శ్రీ సుందరకాండ (రాయప్రోలు సుబ్బారావు)/సర్గ 18
శ్రీ
సుందరకాండ
సర్గ 18
1
పూచి అశోకతరువులు హసించు వని
పుష్పించిన తరువుల ఉద్యానము
తిలకించుచు, వైదేహి రాకకై
వేచుచుండె కపివృషభుడింతలో.
2
సాంగవేదములు చదివి, క్రతువులను
పచరింపంగల బ్రహ్మరాక్షసులు,
పలపల వేగిన వల్లెలు చెప్పెడి
వేదఘోష వినిపించె నంతటను.
3
వీనుల విందుగ వీధుల మ్రోగెడి
ప్రాతర్మంగళ వాదిత్రములను
ఆలకించుచున్. మేలుకొనె యథా
కాలంబున బలశాలి రావణుడు.
4
లేచినంతనె నిశాచరనాథుడు,
నలిగిన దువ్వలువలతో, తునిగిన
ఫూదండలతో, వేదురుపాటున
సీతనె చింతించెను స్మరియించెను.
5
మారుడేచ కామాతురుడయి, వై
దేహిమీది దుర్మోహతాపము స
హింపలేకపోయెను లోలోపల;
మదమాంనల తామసుడగు అసురుడు.
6
మేనంతయు క్రొమ్మెఱుగులు చిమ్మెడి
ఆభరణంబులు శోభిల తాలిచి,
వేగిరపడుచు ప్రవేశించెను, బహు
పుష్పఫల ద్రుమములతో వెలయుచు.
7
నిండియున్న కోనేళ్ళును, పూచిన
తరుశాఖలు సుందరముగ కనబడ,
మదవిహంగ సంభ్రమకూజితములు
ఎలుగు లీన నెల్లెడ సంకులముగ.
8
చూచుట కెంతయు సుందరంబుగా,
మణికాంచన తోరణములు భాసిలు,
వనవీధులలోపల నుండె, చమ
త్కృతములయిన పలుమృగముల ప్రతిమలు.
9
చెట్లనుండి నలుపట్లను రాలిన
పండ్లతో, విహగపంక్తులతో, అతి
సుందరమయిన ఆశోకవనంబు ప్ర
వేశించెను అసురేశుడు బిరబిర.
10
రావణేశ్వరుడు పోవుచుండగా,
వెంబడి నడిచిరి వెలదులు వందలు,
ఇంద్రుడు వెడల మహేంద్రగిరికి గం
ధర్వ దేవకాంతలు వెనుకొనుగతి.
11
కొందఱు తాటాకుల వీవనలను,
వింజామరలను విసరుచునుండిరి,
మఱికొందఱు నిమ్మళముగ బంగరు
కాగడాలుగొని సాగిరి వెంబడి.
12
ముందునడిచి రొక కొందఱు శీతో
దకసువర్ణ కుండికల నెత్తుకొని,
మడ్డుకత్తులును మద్య భాండములు
మోసుకొని వెనుకపోదురు కొందఱు.
13
త్రాగుట కింపగు ద్రాక్షాసవమును
వెలితి లేక నింపిన కనకాలుక
నొక గడితేఱిన యువతీమణి తన
కుడి చేతంగొని కులుకుచు నడిచెను.
14
మిసమిస మెఱసెడి పసిడి కామతో
పున్నమచంద్రుని వెన్నెల చిమ్ముచు,
రాజహంసవలె రాజిలు ఛత్రము
కొనివచ్చుచునుండెను వేఱొక్కతె.
15
నిద్రలు చాలక, నిశిత్రాగిన మధు
పాన మాంద్యములు వదలక నడిచిరి,
మ్రాగన్నులతో రావణు కాంతలు;
మేఘుని వెనుకొను మెఱుపుల వరుసను.
16
దండకడియములు తారుమాఱుగాన్,
కంఠహారములు కలగి చిక్కుపడ,
చెరగిన పూతల, చెదరిన కురుల, చె
మర్చిన మొగముల మదవతులుండిరి.
