శ్రీ సాయిసచ్చరిత్రము /ముప్పదియొకటవ అధ్యాయము

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
'శ్రీ సాయిసచ్చరిత్రము' (ముప్పదియొకటవ అధ్యాయము- 5వ రోజూ పారాయణము )శ్రీ సాయిసచ్చరిత్రము ముప్పదియొకటవ అధ్యాయము ఐదవ రోజూ పారాయణము సోమవారము బాబా సముఖమున మరణించినవారు 1. సన్యాసి విజయానంద్ 2. బాలారామ్ మాన్‌కర్ 3. నూల్కర్ 4. మేఘశ్యాముడు 5. పులి


ఈ ఆధ్యాయములో బాబా సన్నిధిలో కొంతమందితోపాటు ఒకపులికూడ మరణముపొందుటను గూర్చి హేమాడ్‌పంతు వర్ణించుచున్నాడు.

మరణకాలమున మనస్సునందున్న కోరికగాని యాలోచనగాని ఆవ్యక్తి భవిష్యతును నిశ్చయించును. భగవద్గీత 8వ అధ్యాయమున 5-6 శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పియున్నాడు. "ఎవరయితే వారి యంత్యదశయందు నన్ను జ్ఞప్తియందుంచుకొందురో వారు నన్ను చేరెదరు. ఎవరయితే యేదో మరొక దానిని ధ్యానించెదరో, వారు దానినే పొందెదరు." అంత్యకాలయందు మనము మంచి యాలోచనలే మనస్సునందుంచుకొనగలమను నిశ్చయము లేదు. అనేకయంది అనేక కారణముల వల్ల భయపడి యదరి పోయెదరు. కావున అంత్య సమయమందు మనస్సును నిలకడగా నేదో మంచి యాలోచనయందే నిలుప వలెనన్నచో నిత్యము దాని అభ్యసించు టవసరము. భగవంతుని ధ్యానము చేయుచు జ్ఞప్తియందుంచుకొని యెల్లప్పుడు భగవన్నామస్మరణ చేసినచో, మరణకాలమందు గాబరా పడకుండ ఉండగలమని యోగీశ్వరులందరు మనకు బోధించుచుందురు. భక్తులు యోగులకు సర్వస్యశరణాగతి చేసెదరు. ఏలన సర్వజ్ఞులగు యోగులు దారి చూపి, యంత్యకాలమున సహయము చేసెదరని వారి నమ్మకము. ఆటువంటివి కొన్ని యిచ్చట చెప్పెదము.

1. విజయానంద్

విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానససరోవరమునకు యాత్రర్థమై బయలుదేరెను. మార్గములో బాబా సంగతి విని శిరిడీలో అగెను. అక్కడ హరిద్వారమునుంచి వచ్చిన సన్యాసియగు నోమదేవస్వామిని కలసికొనెను. మానససరోవరపు యాత్రగూర్చి వివరములను కనుకొనెను. మానససరోవరము గంగోత్రికి 500 మైళ్ళుపైన గలదని, ప్రయాణములో కలుగు కష్టములన్నిటిని అ స్వామి వర్ణించెను. మంచు యెక్కువనియు భాష ప్రతి 50 క్రోసులకు మారుననియు భూటన్ ప్రజల సంశయనైజమును, వారు యాత్రికలను పెట్టు కష్టములు మొదలగువాని జెప్పెను. దీనిని నిని సన్యాసి నిరాశచెంది యాత్రను మానుకొనెను. అతడు బాబా వద్దకేగి సాష్టాంగనమస్కారము చేయగా బాబా కోపగించి యిట్లునెను. "ఈ పనికిమాలిన సన్యాసిని తరిమి వేయుడు. వాని సాంగత్యము మన కుపయుక్తము గాదు." సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగెను. కూర్చుండి జరుగుచున్న విషయములన్నింటిని గమనించుచుండెను. అది ఉదయమున జరుగు దర్బారు సమయము. మసీదు భక్తులచే క్రిక్కిరిసి యుండెను. వారు బాబాను అనేక విధముల పూజించుచుండిరి. కొందరు వారి పాదముల కభీషేకము చేయుచుండిరి. వారి బొటనవ్రేలునుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి. కొందరు దానిని కండ్ల కద్దుకొనుచుండిరి. కొందరు బాబా శరీరమున కత్తరు చందనములను పూయుచుండిరి. జాతిమత భేదములు లేక యందరును సేవ చేయుచుండిరి. బాబా తనను కోపించునప్పటికి అతనికి బాబాయందు ప్రేమ కలిగెను. కావున నాతనికి ఆ స్థలము విడిచి పెట్టుట కిష్టము లేకుండెను.

