Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గోతముడు (అక్షపాదుడు)

వికీసోర్స్ నుండి

గోతముడు (అక్షపాదుడు) :

సుమారు మూడువేల సంవత్సరముల క్రిందటి ప్రాచీనార్యుల అనుపమేయ కుశాగ్రబుద్ధిని వెల్లడి చేయుటలో ప్రసిద్ధి కెక్కిన తత్త్వగ్రంథము లారు. ఈ ఆరింటిని షడ్దర్శనములని పిలచెదరు. ఈ షడ్దర్శనములలో న్యాయదర్శన మొకటి. ఈ న్యాయదర్శన కర్త గోతము డనువాడు. ఇతనికి అక్షపాదుడను విశేషనామము గలదు. న్యాయదర్శనమునకు న్యాయవిద్య, న్యాయశాస్త్రము, న్యాయసూత్రములు, తర్కశాస్త్రము అను నామాంతరములు కలవు.

ఈ న్యాయసూత్రములు రచించిన గోతము డెవడు? ఏ కాలమువాడు? ఏ దేశమువాడు? ఇతని పేరు గోతముడా? గౌతముడా ? ఇత్యాది విషయములను గూర్చి వాదోపవాదములు కలవు.

గోతములు, గౌతములు పెక్కుమంది కలరు ; సుమారు పదిమంది కనబడుచున్నారు వీరిలో న్యాయదర్శనకర్త ఎవ్వడో నిర్ణయించుటకు ప్రాచ్య పాశ్చాత్య పండితులు అధికముగ శ్రమించినారు. ఆయా గోతముల కాలములను బట్టి న్యాయదర్శనకర్తను, తద్రచనా కాలమును బుద్ధునికాలము మొదలుకొని క్రీ. శ. 4, 5 శతాబ్దముల వరకుగల నడిమి కాలములో నిటునటు లాగి, తమ తమ వివేచనానుసారము ప్రాచ్య, పాశ్చాత్య పండితులు నిర్ణయించియున్నారు. గోతము డెవడా యని చేసిన చర్చ యంతయు పరస్పర విరుద్ధముగా నున్నది. అయితే న్యాయదర్శనకర్తను నిర్ణయించుటకు విలక్షణమైన రెండు సంకేతములు కలవు. ఒకటి అతని పేరు గోతముడయి యుండవలెను. రెండవది, అతనికి అక్షపాదుడను విశేష సామముకూడ నుండవలెను. ఈ రెండు లక్షణములు ఎవ్వని కుండునో వాడే న్యాయదర్శనకర్తయని మనము నిర్ధారణ చేయవచ్చును.

గోతమవంశ జాతుడు గౌతముడగును. కావున గౌతముడను నామధేయము కలవారు ఈ వివాదరంగము నుండి తొలగిపోయెదరు. ఇక పండితులయిన వారిచే చర్చితులైన గోతములకు 'అక్షపాద' బిరుదము కనబడదు . కావున వీరును వివాదరంగమునుండి తొలగవలసియే యుండును. అయితే ఈ న్యాయదర్శన కర్తయగు అక్షపాద గోతముడెవడు అను ప్రశ్న మిగిలియున్నది.

న్యాయదర్శనకర్త గోతముడు. ఇతనికి అక్షపాదుడను బిరుదము కలదు. ఇతడు వేదకాలమునాటివాడు. మంత్ర ద్రష్ట. మహర్షి . ఈ విషయములను సప్రమాణముగా స్పష్ట పరచెదము.

అపౌరుషేయములగు వేదములందే అన్ని దర్శనములు ఆరంభింపబడినవి. ఋగ్వేదీయ, యజుర్వేదీయ చరణ వ్యూహములలో న్యాయశాస్త్రము ప్రస్తావింపబడినది. ఋగ్వేదస్థమయిన 1-164-43 లో న్యాయశాస్త్రము నందు ప్రధానమయిన అనుమానమునకు సర్వ ప్రసిద్దో దాహరణమైన 'పర్వతో వహ్నిమాన్ ధూమత్' అనునది (syllological statement) తెలుపబడినది. (శకమయం ధూమమారాదపశ్యం విషూవతాపర (అగ్నిః) ఏనావరేణ ఉక్షాణం పృశ్నిమపచంతవీరాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్). ముండకోపనిషత్తునందు "ఇతిహాస పురాణాం న్యాయో మీమాంసాధర్మశాస్త్రాణి" అని న్యాయదర్శనమున పేర్కొనబడినది. ఋగ్వేదము మొదటి అష్టకము, 5వ అధ్యాయము, 62వ సూక్తమున 'సనాయతే గోతమ ఇంద్రనవ్యం' అని గోతముడు పేర్కొనబడినాడు. అధర్వ వేదమున, నాల్గవ కాండమునందలి ఆరవ అనువాకము నందును గోతమునిపేరు కలదు. అందుచేత గోతముడును ఆతని న్యాయసూత్రములును వేదకాలమునాటివని నిర్ణయము.

