Jump to content

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/కొండ వేంకటప్పయ్య

వికీసోర్స్ నుండి

కొండ వేంకటప్పయ్య :

కీ. శే. దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులుగారు ఆంధ్రజన మణిహారమున నాయకమణియై వరలెను. పంతులుగారి వినయసంపత్తి, మానవసేవాసక్తి, స్వతంత్ర కార్యాచరణశక్తి, దేశ సేవానురక్తి, ధైర్యోత్సాహ స్వార్థత్యాగౌదార్యములు మున్నగు నుత్తమ గుణములు వారు న్యాయవాది శిరోమణిగా, రాజకీయతంత్రవిశారదుడుగా, ఆంధ్రోద్యమ జనకుడుగా, దేశభక్తాగ్రేసరుడుగా రూపొందుటకు ప్రకృష్టోపకారకములయ్యెను.

గుంటూరు పట్టణమునందు ఒక బ్రాహ్మణ వంశమునందు కొండ అప్పయ్య అను మహాశయుడు ఉదయమందెను. అతడు వాసిరెడ్డి వారి సంస్థానమున రాజోద్యోగిగా నుండెను. అతని కొడుకు కోటయ్య. ఆతనికి పిత్ర్యముగా 15 ఎకరముల భూమి సంక్రమించెను. దానిపై రు. 30 ల ఆదాయము మాత్రమే లభించుచుండుటచే, ఆత డొక వైశ్యు నొద్ద ఉద్యోగిగ పనిచేయుచు తిమ్మరాజు గోపాలరావుగారి కూతురు బుచ్చమ్మ యను నామెను పెండిలియాడెను. ఆమె పరమసాధ్వి. సూర్యారాధనతత్పర. రవిని జూచి గాని కుడువ నొల్లనిది. కాలక్రమమున బుచ్చమాంబా కోటయార్యుల నోములపంటలై వేంకటప్పయ్య, సూర్యనారాయణ, ఆదినారాయణ అను ముగ్గురు కుమారు లుదయించిరి. వారిలో వెంకటప్పయ్యగారి శుభ జనన దినము 1866 సంవత్సరము ఫిబ్రవరి 2వ తేది శుక్రవారము. బుచ్చమ్మ తన 30 వ యేటనే పరమపదించెను. ఉపనీతులై యున్న వేంకటప్పయ్యగారే తల్లిగారి పరలోక క్రియలను నిర్వర్తించిరి.

పువ్వు పుట్టగనే పరిమళించు నన్నట్లు వేంకటప్పయ్యగారు విద్యాభ్యాసదశ నుండియే తమ ప్రతిభను ప్రదర్శింప దొడగిరి. వారు తొలుదొల్త ఒక మౌల్వీగారి పాఠశాలలో ఉరుదుభాష నభ్యసించిరి. పిదప ఒక ఆంగ్లేయ పాఠశాలలో ఆంగ్ల భాషాభ్యాసము నారంభించిరి. 1883 సం. డిసెంబరు మాసమున రాజమహేంద్రవరములో మెట్రిక్యులేషను పరీక్షయందు కృతార్థులైరి. అంతకు పూర్వముననే పంతులుగారు ఒక పాఠశాలా వార్షికోత్సవ సందర్భమున తమ వినోదకర సంభాషణ కౌశల్యముచే సభ్యులను హర్షాశ్చర్య మగ్నుల నొనర్చిరి. ప్రతి కక్ష్యయందును ఉన్నత శ్రేణిలో కృతార్థత నొందుచు నిరంతర విద్యార్థి వేతనమును, పుస్తకరూప బహుమానములను పొందుచుండిరి. రాజమహేంద్రవరమున నున్నప్పుడు వారికి కీ. శే. కందుకూరి వీరేశలింగముగారి దర్శనలాభము చేకూరెను. ఆంధ్ర భాషాధ్యాపకులగు కొండుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ప్రోత్సాహముచే, తెలుగు నాటకములలో ప్రముఖమైన స్త్రీపాత్రను సమర్థతతో నటించి ప్రేక్షకుల ప్రశంసలను చూరగొనిరి.

తమ సహపాఠియగు చంద్రశేఖరమను నాతనికి చికిత్స చేయించిన సందర్భమున కుగ్లరు దొరసానితో వారికి పరిచయ మేర్పడెను. ఆమెయొక్క సంఘసేవ, దైవభక్తి మున్నగుగుణములచే ఆకృష్టులైన పంతులుగారు క్రైస్తవమతా భిమానులు కాసాగిరి. క్రైస్తవమత ప్రవిష్టులయి యుందురు; కాని శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిగారిచే బోధితులై క్రైస్తవమత స్వీకరణోద్యమమునుండి విముఖులైరి.