అతడు శిరిడీలో రెండు రోజులుండిన పిమ్మ‍ట తల్లికి జబ్బుగా నున్నదని మద్రాసునుండి ఉత్తరము వచ్చెను. విసుగుచెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను. కాని బాబా యజ్ఞ లేనిదే శిరిడీ విడువ లేకుండెను. ఉత్తరము తీసికొని బాబా దర్శమునకై వెళ్ళెను. ఇంటికి పోవుటకు బాబా యాజ్ఞ వేడెను. సర్వజ్ఞుడగు బాబా, ముందు జరుగుబోవునది గ్రహించి, "నీ తల్లిని అంత ప్రేమించువాడవయితే సన్యాసమెందుకు పుచ్చుకొంటివి? కాషాయవస్త్రములు ధరించువానికి దేనియందభిమానము చూపుట తగదు. నీ బసకు పోయి హాయిగా కూర్చుండుము. ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము. వాడాలో పెక్కు దొంగలున్నారు. తలుపు గడియవేసికొని జాగ్రత్తగ నుండుము. దొంగలంతయు దోచుకొని పొయెదరు. ధనము ఐశ్వర్యము మొదలగునవి నిత్యము కావు. శరీరము శిధిలమై తుదకు నశించును. దీనిని తెలిసికొని, నీ కర్తవ్యమును జేయుము. ఇహలోక పరలోక వస్తువులన్నిటియందు గల యభిమానమును విడిచి పెట్టుము. ఎవరయితే ఈ ప్రకారముగా జేసి హరియొక్క పాదములను శరణు వేడెదరో, వారు సకలకష్టములనుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు. ఎవరయితే భక్తి ప్రేమతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరుగెత్తిపోయి సహయము చేయును. నీ పూర్వపుణ్య మెక్కువగుటచే నీ విక్కడకు రాగలిగితివి. నేను చెప్పిన దానిని జాగ్రత్తగ విని జీవిత పరమావధిని కాంచుము. కోరికలు లేనివాడవై రేపటినుండి భాగవతమును పారాయణ చేయుము. శ్రద్దతో మూడు సప్తాహములను చేయుము. భగవంతుడు సంతుష్టి జెంది విచారములను దొలిగించును. నీ భ్రమలు నిష్ర్కమించును. నీకు శాంతి కలుగును"అనిరి. అతని మరణము సమీపించినందున బాబా అతనికీ విరుగుడు నుపదేశించెను. బాబా కూడ తన దేహవసాన సమయాన మృత్యుదేవతకు ప్రీతి కలిగించే ’రామవిజయము" చదివించెను. అ మరుసటి యుదయము స్నానము మొదలగునవి యాచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లెండీ తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను. రెండు పారాయణముల చేయగనే యలసిపోయెను. వాడాకు వచ్చి రెండు దినములుండెను. మూడవ రోజు ఫకీరు (బడే) బాబా తోడపై ప్రాణములు వదలెను. బాబా ఒకరోజంతయు శవము నటులే యుంచుడనెను. పిమ్మట పోలీసువాండ్రు వచ్చి విచారణ జరిపి శవసంస్కారమున కాజ్ఞనిచ్చిరి. యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి. ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహయపడెను.