గోతముడు ( గౌతముడుకాడు) న్యాయసూత్ర కర్త యను విషయము ఈ క్రిందివాటిచే బలపడుచున్నది.

(i) కణాదేవతు సంప్రోక్తం శాస్త్రం వై శేషికం మహత్, గోతమేన తథాన్యాయం సాంఖ్యంతు కపిలేనవై (పద్మపురాణమ్. ఉత్తరకాండము. 263 అధ్యాయం.)

(ii) గోతమఃస్వేన తర్కేణ ఖండయన్ తత్రతత్రహి (స్కాందపురాణము. కాలికాఖండము. 17 వ అధ్యాయము.)

(iii) షోడశపదార్థవాదినో గోతమస్య (కిల్హారన్ సంపాదితమగు అమరకోశము)


(iv) ముక్తయే యశ్ళిలాత్యాయ
      శాస్త్రమూచే సచేతసాం
      గోతమం తవవేత్యేవ
      యథావిత్థ తథైవసః

(అనగా సుఖదుఃఖాద్యనుభవము లేకుండుటకై పాషాణ కల్పమగు (శిలాత్యాయ) ముక్తి నుపదేశించు న్యాయ శాస్త్రమును రచించిన గోతముడు మీకు తెలిసినట్లుగా గోతముడే (గొప్పఎద్దే. ప్రకృష్టోగౌః గోతమః అని వ్యుత్పత్తి) అని చార్వాకుడు నిందించెను.

శ్రీహర్షుని నైషధ మహాకావ్యము 17 వ సర్గము న్యాయ శాస్త్రకర్త గోతముడని పేర్కొనినది.

ఈ న్యాయసూత్ర కర్తయగు గోతముడు అక్షపాదు డనుటకును ఆధారములు కలవు. న్యాయసూత్ర కర్తను పేర్కొనిన పెద్దలందరును అతడు అక్షపాదుడని వచించిరి. న్యాయసూత్ర భాష్య కర్తయగు పక్షిలస్వామి వాత్స్యాయనుడు (ఇతడు కామసూత్ర ప్రణేత కాడు) స్వీయ భాష్యాంతమున 'యో౽క్షపాదమృషిం న్యాయః ప్రత్యభాద్వదతాంవరం' అని వ్రాసెను. 'నైయాయి కస్త్వథపాదః' అని కీల్హారన్ సంపాదితమైన అమరకోశమున గలదు. మహాభారత టీకలో నీలకంఠుడుకూడ “కణభక్షమక్షచరణం జైమిని కపిలౌ పతంజలించనుమః" అని దర్శనకర్తల ప్రసంగములో అక్షచరణుని కీర్తించెను.

న్యాయ సూత్రకర్తయగు గోతముడు అక్షపాదుడని నిరూపించు రెండు కథలుకూడ లోకమున ప్రచారమున కలవు. వ్యాసుడు బ్రహ్మ సూత్రములలో 'తర్కాప్రతిష్ఠానా దన్యథాప్యనుమేయమితిచేదేవమప్య నిర్మోక్షప్రసంగః' అని సూత్రించి తర్క (న్యాయ) శాస్త్రము అప్రతిష్ఠితము, అనగా ప్రమాణము కాదని నిందించెనట. గోతముడు కుపితుడై వ్యాసుని మొగమును చూడనని ప్రతిజ్ఞ యొనర్చెను. ఒకప్పుడు వ్యాసుడే గోతమ దర్శనార్థమై ఏగెను. అపుడు గోతముడు వ్యాసునివైపు తనకాలు సాచి అందులో కన్ను మొలిపించి తన్మూలమున ఆతని జూచి సంభాషించెనట. ఇది మొదటికథ. గోతముడు తర్కమూలమున జీవేశ్వరభేదమును సాధించెనను కారణమున వ్యాసుడాతని మొగమును జూడ నొల్లడయ్యెనట ! గోతము డాతని జూచి సంభాషించుటకు తన కాలిలో కన్ను మొలిపించుకొనె ననునది రెండవకథ. కాగా, న్యాయసూత్ర కర్తయగువాడు గోతముడు; అతడు అక్షపాదుడని తేలినది. ఈ గోతము డెక్కడివాడు అనునది విమర్శనీయము.