ఉన్నత విద్యాభ్యాసము: పంతులుగారికి క్రైస్తవ మతమునందు జనించిన అభిరుచి పెంపొందు అవకాశము లేకుండ తండ్రిగారు వారిని ఎఫ్. ఏ. తరగతిని రాజమహేంద్రవరములో చదువునట్లు ఏర్పాటు కావించిరి. కాని ఎఫ్. ఏ. రెండవ సంవత్సరపు చదువు సాగించుటకు పంతులుగారు మదరాసులో క్రైస్తవ కళాశాలలో ప్రవేశించి, మితవ్యయ మొనర్చుచు, కుగ్లరు దొరసానిగారు తమకు పంపదొడగిన విద్యార్థి వేతనమును సహపాఠియగు చంద్రశేఖరమున కొసగుచు, అఖండమైన ఔదార్యమును ప్రకటించిరి. అచటి విద్యార్థిదశయందే వారు తెనుగున కవిత్వము వ్రాయదొడగిరి. బి. ఏ. పరీక్షలో కృతార్థులు కాకముందే వారు లింగమగుంట కోదండ రామయ్యగారి కన్యారత్నము, వేంకట సుబ్బమ్మగారిని ధర్మపత్నిగా స్వీకరించుట తటస్థించెను.

బి. ఏ. తరగతిలో చదువుచున్న కాలముననే వేంకటప్పయ్యగారు కళాశాల విద్యార్థి సంఘ చర్చలలో అగ్రగణ్యులుగ పేరొందిరి. ఉపన్యాసకరణమున లబ్ధవర్ణులైరి. షేక్స్పియరు నాటక ప్రదర్శనావసరములలో తాము స్వీకరించిన పాత్రకు అనుగుణముగ ఉచ్చారణ మొనర్చుచు, హావభావాదికముల ప్రదర్శించుచు, నిరుపమానమైన ప్రజ్ఞాకౌశలమును ఆవిష్కరించిరి. అత్తరి వారు అలవరచుకొనిన సుగుణగణమే ఉత్తరకాలమున వారు ఉత్తమన్యాయవాదిగ నిర్మించుకొనిన కీర్తిసౌధమునకు పునాదియై వరలెను. ఒకనాడు ప్రొఫెసరు లాయిడ్ అనునాతడు బైబిల్ పాఠము చెప్పుచు హిందూమతమును దూరిన కారణముగా విద్యార్థులచే గొప్పసమ్మె జరుపబడెను. ఆ సమ్మెయందు అత్యుత్సాహ ధైర్యములతో ప్రధాననాయకత్వమును వహించిన వారు పంతులుగారే.

1887 సంవత్సరము డిసెంబరులో అచట జరిగినభారత కాంగ్రెసు తృతీయ సమావేశ సందర్భమున పంతులుగారు ఐచ్ఛికభటులుగా స్వీయకృత్య నిర్వహణమున అత్యంత సామర్థ్యమును వ్యక్తీకరించిరి. పై సందర్భములలో పంతులుగారు అలవరచుకొనిన గుణములే, నిరుపమానమైన వారి భావి దేశ నాయకత్వమునకు రాచబాట వైచినవి.

బి.యల్. పరీక్షాఫలితములు తెలియకమున్నే పంతులుగారు సబ్ రిజిస్ట్రారుగా నియమింపబడిరి. కాని వారు దానిని స్వీకరింపక, న్యాయశాస్త్ర పట్టభద్రులయిన వెంటనే బందరులో తమ న్యాయవాద వృత్తికి విఘ్నేశ్వరపూజ గావించిరి. పంతులుగారి హస్తము పరుసవేదియై వారు పట్టిన దెల్ల బంగారమగు చుండెను. ప్రప్రథమమున వారొక ఖూనీ కేసునందు ముద్దాయి పక్షమున ప్రచండముగ వాదించి గడించిన అఖండ విజయమే పిదప న్యాయవాదిగా వారికి చేకూరిన కీర్తి ప్రతిష్ఠలకు జయ పతాక యయ్యెను.

