శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 9

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 9

                 1
ఆ రాజాయతనాభ్యంతరమున
చూచెను మారుతసూతి, మహాకపి,
పొడవును వెడలుపు పొందిపొసగి, సువి
శాలమయిన శయనాలయరాజము.
                   2
సగ మామడ విస్తారంబయి, ఒక
యామడ పొడవున ఆయత్తంబయి,
రాక్ష సేశ్వరుని ప్రాసాదము బహు
భవనంబులతో భాసిలుచుండెను.
                 3
అరికులాంతకుడు హనుమంతుం డా
సుందర సౌధముచుట్టి తిరిగె, సీ
తను దీర్ఘాపాంగను, శుభాంగనను
వెతకుచు జాగ్రదపేక్షమాణుడయి.
                  4
ఉత్తమరాక్షసులున్న ఉన్నత ని
వాస భవనముల వరుసలన్ గడచి,
హనుమ సమీపించెను రాజస రా
జన్యుడు రావణు శయనసదనమును.

                  5
మూడు దంతముల పోతుటేనుగులు,
నాలుగు కొమ్ముల నాగేంద్రంబులు,
మంద మందముగ మసలుచుండ, సా
యుధులై కావలి యుండిరి దైత్యులు.
                  6
దశకంఠుని సౌధంబున నుండిరి
పెండ్లియాడిన యువిదలును, బాహు ప
రాక్రమమున పరరాజన్యుల ని
ర్జించి అపహరించిన కన్యకలును.
                  7
మీన తిమింగిల మిళితాకులమై,
నక్రమకరమగ్న గభీరంబయి,
వాయు ధూతమయి, పన్నగభరమై,
రత్నాకరము కరణిని క్రాలునది.
                 8
ఘనపతియగు ఇంద్రుని యైశ్వర్యము,
ధనదుడగు కుబేరుని సౌభాగ్యము,
అన్నియు సుస్థిరమై నిలకడగొనె
రావణు నింట సురక్షితంబులుగ.
                9
యమ వరుణ కుబేరాది దిక్పతుల
ఇష్టకామిత సమృద్ధి సర్వమును
అధవా! అంతకు నతిశయముగ దశ
కంఠుని గృహమున కాపురముండెను.
                 10
ఆ ప్రాసాదము అంతరమందున,
యోధ జనము సాయుధులై తిరుగ,
మిగుల మోహనంబుగ నిర్మించిన
రాణివాసముల శ్రేణిని చూచెను.

                  11
స్వర్గలోకమున బ్రహ్మకోసమయి
విశ్వకర్మ భావించి కట్టె నది,
పుష్పక నామంబున విలసిల్లును
నానారత్న వితాన ధామమయి.
                 12
పరమ తపస్యా పరిపాకముగా
మునుపు కుబేరుడు పొందె బ్రహ్మకృప,
రావణేశ్వరుడు రాజరాజును జ
యించి, తా నపహరించెను దానిని
                13
అచ్చపు వెండిని పచ్చని పసిడిని
కరిగిపోసిన సొగసు నిలువులతో,
తోడేళుల మూర్తులతో, దిగ్భ్రమ
లావహించు నా దేవ విమానము.
               14
వరుసగదుల, శోభనగృహముల , మి
న్నంటుచున్న పై యంతస్తులతో,
మందరగిరివలె మహితోన్నతమయి,
రంజిలునది అపరంజి కొండవలె.
                 15
విశ్వకర్మ ఒప్పిదముగ కట్టెను,
అర్కాగ్నిచ్ఛాయలు విలసిల్ల గ,
బంగారపు సోపానవేదికలు,
సుందరంబుగా శోభిలుచుండెను.
                16
కనకంబున స్ఫటికములు ఖచించిన
చక్కని కిటికీ చట్టము లొప్పును;
నీలములు మహానీలంబులును పొ
దిగిరి తీరుతీరుగ వేదికలను.