విదేహదేశము న్యాయశాస్త్రమునకు పుట్టిల్లు. న్యాయ దర్శనమున ఉద్దండ పండితులయిన ఉదయనాచార్యుడు, వాచస్పతి మిశ్రుడు, గంగేశోపాధ్యాయుడు అనువారు మైథిలులు కావున గోతముడును మైథిలుడను హేతువు సమంజసముగ కనిపించును. మాథ్యందినుల శతపథబ్రాహ్మణము నందలి ఒకటవ కాండమునగల 4 వ అధ్యాయములో 'విదేఘోహ మాధవో౽గ్నిం వైశ్వానరం ముఖేబభార తస్య గోతమో రాహుగణ ఋషిః పురోహిత ఆసతస్మై హస్మామన్త్రయాణోన ప్రతిశృణోతి తన్మేగ్నిర్వైశ్వానరో ముఖాన్నిప్పద్యా ఇతి' అనునదియు గోతముడు విదేహవాసియనియు, ఆతడు రాహుగణుడగు గోతముడనియు తెలుపుచున్నది. ఇతడు ఉశిజుని కొడుకుగాని, ఉళిక్కు కొడుకుగాడు.

శ్రీమద్రామాయణము నందలి బాలకాండమునుబట్టి గోతముని ఆశ్రమము విదేహరాజధానియగు మిథిలకు సమీపమున నున్నట్లు తెలియుచున్నది. అతని కొడుకగు శతానందగౌతముడు మిథిలాధిపతియగు జనకునకు పురోహితుడని భవభూతివాక్యము సాక్ష్యమిచ్చుచున్నది. ఆ గోతముడు అహల్యాపతియని 'యద్యాన్తిక సుఖదుఃఖ హానరూపం కైవల్యం కథమశపద్భవానహల్యాం' అను నీలకంఠ దీక్షితుని శ్లోకము విశదీకరించుచున్నది.

గోతముడు న్యాయసూత్రములను రచించెను. వీటికే న్యాయదర్శనము అని పేరు. ఈ శాస్త్రము వేదాది ప్రమాణముల నాదరించి, తదవిరుద్ధముగ ప్రవర్తించినది. కణాదుని వై శేషికదర్శనముకన్న ఈ న్యాయదర్శనము తరువాతిదే. ఆదర్శన మిట "ప్రతితంత్ర" మనబడినది. ఆత్మస్వరూపము, శబ్దానిత్యత్వము, అనుమానము, హేత్వాభాసము వీటి చర్చలో గోతముని న్యాయదర్శనముయొక్క ఆర్వాచీనత కనిపించును. వైశేషికతంత్రములో లేని ఈశ్వరుడు, అతని జగత్కారణత్వము ఇందు విచారింపబడినవి. వై శేషికములో పదార్థనిరూపణము కలదు. అయితే ఇందులో ఆ విచారమున కెక్కువ ప్రాధాన్యము కలదు.

గోతముని న్యాయసూత్రములు అయిదధ్యాయములు గాను, ప్రతి అధ్యాయము రెండు ఆహ్నికములుగాను విభజింపబడినవి. గోతముడు ఈ శాస్త్రమును “ప్రమాణ ప్రమేయ-సంశయ - ప్రయోజన - దృష్టాంత - సిద్ధాంత- అవయవ-తర్క-నిర్ణయ వాద - జల్ప-వితండా- హేత్వాభాస - ఛల - జాతి - నిగ్రహస్థానానాం తత్త్వజ్ఞానా న్నిశ్రేయసాధిగమః" అను సూత్రముతో నారంభించెను. ప్రమాణాదులగు పదునారు పదార్థముల తత్త్వజ్ఞానము నిశ్శ్రేయసము నధిగమింపజేయును. అదెట్లనగా-“దుఃఖజన్మప్రవృత్తిదోష మిథ్యాజ్ఞానానాముత్తరోత్తరాపాయే తదనన్తరాపాయాదపవర్గః" అని రెండవ సూత్రములో గోతముడు బోధించెను. దానితీరు ఇది: తత్త్వజ్ఞానము మిథ్యాజ్ఞానమును తొలగించును. అది తొలగుటవలన దోషములు (రాగద్వేషములు) తొలగును. అందువలన ప్రవృత్తి కలుగదు. అది లేనిదే జన్మ మేది ? జన్మ లేదు కనుక సకల దుఃఖములును నివర్తించును. అదియే కదా నిశ్శ్రేయసము – మోక్షము. ఈ మోక్షమును కలిగించు తత్త్వజ్ఞానము, ఈ శాస్త్రమువలన కలుగునని ప్రయోజనమును, మొదటనే గోతముడు ప్రదర్శించి, తన శాస్త్రమున ప్రవృత్తిని కలిగించెను.