చిత్రము - 8

న్యాయవాద వృత్తి నవలంబించిన మూడు సంవత్సరములకు పిదప వెంకటప్పయ్యగారు కృష్ణాజిల్లా కాంగ్రెసుకు సభ్యులుగను, కార్యదర్శిగను పనిచేయుచుండిరి. 1896లో కృష్ణానది వరదలు కారణముగా అవనిగడ్డతాలూకా గ్రామములు నీటిలో మునిగి పోయెను. ఐన నేమి ! పంతులుగారు అకుంఠిత ధైర్యస్థైర్యసమయస్ఫూర్తులతో వలసిన ద్రవ్యమును భూరివిరాళ రూపమున ప్రోగుచేసి, బాధిత గ్రామజనులకు పడవలపై నెత్తించిన సరకులను స్వయముగా సరఫరా చేయించి తమ దయామయత్వమును, అప్రతిహతోత్సాహమును, కర్తవ్యదీక్షను, మానవ సేవాతత్పరతను ఆవిష్కరించిరి. అట్లే ఒకతూరి రాయలసీమలో కరువు సంభవించగా, అచటికి వారు స్వయముగా వెళ్ళి పర్యటించి, చవుక బియ్యపు దుకాణములను ఏర్పాటు గావించి, నూతులు, కాలువలు త్రవ్వించు నిర్మాణ కార్యకలాపములందు పరిశ్రమించి తమ ప్రజాహితైక తత్పరతను వెల్లడించిరి.

కృష్ణాజిల్లానుండి గుంటూరుజిల్లా కొత్తగా ఏర్పడిన పిదప పంతులుగారు గుంటూరునందే న్యాయవాదిగా ప్రవే శించి అచటి న్యాయవాదుల సమాజములో విరాజమానులైరి. గుంటూరుజిల్లాకాంగ్రెసు అధ్యక్షపదవి నలంకరించి బాలురకును, బాలికలకును పాఠశాలలందు ఉచిత విద్యను, మధ్యాహ్న భోజనమును ప్రభుత్వమువారు ఒనగూర్ప వలయునను ఆశయమును ఉద్ఘాటించిరి. పిదప గుంటూరు పురపాలకసంఘ సభ్యులై ప్రభుత్వమువారు చూపిన ఆక్షేపణల కన్నింటికిని తగురీతి సమాధానములను వ్రాసి, పురపాలక సంఘము రద్దుకాకుండ వారించిరి.

వెంకటప్పయ్యగారు చేపట్టని కార్యముగాని. చేపట్టి విజయము గాంచని కార్యముగాని లేదనుట అతియోశ క్తి కాజాలదు. వారి సంఘ సంస్కరణోద్యమ దీక్షకు వారి ఆధ్వర్యమున బందరు నందు జయప్రదముగ జరిగిన ప్రథమ వితంతూద్వాహము తార్కాణము. వారు కృష్ణాపత్రికను స్థాపించి స్వయముగా జయప్రదముగా దానిని నడిపిరి. లంచము గై కొన్న ఒక మేజిస్ట్రేటుపై ధర్మరక్షణార్థము హైకోర్టు వరకు కేసును నడిపి, అందు విజయమును సాధించిరి. స్త్రీ విద్యా వ్యాప్తి విషయమున పంతులుగా రొనర్చిన కృషి ప్రశంసా పాత్ర మైనది. శారదా నికేతనమును స్థాపించు తలంపున వారు వేనవేల రూపాయీలను చందాగా వేయించి, ఆ జాబితాను, ఆ యుద్యమ నిర్వహణమును ఉన్నవ లక్ష్మీనారాయణ గారికి ఒప్పగించిరి. ఆ సంస్థ స్థాపింప బడిన తోడనే, వారు దాని అధ్యక్ష పదవి నధిష్ఠించిరి. తత్పురోభివృద్ధి నపేక్షించి 200 ఎకరముల భూమిని తమ ధర్మపత్ని చేత భూదానముచేయించిరి.

ఆంధ్రోద్యమము : పంతులవారి స్వార్థత్యాగము సాటిలేనిది. మహాత్మగాంధీ శంఖారావ మొనర్చుటకు 15 సంవత్సరములకు పూర్వమే (1915) వారు న్యాయవాద వృత్తిని త్యజించి దేశహితైక కార్యవ్యగ్రులైరి. ఆ కాలమున ప్రభుత్వమువారి కట్టడి మిక్కిలి కఠినముగ నున్నను లెక్కింపక, వారు 1907 లో తెనాలిలో జరిగిన స్వదేశోద్యమ సభకు అగ్రాసనాధిపత్యమును నిర్భయముగ వహించిరి. విదేశీయ వస్త్ర బహిష్కార మందును, స్వదేశీయ వస్తుపరిగ్రహణ మందును వారు ప్రజలను ప్రోత్సహించిరి.

