Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గాంధి (ఆర్థిక సిద్ధాంతములు)

వికీసోర్స్ నుండి

గాంధి (ఆర్థిక సిద్ధాంతములు) :

మోహన్ దాసు కరంచందు గాంధిగారి జీవితము సమగ్రమైనది. ఆతని ప్రతిభ సర్వతోముఖమైనది. రాజకీయ, తాత్త్విక సాంస్కృతిక రంగములలో వలెనే ఆర్థికరంగములో కూడ గాంధీ మహాత్ముడు తీవ్రమైన కృషి చేసెను. మానవుడు తిండికొరకే జీవింపరాదు; కాని తిండి లేకుండ జీవించుట కూడ మానవునకు సాధ్యమైన విషయము కాదు. ఈ సంగతి గురించియే మన పూర్వికులు అర్థమును చతుర్విధ పురుషార్థములలో నొకదానినిగ పేర్కొని యున్నారు. ప్రజానీకముయొక్క సౌభాగ్య సంక్షేమముల కొరకు అహర్నిశములు పరితపించిన గాంధీగారు ఇందలి సత్యమును గుర్తించియే "ఆకలితో అటమటించే వానిముందు రొట్టె రూపములోతప్ప మరొక రూపములో సాక్షాత్కరించు సాహసము భగవంతునకు కూడ ఉండదు." అని వాక్రుచ్చి యున్నాడు. దారిద్ర్యము, ఆర్థిక అసమానత్వము మొదలగు ఆర్థిక రుగ్మతలను నివారించుటకై కొన్ని మార్గములను అతడు సూచించి యుండెను. ఇవియే గాంధి మహాత్ముని ఆర్థిక సూత్రము లనబడుచున్నవి.

గాంధీమహాత్ముడు ఆర్థిక రంగములో ప్రవేశపెట్టిన సూత్రములయొక్క నిజస్వరూప మెట్టిది అను విషయములోనే ఒకింత వివాదము గలదు. ఒకవంక వాటిని తారక మంత్రమువలె జపించు ఆర్థిక శాస్త్రవేత్తలు కలరు. మరొకవంక ఈ సూత్రము లన్నియు కేవలము ఒక రాజకీయవేత్త చెప్పిన ధర్మపన్నములు అని నిరసించువారును కలరు. ఆర్థికవేత్తగా గాంధిమహాత్ముడు కీన్సు, ఆడమ్‌స్మిత్తు, మిల్ మొదలగు వారి ప్రక్కన నిలువగలడా అను సందేహించువారును కలరు.

గాంధీమహాత్ముని ఆర్థిక సిద్ధాంతములలో శాస్త్ర దృక్పథము కొరవడినదని చెప్పుట ఎంతమాత్రము సమంజసము కాదు. కేవలము కొన్ని పడికట్టు రాళ్ళవంటి పదములను ఆధారము చేసికొను ఆర్థిక శాస్త్రవేత్తలవలె గాక ఆయన ఆర్థిక సమస్యలను వాస్తవిక దృక్పథముతో పరికించెను. అందుచేతనే ఆయన సిద్ధాంతములయందు, అనేక ఆర్థిక శాస్త్రవేత్తలలో కొరవడిన సుస్పష్టత. సరళత్వము గోచరించు చుండును. ఇతర ఆర్థిక వేత్తలవలెనే, గాంధీమహాత్ముడు కొన్ని ప్రాతిపదికలను ఆధారము చేసికొనెను. అంతేకాక ఆశయములకును తదాచరణ మార్గములకును మధ్య వ్యత్యాసము ఉండరాదని ఉద్ఘాటించి అతడు అర్థశాస్త్రమునకు ఒక క్రొత్త వెలుగు చూపి యున్నాడు.

