సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోపాలకృష్ణ గోఖలే
గోపాలకృష్ణగోఖలే :
అకుంఠితమును, నిర్విరామమునైన దేశభక్తి గోపాలకృష్ణగోఖలే యొక్క ముఖ్యగుణము. ఇతడు గాంధి మహాత్మునియొక్క రాజకీయ గురువుగా పేర్కొనబడిన మహావ్యక్తి. సి. వై. చింతామణి, డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి, రైట్ ఆనరబుల్ వి.ఎస్. శ్రీనివాసశాస్త్రి ప్రభృతి దేశనాయకు లనేకులు ఇతనిని తమ గురువునుగా పేర్కొని యున్నారు. గోఖలే సర్వతోముఖ ప్రతిభాశాలి. ఇతడు విద్యావేత్తగా, పండితుడుగా, శాసనసభా వ్యవహారదక్షుడుగా, పట్టువిడుపులెరిగిన రాజకీయవేత్తగా, ఆర్థికశాస్త్రవిశారదుడుగా ప్రసిద్ధి నొందెను.
చిత్రము - 121
గోపాలకృష్ణ గోఖలే
గోఖలే 1866 వ సంవత్సరము మే నెల తొమ్మిదవ తేదీయందు కొల్హాపురమునందు ఒక బీద మహారాష్ట్ర కుటుంబమున జన్మించెను. ఇతని చిన్నతనములోనే తండ్రి గతించెను. అందుచేత తన అన్నయొక్క సాహాయ్యముతో ఇతడు విద్యాభ్యాసము చేసెను. ఆరంభదశయందు వీధులందలి లాంతరుల వెలుగులో కూర్చుండి, కష్టించి ఇతడు చదువు కొనెను. బొంబాయిలోని ఎలిఫిన్‌స్టన్ కళాశాలలోను, పూనాయందలి దక్కను కళాశాలయందును, ఇతడు ఉన్నతవిద్య నభ్యసించెను. 1884 లో పట్టభద్రుడయ్యెను. ఇంజనీరింగు, న్యాయశాస్త్రము, ఐ. సి. యస్ మున్నగు పరీక్షలకై యత్నింపుమని శ్రేయోభిలాషులు ఇచ్చిన సలహాలను ఇతడు సరకుచేయక ప్రజాసేవనే తన జీవిత లక్ష్యమునుగా చేసికొనెను. ఇతడు నెలకు రు. 75 ల స్వల్పవేతనముగల దక్కను విద్యాసంస్థయందలి సభ్యత్వమును అంగీకరించెను. ఆరంభమున ఉపాధ్యాయుడుగను, పిమ్మట ఫెర్గూసన్ కళాశాలలో ఉపన్యాసకుడుగను, తరువాత ఆ కళాశాలయందే ప్రధానాచార్యుడుగను గోఖలే పనిచేసెను. అపారమైన పాండిత్యమును, అనర్గళ మైన వాగ్దాటియు, ఇతనికి ఆదర్శ ఉపాధ్యాయుడుగా వెలుగొందుటకు దోడ్పడినవి. చరిత్రయు, ఆర్థికశాస్త్రమును, ఇతనికి అభిమాన విషయములు. గోఖలే ఉపాధ్యాయవృత్తియం దుండగనే రెనడేమహాశయుని శుశ్రూష ఇతనికి చేకూరెను. ద్రోణునియొద్ద అర్జునుడువలె ఇతడు మిగులశ్రద్ధతో ఈగురువు నొద్ద అర్థశాస్త్రమును పఠించెను. ప్రజాసేవోద్యమ విషయమున ఇతడు తగు శిక్షణము పొందెను.