                  17
ఆ విమానమున కడుగుభాగమున
పండు పగడములు పఱచి బిగించిరి,
మంచి ముత్యములనెంచి పోహణిం
చిరి సౌందర్యము చిందులు త్రొక్కగ.
               18
రక్తగంధధారల నెఱుపుమిగిలి,
పసిడి పసిమి మిసలెసగ, పుణ్యగం
ధ పరిపూర్ణ మై, తరుణారుణమం
డలిబోని విమానము నెక్కెను కపి.
               19
అచట గుబాళించుచు వలగొను మధు
పాన భక్ష్యముల పరిమళము లెగసి
రూపెత్తిన గతి వ్యాపింపగ , ఆ
ఘ్రాణించెను కపిరాజామాత్యుడు.
              20
ఆ గంధానిల మనిల తనూజుని
రావణుచెంతకు రమ్ము రమ్మనుచు
ఆమతించున ట్లాయెను; చుట్టము
చుట్టంబును పిలుచు విధాయకమున .
                21
అపుడు హనుమ కడు నచ్చెరువందుచు
అవలనడచి, అట నరసె మనః ప్రియ
కాంతవోలె కళకళలాడు దశ
గ్రీవు మనోహర కేళీశాలను.
               22
మణుల పలకల నమర్చిన మెట్లును,
కనకముతో మలచిన గవాక్షములు,
దంతస్ఫాటిక ధౌతకాంతులను
అడుగు చట్ట మింపార నచ్చముగ .

                 23
మంచి ముత్యముల మాలలు, పచ్చి ప
గడముల గుత్తులు, కలిసిమెలిసి జీ
ఱాడగ, వెండియు పైడియుకలిపిన
నిలువు కంబము లనేకము లగపడె.
                 24
హెచ్చులు తగ్గులు నించుక లేక , మ
హోన్నతములుగా ఒప్పుచున్న, ఆ
కంబంబులు బంగరు ఱెక్కలతో
అగపడె మింటికి ఎగయ నున్నటుల.
                 25
రావణు రాజసభావరణంబున
రత్నకంబళి పఱచి, రది; పృథివీ
లక్షణాంకితములగు రాష్ట్ర గృహం
బుల గుర్తులతో పొలిచె భూమివలె.
                26
బలిసిన పక్షులు పిలపిలనాడగ,
దివ్యగంధముల తియ్యము సుడియగ,
మంచిరత్నకంబళ్ళతోడ రా
వణుడున్న శుభాంగణ మింపెసగెను.
                 27
అగరు ధూపములు ఎగువకెగయ, కల
హంసల చాయల నమల ధవళమై,
పూజించిన పూవులతో నగపడె
కామ ధేను వట కన్న లేగవలె.
                  28
మనసోత్సాహము నినుమడించుచు, ప్ర
సన్న వర్ణముల కన్నుల తనుపుచు,
శోకతాప మార్చుచు, సమకూర్చును
సిరిసంపదలను శ్రీ దేవతవలె.

                 29
స్పర్శరూప రస శబ్ద సంగతుల
త్వక్చక్షు శ్శ్రోత్ర రసనాదులను
తనియించెను హనుమను తల్లిపగిది;
రావణేశ్వరుని రాజాయతనము.
                 30
స్వర్గంబో ! ఇది బ్రహ్మలోకమో !
ఇంద్రు నగరమో ! ఏ పరమపదమొ !
కావలె నంచును భావించెను కపి
దశకంఠుని సౌధము పరికించుచు.
                31
నిశ్చలముగ ధ్యానించుచున్నటుల
కదలకున్న బంగారు దీపములు,
ఓడిన జూదరు లొడుదుడుకు లుడిగి
నిలబడియున్నట్టుల చూపట్టెను.
                 32.
దీపంబుల దోషాపహదీధితి,
రావణు భుజబలరాజసతేజము,
యువతుల నగల సముజ్జ్వలకాంతులు
జడిగొని జ్వాలల జాడ పై కెగసె.
                 33
చిత్రవర్ణముల చీరలు, రవికలు,
సొమ్ములు, పలువేసమ్ములు దాలిచి,
కళుకు పట్టుజముకాణముల సుఖా
సీనలయిరి యోషిత లంతరువుల .
               34
ఆ దనుజాంగన లర్ధరాత్రి దా
కభిరతిలీలల నాడికూడి, వగ
లోపగజాలక తీపిత్రాగి, ఒడ
లెఱుగక పవళించిరి నిద్దురతమి.