ఈ న్యాయశాస్త్రము సంశయాది పదార్థములతో పయనించినది. కనుకనే ఈ శాస్త్రము ఉపనిషత్తులవలె నొక అధ్యాత్మశాస్త్రము మాత్రముగా కాక త్రయి, దండనీతి, వార్తలతో బాటుగా నొక పృథక్ప్రస్థానపు శాస్త్రమైనది.

త్రయి (వేదత్రయము) యందు ఊరక విషయములు తెల్పబడినవే కాని, వానికి ఉపపత్తి తగినంత చూపబడ లేదు. అది శబ్దప్రధానము కదా! అందు విషయమై ఆస్తికులకు గానీ, నాస్తికులకు గానీ విశేషదర్శనము-ఉపపత్తి నిరూపింపబడక పోవుటవలన సంశయము తప్పదు. దానినిబట్టియే, పక్ష ప్రతిపక్షములు - న్యాయ ప్రవృత్తి ఏర్పడును. దానివలన తత్త్వము నిర్ధరింప నగును. కనుక ఈ దృష్టిలో సంశయాదులు ప్రధానములే కదా ! అవి లేకున్న న్యాయమెట్లు ప్రవర్తింప గలుగును? ఇట్టి న్యాయమును సవిస్తరముగా ప్రవర్తింప జేయునది న్యాయదర్శన మనియు, న్యాయశాస్త్ర మనియు పేర్వడసినది.

అన్యాయ ప్రవిస్తర మేమనగా - స్వార్ధానుమానము, పరార్ధానుమానమునని. ఇట ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అనునవి నాల్గు ప్రమాణములు. ఈ నాలుగును ఒకే విషయమున ప్రవర్తించి, అర్థమును నిర్ణయించును. ఇట్లు సర్వ ప్రమాణముల సమాహార మగుటచే ఈ న్యాయము ప్రధానతమము.

అది ఎట్లనగా - ఈ న్యాయమునకు అయిదు అవయవము లున్నవని గోతముడు తెలిపినాడు. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణము, ఉపనయము, నిగమనము అనునవి ఆ యవయవములు . (భద్రబాహుడు మొదలగు జైనులు- మరొక అయిదు అవయవములను-జిజ్ఞాస, సంశయము, శక్యప్రాప్తి, ప్రయోజనము, సంశయ వ్యుదాసము - అను వాటిని కలిపి పది అవయవములనిరి. కాని అది సరిగాదు) మొదటిది ప్రతిజ్ఞ . ఉదా : కొండయందు నిప్పున్నది ఇది శబ్ద ప్రమాణము. ఇది పరునిగూర్చి తాను స్వతంత్రముగా నిర్దేశించు శబ్దముగదా ! రెండవది — హేతువు. ఉదా : పొగయున్నది కనుక. ఇది అనుమానము. మరొ= దానిని సాధ్యమును (నిప్పును) అనుమానింపజేయు సాధనము కనుక . మూడవది—ఉదా : పొగయున్నచోట నంతను నిప్పుండును ; వంటయింటిలో వలెనే ఇది ప్రత్యక్షము. నాల్గవది—ఉపనయము. ఉదా : ఆ వంటయింటి వలెనే ఈ కొండయు పొగతో నున్నది. ఇది ఉపమానము. అయిదవది నిగమనము. ఉదా : కనుక ఈ కొండయందును నిప్పుండును. వెనుకటి ప్రమాణములన్నియు నొక చోటచేరి అర్థమును సాధింపగల్గినవని వాని సామర్థ్యమును ఇది ప్రదర్శించి నిగమించును అని గోతముని సిద్దాంతము.