గాంధీమహాత్ముని ఆర్థికసిద్ధాంతముల విషయములో ఒకటి రెండు అననుకూల విషయములనుకూడ అంగీకరింపక తప్పదు. ఆయన ఆర్థిక సిద్ధాంతములు బహుళ గ్రంథ పఠనము యొక్కయు, శాస్త్రపరిశ్రమయొక్కయు ఫలితములుగా ఉద్భవించినవి కావు. అంతియకాక ఆయన ఎన్నడును తన సిద్ధాంతములను క్రోడీకరించి వాటిని సమన్వయపరచి రూపొందించి యుండలేదు. ఆయన ఎన్నడును ఇట్టిపనికై ప్రయత్నించి యుండలేదు. ఎడతెగని రాజకీ యోద్యమములు, నిర్విరామసంఘసంస్కరణ కార్యములు కారణముగా, ఆయనకు అందులకు అవకాశము చిక్కలేదు. తక్కిన రంగములలోవలెనే ఆర్థికరంగములోను మహాత్ముడు అహింసాత్మక వ్యవస్థను ప్రాతిపదికగ చేసి యున్నాడు. అట్టి ఆదర్శవ్యవస్థ ఆధునిక మయిన కలుషిత వాతావరణములో ఆచరణయోగ్యమగునా కాదా అను సంశయము పెక్కుమందిని బాధించుచున్నది. భారతదేశమునందు ఆర్థికపరిస్థితులను వీరు గుర్తించుటయే కాక, గ్రామీణ జీవితములో మార్పులు కావించి గ్రామీణ పరిశ్రమలను పునరుద్ధరించిననాడే భారతప్రజల పేదరికమును రూపుమాపనగునని చెప్పెను. ఈ ఆశయ సిద్ధికై అవిరామముగ కృషిసలిపెను. ఇతర శాస్త్రవేత్తలకును, ఇతనికిని గల భేద మిదియే. ఈనాడు భారత ప్రభుత్వము గాంధీజీయొక్క సిద్ధాంతములనే అనుష్ఠించు చున్నది. ఆతని ఆర్థికతత్త్వ ప్రశస్తిని గుర్తించియున్నది.

గాంధిజీ తాను ప్రతిపాదించిన తత్త్వవిషయమున రస్కిన్‌చే, టాల్‌స్టాయిచే, భగవద్గీతచే ప్రభావితుడయ్యెను. వీటినుండియే సాంఘిక ప్రయోజనముకొరకు, ప్రతివ్యక్తియొక్క శ్రేయస్సుకొరకు సంఘము పనిచేయ వలయుననియు, సామూహిక శ్రేయస్సుకొరకు ఏపనియైనను నిరసింపబడరాదనియు, ఆయన అభిప్రాయపడెను. ఆర్థిక శాస్త్రవేత్తలు మానవునియందు కొన్ని లక్షణములను ఆరోపించిరి. మానవులు వస్తువులను మిక్కిలి చౌకగా దొరకు అంగడిలోనే కొందురును సిద్ధాంతము అట్టిదే. సర్వశ్రేయస్సే ఆదర్శముగాగల గాంధిజీ అట్టి సిద్ధాంతములను నిరసించెను. పైన పేర్కొనబడిన సిద్ధాంతము మిక్కిలి అమానుషమైనదిగా ఆతనిచే గర్హింపబడెను. 1937 వ సంవత్సరమునందలి 'హరిజన' పత్రిక యందు ఆర్థికశాస్త్రప్రయోజనమును ఆత డిట్లు నిర్వచించెను: “విశిష్టమయిన నైతిక సిద్ధాంతము ఎట్లు విధిగా న్యాయబద్ధమైన ఆర్థిక సూత్రమగునో, అటులనే వాస్తవికమైన ఆర్థికసూత్రముగూడ అత్యున్నతమయిన నైతిక ప్రమాణమునకు ఎన్నటికిని భిన్నము కాజాలదు. బలహీనులను పీడించి, ధనమును ప్రోగుచేయు తత్త్వమును, ధనదేవతనే ఆరాధించు మనస్తత్వమును ప్రబోధించెడి ఆర్థికవిధానమును కృత్రిమమైనట్టి, ఘోరమైనట్టి ఆర్థిక శాస్త్రము."

