Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గౌతమీ బాలశ్రీ

వికీసోర్స్ నుండి

గౌతమీ బాలశ్రీ :

శాతవాహన వంశము కేవలము, పరాక్రమవంతులు, ధర్మపరాయణులైన రాజులచేతనే గాక, అహింసా niరతలు, సత్యవచస్కలు, దానక్షమాన్వితులు ఐన రాణుల చేతను గూడ పవిత్ర మొనర్పబడినది. శాతవాహన వంశమును పునీతముచేసిన రాణులలో "గౌతమీ బాలశ్రీ" మిక్కిలి ఎన్నదగినది. ఈమె శివస్వాతి మహారాజుభార్య అనితెలియుచున్నది. గౌతమీపుత్ర శాతకర్ణితల్లి, వాసిష్ఠీపుత్త్ర పులోమావి పితామహి. ఈమె జన్మము పావనతమ మైనది. రాజర్షి పత్నీపదమునకు తగిన గుణ విశేషములను కలిగిన ఈ గౌతమీ బాలశ్రీ, లోకోత్తర చరితుడైన కుమారుని పొందినది. పవిత్రము, శుభకరమునై న శీలము కారణముగా ఆమె చిరస్మరణీయ అయ్యెను. శాతవాహన చక్రవర్తులలో తలమానికముగా పరిగణింపబడినట్టి 'గౌతమీపుత్ర శాతకర్ణి' తనపేరునకు ముందు 'గౌతమీ పుత్ర'యని తన మాతృశ్రీ నామధేయమును జతపరుచుటచే శాతవాహనయుగమున అతడు వినూత్నములైన గౌరవ ప్రపత్తులను తల్లికి నొసగు ఆచారమును కల్పించినవా డయ్యెను. ఇది కేవలము శాతకర్ణియొక్క మాతృభక్తి పరాయణతను సూచించుటయేగాక గౌతమీదేవియొక్క సామర్థ్యమును, ఉదాత్తతను, శుభచారిత్రమును గూడ చాటుచున్నది. ఈమె అకుంఠితమైన మాతృ శుశ్రూషా పరాయణుడగు కుమారుని పొందుటచేతనేగాక, తన గురుతరములైన దానధర్మములచేతగూడ చిరస్థాయియైన కీర్తి నార్జించినది. ఈమె, శివస్వాతిమహారాజు కాలమున ప్రసిద్ధి వహించినది. తరువాత కుమారుడును, చక్రవర్తియునగు గౌతమీపుత్ర శాతకర్ణి కాలమునను, పౌత్రుడగు పులోమావి కాలమునను వారితోగలిసి తానుకూడ దానధర్మములను జేయుచు రాజ్యతంత్రమునందు కూడ వారికి తోడ్పడినట్లు తెలియుచున్నది. గౌతమీపుత్రశాతకర్ణి నాసిక శాసనమునుబట్టి “రాజమాతయు, జీవసుతయునగు మహాదేవియొక్క మాటలుగా గోవర్ధనమునం దమాత్యుడగు శ్యామకుని ఆరోగ్యము అడుగ బడుట, తిరణ్హు పర్వతపుగుహలో నివసించు భిక్షువులకు ఉత్తమ క్షేత్రమును దానము చేయుట గౌతమీదేవియొక్క ఉదారతను సూచించును. ఈ దానశాసనము ప్రతీహారియగు 'లోటు'ని చే వ్రాయబడినది. సుజీవిచే అమలు జరుపబడినది.

శ్రీ పులోమావి రాజుయొక్క 19వ రాజ్య సంవత్సరమున గ్రీష్మఋతువు రెండవపక్షమున చేయబడిన దాన శాసనమునందు గౌతమీ బాలశ్రీ మిక్కిలి నుతియింప బడినది. గౌతమి కోరిక పైననే ఈ దానశాసనము వ్రాయించినట్లు కనబడును. అందు "... రాజ రాజును గౌతమీపుత్రుడును, శ్రీ శాతకర్ణియొక్క తల్లియు, సత్యదాన అహింసానిరతయు, తపోదమనియ మోపవాస తత్పరయు, రాజర్షిపత్నికి గల యోగ్యత పూర్తిగ కలదియు అగు మహాదేవి గౌతమీ బాలశ్రీ కైలాస పర్వతముతో సమానమగు తిరణ్హు పర్వతాగ్రమున పవిత్రమైన ధర్మముగా కైలాస సదనమువలె యీ గుహను దొలిపించెను" అని కలదు. దీనిని ఈ మహారాణీ భద్రాయ నీయు లను భిక్షువులయొక్క సంఘము ద్వారమున బుద్ధ నికాయమునకు నిచ్చెను. కేవలము కుమారుడేకాక, పౌత్రుడుకూడ పితామహియగు నీ మహారాణి ప్రియమును, సేవను కాంక్షించి “పిసాజిక పద”మను గ్రామ మును దానముచేసి యుండుట ఈమె సౌభాగ్యమహిమను దర్పణమునందువలె స్ఫుటముగా జూపుచున్నది. ఇట్టి మహాసాధ్వియు, మహా ధర్మపరాయణయునైన గౌతమీ బాలశ్రీ, సౌగతధర్మమునం దాసక్తయై, రాచకార్యము లందు చేదోడు వాదోడై అఖండమైన గౌరవ ప్రతిపత్తులను పొంది స్త్రీలోకమునకు గర్వకారణమై, మరువరానిదైనది.