ఈ న్యాయము సంశయములేనిదే ప్రవర్తింపదు. అది ఎట్లనగా——అసలేమియు తెలియనపుడుగానీ, బాగా తెలిసి నపుడుగానీ, మన మూహింపబోము. కొంత తెలిసి, కొంత తెలియక సందిగ్ధముగా నుండునపుడే మనయూహ ప్రసరించును. కనుక న్యాయప్రవృత్తికి సంశయము ముఖ్యమే కదా! అట్లే ప్రయోజనమును ముఖ్యమే. కాకదంత పరీక్ష నొనర్పముకదా ! న్యాయ ప్రయోజనమగు సిద్ధాంతము దృష్టాంతముతోనే నిర్ణయమగును. ఇదియు నూహా పోహలతోనె——తర్కముతోనే ఏర్పడును. ఊహపోహాత్మకమగు విచారము లేకున్న ప్రతికూలములెట్లు తొలగును? కనుక ఈవిచారమున తర్కసాహాయ్యమత్యావశ్యకము. ఈ విచారమును - వాదము, జల్పము, వితండయని మూడు రకములుగా గోతముడు విభజించి యున్నాడు. ఈ మొత్తమును కథ యందురు. ఛలము, జాతులు, నిగ్రహ స్థానములు, హేత్వాభాసములు ఈకథలోనే ఉపయోగించును. వీనిని సరిగా తెలియనిచో తత్త్వము ఎరుకపడదు. అంతేకాక తర్కసాహాయ్యమున ఛలాదులను తొలగించి ప్రమాణసర్వస్వ మగు న్యాయమును ఉపయోగింపనిచో తత్త్వ మవధారింప వీలు కలుగదు. ఇక నిశ్శ్రేయస మెట్లు? కనుక ఈ ప్రమాణ సంశయాదులతో పృథక్ప్రస్థానము సాగించి, కడమ శాస్త్రములచే ఇది గతార్థము కాకపోగా, సకల శాస్త్రములను ప్రదీపమువలె ప్రకాశింపజేయును. అన్ని పనులకును ఉపాయమగును. అన్ని ధర్మములును దీని నాశ్రయించియుండును. ఇది లేనిదే మరేదియు నిష్కృష్టమగు జ్ఞానమును కలిగింప జాలదు. ఇది ప్రమాణములతో అర్థమును జక్కగా పరీక్షించును. ప్రత్యక్షమునకును, ఆగమమునకును అవిరుద్ధముగా ప్రవర్తించి వానితో పరీక్షింపబడిన విషయమును సరిగా పరీక్షించునని దీనిని 'అన్వీక్షకి' అనియు నందురు. ప్రత్యక్షాగమములకు విరుద్ధ మగునేని అది న్యాయాభాస మగును. ఇట్లిది ప్రవర్తించి అన్వీక్షకి యనియు, న్యాయప్రధాన మగుటవలన, న్యాయవిద్య యనియు, న్యాయదర్శన మనియు పిలువబడుచున్నది.

దీనివలన ఎరుగవలసినవి నాల్గు విషయములు——- 1. హేయము, 2. దానిని నిర్వర్తించునది, 8. హానము, 4. దానికి ఉపాయము. దీని వివరణ మిట్లు : మోక్షమే గదా పరమ పురుషార్థము. మోక్షమన విడుచుట. దేనిని? ఆ విడువవలసిన దానిని తెచ్చి పెట్టిన దేది ? అసలు విడుచుట యననేమి ? దాని కుపాయము లెవ్వి? ఈ నాల్గింటిని సరిగా తెల్పు ఉపాయమగు ప్రమాణము సరిగా నుండవలెను. దీనిని సరిగా తెల్పునదే ప్రమాణము. అట్లు తెల్పనిచో ప్రమాణము కాదు. సరియగు జ్ఞానమును కలిగించిననే అనగా ప్రమితిని ఉదయింపజేసిననే ప్రమాణము సార్థకమగును. అది సార్థకమైననే, దానిని తన త్యాగభోగములకై ఉపయోగించుకొనునట్టి ప్రమాత సార్థకమగును. అపుడే ఆప్రమితియు సార్థకమగును; అందు గోచరమగునది ప్రమేయముగాను సార్థకమగును. ప్రమాణమే సార్థకముగానిచో, ఇవియేవియు సార్థకములు కాజాలవుకదా ! ఆప్రమాణము నాలుగు విధములు : 1. ప్రత్యక్షము, 2. అనుమానము, 3. ఉపమానము, 4. శబ్దము. అందు ప్రత్యక్షము రెండు రకములు : బాహ్యము, ఆభ్యంతరమును. బాహ్యేంద్రియములవలన కల్గునది బాహ్యము. అంత రింద్రియమగు మనస్సు మాత్రమున గల్గునది అభ్యంతరము. బాహ్యేంద్రియము లైదుగనుక, అప్రత్యక్ష మైదు రకములు. అంతరింద్రియ మొక్క టేకనుక అది యొకరకమే. ఈ జ్ఞాన ముదయించునపుడు ఆత్మ మనస్సుతోను, మనస్సు ఇంద్రియముతోను, ఇంద్రియము వస్తువుతోను కలియును. ఈ కలయికను సన్నికర్ష మందురు. ఇది యారురకములు 1. సంయోగము, 2. సంయుక్త సమవాయము, 3. సంయుక్త సమవేత సమవాయము, 4. సమవాయము, 5. సమవేత సమవాయము, 6. విశేషణవిశేష్యభావము. ఘటము ప్రత్యక్షమగునపుడు ఇంద్రియమగు చక్షుస్సునకును. విషయమగు ఘటమునకును ఉండు సంబంధము సంయోగము. దానిరూప ప్రత్యక్షములో సంయుక్త సమవాయము ఆ రూపమందున్న నీలత్వపీతత్వాదుల ప్రత్యక్షములో సంయుక్త సమవేత సమవాయము, శబ్దపు ప్రత్యక్షములో గగనమగు శ్రోత్రమునకు శబ్దము గుణమేకనుక, గుణగుణులకు సంబంధము సమవాయమే. ఆ శబ్దమందలి శబ్దత్వ జాతి ప్రత్యక్షములో సమవేత సమవాయము. "భూతలము ఘటాభావము కలది" అను అభావ ప్రత్యక్షములో భూతలమునకును ఘటాభావమునకును విశేషణ విశేష్యభావమేకదా సంబంధము. ఇట్లు విషయములగు ద్రవ్యగుణక్రియా - జాతి - సమవాయ - అభావములకును ఇంద్రియములకును ఉండు సంబంధములే సన్నికర్షములు - అని గోతముడు నిరూపించెను.