2. బాలారామ్ మాన్‌కర్

బాలారామ్ మాన్‌కర్ అను గృహస్థుడొకడు బాబా భక్తుడుగా నుండెను. అతని భార్య చనిపోయెను. అతడు విరక్తిచెంది కొడుకునకు గృహభారమప్పగించి శిరిడీకి వచ్చి బాబాతో నుండెను. అతని భక్తికి బాబా మెచ్చుకొని, అతనికి సద్గతి కలుగ జేయవలెనని యీ దిగువరీతిగ జేసెను. బాబా అతనికి 12 రూపాయలిచ్చి సతారా జిల్లాలోని మచ్ఛింద్రగడ్‌లో నుండుమనెను. బాబాను విడిచిపెట్టి మచ్ఛింద్రగడ్‍లో నుండుట అతనికిష్టము లేకుండెను. కాని యిదే అతనికి మంచి మార్గమని బాబా యొప్పించెను. అచట రోజుకు మూడుసారులు ధ్యానము చేయుమనెను. బాబామాటలందు నమ్మకముంచి మాన్‌కర్ మచ్ఛిండ్రగడమునకు వచ్చెను. అక్కడి చక్కని దృశ్యమును, శుభ్రమైన నీటిని, అరోగ్యమైన గాలిని, చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును జూచి సంతసించి, బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయమొదలిడెను. కొలది దినముల పిమ్మట యొక దృశ్యమును గనెను. సాధారణముగా భక్తులు సమాధిస్థితియందు దివ్యానుభవములను పొందెదరు. గాని మాన్‌కర్ విషయములో నట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్యదర్శనము లభించెను. అతనికి బాబా స్వయముగా గాన్పించెను. మాన్‌కర్ బాబాను జూచుటయేగాక తన నచట కేల పంపితివని యడిగెను. బాబా యిట్లు చెప్పెను. "శిరిడీలో అనేకాలోచనలు నీ మనస్సున లేచెను. నీ చంచలమనస్సుకు నిలకడ కలుగజేయువలెనని యిచటకు బంపితిని. నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి. నేనెల్లప్పుడు శిరిడీలోనె యుండెద ననుకొంటివి. ఇప్పుడు నీ విచట చూచిన నా రూపము శిరిడీలో చూచిన నారూపముతో సమానముగా నున్నదో లేదో నిర్ధారింపుము. ఇందుకే నిన్నిచటికి బంపితిని. " కొంతకాలము గడచిన పిమ్మట మాన్‌కర్ గఢమును విడచి బాంద్రాకు పయనమయ్యెను. పూనానుండి దాదరుకు రైలులో పోవలెననుకొనెను. టిక్కెట్టు కొరకు బుకింగ్ అఫీసుకు పొగా మిక్కిలి క్రిక్కిరిసి యుండెను. అతనికి టిక్కెట్టు దొరకకుండెను. లంగోటి కట్టుకొని కంబళి కప్పుకొన్న ఒక పల్లెటూరివాడు వచ్చి, "మీరెక్కడికి పోవుచున్నా"రని యడిగెను. దాదరుకని మాన్‌కర్ బదులు చెప్పెను. అతడిట్లనెను. "దయచేసి నా దాదరు టిక్కెట్టు తీసికొనుము, నాకవసరమైన పని యుండుటచే దాదరకు వెళ్ళుట మానుకొంటిని." టిక్కెట్టు లభించినందున మాన్‍కర్ యెంతో సంతసించెను. జేబులోనుంచి పైకము తీయునంతలొ నా జానపదు డంతర్థానమయ్యెను. మాన్‌కర్ ఆ గుంపులో నతనికై వెదెకెను. కాని లాభము లేకపోయెను. అతని కొరకు బండి కదులనంతవర కాగెను. కాని వాని జాడయే కానరాకుండెను. మాన్‌కరుకు కలిగిన వింత యనుభవములందు ఇది రెండవది. ఇంటికి పోయివచ్చి తిరిగి మాన్‌కర్ శిరిడీ చేరెను. అప్పటినుంచి శిరిడీలోనే బాబా పాదముల నాశ్రయించి యుండెను. వారి సలహల ననుసరించి నడుచు కొనుచుండెను. తుదకు బాబా సముఖమున వారి యాశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో యదృష్టవంతుడని చెప్పవచ్చును.

3. తాత్యాసాహెబు నూల్కర్

తాత్యాసాహెబు నూల్కర్ గూర్చి హేమడ్‌పంతు ఏమియు చెప్పియుండ లేదు. వారు శిరిడీలో కాలము చేసినారని మాత్రమే చెప్పెను. సాయిలీలా పత్రిక నుండి యీ వృతాంతమును గ్రహించితిమి.

1909 సంవత్సరములో తాత్యాసాహెబు పండరీపురములో సబ్‌జడ్జిగా నుండెను. అప్పుడు నానాసహెబు చాందోర్కరు అచట మామలతదారుగా నుండెను. ఇద్దరు చాలాసార్లు కలిసికొని మాట్లాడుచుండిరి. తాత్యాసాహెబుకు యోగులయందు నమ్మకము లేకుండెను. నానాసాహెబుకు వారియందు మిగుల ప్రేమ. అనేక పర్యాయములు నానాసాహెబు, నూల్కర్‌కు బాబా లీలలను చెప్పి శిరిడీకి పోయి వారి దర్శనము చేయుమని బలవంత పెట్టెను. తుదకు రెండు షరతులపై నూల్కర్ ఒప్పుకొనెను. అందులో ఒకటి బ్రాహ్మణవంటవాడు దొరకవలెను. రెండవది బహూకరించుటకు చక్కని నాగపూరు కమలాఫలములు దొరకవలెను. భగవత్కటాక్షముచే ఈ రెండును తటస్థించెను. ఒక బ్రాహ్మణుడు నానాసాహెబువద్దకు రాగా అతడు వానిని తాత్యాసాహెబు నూల్కర్ వద్దకు పంపెను. ఎవరోగాని వంద కమలాఫలములను నూల్కర్‌కు పంపిరి. రెండు షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబు శిరిడీకి తప్పక పోవలసి వచ్చెను. మొట్టమొదట బాబా అతనిపై కోపిగించెను. క్రమముగా బాబా యవతారపురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబు నూల్కర్కు లభించెను. కనుక నతడు బాబా యెడ మక్కువపడి తన యంత్యదశవరకు శిరిడీలోనే యుండెను. తన యంత్యదశలో మతగ్రంథముల పారాయణము వినెను. చివరి సమయములో బాబా పాదతీర్ధము అతని కిచ్చిరి. అతని మరణవార్త విని బాబా యిట్లనెను. "అయ్యో! తాత్యా మనకంటె ముందే వెళ్ళిపొయ్యెను. అతనికి పునర్జన్మము లేదు."