                  35
మగువలు నిదురింపగ వారల భూ
షణముల గలగల యణగి కనబడిరి,
హంసల అలజడి, అళికులముల రొద,
విడుపుగొన్న అరవింద వనమువలె.
                 36
వాతెఱకప్పిన పలువరుసలతో,
వాలిన కనుఱెప్పలతో, నిద్దుర
బోవు మెలంతల మోములుగనె కపి
మొగిడిన తామరపువ్వుల పోడిమి.
                 37
రేయిజాఱ రమణీయముగా వి
చ్చిన పద్మంబులు, చీకటిపడగా
క్రమ్మఱ ముఖ రేఖలను ముడుచుకొను
భంగినుండి రా పద్మదళాక్షులు.
                38
వారల ముఖబింబంబులు పూచిన
పద్మము లనుకొని భ్రమసి మోహమున
మత్తమధుపములు మఱలమఱల ప్ర
దక్షిణించును వదల క పేక్షమెయి.
                 39
ఆ ప్రియదృశ్యము నరసి మహాకపి,
మేధావి, యిటుల మీమాంసించెను;
గుణవాసనలను ప్రణుతికెక్కె ప
ద్మము, లయ్యవి పంకమున పుట్టినను.
                  40
ఆ కాంతలతో అందముగ ప్రకా
శించె రావణుని శ్రీసదనము, శా
రదరాత్రుల తారామాలలతో
రాజిల్లు నభోరంగము భంగిని.

               41
అసురకామినీ విసరము గిరికొన
రంజిలుచుండెను రాక్షసనాథుడు,
చక్కని చుక్కలు సరస చుట్టుకొన
భ్రాజ మానుడగు రాకాశశివలె.
                42
అనుభవింప మిగిలిన పుణ్యంబున
తారలు విష్ణుపదంబునుండి దిగి,
పుణ్యజనస్త్రీ భూషణంబులుగ
పుట్టిరంచు తలపోసెను మారుతి.
                43
అచ్చట నున్న శుభాంగనలకు ప్రా
ప్తించెను, దివమున వెలుగు తారలకు
వలె, అక్షయలావణ్య ప్రభలును,
లలితప్రియమంగళ శుచిరుచులును.
                44
ఊడిన కొప్పులు, వీడిన పూదం
డలు, చిక్కుపడిన నగలతోడ, వా
రందఱు, క్రీడల నలసి, మధువుగొని,
మతిపోయి, నిదురమబ్బుల తూగిరి.
              45
తిరుగబడిన అందెలతో కొందఱు,
కరగి దిగిన తిలకంబుల కొందఱు,
హారంబులు పెడజాఱిన కొందఱు,
ప్రమద లాలసావశలై కొందఱు.
              46
పెరిగిన ముత్తెపు సరములతో, జా
ఱిన వలువలతో, తునిగి పెనగు మొల
నూళ్ళతో, అట కనుపడిరి కొందఱు,
పడి పొర్లాడిన బాలహయము లన.

                47
రవ్వల కమ్మలు ఱాపుల మెఱయగ,
నలిగి తెగిన పువ్వుల గుత్తులతో
అగపడి, రేన్గులు పెగలిచి పడత్రొ
క్కిన పువ్వుల తీగెలవలె కొందఱు.
                48
చందమామ హస్తాలవంటి ము
త్యాల సరులు కొందఱు ధరించి, రవి
పాలిండ్లనడుమ పవ్వళించి ని
ద్రించు హంసపుత్రిక లట్లగపడె.
                 49
అబలల వైడూర్య సరంబు లమరె
అక్కున హత్తిన హంసలరూపున,
కంఠంబుల బంగారపు గొలుసులు
చక్రవాకముల చాళ్ల వలె నెగడె.
                 50
కన్నె లేళ్ళు, జక్కవలు, హంసములు
ఈదుచున్న సెలయేళ్ళుపోలె నుం
డిరి మదవతులు, కటీతటములు నిం
పెసలా రె మెఱుగుటిసుక తిన్నెలుగ.
               51
బుగ్గలుగా చిఱుమువ్వలు గజ్జెలు,
మొగములుగా పరిఫుల్ల కమలములు,
కామభావములు కటికి మొసళ్లుగ
నదు లట్లుండిరి నిదురను నెలతలు.
                52
మెలతల మెత్తని మేనులను నగల
రాపిడిచే చాఱలుపడె కొందఱి,
కవి, కుచాగ్రములయందు శోభిలెను
పెట్టని సొమ్ముల యట్టు లందముగ.

