సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోదావరి జిల్లా (తూర్పు)
గోదావరిజిల్లా (తూర్పు) :
ఉనికి : తూర్పు గోదావరిజిల్లా ఆంధ్రప్రదేశములో కోస్తా జిల్లాలు లేక సర్కారు జిల్లాలు అనబడు భాగములో చేరియున్నది. ఇది భారతదేశము యొక్క తూర్పుతీరమందు బంగాళాఖాతము నంటి 16°30' – 18°30' తూర్పు అక్షాంశముల మధ్యను, 80025' - 82035' తూర్పు రేఖాంశ వృత్తముల మధ్యను వ్యాపించి యున్నది. ఈ జిల్లాకు ఉత్తరమున విశాఖపట్టణము జిల్లాయు ఒరిస్సా, మధ్యప్రదేశ రాష్ట్రములును, తూర్పు, దక్షిణములందు బంగాళాఖాతమును, పశ్చిమమున పశ్చిమ గోదావరి జిల్లాయు ఖమ్మం మెట్టు జిల్లాయు సరిహద్దులుగా కలవు. జిల్లాకంతకు దక్షిణ పశ్చిమములందు గోదావరీనది సరిహద్దుగా నున్నది. ఆ నది వెంట నీ జిల్లా పొడవుగా నుండును. 1951 లెక్కల ననుసరించి ఈ జిల్లాకు సంబంధించిన వివరము లీ దిగువ విధముగా నుండును.
జిల్లా విస్తీర్ణము 5,682 చ. మైళ్లు; గ్రామములు 1816; పురములు 20; ఇండ్లు 4,36,570; జనాభా 2.414,808; పురుషుల సంఖ్య 12,06,483; స్త్రీల సంఖ్య 12,08, 325; జనసాంద్రత 425.
5 రెవెన్యూ డివిజనులలో 12 తాలూకాలు కలవు. (1) భద్రాచలము డివిజను దీనియందు భద్రాచలము, నూగూరు తాలూకాలు కలవు. (2) రాజమహేంద్రవరము డివిజను—దీనియందు రాజమహేంద్రవరము, రామచంద్రపురము, రంపచోడవరము తాలూకాలు కలవు. (3) పెద్దాపురము డివిజను - దీనియందు పెద్దాపురము, తుని, పిఠాపురము, ఎల్లవరము తాలూకాలు కలవు. (4) అమలాపురము డివిజను - దీనియందు అమలాపురము, రాజోలు తాలూకాలు కలవు. (5) కాకినాడ డివిజను- దీనియందు కాకినాడ తాలూకా మాత్రమే కలదు. ఈ జిల్లాయందలి 12 తాలూకాల వివరము లీ దిగువ నీయబడినవి :
చిత్రము - 119
1. భద్రాచలము తాలూకా : దీని విస్తీర్ణము 911 చ. మై. జనాభా 77,620; వీరిలో పురుషులు 39,016 మంది, స్త్రీలు 38,604 మంది; జన సాంద్రత చ. మైలు 1కి 85 మంది; గ్రామములు 327.
2. నూగూరు తాలూకా : దీని విస్తీర్ణము 593 చ.మైళ్లు; జనాభా 35,366; వీరిలో పురుషులు 17,880, స్త్రీలు 17,486; జనసాంద్రత చ. మై. 1 కి 60 మంది, గ్రామములు 146.
షరా : భద్రాచలము, నూగూరు తాలూకాలు ఖమ్మము జిల్లాలో చేర్చబడినవి (1960).
3. రంపచోడవరము తాలూకా : దీని విస్తీర్ణము 710 చ. మైళ్లు; జనాభా 40.273; వీరిలో పురుషులు 20.119, స్త్రీలు 20,154; జనసాంద్రత చ. మై. 57 మంది; గ్రామములు 232.
4. ఎల్లవరం తాలూకా : దీని వి స్తీర్ణము 850 చ.మైళ్లు; జనాభా 54,525; వీరిలో పురుషులు 27,589; స్త్రీలు 26,956; జనసాంద్రత చ. మై. 1 కి 64 మంది, 'గ్రామములు 323.
