Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గన్నవరము కుల్యవాహిక

వికీసోర్స్ నుండి

గన్నవరము కుల్యవాహిక (అక్విడక్టు) :

గన్నవరము అనెడి యూరు రాజమహేంద్రవరమునకు దక్షిణమున 32 మైళ్ల దూరములో, గన్నవరము కాలువ పొంత, వైనతేయమను నదీ శాఖ యొక్క ఒడ్డున కలదు. గన్నవరమునకు గరుడపుర మని పూర్వము పేరుండెనట ! దేశవిఖ్యాతిగాంచిన మహాదాత్రి డొక్కా సీతమ్మ నివసించినది ఇచ్చటనే. ఇచ్చట కాలువ నీరు, 31/2 ఫర్లాంగుల పొడుగు గల యొక తొట్టివంటి కట్టడము ద్వారా నదీ శాఖ మీదుగా ఎడమనుండి కుడివైపునకు దాటింపబడుచు నగరము ఖండమను తాటిపాక సీమకు తీసికొనిపోబడుచున్నది. ఈ తొట్టియే గన్నవరము అక్విడక్టు. పామరులు దీనిని అక్కి లేరందురు.

గోదావరీనది అఖండ గౌతమి యను పేరుతో రాజమహేంద్రవరము వరకును ప్రవహించి, అట ఏడుశాఖలై సప్తసాగరములు అను ఏడు చోట్ల సాగరములో సంగమించుచున్నది. "తుల్యా౽౽త్రేయీ భరద్వాజీ, గౌతమీ వృద్ధ గౌతమీ, కౌశికీచ వసిష్ఠాచ, సప్త శాఖాః ప్రకీర్తితాః". ఈ ఏడు బాహువులతో గోదావరీమాత డెల్టా భూదేవి నాలింగనము చేయుచున్నది. ఈ శాఖలలో తుల్య, ఆత్రేయి, భారద్వాజి, వృద్ధ గౌతమి, కౌశికి అనునవి మురుగు కాలువలుగా రూపాంతరము నొందినవి. కౌశికీ (కౌంతేయ) నదీప్రాంతము కోనసీమ యనబడును. శ్రీనాథ మహాకవి కౌశికీ తీరస్థ పలివెల క్షేత్రమును దర్శించి, కోనసీమ నుండి తూర్పుగా, భీమఖండమునకు బోవుచు గోదావరీ సప్తశాఖలను స్మరించెను. గౌతమీ మాత తన యేడు ముఖములతో అపార జలరాశిని సాగరములో పారబోయుచుండ ప్రక్కభూముల జనులు తమ పంటలకు నీరులేక మేఘుని వైపు బిక్క మొగములతో చూచుచుండిరి. ఈ గౌతమీ శాఖల కడ్డముగా ధవళేశ్వరము, బొబ్బర్లంక, విజ్ఝేశ్వరముల కడ బ్రహ్మాండమైన ఆనకట్టలు కట్టి, నదీజలము నాపి, కాలువలు త్రవ్వించి, లాకులు కట్టించి, దేశమును సస్య శ్యామలము గావింప సంకల్పించిన మహాశయుడు సర్ ఆర్థరు కాటను. ఈతడీ ఆనకట్టలను 1842-1852 సంవత్సరములలో నిర్మించి, నదిని జయించుటలో కృతకృత్యుడాయెను. ఈతని అఖండ నిర్మాణములోని భాగమే గన్నవరము అక్విడక్టు. ఈ ఆనకట్ట, అక్విడక్టులకు పూర్వము పెక్కుమార్లు వరపులచే కాటకములు సంభవించి ప్రజలు నశించిరి. పెక్కండ్రు వలసపోయిరి. అప్పుడు మెట్టపంటలును కొబ్బరి, మామిడి తోటలును ఉండెను.

ధవళేశ్వరము, విజ్ఝేశ్వరము ఆనకట్టల మధ్య బొబ్బర్లంక యొద్ద గన్నవరము కాలువ పుట్టెను. ఈ కాలువ గన్నవరము కడ వైనతేయమును దాటిన గాని నగరము ఖండమునకు నీరులేదు. నగరము ఖండము వైనతేయ, వసిష్ఠలకు మధ్య సముద్రము వరకు వ్యాపించియున్న డెల్టాభాగము. ఇది ఇప్పటి రాజోలు తాలూకాలోని దిగువ భాగము. వైనతేయ మిచ్చట అరమైలు వెడల్పు. ఇది గోదావరియొక్క యేడు శాఖలలో నెన్నబడలేదు. గన్నవరమునకు మీదుగా 11/2 మైలు దూరములో భర్తృ హరి మడుగు అనుచోట నిది వసిష్ఠ యొక్క యెడమ బాహువుగా విడిపోయినది. కోనసీమకు తాటిపాకసీమకు మధ్యగా ప్రవహించి, ఇది బెండమూర్లంక కడ కడలిని చేరుచున్నది.

వసిష్ఠుడు గౌతమీజలమును సముద్రగామిగా గొనిపోవుచు అనుష్ఠానము కొరకు కమండలము నేల నుంచగా వైనతేయుడు (= గరుత్మంతుడు) తన ముక్కుతో కమండల జలము హరించి వైనతేయ మను పేరున ప్రవహింప జేసెనట. అంత వసిష్ఠుడు ఆ యేరు స్నానార్హము కాకుండునట్లు శపించెనట. వైనతేయుడు ప్రార్థింప ఆదివారము లందు మాత్రము వైనతేయము స్నానయోగ్యమగునని వసిష్ఠు డనుగ్రహించెనట.