గుంటూరులో వింజమూరి భావనాచార్యులవారి ఇంట ఆంధ్రోద్యమము ఆరంభ మయ్యెను. ఆ సమావేశ మందు పంతులుగారే అధ్యక్షులయిరి. ఆంధ్రోద్యమమును గూర్చి ఆంధ్రము నందును, ఆంగ్లము నందును గ్రంథములను రచించిరి. గుంటూరు జిల్లా కాంగ్రెసు సంఘము ఏర్పడి నప్పుడు దానికి పంతులుగారే అధ్యక్షులయిరి. 1913 లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు పంతులుగారు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా నుండిరి. ఆంధ్ర రాష్ట్ర తీర్మానము వాయిదా పడగా, ఉద్యమ ప్రచారమున కొక స్థాయీసంఘము నేర్పరచి, దానికి పంతులుగారు కార్యదర్శియై కార్యకలాపములను నిర్వహించిరి. డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారితో పాటు 1913లో రాయలసీమలో ఆంధ్రోద్యమ ప్రచార మొనర్చిరి. పెద్దిభొట్ల వీరయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, అయ్యంకి వేంకట రమణయ్యగార్ల కృషికి ఫలితముగా విజయవాడలో (1914) జరిగిన రెండవ ఆంధ్ర మహాసభలో పంతులుగారు ప్రచారసంఘపు పర్యటనానుభవములను నివేదించిరి. 'మహానంది' విద్యార్థి మహాసభలో ఆంధ్రరాష్ట్ర నిర్మాణమును గూర్చి వివరించిరి. మూడవ, నాలుగవ ఆంధ్ర మహాసభలు విశాఖపట్టణము (1915), కాకినాడ (1916)లలో జరిగెను. పంతులుగారు స్థాయీసంఘము యొక్క కార్యదర్శిగా, ప్రచార సంచారక నివేదికలను సమర్పించిరి. నెల్లూరులో జరిగిన 5వ ఆంధ్రరాష్ట్ర మహాసభకు పంతులుగారే అధ్యక్షత వహించిరి. అందు ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అనుకూలముగా తీర్మానము గావింపబడెను. 6వ ఆంధ్రరాష్ట్ర మహాసభ పంతులుగారి కృషి ఫలితముగా కడపలో జరిగెను.

రాజకీయ జీవితము : మద్రాసులో విద్యార్థిగా నున్నప్పుడు అక్కడ జరిగిన అఖిలభారత కాంగ్రెసు మహాసభలో ఐచ్ఛిక భటుడుగా పంతులుగారు ప్రారంభించిన రాజకీయ జీవితము అఖిలభారత కాంగ్రెసు అధ్యక్షపదవికి దారి తీసినది. వారు జెయిలు కేగినపుడు మాత్రము కీ. శే. టంగుటూరి ప్రకాశం పంతులుగారు వారి స్థానమున రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులుగా నుండిరి. ఈ పదవిని పంతులుగారు బుద్ధిపూర్వకముగా వదలుకొనిరి నాగపూరు కాంగ్రెసు సభలో (1920) కార్యవర్గ సభ్యుడుగా పంతులుగారు ఎన్నుకొనబడిరి. బెల్గాములో (1924) జరిగిన కాంగ్రెసు సభవరకును తమ సభ్యత్వమును అత్యంత సమర్థతతో నిర్వహించిరి. వారు గాంధిజీ చెప్పిన ప్రతి మాటకు తలయూపువారు కారు. తనకు అసమ్మతమైన విషయమును ధైర్యముతో వ్యక్త పరచెడివారు.