5. రాజమహేంద్రవరము తాలూకా : దీని విస్తీర్ణము 378 చ. మైళ్లు; జనాభా 321,984; వీరిలో పురుషులు 1,61,000; స్త్రీలు 1,60,984 జనసాంద్రత చ. మై 1కి 852 మంది; గ్రామములు 80; పురములు 2 (రాజమహేంద్రవరము, ధవళేశ్వరము).
6. పెద్దాపురము తాలూకా : దీని విస్తీర్ణము 602 చ. మైళ్లు; జనాభా 2,87,764; వీరిలో పురుషులు 1,43,571; స్త్రీలు 1,44,193; జనసాంద్రత చ. మై 1కి 478 మంది; గ్రామములు 197; పురములు 3 (పెద్దాపురము, కిర్లంపూడి ఎల్లేశ్వరము).
7. పిఠాపురము తాలూకా : దీని విస్తీర్ణము 138 చ. మైళ్లు; జనాభా 1,47,070; వీరిలో పురుషులు 72,985: స్త్రీలు 74,085; జనసాంద్రత చ. మై. 1కి 1,066 మంది; గ్రామములు 46; పురములు 2 (పిఠాపురము, గొల్లప్రోలు).
8. తుని తాలూకా : దీని విస్తీర్ణము 183 చ. మైళ్లు; జనాభా 1,16,971; వీరిలో పురుషులు 58,816; స్త్రీలు 58,155; జనసాంద్రత చ. మై 1కి 639 మంది; గ్రామములు 48; పురము 1 (తుని).
9. రామచంద్రపురము తాలూకా : దీని విస్తీర్ణము 289 చ. మైళ్లు; జనాభా 3,46,056; వీరిలో పురుషులు 1,72,575; స్త్రీలు 1,73,481; జనసాంద్రత చ. మై. 1కి 1,197 మంది; గ్రామములు 112; పురములు 5 (రామచంద్రపురము, మండపేట, బిక్కవోలు, అనపర్తి, ద్రాక్షారామము).
10. కాకినాడ తాలూకా : దీని విస్తీర్ణము 384 చ. మైళ్లు; జనాభా 3,55,502; వీరిలో పురుషులు 1,77,405; స్త్రీలు 1,78,097; జనసాంద్రత చ. మై. 1కి 926 మంది; గ్రామములు 100; పురములు 2 (కాకినాడ, సామర్లకోట).
11. రాజోలు తాలూకా : దీని విస్తీర్ణము 291 చ. మైళ్లు; జనాభా 3,14,910; వీరిలో పురుషులు 1,56, 759 స్త్రీలు; 1,58,151; జనసాంద్రత చ. మై. 1కి 1,082 మంది, గ్రామములు 103; పురములు 2 (రాజోలు, కొత్తపేట)
12. అమలాపురము తాలూకా : దీని విస్తీర్ణము 353 చ. మైళ్ళు; జనాభా 3,16,767; వీరిలో పురుషులు 1,58,788; స్త్రీలు 1,57,979; జనసాంద్రత చ మై. 1కి 897 మంది; గ్రామములు 102; పురములు 3 (అమలాపురము, ముమ్మిడివరము, మాచవరము).
ఈ 12 తాలూకాలలో నూగూరు, భద్రాచలము, రంపచోడవరము, ఎల్లవరము తాలూకాలు నాలుగు మన్య ప్రాంతమని వ్యవహరింపబడును. ఈ ప్రాంత మందు 'కోయలు' అనబడు ఆటవికులు అధికముగా నుందురు. అడవులు కూడ నిచట మెండు. నూగూరు, భద్రాచలము, రంపచోడవరము, రాజమహేంద్రవరము, రామచంద్రపురము, రాజోలు, అమలాపురము తాలూకాలు గోదావరీతీరమందున్నవి. తుని, పిఠాపురము, కాకినాడ తాలూకాలు బంగాళాఖాత తీరమందున్నవి. జిల్లాలో సగభాగము దాదాపు తూర్పుకనుమలచే ఆవరింపబడి యున్నది. ఈ విధముగా ఈ జిల్లాను మూడు ప్రకృతి మండలములుగా విభజింపవచ్చును: 1. మన్యప్రాంతము లేక కొండలతో కూడిన అరణ్యప్రాంతము 2. సముద్ర తీరమందున్న గోదావరి నదియొక్క డెల్టాభాగము 3. మిగిలిన మెట్టప్రాంతము (తుని, పెద్దాపురము, పిఠాపురము తాలూకాలు).
