శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 40

వికీసోర్స్ నుండి

శ్రీ

సుందరకాండ

సర్గ40

                   1
అనిల సుతుండు మహాత్ముడు పలికిన
వాకుల నన్నియు ఆకళించి సుర
కన్యబోని జనకసుత హనుమతో
ఇట్లు పలికె తన యిష్టార్థంబును.
                   2
ప్రియము తెచ్చిన కపిప్రవరుని నిను
చూచి మానసము సుఖముఖ మాయెను,
సగసగము మొలక సాగిన క్షేత్రము
వానకురియగా పచ్చగిలిన గతి.
                   3
అతను తాపమున అగలి సెగలలో
కాగుచున్న విభుగాత్రముతో, సమ
ముగ తపియించుచు నొగులు నాదు గా
త్రము సోకు ఉపాయము సమకూర్చుము.
                   4
కాకి కన్నొకటి పీకివేయుటకు
పచ్చని గరికెను బ్రహ్మాస్త్రముగా
విసరినకథ చెప్పితిని, చెప్పమది
పతికి జ్ఞాపకము వచ్చును తప్పక.

321


             5
పెట్టుకొన్న నా బొట్టు చెఱగిపోన్ ,
ప్రీతితో మణిశిలా తిలకంబును
చెక్కిలి ప్రక్కన చుక్క పెట్టె, ఆ
ప్రియచేష్టితము స్మరింపు మనుము హరి !
               6
ఇంద్రవరుణులకు ఈడుజోడయిన
వీరుండవు రణశూరుండపు, సీ
తను నీ పత్నిని, తలచవేల ? అప
హృతనై, రాక్షస హింసల పాల్పడ .
                7
దాచుకొంటి నీ తలమాణిక్యము
పయటలో ముడిచి ప్రాణప్రియముగ,
ఈ దుర్వ్యధల సయితము, దీనిగని
నిను చూచిన భాతిని సుఖియింతును.
             8
సిరులకు నెలవీ శ్రీ చూడామణి
రత్నాకర గర్భంబున పొడమెను,
దీనిని కూడ విభో! నీ కంపితి
బ్రతుక లేనిక దురంతదుఃఖమున.
                9
గుండెలు పగిలెడి బండతిట్లకు, భ
రింపరాని విపరీత యాతనకు,
ఓర్చి, నే బ్రతికియుంటి నీ కొఱకు;
ఈ శోకముతో నిక జీవింపను.
              10
ఒక నెల మాత్రము ఉసురులు నిలుపుదు,
శాత్రవకుల నాశక ! ఈ లోపల
దర్శన మందింప డేని విధి,
గడువు దాటు, నే విడుతు ప్రాణములు.

                   11
జాలియెఱుగని నృశంసను డీ రా
క్షసనాథుడు, కశ్మలమగు చూపుల
చూచు నన్ను; ఆలోచనలను నీ
వాలసింప, నా కాలము తీఱును.

                   12
నిష్ఠురార్తి కన్నీళ్ళు కార్చు, చతి
దీనముగా వై దేహి పలుక విని,
మనసు ద్రవింపగ మారుతి పలికెను
కరుణ కరుణముగ కంఠము రాల్పడ.

                   13
దేవీ! రాముడు నీ వియోగ దుః
ఖమున అన్నిటను విముఖుండయి కృశి
యించు అట్టులె తపించు లక్ష్మణుడు,
సత్యముతోడని శపథము చేసెద.

                   14
ఎటులో నీ విచ్చట అగపడితివి,
సమయము కాదు విషాదవేదనల,
కంతములగు నీ అష్టకష్టములు
ఇంతలోనె సీమంతిని! చూడుము.

                   15
మచ్చలేని ధర్మచరిత్రులు, బె
బ్బులలబోని నృపపుత్రు, లిద్దరును
విచ్చేసెద రిటు వేగమె నిను గన,
లంకభస్మపటలము కావింతురు.

                   16
క్రూరుడయిన రక్షోవిభు రావణు,
నాత్మబంధు యోధామాత్యులతో
హతమార్చి, విశాలక్షీ! రాముడు
నిను కొనిపోవును నిజపురంబునకు.


          17
పూతశీలవు, పునీత వీవు, దే
వీ! రాఘవునకు ప్రియమగు చిహ్నము
మఱియొకటిమ్ము సమర్పింతును, దా
నినిగని ఆనందించు నతండును.
          18
అన విని జానకి, హరివర ! అన్నియు
అరసియె, నా కేశాభరణము ని
చ్చితి, గుర్తించును పతియును దీనిని,
నామాట వినుము, నమ్ముము నీ వనె.
              19
సతిపలుకులు విని సామీరి, శిరో
మణిగొని, వంగి నమస్కరించి, గమ
నోత్సాహముతో ఒడలు పెంచసా
గెను, వినువీథి నెగిరిపోవు తమిని.
          20-21
పెరుగుచున్న బహు వేగశాలి కపి
వీరుని రూపము వీక్షించుచు, క
న్నీళ్ళచాళ్ళు నిండిన ముఖంబుతో,
మఱల పలికెసతి మందస్వరమున.
             22
హరివతంస ! సింహములవంటి రా
ఘవసోదరులను, కపిరాజును, సే
నాపతులను, వానరులను, సచివుల
నందఱిని కుశల మడిగితినను, మట.
            23
దుఃఖజలంబుల దొప్పదోగు న
న్నుద్ధరించును రఘూద్వహు డెట్టుల,
అట్టు లతని మది హత్తగ చెప్పుము,
అందుల కీవె సమర్థుడవు హరీ!




             24
దుస్సహమగు నా దుఃఖ యాతనలు,
క్రూర రాక్షసుల ఘోరబాధలును,
తొలగింపగ నేర్తువు నీ వొకడవె.
సుగమ సుఖప్రద మగును నీ పథము.
            25
రాజపుత్రి సార్థక భాషణముల
హర్షించె కపి కృతార్థుడై నటుల,
మనసు పఱచి మిగిలిన కార్యముపయి,
ఉత్తరదిక్కున కున్ముఖు డాయెను.