ఈ నిరూపించిన ప్రత్యక్షమును బట్టి ప్రవర్తించు ప్రమాణము అనుమానము. ఇది (1) స్వార్థము (2) పరార్థము అని రెండురకములు, మొదటిదానిలో వాక్యముపైకి ప్రయోగింపకున్నను ఆలోచనము అట్లున్ననే, తత్త్వ నిర్ణయమగును. రెండవదానిలో ఐదవయవములు ఉపయోగింపబడును. ఆ మహావాక్యమే న్యాయము . దానిలోని అవాంతర వాక్యములే అవయవములు అని తెలియుచున్నది. దీని ఉపయోగప్రక్రియ ఇట్లు చెప్పబడినది. ఒకడు ఒక కొండకడ కేగినపుడు, అతనికి అచ్చట పొగ అగపడును. ప్రక్కనున్న వాడు తానిదివరలో నిప్పునకును గల వ్యాప్తిసంబంధమును ఎరుగును గనుక, నిప్పు నూహించి, అది తెలియని తన సహచరునకు పైరీతిగా మాటలతో (న్యాయముతో) బోధించును. ఇతడు అదివరకే ధూమమును కొండమీద (పక్షధర్మత) జూచెను కనుక, ఆ న్యాయమువలన వహ్నిధూమముల వ్యాప్తిని తెలిసికొనును. పిమ్మట వెనుకటి పదధర్మతాజ్ఞానము జ్ఞప్తికలిగి ఈ రెంటికిని పరామర్శకలుగును. "ఈ కొండమీద నిప్పును వీడనిపొగ యున్నది" అని వెంటనే కొండమీద నిప్పున్నదని అనుమితి కల్గును. ఇచ్చట పక్షత, వ్యాప్తి, పక్షము, సపక్షము, విపక్షము అనునవియున్నవి. నిషాధయిషా విరహావిశిష్టసిద్ధ్యభావము పక్షతయనబడును. సాధ్యమును హేతువు వీడకుండుట వ్యాప్తి, సాధ్యమును ఊహించు చోటు (పర్వతాదికము) పక్షము, దృష్టాంతము సపక్షము (వంటఇల్లు). సాధ్యము లేనిది విపక్షము (నీళ్ళనుడుగు). ఈ సామగ్రితో వాది ప్రతివాదులు నడపు ప్రసంగము కథయనబడును. వా రిరువురు సంప్రతిపత్తితో వస్తుతత్త్వము తెలియు తలంపుతో చేయునది వాదము. విప్రతిపత్తితో, నొకరి నొకరు జయించు తలంపుతో నొనర్చునది జల్పము. ఒకడు మరొకని వాదమును ఖండించుటే కాని తానొక పక్షము స్వీకరింపక నడుపునది వితండము. మొదటిదానిలో హేత్వాభాసములు మాత్రమే ప్రసక్తించును. వీనిలో అవియేకాక ప్రతివాది నిగ్రహమునకు ఉపయోగించు ఛలము, జాతి, నిగ్రహస్థానములు ఉపయోగింపబడును. ఈ అనుమానము మరొక త్రోవను బట్టి మూడురకములుగా చెప్పబడినది. (1) పూర్వవదనుమానము (2) శేషవదనుమానము (3) సామాన్యతోదృష్టానుమానము అనునవి ఈ మూడురకములు. కారణముతో కార్యము నూహించుట - మబ్బుపట్టగా వర్షము వచ్చుననుకొనుట పూర్వవదనుమానము. అథవా, పూర్వమువలె - వెనుకటి మోస్తరుగా కనిపించిన వహ్నిధూమములను బట్టి ధూమ మగుపడగా, వహ్నినూహించుటయు నిదే కార్యముతో కారణము నూహించుట శేషవదనుమానము. ఏటికి వేగముతో క్రొత్తనీరు తగులగా, పైన నెక్కడో వాన కురిసినదని ఊహించుట, అథవా చిట్టచివరకు తేలిన యూహకూడ అనగా పరిశేషానుమానముకూడ, శేషవదనుమానమే. హేతుసాధ్యములకు సాక్షాత్సంబంధ మగపడకున్నను, ఏదో సామ్యమునుబట్టి సాధ్యము నూహించుట సామాన్యతో దృష్టానుమానము. ఇచ్ఛాదులకును, ఆత్మకును సాక్షాత్తుగా సంబంధమగపడకున్నను, ఇచ్ఛాదులు గంధాదులవలె గుణములు కావున, వాటి ఆశ్రయము ద్రవ్యమే- అది ఆత్మయే అని ఊహించుట. ఈ అనుమానప్రమాణము సదసత్తులనుగూర్చి ప్రవర్తించును. దీనికి మూలమగు ప్రత్యక్ష మొక సత్తునందుండుదానిని వర్తమానమునం దుండుదానినిగూర్చి ప్రవర్తించును. అనుమానము కాలత్రయమం దుండువాటినిగూర్చి కూడ ప్రవర్తించును. ఇదియే ప్రత్యక్షమునకును అనుమానమునకును భేదమగు చున్నది. ప్రసిద్ధమైన దానితోడి పోలికనుబట్టి తెలుపవలసిన దానిని తెలుపుట ఉపమానము. ఉదా : గోవుతోడి పోలిక కనబడగానే ఇది గవయమని తెలియుట. పేరునకును, వస్తువునకును సంబంధము బోధపడుట ఈ ప్రమాణము యొక్క ఫలము.