నదులు : ఈ జిల్లాయందు ప్రధానమగునది గోదావరి. ఈ నది వెంట నూగూరు, భద్రాచలము, రంపచోడవరము, రాజమహేంద్రవరము, రామచంద్రపురము, అమలాపురము, రాజోలు తాలూకాలు కలవు. భద్రాచలమున కెగువున 12 మైళ్ళ దూరమున దుమ్ముగూడెము వద్ద గోదావరి కొక ఆనకట్ట నిర్మింపబడెను. ధవళేశ్వరము వద్ద ఈ నదికి మరియొక పెద్ద ఆనకట్ట నిర్మింపబడెను. అచటినుండి నది గౌతమి, వసిష్ఠ అను రెండు ముఖ్యమైన శాఖలుగా చీలి ప్రవహించును. ఈ రెండుశాఖల మధ్య నున్న లంకభూమిలో అమలాపురము, రాజోలు తాలూకాలు కలవు. ఈ భూఖండమునే కోనసీమ యని వ్యవహరింతురు. ఇది మిక్కిలి సారవంతమైన భూమి. గౌతమినుండి విడిపోయిన తుల్యభాగ, అత్రి అను రెండు పాయలు కాకినాడకు దగ్గరలోనున్న చొల్లంగి, కోరంగి అను గ్రామములవద్ద వరుసగా సముద్రములో సంగమించును. మిగిలిన గౌతమి, కౌశిక, కాశ్యప, భరద్వాజ, వైనతేయ, వసిష్ఠ అను శాఖలు కోనసీమనంతను ఆవరించి సముద్రములో కలియుచున్నవి. తరువాత ఈ జిల్లాలో ముఖ్యమైన నది ఏలేరు. ఇది ఎల్లవరము తాలూకాలో ఉద్భవించి పెద్దాపురము, పిఠాపురము, కాకినాడ తాలూకాలగుండా ప్రవహించి సముద్రములో చేరును. ఈ నదిని సేద్యమున కుపయుక్తముగా చేయ వలెనన్న ప్రయత్నములు సాగుచున్నవి. అవి ఫలించినచో మెట్టతాలూకాల కెక్కుడు లాభించగలదు.
అరణ్యములు : ఈ జిల్లాలో 1,880.48 చ. మైళ్ళ రిజర్వుడు అడవులు, 85.33 చ. మైళ్ళ తీసికొనబడిన ఎస్టేటు అడవులు, 23.30 తీసికొనబడని ఎస్టేటు అడవులు మొత్తము 1,989.11 చ. మైళ్ళ అడవులు కలవు.
శీతోష్ణస్థితి, వర్షపాతము : జిల్లాకంతకు ఏప్రిల్, మే, జూన్ నెలలు వేసవిగను; జులై, ఆగస్టు, సెప్టెంబరునెలలు నైరృతి ఋతుపవనములచే వర్షముకురియు వర్షాకాలముగను; అక్టోబరు, నవంబరు నెలలు ఈశాన్య ఋతుపవనములచే వర్షములు కురియు ఋతువుగను; మిగిలిన డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు శీత కాలముగను ఉండును. సాధారణముగా వాయవ్య ఋతుపవనములవలననే అధిక వర్షము కురియుచున్నను, తూర్పుతీరమందు ఈశాన్య ఋతుపవనములు కూడ ఎక్కువ వర్షము నిచ్చుచున్నవి. ఈ రెండవ వర్ష ఋతువునందు అప్పుడప్పుడు గాలివానలు వచ్చుచు, తీరప్రాంతమందు విస్తారమగు నష్టమును కలిగించుచుండును. జిల్లా యందలి సగటు వర్షపాతము 45.24 అంగుళములు, వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రత భద్రాచల ప్రాంతమందుండును. అచట సుమారు 50°C వరకు ఉష్ణాధిక్యము కనబడుచుండును. జిల్లాలోని తీరప్రాంతమందు సముద్రప్రభావ మధికముగా నుండుటచే వేసవి యందు అధికమగు ఉష్ణముగాని, శీతకాలమందు మిక్కిలి చలిగాని లేకుండ సమశీతోష్ణమై మంచి వాసయోగ్యముగా నుండును. సతత హరితములగు ఫలవృక్షముల తోటలు, పైరులు, అడవులు కూడ ఇందుకు తోడ్పడుచున్నవి.
