శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 68

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ : 68

                 1
అంత తనివిగొన కార్యాతిలకము
నీ ప్రసన్నమతి, నా ప్రపన్న రతి,
భావించినటుల, భాషించెను సం
భ్రమమున మఱి మఱి పరిపరి విధముల.
                 2
దశరథ పుత్ర వతంసుడు రాముడు
వచ్చి యిచ్చటికి వ్రచ్చి రావణుని,
నను కొని పోవుట కనువగునెటు, లా
వీలుచాళ్ళు వినిపింపుము విభునకు.
                 3
నీ వించుక ఇట నిలువ తలంచిన
చాటు మాటయిన చోట ఎందయిన
ఒక్క దినము శ్రమ తక్కి విరామము
పొంది, రేపకడ పోవచ్చును హరి!
                 4
అల్పభాగ్యనయి, అగచాట్లం బడు
నా కే పుణ్య విపాకమొ కలిగెను
శోక విరామము సుంత నీ వలన,
అదియు సమాప్తం బగుచున్న దిపుడు.

                5
నీవు పోయి మీ తావుచేరి క్ర
మ్మఱుదాకను నే మనియుందునొ, మర
ణింతునొ! అది సందేహాము పావని!
దినగండము నా మనుగడ ఇచ్చట.
                6
దుఃఖము వెంబడి దుఃఖము విడువక
ఈడ్చుచున్న నే నింత సుఖించితి
నీరాకను, ఇక నీవు కనబడని
చింతలవంతలచే హతమగుదును.
               7-8
తీఱని దొక నందియము హనుమ! నా
కట్టెదుటను గ్రక్కదలదు, మీ వా
నర భల్లుక సైన్యములుగాని, రా
ఘవులుగాని ఎటుగడతురు వార్థిని?
                9
సాగర మీదగ శక్తిమంతు లీ
భూతగణములో ముగ్గురుమాత్రమె,
నీవును, నీ తండ్రియు, సుపర్ణుడును;
అన్యుల కెవరికి నలవికాదుగద.
               10
కార్య నియోగము గట్టెక్కుట కీ
దాటరాని ఆతంక మే యుపా
యంబున తీర్తువు హరికుల సత్తమ!
నాకు సమాధానము కావింపుము.
               11
కార్య దక్షుడవు, గణ్యుడ వీవొ
క్కడవె చాలు దీ గండము గడపగ,
నీ దాక్షి ణ్య బలోదయ, మిలలో.
ఆలవాలమగు అక్షయ కీర్తికి.

                 12
సాంగబలముతో సాగివచ్చి, రా
వణుని రణంబున వధియించి, జయము
పొంది, నన్ను కొనిపోవుట, వీరుడు
రామునకు యశోరాజమార్గమగు.
                 13
రామ భయముచే రావణుడు మునుపు
వంచనచేసి అపహరించెను నను,
అట్లు, రాము డిపు డధమ మార్గమున
నను కొనిపో వలదని నచ్చింపుము.
                 14
సేనలతో విచ్చేసి, లంక సం
కులముచేసి పడగొట్టి, విజయుడై
నను తోడ్కొని పోయిన యుక్తంబగు,
రఘువీరుని గోత్రక్షాత్రములకు.
                 15
రాము వీర విక్రాంతి ఖ్యాతికి
అనురూపంబగు ఆహవదోహల
శూరపథంబును చూపుము విభునకు,
ధీరచరితములు తెలిసిన యోధవు.
                 16
సార్థకమై , హితమయి, సహేతుకం
బయిన భాషణము లాలకించి, ఆ
యమ, ఆశయశేషము పూరింపుచు
చెప్పితి నేనిటు లప్పుడు రాఘవ!
                 17
వానర భల్లుక సేనల కధిపతి,
ప్ల వగలోకపాలక పరమేశుడు,
సుగ్రీవుడు నిల్చును, దేవీ! నీ
కార్యార్థము కంకణము కట్టుకొనె.

                    18
జవ సత్వంబులు, శౌర్య సాహసము,
లిచ్చ వచ్చి నట్లెగయు ప్రభావము,
కలిగిన గండర గండలు లక్షలు
కోట్లు, అతని అడుగులబడి నడతురు.
                    19
ఆకాశంబున, అంతరిక్షమున,
పాతాళము లోపలను భ్రమింతురు
అడ్డ మాక లే కలవోక, మహా
వానర వీరు లపారవేగమున.
                    20
బల దర్పితులయి వాయు వేగమున
భూచక్రంబును పూర్తిగా తిరిగి
వచ్చిరి పలుమరు వార లనంఖ్యలు
జాహు బల మనోబల భూయిష్ఠులు.
                    21
నాకంటెను చండ ప్రచండు లు
న్నార లనేకులు; లేరెవరును నా
కంటె కనిష్ఠులు, కపినాథుని స
న్నిధిలోన పురంధ్రీ మతల్లి రో!
                    22
నను సామాన్యు నొకని పంపిరి యీ
స్వల్పకార్యమున కధికు లెందుకని,
దూతలుగ ఉదాత్తుల నంపరు భూ
మీశు లరసి మాదృశుల పంపుదురు.
                    23
కావున నీవిక దేవీ! దైన్యము
త్యజియింపుము, పరితాపము మానుము
ఒక్కదూకులో యోధవానరులు
లంకపై బడి కలంత్రు పునాదులు.

                   24
పొడుచుచున్న సంపూర్ణ సూర్యచం
ద్రులవలె నా మూపులపై వెలుగుచు
వేంచేతురు నీ పంచకు దేవీ!
రాజసింహములు రామలక్ష్మణులు.
                   25
దర్శింపగలవు ధర్మశాలినీ!
అరిగజకేసరియగు రాము, ధను
ష్పాణియైన లక్ష్మణు, నీ లంకా
ద్వార కవాటము దగ్గర శీఘ్రమె.
                   26
గోళ్ళును కోరలు క్రూర విశిఖలుగ,
శత్రు భయానక సాహసాంకులయి,
పోతు టేనుగుల బోని వానరుల
వీర సంభ్రమము విందువు వేగమె.
                   27
లంకా ద్వీప మలయగిరి లోయల
నడ కొండలవలె, సుడిమబ్బులవలె,
వ్రాలి, పిచ్చటిలు వానర సేనల
సంఘర్షణ ధర్షణములు విందువు.
                   28
వనవాసంబు నివర్తించి, నిశా
చర వీరుల పీచం బడంచి, నీ
తో నయోధ్యయందు అభిషిక్తుడగు
శ్రీరాముని చూచెదవు సవిత్రీ!
                   29
అనుచు దైన్య మంటని భాషణముల
మనసు కిష్టమగు మంగళార్థములు
పలికితి, విని మైథిలి శాంతించెను
తావక విరహ నిదాఘతాపమున.