సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గారిబాల్డి
గారిబాల్డి :
సుమారు నూరు సంవత్సరముల క్రిందట ఇటలీదేశము ఒక్క రాజ్యముగా నుండి యుండలేదు. ఆ దేశముయక్క వేర్వేరు భాగములను వేర్వేరు రాజులు పరిపాలించు చుండిరి. ఇట్లు పెక్కు ప్రభుత్వముల మధ్య పడి యుండుటచే, ఏకీభావము లేక మానసికముగ, సాంఘికముగ, రాజకీయముగ ప్రజలు ఎన్నో బాధలు పడుచుండిరి. ఈ దుస్థితిని తొలగించి ఇటలీ ప్రజలు ఒక్క ప్రభుత్వము క్రింద నుండి కష్టసుఖములు సమానముగా ననుభవించునట్లు ప్రయత్నించ కొందరు దేశభక్తులు బయలుదేరిరి. ఇట్టి దేశభక్తులలో "గారిబాల్డి" ఎన్నదగినవాడు.
జోసెఫ్ గారిబాల్డి 1807 వ సంవత్సరములో నైస్ అను పట్టణములో జన్మించెను. ఇతడు చిన్నతనములో తండ్రితో సముద్ర యానము చేయుచుండగా, సముద్రతీరము లందు కొందరిని చూచుట తటస్థించెను. వారందరు ఇటలీ దేశీయులే. వారు తమ మాతృదేశపు విముక్తికై ప్రయత్నించిన కారణమున, దేశద్రోహులుగా పరిగణింపబడి వెళ్లగొట్ట బడినవారు. వీరితో యువకుడగు గారిబాల్డియు చేరెను. వారందరు ఒక కూటమిగా చేరి వివిధ రాజరికములను మట్టుబెట్ట సంకల్పించిరి. వీరు ధైర్యము కలవారే కాని అంతగా వివేకము కలవారు కారు. కావున మొట్టమొదట ఇటలీ ప్రజలను కూడగట్టుకొన వలయునను జ్ఞానము లేక ప్రభుత్వము పయి తిరుగుబాటుచేసి విఫలులయినట్టి వారు. నాయకు లెందరో వధింప బడిరి. గారిబాల్డి ఎట్లో తప్పించుకొని దక్షిణ అమెరికాకు పారిపోయెను.
మాతృభూమినివీడి గారిబాల్డి పదునాలుగు సంవత్సరములు ప్రవాసములో నుండెను. అతడు దక్షిణ అమెరికాలో వర్తకము చేయుచు, అచ్చటి యుద్ధములలో పాల్గొనుచు దినములు గడుపుచున్నను, దేశవిముక్తి కొరకు సన్నాహములు చేయుచునే యుండెను.
దక్షిణ అమెరికాలో నున్నప్పుడే గారిబాల్డి యొక కన్యను వివాహమాడెను. గాలిబాల్డి వలెనే ఆమెయు ధీరురాలు. అచ్చటజరిగిన యొక యుద్ధములో ఆమె శత్రువులచేతిలో పడెను. ఏలాగయినను తప్పించుకొనిపోయి భర్తను కలియుటకు ఆమె నిశ్చయించుకొనెను. ఆమె యొకనాడు రక్షకభటుల కండ్లలో దుమ్ముకొట్టి, చురుకైన గుఱ్ఱమునెక్కి దౌడుతీసి శిబిరమునుండి బయటపడెను. నాలుగు దినములుగా గుఱ్ఱముమీదనే స్వారిచేయుచు, బయళ్లను గడచి, అరణ్యములనుదాటి, మహానదులనీది, గుట్టలెక్కి పోయిపోయి చివరకు భర్తను గలిసెను. ఆమె తనభర్తయెడ చూపిన గాఢవిశ్వాసము, పతిభక్తి గారిబాల్డికి ఎంతో ప్రోత్సాహమును, ఆనందమును కలిగించెను.
ఇటలీలో స్వాతంత్ర్య భావములు ప్రబలుచుండెను. ఇటలీ ప్రజలు గారిబాల్డిని మాతృదేశమునకు ఆహ్వానించిరి. అవసరమయిన సన్నాహములు జరుగుచుండెను. కనుక, గారిబాల్డి 1848 లో మరియొకసారి మాతృభూమికి వచ్చెను.
