శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 63

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ : 63

                  1
తన పాదంబుల తలవాల్చి పడిన,
వానర వృషభుని మేనమామ గని,
సుగ్రీవుడు మనసున నొచ్చుకొనుచు,
వ్యాకులుడై యిట్లనె ఆదరమున.
                2
లెమ్ము లెమ్ము, అభయమ్మిచ్చితి నీ
వేల పాదముల వ్రాలితి విట్టుల
వీరాగ్రణి ! భయకారణమును అం
తయు ఎఱిగించుము నాకు వివరముగ.
                3
ప్రభువు పలుకు విశ్వాసము నింపగ,
లేచి, వానర కులీనుడు దధిముఖు,
డచ్చట జరిగిన ఆగడమంతయు
వక్కాణింపగ ప్రారంభించెను.
                4
రాజేంద్ర ! ఇదివఱకు, నీ తండ్రియు
నీవును, వాలియు నీయలేదు మధు
వన మెవ్వరికిని తిని త్రాగుటకయి,
వీటి బుచ్చి రాతోట వానరులు.

                   5
కావలివారలు కాదని తోలగ
కిచకిచలాడుచు కేరించి, ప్రతా
పించి, కొట్టి త్రావిరి తేనెలు, ఫల
ములు భక్షించిరి పుక్కిటిబంటిగ.
                   6
పండ్ల గుత్తులను భక్షించుచు, కుతి
కెల బంటిగ తేనెలు త్రాగుచు, మే
మడ్డగింప, మాఱొడ్డి, కనుబొమలు
ఎగరవేయుచును ఇగిలించిరి మము.
                  7
బెదిరింపులతో కదలకున్న, వన
పాలకు లెసకొని వారింపతొడర,
అలిగికలగి క్రుద్ధులయి వానరులు
తారుమారుగా తరిమిరి వారిని.
                 8
అంతన ఆగక హరివీరులు తమ
నంగదనాయకు లాదరింప, కను
లెఱ్ఱచేసి, భయమెత్తగ మొత్తిరి,
మధురక్షకులను మన సేవకులను.
               9
అఱచేతులతో అడచిరి కొందఱ ,
మోకాళ్ళు విఱుగపొడిచి, ముడిచి కొం
దఱికి అపానద్వారము చూపిరి,
త్రాగిరేగి, మత్తప్రమత్తులయి.
               10
ఏలికవయి నీ విచట నుండగనె,
ఇష్టమై నటుల హింసించిరి మము,
మధుపాలకులను మర్దించిరి, ని
శ్శేషముగా భక్షించిరి మధువును.

                  11
ప్రభువుతో నటుల వానరు డేమో
చెప్పుచుండ వీక్షించి, యథోచిత
ముగ సుగ్రీవు నడిగె కుమార ల
క్ష్మణుడు, వైరికులమారకు డిట్టుల.
                12
వాన రేశ్వర ! ఎవం డిత డిప్పుడు
ఏల వచ్చె నీ పాలికి ? ఏమి ని
వేదించుకొను? విషాదముఖుండయి,
వినదగు నే నది వివరింపుము ప్రభు !
                 13-14
లక్ష్మణు ప్రశ్నములకు సుగ్రీవుడు
ఇట్లనె, మిత్రమ ! ఇతడు దధిముఖుడు,
అంగద ప్రముఖు లైన వానరులు
తీపి త్రాగిరని తెలుపగ వచ్చెను.
                 15
దక్షిణదిశ నంతయును వెతకి రట,
తిరిగివచ్చి వానరు లందఱు, మధు
వనము చొచ్చిరట ; వారు కృతార్థులు
కాకున్న ఇటు లకార్యము చేయరు.
                  16
వచ్చీరాకయె వనమును చొచ్చిరి,
కావలివాండ్రను చావమోది, త్రా
గిరి మస్తుగ మాగిన మధువును; ఇవి
యెల్ల తఱచి ఊహింపగ తోచును.
                  17
పోయిన పని సంపూర్ణముగా సా
ధించిరి వీరలు, దేవిని సీతను
చూచియుందు రెచ్చోటనొ ? తథ్యము,
సందేహము లే దిందుకు లక్ష్మణ !

                 18
ఈ కార్యమునకు ఇతరులు చాలరు,
హనుమ యొక్క డె సమర్థుడు, దక్షుడు,
కార్యసాధనకు కావలసిన , దీ
క్షయు, బుద్ధియు, బలిమియు, కలవతనికి.
                   19
బలమును, కార్యోపాయ, మనుభవము,
కలవతనికి, అంగదుడు జాంబవం
తుడును నేతలుగ తోడై నడపగ,
ఇట్టి అకార్యము లెన్నడు జరుగవు.
                  20
తిఱిగివచ్చెనట పఱచిన బలములు,
అంగదాదు లుద్యానవనము హత
మార్చిరట, వలదన్న రక్షకుల
మోకాళ్ళు విఱుగపొడిచి తన్నిరట.
                21
ఇది యంతయు మా కెఱిగించుటకై
విచ్చేసె నితడు, పేరు దధిముఖుడు,
మధువనాధిపతి, మధురభాషి, వి
ఖ్యాతుడు కపిలోకమునం దెల్లను.
                22-23
సీతను సందర్శింపకున్న ఈ
పరమోత్సాహము పొరలదు వారికి,
అదియుగాక , మా ముదితోద్యానము
ఆక్రమించి చేయరు దుండగములు.
                  24
సీతను దర్శించిరి వానరు లను
సుగ్రీవుని ముఖ సుఖవాక్కులు, విని
వీనుల విందుగ, మానసముల ఆ
నందించిరి రఘునందను లిరువురు.

              25-26
రామలక్ష్మణులు రాగిల్లుట కని
వానర రాజేశ్వరుడును మిక్కిలి
ఉత్సహించి, పూజ్యుడు వనాధిపతి
కానతిచ్చె నిటు లనునయార్థముగ.
                  27
ప్రీతులమైతిమి సీతాన్వేషకు
లంగదాదులు కృతార్థులై తిరిగి
వచ్చినందులకు, పని సాధించిన
వారు త్రాగినను సై రింపగ తగు.
                28
కార్యసిద్ధిగొని, క్రమ్మఱ వచ్చిన
వీరుల కపికంఠీరవులను గని
దేవిని శీఘ్రము తెచ్చు ప్రయత్నము
వినవలతుము, పంపించుము వారిని.
                29
ప్రీతితో కనులు విప్పారిన రా
ఘవుల ప్రమోదము కని సుగ్రీవుడు,
గగురొత్తగమెయి, కార్యసిద్ధి చే
తుల కందినవంతున పొంగెనపుడు.