హోంరూలు సమితి సభ్యులుగా పంతులుగారు డా. అనిబిసెంటుతో ఢిల్లీకి వెళ్ళి మాంటేగు - చెమ్స్ ఫర్డులను దర్శించిరి. ఉన్నవ లక్ష్మీనారాయణగారి నిర్బంధమునకు అసమ్మతిగా వర్తకులచే వారము దినములు జయప్రదముగా సమ్మెచేయించిరి. ఇది యొక అపూర్వసంఘటనము. ఆబ్కారీ పాటలను పాడవలదని గుంటూరు మేజిస్ట్రేటుగారి ఎదుట వర్తకులకు ప్రబోధించిరి. కాంగ్రెసు ఎన్నికలను బహిష్కరించిన సందర్భమున పంతులుగారు రాష్ట్రమంతటను ప్రచార మొనరించిరి. పంతులుగారి సహాయ నిరాకరణ ప్రచారము మూలముననే బులుసు సాంబమూర్తి వంటి వా రెందరో తమ న్యాయవాద వృత్తులను విసర్జించిరి. పన్నుల నిరాకరణోద్యమమును (1920), బార్డోలీ ఉద్యమమునకు దీటుగా పెదనందిపాడులో జరిపించిరి. ఆ యుద్యమమును విరమింపుడని గాంధిజీ వ్రాసినను, పంతులుగారు అది బహుదూరము సాగినదనియు, అట్టి దశయందు దానిని ఆపివేయుటయే సంభవించునెడల, ఆంధ్రదేశము కాంగ్రెసునుండి తొలగవలసి వచ్చుననియు ఖండితముగా చెప్పిరి. వారి ధైర్య సాహసము అట్టివి ! కాంగ్రెసు కార్య నిర్వాహకసభ అమృతసర్ లో జరిగినపుడు పంతులుగా రచటికి అఖిలభారత కాంగ్రెసు అధ్యక్షులుగా వెళ్ళిరి. నాడు అకాలీల శాసనోల్లంఘనపు టూరేగింపులో కాంగ్రెసు కార్యవర్గమువారు కూడ పాల్గొనిరి. గాంధీజీ దండిగ్రామములో ఉప్పు సత్యాగ్రహము జరిపినపుడు పంతులుగారు నూరుమంది కాంగ్రెసు కార్యకర్తలచే తమ ఆవరణములో ఉప్పు తయారుచేయించి అమ్మించిరి. అఖిలభారత చరఖాసంఘపు శాశ్వత సభ్యుడుగా. ఆంధ్రరాష్ట్ర చరఖాసంఘపు అధ్యక్షుడుగా, ఆంధ్రరాష్ట్ర హిందీ ప్రచార సంఘపు అధ్యక్షుడుగా పంతులుగారి సేవ ఎంతయు ప్రశంసాపాత్రము. బాపుజీ ఖద్దరు నిధి కొరకు ఆంధ్రరాష్ట్రమున సంచారము చేసినపుడు పంతులుగారు వారికి కంటి రెప్పవలె వర్తించిరి. వీరు పెక్కుసారులు కారాగారశిక్ష ననుభవించిరి.

శాసన సభ్యత్వము : పంతులుగారు గుంటూరు, కృష్ణా, గోదావరిజిల్లాల ప్రతినిధిగా శాసనసభకు ఎన్నుకొనబడిరి. వీరు శాసనసభలో చాల కృషిసల్పి విషయములను సమగ్రముగ తెలిసికొని, ఆవశ్యకమగు అంశముల నన్నిటిని పూస గ్రుచ్చినట్లు శ్రుతపరచెడువారు. శాసనసభ యందు ప్రభుత్వ బలమే హెచ్చయ్యెను. అయినను వారు త్రికరణ శుద్ధితో, దేశ సేవా దీక్షతో గ్రంథాలయముల కొరకు ప్రభుత్వ సహాయ మర్థించుచు, ప్రతిపాదించిన బిల్లును ఆమోదించియు, స్త్రీలు విద్యాలయములందు చదువకయే పరీక్షలలో వ్రాయవచ్చునని ప్రతిపాదించిన బిల్లును మొదట వ్యతిరేకించినను, తుదకు ఆమోదించియు పంతులుగారిని బ్రిటిష్ ప్రభుత్వమువారు గౌరవించిరి. వారు 1936 లో శాసనసభ్యులై గుంటూరు నియోజకవర్గమునకు సేవచేసిరి. కాంగ్రెసులోని అక్రమములను గాంధి, నెహ్రూ మున్నగు ప్రముఖ నాయకులకు తెలియజేసి, కాంగ్రెసును పరిశుద్ధ మొనర్ప ప్రయత్నించిరి.

అట్టి మహనీయులు, వినయధనులు, ప్రతిభావిలసితులు, మానవసేవా ధురంధరులు, ధైర్యోత్సాహ, ఉదారాది ప్రశస్త గుణగణ విరాజితులు, దేశ హితైకతత్పరులు, ఆంధ్రోద్యమ జనకులు, 'దేశభక్త' బిరుద శోభితులుఅయిన శ్రీ వెంకటప్పయ్యగారు 1949వ సంవత్సరమున ఆగస్టు 15 వ తేదీయందు దేశ ప్రజలకు స్వాతంత్ర్యదిన సందేశ మొసగి, ఆ పర్వదినముననే దేశీయులను అపారశోకవారిధియందు ముంచి భౌతిక దేహమును త్యజించి నిరుపమ కీర్తి కాయముతో పరమపదమందిరి.

[[వర్గం::సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]