పి. య. రె


గౌతముడు (ధర్మసూత్రప్రణేత) :

ప్రాచీన భారతచరిత్రమును నిర్మించుటకు మన చరిత్రకారుల కుపయోగించిన సాధనములలో శ్రుతి - స్మృతి - సూత్ర - ఇతిహాస - పురాణములు ముఖ్యములు. అందు 'సూత్ర' వాఙ్మయమునకును మంచిస్థాన మున్నది మన ఆర్యుల ధర్మశాస్త్రగ్రంథములలోని కెల్లను సూత్రగ్రంథములు మిక్కిలి పురాతనములయినట్లు విజ్ఞుల అభిప్రాయము. 'సూచనాత్సూత్రమిత్యాహుః' అన్నట్లు, సూత్ర గ్రంథములలో వేదత్రయవిజ్ఞానమును, త్రివర్గమును గూర్చిన పరిజ్ఞానమును పూర్ణ - లుప్త వాక్య విశేషములలో నిక్షిప్తమై యున్నది. అవి శ్రౌత-గృహ్య-ధర్మసూత్రములని వివిధరూపముల కానబడుచున్నవి. మనకిప్పుడు ప్రసక్తమైనవి 'గౌతమధర్మసూత్రములు'. వానికి కర్త గౌతమ మహర్షి ·

భారతీయవాఙ్మయమున గౌతమమహర్షులు పెక్కురు కానవచ్చుచున్నారు. ఇతిహాసములలో అహల్యాపతి గౌతముడును, శాస్త్రకర్తలలో న్యాయశాస్త్రప్రణేతయగు గౌతముడును-ఈతడు 'గోతముడు' అను శీర్షికక్రింద వర్ణితమయినాడు – సూత్రకర్తలలో ప్రకృతము మన గౌతముడును ముఖ్యులుగా కన్పింతురు. ఈ గౌతమ మహర్షినిగూర్చి తెలియవచ్చిన చరిత్రాంశములు చాల తక్కువయని చెప్పవలయును. ఇతిహాసములకంటె శాస్త్రములును, వానికంటెసూత్రములును ప్రాచీనతరములగుటచేత, ఇతర గౌతములకంటె సూత్రకర్తయగు గౌతముడు మిక్కిలి ప్రాచీను డని చెప్పవచ్చును. ఆ సూత్రవాఙ్మయమునను ఆపస్తంబుడు, బోధాయనుడు, కాత్యాయనుడు, మున్నగువారి సూత్రగ్రంథములకంటె చారిత్రకదృష్టిచేతను, పారంపర్యదృష్టిచేతను, ఈ ధర్మ సూత్రములే పురాతనములగుటచేత, వాని నిర్మాతయగు గౌతముడే ఆపస్తంబాదులకంటె పూర్వుడని చెప్పనగును.

ఆపస్తంబుడు క్రీ. పూ. 800-600 మధ్యనున్నట్లు చరిత్రకారులు నిర్ణయించినందున ఈ గౌతముడు క్రీ. పూ. 800 కు ముందున్నవాడనియో లేక ఆ ప్రాంతమువాడనియో భావింపవచ్చును. ఇతడు సుమారు మూడువేల సంవత్సరములక్రింద నున్న వాడనుటలో ఎట్టి విప్రతి పత్తియు నుండదు. యజుర్వేదులు కాపస్తంబసూత్రము అనుసరణీయములైనట్లుగా ఛాందోగ్యులకు (సామవేదులకు) గౌతమధర్మసూత్రములు అనుసరణీయములై నట్లు పెద్దలవలన వినికి. దానినిబట్టి మన గౌతముడు సామవేద శాఖకు చెందినవాడై యుండునని విద్వాంసుల అభిప్రాయము. ఈ ధర్మసూత్రములను రచించిన శక్తి సామర్థ్యములనుబట్టి గౌతమమహర్షి శ్రుతిస్మృత్యాది పరిశీలనముచే ధర్మనిర్ణయముచేయు నధికారముగల ప్రజ్ఞాశాలి యని యేర్పడుచున్నది.

గౌతమధర్మసూత్రములు 'ధర్మసూత్రము' లనబడుటచేత అవి ధర్మములను వివరించు వాక్యగ్రంథమని తెలియ గలదు. 'ధర్మ' మనగా 'ధరతిలో కానితి ధర్మః - ధ్రయతే పుణ్యపురుషై రితి ధర్మః' అని వివిధముగా వ్యుత్పత్తి చెప్పబడి యున్నది. సాధారణముగా సుఖప్రవృత్తిని దుఃఖ నివృత్తిని గోరు జీవులకు సత్కర్మలవల్ల సుఖమును దుష్కర్మలవల్ల దుఃఖమును గల్గుచున్న దని భారతీయుల సిద్ధాంతము. సత్కర్మ - దుష్కర్మల పరిజ్ఞానము ధర్మా ధర్మ వివేకముచే గల్గును. ధర్మము తెలిసినయెడల తద్భిన్నముగా అధర్మము తెలియబడవచ్చును. కావున ధర్మ ప్రబోధమునకై మన దేశమున ధర్మశాస్త్రములు, ధర్మసూత్రములు రచింపబడినవి. వానిలో గౌతమధర్మ సూత్రములు ప్రముఖస్థానమునుపొంది యున్నవి. ఈగ్రంథమును గూర్చి పాశ్చాత్యపండితులగు బూలర్ మొదలగు వారు విమర్శించి వ్రాసియున్నారు.

ఈ ధర్మసూత్ర గ్రంథము సామవేదమునకు సంబంధించిన యొకానొక గౌతమచరణమునకు సంబంధించినదిగా భావింపబడుచున్నది. అందులకు 'గౌతమ' మను పేరుతో సామవేదశాఖయొకటి యుండెడిదను సంప్రదాయము బలమొసగు చున్నది. సామవేదమునందలి వంశ