ఆప్తుని ఉపదేశము శబ్దప్రమాణము. తాను సరిగా ఎరిగిన దానిని ఇతరులకు తెలుపు ఇచ్ఛతో తెలుపువాడు ఆప్తుడు. ఆప్తి అన విషయమును సరిగా తెలియుట. ఈ లక్షణము ఋషులకు, ఆర్యులకు, అనార్యులకుకూడ సాధారణమే కనుక అట్టివారందరి మాటలను పరిగ్రహించియే వ్యవహారము నడచును. ఈ శబ్దము ఒక దృష్టవిషయముననేగాక, కనిపించని స్వర్గనరకాదులయెడ గూడ ప్రమాణమే. అవి అనుమానమునకు గోచరములేగదా !

ఈ ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్దములు అను ప్రమాణములను నాల్గింటిని ఉపయోగించి తెలియవలసినది ప్రమేయము. అది ఆత్మ, శరీరము, ఇంద్రియములు, అర్థములు, బుద్ధి, మనస్సు, ప్రవృత్తిదోషములు, ప్రేత్య భావము, ఫలము, దుఃఖము, అపవర్గము అనునవి. ఇందు మొదట ఎవడీ ప్రపంచమునంతయు జూచుచు అనుభవించుచున్నాడో అట్టి ఆత్మను ఎరుగుట అత్యంతావశ్యక మేగదా ! ఆ యాత్మకు భోగస్థానము శరీరము. భోగోపకరణములు ఇంద్రియములు. భోగగోచరములు అర్థములు, భోగమే బుద్ధి. బాహ్యాంతర విషయముల నన్నింటిని తెలిసికొనుటకు సాధనమైనది మనస్సు. దాని ద్వారముననే పుణ్యపాపకర్మలందు ప్రవృత్తి కల్గును. కల్గించునవి రాగద్వేష మోహములు. ఇవే దోషములు. ఈ శరీరము ఈ ఆత్మకు ఇదివరలో నున్నదియుకాదు. ఇకముందుండునదియుకాదు ఇట్టివెన్నియో యైనవి. ఇది తొలగి తిరిగి జనించుట ప్రేత్యభావము. సుఖదుఃఖములను ససాధనముగా ననుభవించుట ఫలము ఇచట దుఃఖమనగా దానితో నిత్యానుషక్తమగు జన్మమే. దీనిని ఇట్లు ఏకాగ్రముగా భావించుటకే “దుఃఖ" మని యుపదేశము. ఇట్లు భావింపగా నిర్వేదము కలిగి వైరాగ్య మొదవును. దానివలన అపవర్గము - మోక్ష మేర్పడును. జనన మరణముల నిరంతర ప్రవాహమింకిపోయి దుఃఖములన్నియు తొలగుటయేకదా ఇది ! ఇట్లీ పదార్థములన్నింటిని పేరు పేరున బేర్కొనుటయు (ఉద్దేశము), వానిని లక్షించుటయు మొదటి అధ్యాయములో మొదటి ఆహ్నికముననైనవి. వాని పరీక్షణము, తరువాత ఆరంభింపబడినది. ఈ శాస్త్రమును, ఈ యుద్దేశ లక్షణ పరీక్షలను ఈతీరున (పృథక్ప్రస్థానమున ప్రవర్తింప జేసి కడమవానికన్న విలక్షణముగా గోతముడు రచించినాడు.

