Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కోడూరు-II

వికీసోర్స్ నుండి

కోడూరు-II :

కోడూరు కడప మండలమున రాజంపేట తాలూకా యందు గల మహాగ్రామము. కడప పట్టణమున కియ్యది యేబదిరెండుమైళ్ళ దూరమున (84 కిలోమీటర్లలో) గలదు. మదరాసునుండి బొంబాయికి బోవు రైలుమార్గమున గలదు. రేణిగుంట దాటినతర్వాత మూడవస్టేషను. ఇచట అన్నివిధములగు రైలుబండ్లు ఆగును. ఇది పూర్వకాలము నుండియు ప్రసిద్ధికెక్కిన స్థలము. తిరుపతికి వెళ్లువారు కాలినడక ఈ మార్గమున కొండలలో వెళ్లుచుండిరి. శేషాచలమునకు సమీపమున నున్నది. తిరుపతికొండనుండి ప్రవహించు కుంజర (గుంజన) యను సెలయేరు సంతత ప్రవాహముగలది ఈ కోడూరు నానుకొని ప్రవహించును. ఈ నదీజలముచే నీ గ్రామమున అనేకవిధములగు ఫలవృక్షములు పుష్కలముగా ఫలముల నిచ్చును. ఇచట సమీపమున గల శేషాచలము, పాలకొండ యడవుల నుండి కలపసామానులు, వంటకట్టెలు, చీనీపండ్లు, అరటిపండ్లు, తములపాకులు పలుచోట్లకు ఎగుమతి యగును. వెదురు మంచములు, గంపలు, తడికెలు, వెదుళ్ళు సమృద్ధిగ లభించు స్థల మిది. చేతిపనుల కనుకూలములగు వస్తువులీ కొండలయందు లభించుటచే తద్వృత్తులచే జీవించువారిందు ఎక్కువ గలరు.

సమృద్ధములగు ఫలజాతు లుత్పత్తి యగుచుండుట వలన ఇందు ప్రభుత్వమువారు ఫలపరిశోధన కేంద్రమును స్థాపించియున్నారు. ఈ కేంద్రము చూడదగినది. అనేక విధములగు ఫలరసము లిందులభించును. నిపుణులగువారు ఈ కేంద్రమున నుత్పత్తిచేసి యెగుమతిచేయుదురు. రక్తచందన వృక్షములు 1865 సంవత్సరములో నిచటి సమీపారణ్యములలో నాటి యభివృద్ధి నొనరించుచున్నారు. శ్రీగంధపుచెట్లు ఈ ప్రాంతపు టడవులలో దొరతనము వారు తమ పర్యవేక్షణక్రింద నభివృద్ధి చేయించుచున్నారు. అటవీశాఖవారు ఇచట 1871 వ సంవత్సరమున వంట చెరకుల డిపోను స్ధాపించిరి. ఇవి మద్రాసు మున్నగు ప్రదేశముల కెగుమతియగును. 1880 ప్రాతమున జర్మనీ లూధరన్ మిషన్ వారు తమ కార్యాలయమును ఇట స్థాపించినట్లు తెలియుచున్నది. 1887 వ సంవత్సరమునందు ఇచట మిషనువారు చర్చిని నిర్మించినారు. ఈ యూరికి ఒకటిన్నరమైలు దూరమున మిషనువారు కుష్ఠువ్యాధి నిర్మూలనార్థము కురపపల్లె యనుచోట ఆసుపత్రి నిర్మించినారు. ప్రకృత మీయూర నొక వైద్యశాల యున్నది. ఇచట మొదట లూథరన్ మిషను వారు ఎనిమిది ప్రైమరీ స్కూళ్ళను నడుపుచువచ్చినను ప్రకృతమున ఒక యున్నత పాఠశాలను జిల్లా పరిషత్తువారు సక్రమముగ నడుపు చున్నారు. లెక్కల ప్రకారము. 1951 లెక్కల ప్రకారము (Census No. 96, 97,) విస్తీర్ణము 18.21 మైళ్ళు. జనసంఖ్య 10,572.

మద్రాసునుండి బొంబాయిపోవు రైలుమార్గము మద్రాసు అండ్ సదరన్ మహారాటా రైల్ వే అను పేరుతో 1854-66 లో ఈ ప్రాంతమున వేయబడినది. శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మ్యమును రచించిన ధూర్జటి కవి తిన్నని కథలో "పొత్తపినాటలోన నుడుమూరను పక్కణమొప్పు" అని ఉదహరించిన పొత్తపి సీమకు జేరిన దీ కోడూరు. తిరుపతి వెళ్ళవలయుననిన నిటనుండి శేషాచలములో ప్రయాణము చేసిన పాపనాశన క్షేత్రము చేర వీలయిన త్రోవగలదు. ఇపుడు ఆ మార్గమున రోడ్డు వేయు ప్రయత్నములు జరుగుచున్నవి. ఈమహాగ్రామము చుట్టుప్రక్కలనుండు వనములు చూడతగినవి.