1895 లో భారతదేశ పరిపాలనావిధానమునుగూర్చియు, ఆర్థిక సమస్యలను గూర్చియు విచారణ జరుపుటకు వెల్బీ కమీషన్ నియమింపబడినది. ఈ సందర్భమున కమీషనుముందు బొంబాయి రాష్ట్ర సమితివారి ప్రతినిధిగా సాక్ష్య మిచ్చుచు ఇతడు చూపిన తార్కిక ప్రతిభయు విషయ పరిజ్ఞానమును ఆ కమీషనునందలి అధికారులకు ఆశ్చర్యమును, స్వదేశీయులకు ఆనందమును కలుగజేసెను. అప్పటికి ఇతనిప్రాయము 31 సంవత్సరములే. పిమ్మట గోఖలే బొంబాయి రాష్ట్రశాసవసభయందును, సామ్రాజ్య శాసనసభయందును ఆదర్శసభ్యుడుగా నుండి ప్రసిద్ధి నొందెను. విషయ విజ్ఞానమునకును, తర్క ప్రౌఢిమకును మచ్చుతునుకలైన ఈతని ప్రసంగములు ఆనాటి సభ్యుల ప్రశంసలను చూరగొనెను. ఈనాడును అవి శ్రద్ధా గౌరవములతో పఠింపబడుచున్నవి. 1905 వ సం. లో ఇతడు
కాశిలో జరిగిన జాతీయ మహాసభకు అధ్యక్షుడయ్యెను. ఆంగ్ల దేశమునకేగి అచట భారతప్రజల ఆశయములను
స్పష్టముగా, సమగ్రముగా వెల్లడించెను. భారతదేశము నందలి రాజకీయ సంస్కరణములయొక్క ఆవశ్యకమును
గూర్చి ఆనాటి భారతదేశ వ్యవహార కార్యదర్శియగు మార్లేకు ఇతడు నచ్చచెప్పెను.
1905 లో గోఖలే భారత సేవకసమితిని నెలకొల్పెను. దక్షిణాఫ్రికాయందు పర్యటించి అచ్చటి భారతీయుల కష్టములను నివారించు నుద్యమములో మహాత్మునకు చేదోడు వాదోడై నిలచెను. బ్రిటిష్‌ప్రభుత్వము తనకు ఒసంగిన సి. ఐ. ఇ. బిరుదును నిరాకరించి, గోఖలే తన త్యాగశీలమును చాటెను. 1915 సం. ఫిబ్రవరి 19 వ తేదీ యందు ఇతడు స్వర్గము నలంకరించెను. స్వదేశీయులీ విషాద వార్తను విని దుఃఖవారధిలో మునిగిరి. బొంబాయిలో జరిగిన సంతాపసభలో ప్రసంగించుచు మహమ్మదాలీ జిన్నా -గోఖలే రాజకీయ ఋషి యనియు, భారత దేశీయ ఆర్థిక సమస్యా పరిష్కార విషయమున అందెవేసిన చేయి యనియు, త్యాగధనుడగు మహావ్యక్తి యనియు ప్రశంసించెను. ఇతడు ప్రాక్పశ్చిమ దేశముల మధ్య చక్కని సమన్వయమును కల్పించినవాడు అని సర్ విలియం వెడర్ బర్న్ ఇతనిని ప్రశంసించెను.
గోఖలే మహాశయు డొనర్చిన భారత ప్రజాసేవ ఒక ఎత్తు; ఆర్థిక సమస్యల విషయములో ఇతడు చేసిన అపార కృషి మరియొక ఎత్తు. ఆర్థిక శాస్త్రములో ఇతడు చేసిన కృషికి కారణములైనవి మూడు. చరిత్ర, ఆర్థిక శాస్త్రము ఇవి ఇతని అభిమాన విషయములై ఈ శాస్త్రములను విద్యార్థులకు బోధించుటయందు ఇతనికి గల అసమానమైన సామర్థ్య మొక కారణము; దారిద్ర్య దేవత ఒడిలో పెరిగి తన దేశీయులను బాధించుచున్న దారిద్ర్యమును నిర్మూలింపవలయునని ఈ మహనీయునికి కలిగిన ఆవేదన రెండవ కారణము; రెనడే మహాశయుని శుశ్రూష లభించి అతనిచే ఇతడు ప్రజాహితమునకై ఉపయోగింపబడు విధమున తీర్చి దిద్దబడుట మూడవ కారణము.
