముగా దిగుమతి చేయబడ వలసిన తాజా ద్రాక్ష పండ్లు, గ్రుడ్లు కూడ విమానములలో కొనిపోబడును. ఇవి ఎక్కువగా దక్షిణాఫ్రికా యూనియనునుండి ఎగుమతి యగును. చాల తక్కువ పరిమాణముగల ఇతర సామగ్రులు మాత్రమే విమానముల ద్వారా కొనిపోబడును.
బి. ఎన్. చ.
ఘర్మయంత్రములు (Heat Engines) :
ఒక “పనిని” (work) సులభముగా చేయవలెనన్న, యంత్రము నుపయోగింపవచ్చును. 'పని' అనగా నేమి ? ఉదాహరణమునకు ఒక మనుష్యుడు ఒక పెద్దరాయిని తలపై పెట్టుకొని నిశ్చలముగా నిలబడినాడనుకొందము. రాయి బరువువలన అతడు అలసట చెందవచ్చును. కాని శాస్త్రరీత్యా చూచినచో, అతడేమియు 'పని' చేయలేదు. అట్లుకాక రాతిని నేలమీదినుండి ఎత్తి ఒక బల్లమీద పెట్టినచో, ఆతడు కొంత 'పని' చేసినట్లగును. రాయి బరువును బల్ల ఎత్తుచే గుణించుటవలన అతడు చేసిన 'పని' యొక్క పరిమాణము (amount) మనకు తెలియును. ఇదే 'పని'ని చేయుటకు మనుష్యుడు తన కండరశక్తిని వినియోగించుటకు బదులు ఒక యంత్రమును ఉపయోగింప వచ్చును. యంత్రము పనిచేయునట్లు చేయుశక్తిని లేదా యంత్రశక్తిని (mechanical energy) అనేక విధములుగా పొందవచ్చును. అందులో నీటిని వేడిచేయుట ఒక పద్ధతి. అనగా, ఉష్ణశక్తి వలన నీటిని ఆవిరిగామార్చి, ఆ ఆవిరియొక్క పీడనశక్తిచే యంత్రములు పనిచేయునట్లు చేయుట. ఇచ్చట ఉష్ణశక్తి యంత్రశక్తిగా మారుటచే పనిని చేయగలుగుచున్నాము. ఉష్ణశక్తికిని యంత్రశక్తికిని గల అవినాభావ సంబంధము అనేకవిధముల స్పష్టీకరింపబడినది. పదార్థములలోని అణువుల (molecules) సంచలనమువలన ఉష్ణము కలుగుచున్నట్లు చలన సిద్ధాంతము (Kinetic Theory) చే నిరూపింపబడినది. ఒక కేలోరీ (Calorie) ఉష్ణము 4.18x107 ఎర్గుల (ergs) పనికి సమానమని ప్రయోగములచే నిర్ణయింపబడినది. ఇట్లు ఉష్ణశక్తి (Heat energy) వలన పనిచేయు యంత్రములు ఘర్మ లేక ఉష్ణయంత్రములు (Heat engines) అని పిలువబడుచున్నవి. వివిధరకముల ఘర్మ యంత్రములను గూర్చి తెలిసికొనుటకు ముందు వాటి మూలసూత్రములను విశదీకరించు ఉష్ణగతిశాస్త్రము (Thermodynamics)ను గురించి కొంత తెలిసికొనవలసి యున్నది.