శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 50

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ 50

                 1
లోకములకు భయ శోక దాతయగు
రావణుండు రోషావశుం డగుచు,
పచ్చిగోఱజము వన్నె కనులతో
ఎదుట నున్న కపి వృషభుని కనుగొని.
                 2
శంకించెను, వాస్తవ కపి మాత్రుడు
కాడు వీడు, మును కై లాసంబున
తిరుగునపుడు నను తిట్టి శపించిన
సాక్షాన్నందీశ్వరుడు కానగును.
                  3
కాక, వానరాకారంబున బా
ణాసురు డిటు నే డరుగుదేరగా
బోలు, నటంచును లోలోపల తల
పోసెను ఊహాపోహలు మిగులగ.
                4
మనసులో నిటుల మధనలు పడి పడి,
రోషరక్త నేత్రుడయి, ప్రహస్తుని
చూచి పలికె సమయోచితంబుగా
దశకంఠుడు సార్థక వాక్యంబులు.

                  5
ఎచటినుండి యిటకేగుదెంచె, కా
రణమే? మెందుకు వనమును చెఱిచెను,
అసురులతో పోరాడె నెందులకు?
అని అడుగుము దుష్టాత్ముని వీనిని.
                  6
చొరకూడని మా పురమేల ప్రవే
శించె? ఏమి కాంక్షించి యుద్ధమును
చేసె నిచట? ప్రశ్నింపుడు మీ రీ
దుర్బుద్ధిని విధ్యుక్తక్రమమున.
                   7
రావణుడాడిన ప్రభువాక్యములను
ఆలకించిన ప్రహస్తు డిట్టులనె;
విశ్రమింపుము కపీ! లే విచ్చట
భయకారణములు, భద్రము సర్వము.
                  8
ఇంద్రుడంప లంకేశ్వరుని నివా
సంబున కిట్టుల చనుదెంచితివో!
నిజము చెప్పుము వనేచరపుంగవ!
భీతిచెందకుము విడిచిపుచ్చెదము.
                  9
యముని పక్షమున, అధవా ధనపతి
పంపున , లేదా వరుణుని ప్రేరణ,
చార రూపమున తారాడుచు మా
పట్టణమున చొర బడినాడవొ కపి !
                 10
విజయ కాంక్షతో విష్ణు దేవుడే
దూతగా మొదట తోలినాడొ నిను!
కోతిది కాదీ భూత బలము, ఆ
కారమాత్రమున కపివీవు సుమీ.

               11
నిజమును చెప్పుము నిన్ను విడిచెదము,
కల్ల లాడ దక్కదు నీ ప్రాణము,
కాదయేని, లంకాపతి రావణు
ఇల్లు చొచ్చుటకు ఏమి కారణము ?
                12-15
సచివోత్తము ప్రశ్నలు విని మారుతి,
బదులు పలికె రావణు వీక్షించుచు,
ఎఱుగ నింద్ర యమ వరుణ కుబేరుల,
విష్ణువు ప్రేరేపింపలేదు నను.
                  ?
వానరజాతుడ, వచ్చితి స్వయముగ
రాక్షసేంద్రు దర్శనమున, కందుకు
అనువేర్పడ మీ వనమును విఱిచితి,
ప్రాణరక్షణార్థము పోరాడితి.
                16
అసురుల కమరులకై నను శక్యము
కా, దస్త్రంబుల కట్టివేయ నను,
ఈ వరమును నాకిచ్చెను బ్రహ్మయె,
రాజ దర్శనార్థమె బంది నయితి.
                 17
అస్త్రబంధములు అగలి యూడినను
పీడించిరి పగతోడ రాక్షసులు,
ఓర్చితి, వచ్చితి, ఒక్క రాజ కా
ర్యార్థ మిట్లు మీ యంతికంబునకు.
                 18-19
కల, డమిత పరాక్రముడు రాఘవుడు,
ఆ మహనీయున కాప్తుడ , దూతను,
హితములైన నా యీ వచనంబులు
ఆలకింపుము శుభార్ధములు ప్రభూ !

23-6-1967