నేలలో నధిక భాగము డెల్టాకు సంబంధించిన సారవంతమగు ఒండ్రుమట్టితో నిండియున్నది. మన్యపు ప్రాంత మందును, మెట్టతాలూకాలలోను రేగడి నేలలు కలవు. ఇవియు సారవంతమైన భూములే.
నేలల రకముల వివరము: డెల్టాభూమి 3,60,000 ఎకరములు, అభివృద్ధికి తేబడిన భూమి 700 ఎకరములు, నల్ల రేగడిభూమి 63,000 ఎకరములు, ఎఱ్ఱరేగడినేల 2,51,500 ఎకరములు, ఇసుక నేల 46,200 ఎకరములు .
నీటిపారుదల : ధవళేశ్వరము వద్ద 1852 లో సర్ ఆర్థర్ కాటన్ అను మహాశయునిచే ఆనకట్ట నిర్మింపబడెను. దానినుండి అనేకములగు కాలువలు ఇరువైపుల త్రవ్వబడెను. ఎడమవైపు కాలువ లి జిల్లాకు పుష్కలముగా నీటిని అందజేయు చున్నవి. వాటి ద్వారమున రాజమహేంద్రవరము, కాకినాడ, రామచంద్రపురము, అమలాపురము, రాజోలు తాలూకాల భూములు సేవ్యము చేయబడుచున్నవి. రాజోలు తాలూకా గన్నవరము వద్ద గోదావరి కాలువను వైనతేయనది మీదుగా దాటించుటకై గొప్ప అక్విడక్టు నిర్మింపబడెను. గోదావరి కాలువలక్రింద సుమారు 9 లక్షల యెకరముల భూమి సేవ్యము చేయబడుచున్నది. ఈ కాలువలలో సంవత్సర మంతయు నీరుండుటచే రెండవ పంటకుకూడ నీరు లభించి ఎల్లప్పుడును భూములు పైరులతో నిండియుండును. ఇదియే యీ జిల్లాలోని ప్రధానమగు నీటి సౌకర్యము. రెండవది ఏలేరునది. దీని క్రింద 17 వేల ఎకరములకు పైగా సేవ్యమగుచున్నది. ఈ నదికి సరియైన జలాశయము నిర్మించి యింకెక్కువ నీటివనరును మెట్టతాలూకాలకు కల్పించవలెనను పథకములు ప్రభుత్వ దృష్టిలో కలవు. ఇవిగాక చెరువులు, వాగులు, బుగ్గబావులుకూడ సేవ్యమునకై ఉపయోగపడుచున్నవి. జిల్లాలలో మొత్తము 1052 చిన్న నీటి వనర్లు కలవు. వాటి క్రింద 37,260 ఎకరములు భూమి సాగు అగుచున్నది. పెద్ద నీటి వనరుల క్రింద 4,28,673 ఎకరములు భూమి సాగు అగు చున్నది.
పంటలు : తూర్పు గోదావరిజిల్లా ఆంధ్రప్రదేశ మందలి అన్నిజిల్లాలలోను పంటల విషయమున అగ్రస్థానమును వహించుచున్నదనవచ్చును. గోదావరీమతల్లి చలువ వలన నదియొక్క డెల్డా భాగమంతయు సారవంతమగు భూమి కలిగియుండుటయేగాక సంవత్సరము పొడుగున నీటి కొరతలేని కారణమున రెండు ఋతువులలో వరి, చెఱకు విస్తారముగా పండును. చోడులు, రాగులు, వేరుసెనగ, నువ్వులు, ప్రత్తి, పొగాకు — ఇతర పంటలు. ఇవిగాక మామిడితోటలు, కొబ్బరితోటలు, అరటితోటలు, పోకతోటలు, జీడిమామిడి తోటలు ఈ జిల్లాయం దధికముగా నున్నవి. పరిశ్రమలు : ఈ జిల్లాలో చిన్నవి, పెద్దవి ఫ్యాక్టరీలు మొత్తము 308 కలవు. వాటిలో రాజమహేంద్రవరములోని కాగితముల మిల్లు, సామర్లకోటలోని చక్కెరమిల్లు, అనపర్తిలోని పొగాకు మిల్లు, పెద్దాపురములోని సిల్కు మిల్లులు, బియ్యపు మిల్లులు (పెద్దవి), కాకినాడలోని కొబ్బరిత్రాళ్లు నేయు మరలు, అల్యూమినము, ఇత్తడి కర్మాగారములు, నూనె మిల్లులు మున్నగు పలుకరముల పెద్దపరిశ్రమలు పల్లపు తాలూకాలలో కలవు. వీటియందు మొత్తము 14,242 మంది కూలీలు పని చేయుచున్నారు. ఇవిగాక అనేకవిధములగు గృహ పరిశ్రమలు, లఘు పరిశ్రమలు ప్రతి తాలూకాయందును గలవు. పిఠాపురము తాలూకా ఉప్పాడలోని పట్టునూలు చేనేత పరిశ్రమ మిక్కిలి ప్రసిద్ధిగాంచినది. బెల్లపు పరిశ్రమ, కలప పరిశ్రమ కూడ పేర్కొనదగియున్నవి. ఇటీవల పిఠాపురములో నొక చక్కెర ఫ్యాక్టరీ నిర్మింపబడెను.