4. మేఘశ్యాముడు

28వ అధ్యాయములో మేఘుని కథ చెప్పితిమి. మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరు శవమువెంట వెళ్ళిరి. బాబా కూడ వెంబడించెను. బాబా అతని శవముపై పువ్వులు చల్లెను. దహనసంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్ళు కారెను. సాధారణమానవునివలె బాబా చింతావిచారమగ్నుడైనట్లు కనబడెను. శవమంతయు పులతో కప్పి దగ్గరి బంధవువలె నేడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను.

యోగు లనేకులు భక్తులకు సద్గతి నిచ్చుట విందుము. కాని బాబా గొప్పదన మమెఘమైనది. క్రూరమైన పూలికూడ వారి వలన సద్గతినే పొందెను. ఆ కథయే ఇప్పుడు చెప్పెదును.

5. పులి

బాబా సమాధి చెందుటకు 7 రోజుల ముందొక విచిత్రమైన సంగతి శిరిడీలో జరిగెను. ఒక నాటుబండి వచ్చి మసీదు ముందర అగెను. అ బండిపై ఇనుపగొలుసులతో కట్టియుంచిన పులి యుండెను. దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి యుండెను. దానిని ముగ్గురు దర్వీషులు పెంచుచు ఊరూర త్రిప్పి డబ్బు సంపాదించుకొనుచుండిరి. అది వారి జీవనోపాధి. ఆ పులియేదో జబ్బుతో బాధపడుచుండెను. అన్ని విధముల ఔషదములను వాడిరి. కాని వారి ప్రయత్నములు నిష్పలమయ్యెను. బాబా కీర్తి విని వారు దానిని శిరిడీకి తీసికొని వచ్చిరి. దానిని గోలిసులతో పట్టుకొని ద్వారమువద్ద నిలబెట్టి. దర్వీషులు బాబా వద్దకు బోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి. అది చూచుటకు భయంకరముగా నుండియు జబ్బుతో భాధపడుచుండెను. అందుచే అది మిగుల చికాకు పడుచుండెను. భయాశ్చర్యములతో ప్రజలందరు దానివైపు చూచుచుండిరి. బాబా దానిని తన వద్దకు దీసికొని రమ్మనెను. అప్పుడు దాని బాబా ముందుకు తీసికొని వెళ్ళిరి. బాబా కాంతికి తట్టుకొనలేక యది తల వాల్చెను. బాబా దానివైపు చూడగా నది బాబా వైపు ప్రేమతో చూచెను. వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివితప్పి క్రిందపడి చచ్చెను. అది చచ్చుట జూచి దర్విషులు విరక్తి జెంది విచారములో మునిగిరి. కొంతసేపటికి వారికి తెలివి కలిగెను. అ జంతువు రోగముతో భాధపడు చచ్చుటకు సిద్దముగా నుండుటచే నది బాబా సముఖమున వారి పాదములవద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మపుణ్యమే యని భావించిరి. అది వారికి బాకీపడి యుండెను. దాని బాకీ తీరిన వెంటనే యది విమోచనము పొంది బాబా పాదములచెంత ప్రాణములు విడిచినది. యోగుల పాదములకడ వినమ్రులై ప్రాణములు విడుచువారు రక్షింపబడుదురు. వారెంతో పుణ్యము చేయనిదే వారి కట్టి సద్గతి యెట్లు కలుగును?


శ్రీ సాయినాథాయ నమః ముప్పదియొకటవ అధ్యాయము సంపూర్ణము

సమర్ద సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు శుభం భవతు