ఈ గ్రామము చారిత్రకముగా ప్రసిద్ధికి నెక్కినట్లు కొన్ని విషయములు గలవు. మధురాంతక పొత్తపి చోళ తిక్కరాజు పాకనాటిని పాలించునప్పుడు (1254-1291) పొత్తపి యను సీమ యొకటి ప్రత్యేకముగా నుండెడిది. ఈ పొత్తపిసీమకు పొత్తపియే రాజధానీ నగరము. ఈ పొత్తపి ప్రకృతము రాజంపేట తాలూకాయందు గల గ్రామము. మధురాంతక పొత్తపిచోళులు మిరిపెకనాడు అను దేశభాగమును పాలించుచుండిరి. ఈ కుటుంబము వారికి గండగోపాల నామము గలదు. నెల్లూరును పాలించిన మనుమసిద్ధి చోళవంశమునకు చేరినవాడు. ఇతడే తిక్కన సోమయాజికి పోషకుడు. ఈ మనుమసిద్ధిని గూర్చిన వివాద విషయము పొత్తపిసీమ సంబంధమైనది యొకటి తెలియుచున్నది. ఒక బ్రాహ్మణజాతికిని,

వెల్లాలజాతికిని కలిగిన విరుద్ధ విషయములో మధురాంతక పొత్తపి చోళమహారాజు నిర్ణేతగా నేర్పడెను. బ్రాహ్మణులకు పల్లవరాజు ముక్కంటికాడువెట్టి యనునాతడు ఏబదిరెండు భాగములు సాకలి కోడూరు అను గ్రామమున నొసగినట్లు శాసన మున్నది. ఈ భాగమును ఆ యూరి రైతులు అనుభవించుచు బ్రాహ్మణులకు చెందనీయక యుండగా మనుమసిద్ధి ఈ వాదమును విచారించి, కోడూరు అగ్రహారము బ్రాహ్మణులకు మరలవచ్చునట్లు తీర్మానించినట్లును తెలియుచున్నది. ఈ శాసనములో నుదాహృతములయిన పెనగలూరు, ఇండ్లూరు అనునవి కోడూరు ప్రాంతముననే గలవు. పొత్తపిసీమ కడప సమీపమునుండి కోడూరు దాటి శ్రీకాళహస్తివరకు వ్యాపించినట్లు కనబడును.

సూర్యవంశమువా రగు మట్లరాజుల కాలములో రాజంపేటతాలూకాయందు ఆ రాజులు అరువదినాలుగు అగ్రహారములు కట్టించిరి. పెక్కు చెరువులుత్రవ్వించి ముఖ్యములగు సారవంతములగు భూములను వారు దేవతలకును బ్రాహ్మణులకును ఇనాములుగా నిచ్చినట్లు పూర్వపు శాసనములు సాక్ష్య మిచ్చుచున్నవి. ఈ కోడూరు గ్రామము చారిత్రకప్రసిద్ధి నందినది. ఫలసార వంతమగు కోడూరు పొత్తపి సీమలో మిగుల ముఖ్యమయిన ప్రదేశము. ఇటనుండి శేషాచలారణ్యము ప్రారంభమగును.

కోడూరునకు నిర్వచనము: “కోడు" అనగా పల్లము - నదియొక్క మడుగుతీరము. ఆప్రదేశమున నిర్మించిన గ్రామము కాబట్టి కోడూరు అను నామమేర్పడినది. ఈనదీ నామము కుంజరీ యనునది. పూర్వమిటకు శేషాచలము నుండి యేనుగులు అడవులు తిరిగి యీ నదియందలి మడుగులో నీరుత్రావుచుండుటవలన కుంజరీ యనునామ మానదికి వచ్చినది. ఈ కుంజరీ శబ్దము క్రమముగా జనుల వాడుకలో ఆనోట ఆనోట బడి మారి" గుంజన” యైనది. ఈ నది సర్వకాలముల యందును జలముతో నుండును. ఈ నదీతీరమున అనేక ఫలవృక్ష వనములు, సస్యశ్యామలము లగు కేదారములును గలవు.

జ. వే. సు. శ.