వృత్తులు: మెట్టతాలూకాలలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. ఆటవికులగు కోయలకు అడవులలోని కలపను నరుకుటకూడ ముఖ్యవృత్తిగా నున్నది. పల్లపు తాలూకాలలో వ్యవసాయము, పండ్లతోటలు పెంచుట, పారిశ్రామిక కేంద్రములలో కూలి పని చేయుట, చేపలు పట్టుట, గోదావరిలోను, కాలువలలోను, సముద్రములోను పడవలను నడుపుట, ముఖ్యమైన వృత్తులై యున్నవి. మొత్తము మీద జిల్లా యంతటను ఒడలువంచి పని చేయగలవారికి చేతినిండ పని యుండును. రాజమహేంద్రవరము, జిల్లా ముఖ్యపట్టణమగు కాకినాడ ముఖ్యమగు వర్తక కేంద్రములు. ఈ రెండు పట్టణములకు రైలు మార్గము, రోడ్డు మార్గము, జల మార్గము రవాణా సదుపాయములుగా నున్నవి. ఈ ప్రాంతమంతయు ఎక్కువ సారవంతమై అన్నివిధముల సుసంపన్నమై యుండుటను బట్టియు, కావలసినంత పని దొరుకుటనుబట్టియు విశాఖపట్టణము, గుంటూరు జిల్లాల నుండి అసంఖ్యాకమగు కార్మికజన మిచటికి వలస వచ్చి స్థిరనివాస మేర్పరచుకొనిరి.
రహదారులు : జిల్లాలోని రహదారుల పొడవు మొత్తము 1633 మైళ్ళు. మెట్టతాలూకాలలో నివి తక్కువ. కలకత్తా మద్రాసులను కలుపు ట్రంకురోడ్డు ఈ జిల్లాగుండా 69 మైళ్ళ పొడవున పోవును. దీనికి దాపుగానే పై రెండు పట్టణములను కలుపు ఇనుపదారి 791/2 మైళ్లు ఈ జిల్లాలో గలదు. ఇది దక్షిణ రైల్వేశాఖకు చెందినది. సామర్లకోట కూడలినుండి జిల్లా ముఖ్యపట్టణమగు కాకినాడకు, సముద్రపు రేవునకు రైలుమార్గము కలదు. సముద్రము, గోదావరీనది కాలువలుకూడ రాకపోకలకు, ఎగుమతి దిగుమతులకు అనువైన ముఖ్యమగు రహదారులుగా నుండుట ఈ జిల్లాయందు గమనించతగిన విశేషము. సముద్రతీరమందున్న కాకినాడ, కోరంగి, తాళ్ళ రేవు, ఇంజరం, యానాం, ఉప్పాడ మొదలగునవి ముఖ్యమైన ఓడరేవులుగా పూర్వకాలము నుండియు ప్రసిద్ధి కెక్కి యున్నవి. ఇప్పటికిని ఈ రేవులగుండ కొంత వ్యాపారము జరుగుచునే యున్నది.