స్వదేశమునకు రాగానే గారిబాల్డి ఏమియు చేయలేదు. కాని, పోపురాజ్యము రిపబ్లికు (ప్రజాప్రభుత్వము) కాగానే ఇతడు క్రొత్త ప్రభుత్వము పక్షమున నిలిచెను. ప్రజలకిప్పుడు గారిబాల్డివంటి నాయకమణి కావలసి యుండెను. నేపుల్సు, ఫ్రాన్సు ప్రభుత్వముల వారు రిపబ్లికుపయి దండయాత్రచేసిరి. యుద్ధములో రిపబ్లికు ఓడిపోయెను. అయినను గారిబాల్డి నిరుత్సాహపడక ప్రజలతో ఇట్లనెను.
“ఏ భాగ్యదేవత నేడు మనలను వంచించినదో. ఆమె రేపు మనలను ప్రేమించును. నేను రోము నగరమునకు పోవుచున్నాను. విదేశీయులతో పోరాటము సాగింపగోరువారు నావెంటరండు. నేను జీతబత్తెములను ఇయ్యజాలను. నానుండి మీకు లభించునవి ఆకలి, దప్పిక, యుద్ధములు, మరణము మాత్రమే."
గారిబాల్డి చేసిన యిట్టి గంభీర వాక్యార్థములను గ్రహించి, అతని శంఖారావమును విని, నాలుగువేల మంది ఆతనితో బయలుదేరిరి. వారితోబాటు గారిబాల్డి సతియు నుండెను. ఈ దండు సాగిపోవుచు, దారి పొడుగునను ఎన్నో కష్టములు పడవలసివచ్చెను; కొందరు చనిపోయిరి ; మిగిలినవారు గమ్యస్థానము చేరగలిగిరి. కాని త్రోవలో గారిబాల్డి భార్య జబ్బు పడెను. ఒక బెస్తవాని గుడిసెలో ఆమె మరణించెను. వెనుకనుండి శత్రుసేనలు తరుముకొని వచ్చుచుండుటచే, భార్యశవమును బెస్తవానికి నొప్పజెప్పి గారిబాల్డి ముందు ప్రయాణము సాగింపవలసివచ్చెను.
కొంతకాలమువరకు ఏమియు జరుగలేదు. గారిబాల్డి 'కాప్రెరా' ద్వీపములో శాంతముగ జీవితము గడపు చుండెను. తరువాత వేయిమంది సైన్యముతో ఓడ ప్రయాణముచేసి సిసిలీ ద్వీపముపై దాడిసలిపెను. ఎంతో కష్టముమీద భూమిపై దిగిరి. ఆ యుద్ధములో గారిబాల్డి నేపుల్సు రాజును ఓడించెను. ఇప్పుడు గారిబాల్డి యొద్ద ఇరువదివేల సైన్యముండెను. ఈ సైన్యముతో గారిబాల్డి ఇటలీ నడిగడ్డపై నడుగిడెను. గారిబాల్డిని ఎదుర్కొని యుద్ధము చేయుటకు ఎవరును సాహసింపరైరి. అచ్చటి సైన్యమంతయు నతనికి లొంగిపోయెను. ప్రజలు జయధ్వానములు చేయుచు గారిబాల్డికి స్వాగత మిచ్చిరి. గారిబాల్డిని తమ ముక్తిదాతగా ప్రజలు కీర్తించిరి. ఇటలీ యందలి వివిధ ప్రాంతములు కలుపబడి ఒక్క ప్రభుత్వము క్రిందికి తేబడెను. ప్రజల యభిప్రాయము ప్రకారము విక్టరు ఎమ్మాన్యుయల్ ఇటలీ దేశమునకు రాజుగా ఎన్నుకోబడెను.
తనదేశము అఖండమై వృద్ధినొందుచుండుట చూచుచు గారిబాల్డి చాల కాలము జీవించెను. గారిబాల్డి చేసిన ఆలోచనలకు, సన్నాహములకు ఫలితము ఇదియే.
ఇప్పటికిని ఇటలీ ప్రజలు గారిబాల్డిని భక్తిభావముతో స్మరించెదరు. నిష్కాపట్యము, నిస్వార్థత, గారిబాల్డి యొక్క ప్రత్యేక గుణములు. ఆతని దేశభక్తి స్వార్థరహితమైనట్టిది. గారిబాల్డి అందరకు ఆదర్శపురుషుడు.
ఆ. వీ.