అంకెలతోను, వివరములతోను గూడిన విషయపరిజ్ఞాన సాహాయ్యమున శాసనసభలలో ఆర్థిక సమస్యలపై ఇతడు చేసిన ప్రసంగములు చిరసంస్మరణీయములు. వాటిలో ప్రభుత్వ ఆదాయవ్యయపట్టిక పై ఇతడొసగిన ఉపన్యాసములు విశిష్టము లయినవి. ఆర్థిక సూత్రములమ భారతీయ పరిస్థితుల విషయమున అన్వయించి తన ప్రతిపాదనలను సమర్థించిన విధానము అద్వితీయము. తాను విశ్వసించిన విషయమును జంకులేక చెప్పుటయం దితడు కడుంగడు దిట్ట. అప్రియములును, కఠినములునైన విషయములను సముచితరీతి మృదులముగా ప్రతివాదించు నేర్పునం దీతని కీతడేసాటి. శుష్క విమర్శనముల పొంత బోక నిర్మాణాత్మకములైన సూచనలు చేయు విషయమున ఇతడు కుశలుడు. వెల్బీకమీషన్ సమక్షమున సాక్ష్యమిచ్చుచు ఇతడు బ్రిటిష్ వాణిజ్యవర్గము నెడ ప్రభుత్వము చూపుచున్న అత్యంత సానుభూతిని, దేశమునకు నష్టదాయకముగ జరుగుచున్న అనవసర వ్యయమును ఖండించెను. ఇంగ్లండు మొదలగు దేశములలో ప్రజల క్షేమార్థమై ప్రభుత్వము ధనము వ్యయించుచున్న దనియు, ఇండియాలో అట్టిపద్ధతి అమలులో లేకుండుట న్యాయము కాదనియు ఇతడు నొక్కి వక్కాణించెను. 1901 వ సం.లో బొంబాయిరాష్ట్ర శాసనసభలో 1879 సం. ల్యాండు రెవెన్యూ చట్టమునకు కొన్ని సవరణలను ప్రభుత్వము ప్రతిపాదించెను. సవరణలవలన వ్యవసాయదారులకు కలుగబోవు కష్టనిష్ఠురములను సమగ్రముగా ఇతడు ఆవిష్కరించెను. కాని ప్రభుత్వమువారు వాటిని ఆలకింపని కారణముచే సర్ ఫిరోజిషా మెహతా మొదలగువారితో ఇతడు సభనుండి బయటికి వచ్చెను. ఉప్పు పన్ను తగ్గించవలెననియు, ఆదాయముపై వేయదగిన కనీసపుపన్ను పరిమాణము హెచ్చింపవలెననియు, సైనిక వ్యయమును తక్కువ జేయవలెననియు, ఇండెంచరు పద్ధతి ననుసరించి భారతీయ కార్మికులను దక్షిణాఫ్రికాకు పంపరాదనియు, రైతుల ఋణబాధను తొలగించవలె ననియు ఇతడు ఖండితముగా చెప్పెను.
భారతదేశము పారిశ్రామికముగా అభివృద్ధి చెందవలెనని గోఖలే ఆశయము. పారిశ్రామిక, సాంకేతిక విద్యా వసతులు కలిగింపవలసిన ఆవశ్యకమును ఇతడు తన కాంగ్రెసు అధ్యక్షోపన్యాసములో ఉద్ఘాటించెను. దేశ మందు పారిశ్రామికాభివృద్ధికై కృషిచేయుట భారత సేవక సంఘసభ్యుల విధ్యుక్తధర్మములలో నొకటియని ఇతడు వక్కాణించెను. ప్రాథమిక విద్యాచట్టముపై ప్రసంగించుచు విద్యాగంధములేనిచో ప్రజలలో మిత వ్యయము, కార్మికులలో పారిశ్రామికసామర్థ్యము పెంపొందజాలవని వచించెను.
గోఖలేయొక్క హితోపదేశములను ఆనాటి ప్రభుత్వము పెడచెవిని పెట్టెను. కాని ఇతడు ఆశావాది. భవిష్యత్తుపై విశ్వాసము గలవాడు. కావుననే "ఈతరమునకు చెందినమేము మా అపజయముల ద్వారముననే దేశమును సేవింపవలయును. తమ విజయముల మార్గమున దేశమునకు సేవచేయు ధన్యులు భావికాలములో రాగలరు" అని ఇతడు వాక్రుచ్చెను. ఇతని కలలు ఫలించినవి. ఇతడు వచించిన మూడున్నర దశాబ్దులకే భారతదేశము పారతంత్ర్య శృంఖలములనుండి విముక్తి పొందినది.
ఆర్. ఎన్. ఎస్.