తంతి – తపాలా : జిల్లాలో మొత్తము 24 తంతి - తపాలా కార్యాలయములు, 33 పెద్ద తపాలా కార్యాలయములు, 410 చిన్న తపాలా కార్యాలయములు, ఒక తపాలా హెడ్డాఫీసు, ఒక తంతి కార్యాలయము కలవు.
వైద్యము : 9 ప్రభుత్వమువి, 2 లోకల్‌ఫండువి ఆసుపత్రులు కలవు. 56 చిన్న వైద్యశాలలు జిల్లాయంతటను గలవు. ఇవిగాక రాజమహేంద్రవరము, కాకినాడలలో క్రైస్తవ మిషనరీల వైద్యశాలలు గలవు. రాజమహేంద్ర వరములో క్షయరోగ చికిత్సా కేంద్రము కలదు. రామచంద్ర పురములో 165 పడకలుగల కుష్ఠరోగులకు మిషనరీ వైద్యశాల కలదు. జిల్లా కేంద్రమగు కాకినాడలోను, రాజమహేంద్రవరములోను 'క్ష' కిరణ ('X' Ray) యంత్ర సౌకర్యములు గలవు. ఈ జిల్లాలో మొత్తము 505 పడకలకు వసతిగలదు.
విద్య : ఈ జిల్లాలో విద్యాసౌకర్యము లీ క్రింది విధముగా నున్నవి :
సంస్థలు | విద్యార్థుల సంఖ్య |
ఇంజినీరింగు కళాశాల 1 | 485 |
బోధనా కళాశాల 1 | 185 |
ఆర్ట్స్, సైన్సు కళాశాలలు 3 | 2585 |
హైస్కూళ్ళు (బాలురవి) 31 | 21,762 |
హైస్కూళ్ళు (బాలికలవి) 3 | 1171 |
ప్రాచ్య విద్యాలయములు 2 | 71 |
ఆంగ్లో ఇండియన్ స్కూళ్ళు 2 | 289 |
ట్రైనింగుస్కూళ్ళు (బాలురవి 3 బాలికలవి 3) 6 | 1080 |
బేసిక్ ట్రైనింగుస్కూలు 1 | 75 |
మాధ్యమిక పాఠశాలలు | |
(బాలురవి) 19 | 4,658 |
(బాలికలవి) 1 | 175 |
ప్రాథమిక పాఠశాలలు 1,761 | 1,72,119 |
బేసిక్ పాఠశాలలు 3 | 773 |
వయోజన పాఠశాలలు 52 | 1,601 |
జిల్లాలో మొ త్తము 3,94,733 మంది అక్షరాస్యులు కలరు. వారిలో 2,68,013 మంది పురుషులు, 1,26,720 మంది స్త్రీలు కలరు.
ముఖ్యపట్టణములు : కాకినాడ జిల్లా కేంద్రము. జనాభా 99,952 మంది. మునిసిపాలిటీ పట్టణము. రైలు, రోడ్డు, సముద్రపు ఓడల సౌకర్యములు ఈ నగరమునకు కలవు. పలువిధములగు విద్యావసతులను కలిగియున్నది. గొప్ప వర్తక కేంద్రముగను, వ్యాపారకేంద్రముగను తూర్పు ఇండియా కంపెనీలనాటినుండియు ప్రసిద్ధికెక్కి యున్నది
రాజమహేంద్రవరము 1,05,276 జనాభాగల మరియొక మునిసిపాలిటీ, రాజరాజనరేంద్రుని కాలమునుండి అనగా క్రీ. శ. 10 వ శతాబ్దమునుండి ఆంధ్ర సంస్కృతికి రాజకీయములకు కేంద్రమై విలసిల్లిన పురవతంసమిది. గోదావరీ నదీతీరమందుండుటచేతను, ముఖ్యమైన ఇనుపదారిలోను, ట్రంకురోడ్డుప్రక్కను ఉండుటచేతను ఈ నగరము అనేక సౌకర్యములు కలిగి మిక్కిలి వాసయోగ్యముగా నుండును. ఫలసమృద్ధికి పెట్టినదిపేరు. కలప, కొబ్బరికాయలు, పండ్లు, మొక్కలు, నూనె యిచటినుండి విశేషముగా నెగుమతి యగుచుండును.