వైనతేయము మీదుగా గన్నవరము కాలువనీటిని 31/2 ఫర్లాంగుల తొట్టిలో ప్రవహింపజేయుటకు కాటన్‌దొర పర్యవేక్షణము క్రింద, లెఫ్టినెంటు జి. టి. హైగ్ నిర్వహణమున, సంకల్పింపబడిన పథకమును అప్పటి బోర్డు ఆఫ్ డై రెక్టరులు 14-2-1852 న ఆమోదించిరి. వరదలు తుడిచివేయుటకు పూర్వము పనిని ముగించు భగీరథ ప్రయత్నమునకు హైగ్ పూనుకొనెను. ముంగండ వాస్తవ్యుడు ముక్కుగణపతిశాస్త్రి యను ప్రసిద్ధ జోస్యుడు పనికి ముహూర్తము పెట్టి విస్తారమైన తన తోటలలోని మామిడిచెట్లు ఇటిక కాల్పు నిమిత్తము కొట్టివేయకుండ దొరనుండి సమ్మతి నొందెనట. ఆనకట్ట ఇటికలకొరకు ఆప్రాంతమున లెక్కలేనన్ని చెట్లు నరికివేయబడెను. నాటి ఇటిక లిప్పటి ఇటికలకంటె సుమారు ఆరు రెట్లు పెద్దవి. కూలివాండ్రంత పెద్ద ఇటికలను చేతులతో నందించు చుండిరి.

ఇచ్చట నదీగర్భముపై వరదనీరు సుమారు 25 అడుగుల ఎత్తు లేచును. ఇటికతో, సున్నముతో ఒక్కొక్కటి 40 అడుగుల వెడల్పుగల 49 కమానులు, కమానులమీద 7 అడుగుల మందముపై 22 నుండి 24 అడుగుల వెడల్పుగల కాలువ యొకటి నిర్మింపబడెను. కమానుల స్తంభములు ఇసుక అడుగున 7 అడుగుల లోతునుండి 5 లేక 6 అడుగుల వ్యాసము గల గుండ్రపు గోడలతో కట్టబడెను. పరికరములు సమకూర్చుకొన్న తేది మొదలు నాలుగు మాసములలో 2248 అడుగుల తొట్టిని హైగ్‌దొర పూర్తిచేసెను. మరినాలుగు నెలలలో కాలువలో నీరు ప్రవహించెను. యంత్ర సహాయము లేని మారుమూల 5000 మంది కూలీలతో, తగినంత అనుభవములేని యిద్దరు ముగ్గురు ఓవర్‌సీర్లతో ఒక్క ఋతువులో ఇంత గొప్ప నిర్మాణము ముగించుట ప్రపంచమందలి అత్యద్భుత కార్యములలో నొకటి యని హైగ్ ప్రజ్ఞను కాటన్‌దొర వేనోళ్ళ పొగడెను. ఈ కాలువ మొదట 40,000 ఎకరముల భూమి సాగునకు నీరందించెను.

మొదట - ఈ కాలువ వ్యవసాయమునకును పడవల రాకపోకలకును ఉద్దేశింపబడెను. ఈ నిర్మాణమునకు 1852 లో 1.68 లక్షల రూప్యములు వ్యయమయ్యెను. పిమ్మట కాలువకు రెండుప్రక్కలను 4 అడుగుల బాటలు కట్టబడెను. కమానుల క్రింద వైనతేయపు జలమును, మీద తొట్టితో కాలువనీరును ప్రవహించుట మహా గంభీరమగు దృశ్యముగా నుండును. వరదలలో తూములను కాలువను ముంచుచు నదీజల మావలకు ఉరుకుచుండును.

1944 లో వరదల వలన సుమారు ఆరు కమానులు బ్రద్దలాయెను. నగరము ఖండమునకు పోవు కాలువ తెగెను. తాత్కాలికముగ ఇనుప పంట్లమీద నీరు అందింపబడెను. అక్విడక్టు నంతయు పడగొట్టి మరల నిర్మింపదలచి వ్యయమునకు భయపడి కూలిన కమానులను మాత్రము మరల కట్టిరి. పూర్వపు తొట్టిని చేర్చి యెడమవైపున 11 అడుగులు వెడల్పుగల ఇంకొక తొట్టిని పొడుగునను నిర్మించిరి. దీని మూలమున పదివేల ఎకరములకు అదనముగా నీరందును. ఈ అదనపు తొట్టిమీద పూర్వపు అక్విడక్టు రోడ్డును ఆనుకొని బలమైన రోడ్డువంతెన 19 అడుగుల వెడల్పయినది నిర్మింపబడెను. ఇది మోటారు కార్లును బండ్లును పోవుటకు వీలైనది. ఈ నిర్మాణమున కంతకును 22.7 లక్షల రూప్యములు వ్యయమయ్యెను. ఈ రోడ్డు వంతెన 21-1-1949 న తెరువబడెను. ఈ రోడ్డు వంతెన అమలాపురము రాజోలు తాలూకాలను దృఢముగా కలుపుచున్నది. తొట్టిక్రింద నలుబదియైదు వేల ఎకరముల నేలకు జలదానము చేయుచు, ఇంకను ఐదు వేల ఎకరముల భూమియొక్క సాగునకు అవకాశము చూపుచు, సులభప్రయాణ సౌకర్యము చేకూర్చుచు, ఈ నిర్మాణము గోదావరీనదియొక్క డెల్టా భాగమును సౌభాగ్యవంతము గావించుచున్నది.

వా. రా.