17
చాలని నిద్రల తూలుచు, మత్తున
బ్రమసి తిరుగు నేత్రములతో, చెమ
ర్చిన మేనులతో, చెదరిన సిగ దం
డలతో నుండిరి మెలతుక లలసత.
18
రావణుడట్టుల పోవుచుండ, వె
న్నంటి నడిచెను ప్రియాంగనాజనము,
త్రాగి, కన్నులను రక్తము జొత్తిల
కామలాలసను గౌరవంబునను.
19
వారి ప్రియుడు రావణుడు, మహాబల
శాలి, కాముని వశంబయి, సీతా
సక్త మానసము స్వాధీన మెడల,
మందుడై నడిచె మందమందముగ.
20
అప్పుడు వినబడె నచ్చట హనుమకు
ఉత్తమ కాంతల యొడ్డాణపు ము
వ్వలమ్రోతయు, అందెల కడియంబుల
గలగల రవళియు, కర్ణసుఖంబుగ.
21
ఆ కలకలమును ఆలించి, అసురు
సాటిలేని బలశౌర్యంబులు చిం
తించుచు, హారితిలకించెను రావణు
బలగములు వనద్వారము దరియగ.
22
కమ్మని నూనెల దమ్ముగ తడిపిన
వత్తులతో జాజ్వల్యమానముగ
వెలుగుచున్న దీపికల వెలుతురున
సర్వమును ప్రకాశమయం బాయెను
23
కామదర్పముల కావర మెగయగ,
త్రాగిన యేపున తరుణారుణ నే
త్రంబులు మెఱయగ, దశముఖు డగపడె,
విల్లు లేని రతివల్లభురూపున.
24
చిలికిన అమృతపు తళుకు నురుగు వలె
మకిలలేని సుకుమారదుకూలము,
జాఱి తగులుకొన సంది దండలను
పయి కొత్తును రావణుడు పలుమఱును.
25
అపుడు మహాకపి ఆకులకొమ్మల
మాటున చాటయి, మనసును చూపును
ఏకాగ్రముగ నయించి, సమీపిం
చెడిరావణు నీక్షించుచుండె హరి.
26
అటు లవేక్ష నేకాగ్రచిత్తుడయి
పరికించెడి వానర కుంజరునకు,
రూపయౌవన సురుచిర ప్రతిమలు
దశముఖుని కళత్రములు కనబడిరి.
27
సానలు పట్టిన చక్కదనపు బొ
మ్మల వలె చానలు చెలిమిచుట్టుకొన,
హరిణవిహగ సంవరణ మయిన అ
శోక వనంబును చొచ్చె రావణుడు.
28
త్రాగి ఠీవిగా, దంతపుకమ్మలు
తళుకొత్తగ, చిత్రవిభూషణములు
పెనగొను బలశాలిని, యశోవిశా
లుని, విశ్రవసు సుతుని కనుగొనె హరి.
29
సుందరాంగనా బృందము నడుమను
రాజిలుచుండగ రాక్షసేశ్వరుడు,
చూచెను కపికులసోముడు రావణు,
తారల మధ్య సుధాకరు పోలిక .
30
అనిలసుతుండు, మహాకపి అప్పుడు
“ఇతడే రావణు డింతకుపూర్వము
నగరులోన శయనముననున్న వా
డని” నిశ్చితుడాయెను తన మనమున.
31
అమిత వీర్యబలుడయ్యు మారుతి, ప్ర
చండమైన రాక్షసు తేజోద్ధతి
కులికి, నెమ్మదిగ ఒదిగి ఓరసిలె,
కొమ్మల కారాకులలో చాటుగ.
32
నల్లని కురులును నల్లని కనులును
చక్కదనాలు వెదచల్లుచున్న, సు
శ్రోణిని, సీతను చూచు తమకమున
కదియవచ్చె దశకంఠు డంతలో.