ఇవిగాక పెద్దాపురము, అమలాపురములుగూడ మునిసిపాలిటీలుగల పట్టణములు. సామర్లకోట, రామచంద్రపురము, తుని, మండపేట మున్నగు ననేక చిన్న పట్టణములు ఈ జిల్లాయందు కలవు. సంస్థానాధీశులచే నిప్పటి వరకు పాలింపబడిన పిఠాపురము, తుని, కిర్లంపూడి పట్టణములు పూర్వము నుండియు సాంస్కృతికముగ ప్రసిద్ధి కెక్కియున్నవి.
యాత్రాస్థలములు : యాత్రాస్థలములకుకూడ ఈ జిల్లా అగ్రస్థానమును వహించుచున్నది. భద్రాచలముయొక్క ప్రాముఖ్యము తెలియనివా రుండరు. ఆంధ్రులకు ఇలవేల్పనదగు శ్రీరామచంద్రు డిచటనే భక్తరామదాసును తరింపజేసి తాను ప్రసిద్ధికెక్కినాడు. వైకుంఠఏకాదశికి, శ్రీరామనవమికి ఇచట జరుగు మహోత్సవముల సందర్భమున దేశమందలి పలుప్రాంతములనుండి లక్షల కొలది యాత్రికులు వచ్చుచుందురు. భద్రాచలము దగ్గర పర్ణశాల, శ్రీరామగిరి అనునవి గోదావరి తీరస్థ పవిత్ర క్షేత్రములు. ఈ ప్రదేశములకు అఖిలభారతము నుండి యాత్రీకులు వచ్చుచుందురు. (భద్రాచలము ఖమ్మముజిల్లాలో చేర్చబడినది. 1960). తరువాత చెప్ప తగిన గొప్ప క్షేత్రము రామచంద్రపురములోని దాక్షారామము. పంచారామము లనబడు ఐదు శైవక్షేత్రములలో నిది యొకటి. శివరాత్రి కిచట గొప్పతీర్థము జరుగును. ఇచటి శివలింగము సూర్యప్రతిష్ఠితమని పురాణప్రసిద్ధి. వ్యాసుడు కాశినుండి యిచటికి తరలి వచ్చెననియు, ఇదియే దక్షాధ్వరవాటికయనియు భీమఖండాది పురాణములలో కలదు. కోటిపల్లికూడ ఈ తాలూకాలోని మరియొక శైవక్షేత్రము. కోట అనునొక వైష్ణవక్షేత్రముకూడ నిచటనే శిథిలమై యున్నది. ఇది గోదావరీతీరమం దున్నది. పాదగయాక్షేత్ర మన బరగు కుక్కుట క్షేత్రము పిఠాపురమున మిక్కిలి ప్రసిద్ధి గాంచినది. శివరాత్రి కిచట గొప్ప ఉత్సవము జరుగును. ఇచటనే కుంతీ మాధవాలయముకూడ కలదు. తుని తాలూకాలోని అన్నవరములో నొక కొండపై నున్న సత్యనారాయణస్వామివారి ఆలయము గొప్ప యాత్రాస్థలము. వైశాఖపూర్ణిమ కిచట జరుగు ఉత్సవమునకేగాక ప్రతి యేకాదశికి వందలకొలది యాత్రికులు వచ్చు చుందురు. రాజమహేంద్రవరములోని కోటిలింగాలగుడి, మార్కండేయస్వామి గుడి కూడ స్థానిక క్షేత్రములై యున్నవి. కోనసీమ యందు ముక్తేశ్వరము (శైవ), అంత ర్వేది(వైష్ణవ), వాడపల్లి(వైష్ణవ), ర్యాలి మున్నగు పేర్వడ్డ క్షేత్రములే గాక గోదావరీశాఖల తీరములం దంతటను తీర్థము లనేకములు కలవు.
బృహస్పతి గ్రహము సింసారాశిగతమై యుండు సంద ర్భమున రాజమహేంద్రవరములో 12 సంవత్సరముల కొకతూరి గోదావరీ పుష్కరము పేరిట బ్రహ్మాండమగు ఉత్సవము 12 దినములు జరుగును. రాజోలు తాలూకాలోని ఆదుఱ్ఱు గ్రామమున బౌద్ధస్తూపములు కలవు.