రెండవ అధ్యాయపు మొదటి ఆహ్నికములో అసలు పరీక్షకు అంగమైన సంశయము పరీక్షింపబడినది. దాని వ్యవస్థకు అనుగుణముగా విప్రతిపత్తి వాక్యమును వాదమునకు పూర్వాంగముగా గోతముడు స్థాపించెను. ప్రత్యక్షాదుల ప్రామాణ్యమును, వాని బలాబల తారతమ్యమును పరీక్షించెను. రెండవ దానిలో ప్రమాణములు నాలుగే అని (మతాంతరవాదములను ఉన్మూలించి) స్థాపించెను. అందులోని శబ్దము అనిత్యమే అని స్థాపించి, దాని శక్తినిగూర్చి ఆహ్నికము చివరవరకును గోతముడు విచారించెను.

మూడవ అధ్యాయపు మొదటి ఆహ్నికములో దర్శన, స్పర్శనములచే ఒకే వస్తువును గ్రహించుటవలన ఇంద్రియములకు అతిరిక్తుడును, క్షణభంగ మొందని వాడును ఆత్మయని గోతముడు స్థాపించెను. సాత్మకమగు శరీర దాహమున పాపము జనించుటయు, నిరాత్మకమగు శరీర దాహమున అది లేకపోవుటయు లోకవ్యవహారము కనుక శరీరాతిరిక్తుడే ఆత్మయని గోతముడు స్థిరపరచెను. కనులు చెవులు మొదలగునవి రెండేసి యయినను ఇంద్రియ మొక్క టే అనియు, సాధనమగు మనస్సుకన్న కర్తయగు ఆత్మ వేరనియు, అది నిత్యమనియు, శరీర మనిత్యము, పాంచభౌతికమనియు, ఇంద్రియములును అట్టివే అనియు గోతముడు స్థాపించెను. ఉత్పత్తి వినాశములు కలవు. ఈ జ్ఞానము అనిత్యము అది ఆత్మగుణమే కాని, శరీరగుణము కాదు. మన తనువే (శరీరము) కర్మకారితమే కాని, అకర్మ నిమిత్తము కాదు. అని రెండు ఆహ్నికములలో గోతముడు విచారించి స్థాపించెను.

నాల్గవ అధ్యాయమున మొదటి ఆహ్నికములో రాగ ద్వేష మోహములు అను మూడు కారణములవలన మూడు రకముల ప్రవృత్తి కలుగును. శూన్యమునుండి గాని, ఈశ్వరునినుండి గాని, ఆకస్మికముగా గాని ఆత్మ ఏర్పడలేదు. స్వతస్సిద్ధుడే. సర్వమును అనిత్యము కాదు. క్షణికమును కాదు. నిత్యమును కాదు. శూన్యమును కాదు. అపవర్గమున్నది. సంసారము సకల దుఃఖమయము. అందులో ఏక దేశమగు సుఖముగూడ దుఃఖము వంటిదే; ఏ విధమయిన సుఖదుఃఖములును లేశమైన లేకుండుటయే అపవర్గము అని గోతముడు నిరూపించెను.

రెండవ ఆహ్నికములోని విషయములు : దోష నిమిత్తములగు అర్థములను సరిగా తెలియుటవలన అహంకారము నివర్తించును. సావయవులు, నిరవయవులు నగు పదార్థముల స్వరూపము సరిగా తెలిసినచో, వానియందు మమత తొలగును. రాగద్వేషము లుదయింపవు. ప్రవృత్తి గలుగదు. ఇక జన్మాది ప్రసంగమే యుండదు! కనుక ఇట్లు మోక్షము సిద్ధించును. బాహ్యార్థము లేదనరాదు. ఉన్నది. ఆయా వాని పరిజ్ఞానమువలన అహంకారము తొలగును. తత్త్వజ్ఞానము వృద్ధియగును. అని గోతముడు విశదపరచెను.

అయిదవ అధ్యాయములో జాతి నిగ్రహస్థానములు విచారింపబడినవి. ఇట్లు అయిదధ్యాయము లందును, షోడశ పదార్థముల నుద్దేశించి, పరీక్షించి, న్యాయము ద్వారా తత్త్వవిజ్ఞానమున మిథ్యాజ్ఞానమును తొలగించి, ఆ క్రమమున నిశ్శ్రేయసము నధిగమింపజేయు న్యాయ దర్శనమును రచించినది అక్షపాద గోతముడే.

వే. తి.