గాంధి మహాత్ముని ఆర్థికసిద్ధాంతములలో ముఖ్యమైనది ఆర్థిక వికేంద్రీకరణ సిద్ధాంతము (economic decentralization). ఈనాటి పరిశ్రమలలోగల లోపములను - యంత్రమునకు మానవుడు దాసుడగుటయు, గ్రామములందలి కోటానుకోట్ల ప్రజలకు జీవనోపాధి పడి పోవుటయు గ్రహించి గాంధిజీ ఈ అభిప్రాయమునకు వచ్చెను. అభివృద్ధిపొందని ఆర్థికవ్యవస్థలో పెట్టుబడి కొదువగా, మానవశక్తి సమృద్ధిగా ఉండుట సహజము. అట్టి పరిస్థితులలో గ్రామపరిశ్రమలను, చేతిపనులను ప్రోత్సహించి, గ్రామములను స్వయంపోషకములుగా చేయుటయే, దేశమునందలి పెక్కుకోట్ల ప్రజల జీవన ప్రమాణమును వృద్ధిచేయుటకు సవ్యమైన మార్గమని అతడు చెప్పెను. అయితే, అట్టిది ఈ యాంత్రిక, పారిశ్రామికయుగములో సాధ్యమా? అది గడియారమును వెనుకకు నడిపించుట వంటిది కాదా ? అని సంశయించువారు అనేకులు గలరు. కాని గాంధీజీ అభ్యుదయ వ్యతిరేకి కాదు. తనకు యంత్రముల విషయమున ప్రతికూలభావము లేదనియు, విద్యుచ్ఛక్తి, నౌకానిర్మాణము, ఇనుపకర్మాగారములు, యంత్రముల తయారీ మొదలగు కార్యక్రమములు గ్రామీణుల చేతిపనుల సరసనే వర్ధిల్ల వచ్చుననియు అయన నొక్కి చెప్పెను.

గాంధిగారి ఆర్థిక సిద్ధాంతములలో ఆర్థిక అసమానత్వమును, దోపిడిని అరికట్టవలెననునది మరియొకటి. ఆయన తనను దరిద్రనారాయణుని సేవకునిగా పరిగణించుకొనెను. స్వరాజ్యము పేదలస్వరాజ్యము కావలయునని వాంఛించెను. కొలదిమంది స్వప్రయోజనపరులై, పేదల సమాధులపై సౌధములు నిర్మించుకొనుటకు తోడ్పడు ఆర్థిక వ్యవస్థను ఆతడు నిరసించెను. ఆర్థిక అసమానత్వమును అవినీతికి మారుపేరుగ ఆతడు పరిగణించెను.

ఇందుండియే గాంధి మహాత్ముడు సామ్యవాదియా అను మరియొక ముఖ్యప్రశ్న ఉదయించుచున్నది. సామ్యవాదమునకును గాంధీ తత్త్వమునకును పెక్కు పోలికలు ఉన్నమాట నిజమే. గాంధి. మార్క్స్ అను నిరువురుకూడ తమ కాలములయందలి అర్థిక వ్యవస్థలలోని లోపములను ఎత్తి చూపి దానిపై తిరుగుబాటు చేసినవారే. ఇర్వురును 'లాభాపేక్ష' (Profit motive) అను విషయమును నిరసించినవారే. ఇర్వురును సమానత్వముపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను ఆశించినవారే.

అయితే ఈ రెండువాదములకును మధ్యగల సామ్యము కంటె భేదములే పెక్కులున్నవి. గాంధిజీ బోధించిన అహింస, ధనికుల హృదయములలో పరివర్తనము కల్గించి వారిని పేదలయొక్క క్షేమమునకు ధర్మకర్తలను చేయుట, ఈ సిద్ధాంతమునకును, ఇట్టి మరికొన్ని సిద్ధాంతములకును మార్క్స్ బోధించిన సామ్య వాదములో తావు లేనేలేదు. వర్గకలహము మొదలగు సిద్ధాంతములకు గాంధీజీయొక్క ఆర్థిక తత్త్వములో స్థానములేదు . సామ్యవాదులు బలప్రయోగముపై ఆధారపడి తామాశించిన ఆర్థిక వ్యవస్థను రూపొందించుకొనవలెనని అశించిరి. గాంధీజీ మాత్రము నైతిక ప్రవర్తనముపై ఆధారపడెను. వాస్తవమునకు గాంధీ తత్త్వములో ప్రభుత్వమునకు (State) స్థానమేలేదు. ఆయన స్వయంపోషకములైన గ్రామముల సమ్మేళనమును కాంక్షించెను.