ఇతరములు: గోదావరి నాశ్రయించుకొని యున్న దగుటచే నీ జిల్లా అన్నివిధముల యభివృద్ధిగాంచియున్నది. పాడిపంటలకు లోటులేనిదైయుండుటయేగాక సాంస్కృతికముగా కూడ ముందంజవేసినది. నన్నయ, పండిత రాయలు, వీరేశలింగము మొదలగు విద్వదవతంసులకును, వేద వేదాంగ పండిత ప్రకాండులకును ఈ జిల్లా నెలవై యున్నది.
భాషలు: జిల్లాలో తెనుగే ప్రధానముగా మాట్లాడు భాష. అయినను ఇతర భాషలు మాట్లాడువారు కూడ నీ దిగువ విధముగా కలరు:
ఈ జిల్లాలో 35 మాతృభాషలు గలవారున్నారు.
తెలుగు మాతృభాషగా కలవారు | 23,38,459 మంది |
కోయభాష మాతృభాషగా కలవారు | 44,749 మంది |
ఉర్దూభాష మాతృభాషగా కలవారు | 21,870 మంది |
తమిళము మాతృభాషగా కలవారు | 1,977 మంది |
ఓడ్రము మాతృభాషగా కలవారు | 2,011 మంది |
హిందీ మాతృభాషగా కలవారు | 991 మంది |
హిందూస్థానీ మాతృభాషగా కలవారు | 658 మంది |
ఇంగ్లీషు మాతృభాషగా కలవారు | 617 మంది |
మలయాళము మాతృభాషగా కలవారు | 508 మంది |
కన్నడము మాతృభాషగా కలవారు | 435 మంది |
మరాటీ మాతృభాషగా కలవారు | 366 మంది |
ఇతర భాషలు మాతృభాషగా కలవారు (24) | 2,167 |
మొత్తం | 24,14,808 మంది |
మతములు :
హిందువులు | 23,33,448 మంది |
జైనులు | 286 మంది |
బౌద్ధులు | 17 మంది |
మహమ్మదీయులు | 33,577 మంది |
క్రైస్తవులు | 27,390 మంది |
ఇతరులు | 20,090 మంది |
మొత్తం | 24,14,808 మంది |
చరిత్ర : ఈ జిల్లాను శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, కళింగులు, చాళుక్యులు పదునొకండవ శతాబ్దము వరకును ఏలిరి. అమలాపురము, రాజోలుతాలూకాలను కోనవంశమునకు చెందిన రాజులు పండ్రెండవ శతాబ్దము వరకు నేలియుండుటచే నీ ప్రాంతమునకు కోనసీమ యను వ్యవహార మేర్పడెను. 1300 సం. ప్రాంతమున ఓరుగంటి కాకతీయ రాజులును, అటుపిమ్మట 1450 ప్రాంతమువరకు కోరుకొండ, కొండవీటి రెడ్లును తూర్పు గోదావరి జిల్లాపై నధికారమును నెరపిరి. రెడ్డిరాజుల కవియగు శ్రీనాథుని గ్రంథములవలన ఆనాటి యచటి పరిస్థితులు కొన్ని తెలియగలవు. 1515 ప్రాంతమున శ్రీకృష్ణదేవరాయలు విశాఖపట్టణము వరకు జయించి నపుడు ఈ జిల్లాగూడ రాయల యేలుబడిలో చేరెను. విజయనగర రాజ్యపతనానంతరము 1571 లో గోదావరి జిల్లా గోలకొండసుల్తానుల పాలనములో చేరెను. 1687లో ఔరంగజేబు దక్కనును జయించుటతో నిదియు మొగలాయి పాలనములో చేరెను. గోలకొండ సుల్తానులు మొగలాయి రాజ్యపు సుబేదారులు. వీరి ఏలుబడిలో తూర్పుగోదావరి జిల్లా చాలభాగములను పెద్దాపురము, పిఠాపురము, తుని, కిర్లంపూడి మున్నగు సంస్థానములు 3 శతాబ్దములు పాలించి ఈ జిల్లా చరిత్రను తీర్చిదిద్దినవి. 1748 తరువాత నైజాము అనుమతిన తూర్పు ఇండియా కంపెనీవారు ఈ జిల్లాయందు స్థిరపడిపోయిరి. 1825 నాటికి ఫ్రెంచివారు, డచ్చివారు పూర్తిగా వెడలింపబడి జిల్లాయంతయు ఆంగ్లేయుల వశమయ్యెను.
పు. ప. శా.