                  53
కొందఱు లలితాంగులు ధరియించిన
జిలుగు చీర చెంగులు నిట్టూర్పుల
చాలితంబులయి సారెసారెకును
చిందులు త్రొక్కును సుందరాస్యముల.
                    54
అట్టులెగయు చేలాంచలములు, వర
వర్ణినులగు రావణు ప్రియాంగనల
మంగళ ముఖముల ముంగల మెఱసెను,
చిత్రపతాకల సిగల చందమున.
                   55
మఱికొందఱు కొమ్మలు ధరించిన క
డాని రత్నకుండలములు నిట్టూ
ర్పులకు కదలి అలవో కలసాలస
ముగ నూగెను సోయగ మెగపోయుచు.
                 56
మధుశర్కర పరిమళమిళితంబయి,
సహజ సౌరభస్యందంబగు, ప్రియ
కామినీముఖసుగంధమారుతము
సేవించె దశగ్రీవుడు ప్రియముగ.
                  57
ఆపరాని మోహాతిరేకమున
యువతులు కొందఱు సవతుల మొగములు
వాసన చూచిరి వాలాయముగా,
రావణు ముఖమని భ్రమపడి మఱిమఱి.
                58
అత్యంతము కామాసక్తలయిన
రావణు సఖులు పరాధీనలగుచు,
సవతి మచ్చరము జాఱిపోవ ము
దాడి, వారికి ప్రియంబునె సలిపిరి.

                  59
పసిడి కడియములు మిసమిస మెఱయగ,
లలిత బాహులు తలాపిగా మడిచి,
జిలుగు చేలములు సెజ్జలుగా, శయ
నించిరి కొందఱు చంచలేక్షణలు.
                 60
సూత్రము గ్రుచ్చిన చొప్పున చేతులు
చేతులు కూర్చిన స్త్రీ జనమాలిక ,
అళికులములవలె అలకలు ముసురగ,
పుష్పమాలికను బోలి శోభిలెను.
                61
మదనస్నేహ నిమగ్నలై , నెలత
లొకరినొకరు కౌతుకము పైకొనగ,
తొడలను గిల్లుచు, దువ్వుచు ప్రక్కలు,
పిరుదులు నిమురుచు, పింపిళ్లాడిరి.
               62
సన్నని నడుముల చానలు కొందఱు
అన్యోన్యము నంగాంగ స్పర్శల,
ప్రీతి పొలయ నిదురించి రొండొరులు
గొలుసుకట్టుగా కలపి కరంబులు.
                 63
ఒకతె వక్షమున నొక్కతె యొరగిన
దాని బుజంబులు తట్టె నింకొకతె,
ఒకతె అంకమున నొకతె యొ త్తిగిల
దాని బాహులను తట్టె నింకొకతె.
                  64
మధుమాసమున సమర్తలయినటుల
పూచిన తీగెలు వీచిన గాలికి
పాదులు కదలగ బోదియలు పెకలి
ఒకదానిపయి మఱొకటి వాలిపడె.

                65
తల్లక్రిందుగ మొదళ్ళు పెకల, ఆ
న్యోన్య భ్రమరకులాకులమయి వా
లిన పూదోటవలెన్ చూపట్టెను;
రావణు రమణీరాజోద్యానము.
               66
ఆ మెలతల మెఱుగారు మేనులను
కట్టిన చీరెలు, పెట్టిన సొమ్ములు, ,
చుట్టిన మాలలు నట్టె యుండినను,
ఏవి యెవరివో యేర్పడకుండెను.
                67
సుఖనిద్రను దశముఖుడుండ, అతని
మెఱుగు బోణు లనిమిషలై , ప్రియముగ
నిలబడి చూచిరి వెలుగుచున్న బం
గారు దీపకళికల చందంబున.
                68
గంధర్వుల లోకమున , అదితి అ
న్వయమున, పితృదేవతల యింట, రా
జ ఋషుల గృహముల, జనియించిన క
న్యకలు కామవశలై రసురపతికి.
                 69
రణ జిగీషువగు రావణు డని మొన
గెలిచి తెచ్చె కన్యలను కొందఱిని,
మదన మోహమున మదవతు లెందఱొ
వచ్చిరి, ఆతని వలచి మరులుగొని.
                    70
ఆ ప్రమదామణులందు, బలాత్కృత
లయినవారు, పరులపయి మనసయిన
వారు, మగలు కలవారు లే రెవరు;
వై దేహియె అపవాద మందఱను.

                 71
మంచి కులమున జనించని వారలు
చక్కదనంబున తక్కువవారలు,
సరస సరాగము లెఱుగని వారలు,
కామించ తగని లేమలు లేరట.
                  72
అనుచు చింతిలెను హనుమ మఱల నిటు,
రాముని పత్నియు రావణు భార్యల
వలె సుఖించు నట్టులు వర్తించిన,
ఈతని జన్మము పూతమై వెలయు.
                 73
బుద్ధిశాలి తలపోసె మఱల హరి,
సీత విశిష్ట గుణపూత ధ్రువము, లం
కేశుడు సుకృత మహితు, డటు లయ్యును,
ఆర్యపట్ల ఖలుడాయెను హతవిధి.