ఇట్లు గాంధిమహాత్ముని ఆర్థిక సిద్ధాంతములలో విశిష్ట లక్షణములు గలవు. అదృష్టవశమున నేటి మేధావులు గాంధీ తత్త్వము విషయమున తమకు మున్నుగల ఉదాసీనతను విడనాడి దానిని గ్రహించుటకు ప్రయత్నించు చున్నారు. అనేకమంది పాశ్చాత్య మేధావులలో కూడ ఇట్టి ఆకాంక్ష దినదినము వృద్ధిపొందుచున్నది. నేటి అనేక విశ్వవిద్యాలయములలో గాంధీమహాత్ముని సూత్రములు అర్థశాస్త్ర విద్యార్థులకు బోధింపబడుచున్నవి. నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వములు ఆతని ఆదేశములకు అనుగుణ్యముగా అనేక సంస్థలను నెలకొల్పి, గృహ పరిశ్రమలను పునరుద్ధరించుటకు కృషిచేయుచున్నవి. ప్రజల జీవన ప్రమాణమును వృద్ధికి తెచ్చుటలో ఆ ప్రయత్నములు పొందిన విజయమే బాపూజీ సిద్ధాంతముల ప్రసక్తికి ప్రబల నిదర్శనము.

ఇతర దేశములందలి కొందరు ఆర్థికశాస్త్రవేత్తలు తాము ప్రతిపాదించిన ఆర్థిక సూత్రములను తమ కాలములో స్వయముగా అమలు జరిపి, తమ ప్రజల ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దలేక పోయిరి. వారి సిద్ధాంతములను ఇతరులు అమలులో పెట్టిరి. కాని గాంధి మహాత్ముడు తన సిద్ధాంతములను ప్రజలకు బోధించుటయేగాక స్వయముగా వాటిని అమలులోపెట్టి గ్రామీణ జీవితములోను, ఆర్థిక సిద్ధాంతములలోను నూతనములైన పద్ధతులను ప్రవేశ పెట్టెను. అనాటి ఆర్థికశాస్త్ర పండితులలో పెక్కురు గాంధీజీని దూషించుచుండిరి. కాని భారత దేశమునకు స్వాతంత్ర్యము వచ్చిన తరువాత గ్రామీణ పరిశ్రమలలో, స్వదేశ పరిశ్రమలలో క్రొత్త ఉత్సాహము రేకెత్తెను. గ్రామీణ జీవితములో నూతన తేజస్సు పొడమెను. గ్రామ సీమలలోని కొనుగోలుశక్తి హెచ్చెను. ఇది యొక మహత్తరమైన విజయము. గాంధిజీ స్థాపించిన అఖిలభారత చరఖా సంఘము, గ్రామ పరిశ్రమల సంఘము ఈనాటి ఖాదీ, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి పునాదివేసెను. ఈనాడు చిన్నతరగతి కుటీర పరిశ్రమలకు విలువ ఒసగబడుచున్నది. దీనికి కూడా గాంధీజీ వేసిన పునాదియే కారణ మనవలయును. గాంధీజీ దూరదృష్టి కలవాడు. అందుచేత నే విద్యుచ్ఛక్తి కూడ మన పరిశ్రమలలో ఉపయోగింపదగినదని ఆతడు వచించెను. కావున ఆర్థిక సిద్ధాంతములలో గాంధి సిద్ధాంతములకొక ప్రత్యేకస్థానము గలదు.

ఆర్. వి. రా.