Jump to content

శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/7వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

7వ అధ్యాయము.

గురువు.

176. ఎవరికియెవరుగురువు? భగవంతుడొక్కడుమాత్రమే దాఱిచూపగలవాడు. అతడే జగద్గురువు.

177. తనగురువును మనుష్యమాత్రునిగ ఎంచునతడు ధ్యాననిష్ఠవలన ఏమిఫలమును పొందగలడు? మన గురువులను మనుష్యమాత్రులనుగ ఎన్నతగదు. శిష్యునకు భగవత్సాక్షాత్కారమగుటకు పూర్వము, బ్రహ్మజ్ఞానోదయకాలమున గురువుమొదట దర్శనమిచ్చును. పిమ్మట విచిత్రముగా తానే భగవత్స్వరూపము దాల్చి, శిష్యునకు భగవత్సాక్షాత్కారమును ప్రసాదించును. అప్పుడు గురువును, దైవమును, అభేదమని శిష్యుడుగ్రహించును. శిష్యుడుకోరు వరములనెల్ల ఈశ్వరరూపమునుదాల్చిన గురువే వానికొసగును. ఇంతేల, గురువే పరమానందపదవియగు నిర్వాణమునకు సయితము వానినిచేర్చును. లేదా భగవంతుడు ధ్యేయమూర్తిగాను తాను ధ్యాతగను భావస్ఫురణను నిలుపుకొనగోరు నరుడు అట్టిద్వైతభావముతోడను ఉండవచ్చును. అతడు దేనినికోరుకొనినను గురువుదానిని వానికి ప్రసాదింపగలడు.

178. శిష్యుడు గురువును యెన్నడును ఆక్షేపణచేయతగడు. గురువు ఎట్టినియమముచేసినను శిష్యుడు సంసిద్ధముగ విధేయుడై నిర్వహించవలయును. వంగభాషలో ప్రతీతముగ నిట్లుచెప్పుదురు:- "నాగురుడు కల్లుకూటములకు పోవుగాక. అయినను అతడు నాకు నిత్యానందప్రభువే."

"నాగురువు త్రాగుబోతులయొక్కయు, పాపులయొక్క మూకల చేరుచుండుగాక, అయిననుగూడ ఆతడు నాకు వినిర్మల నిష్కళంక గురుమూర్తియే సుడీ?"

179. "గురువులు వందలుగను వేలుగను దొఱకగలరు; కాని శిష్యుడు ఒక్కడుదొఱకుట దుర్లభము" అను సామెత కలదు. అనగా మంచినీతులు చెప్పువారు చాలమందికలరు; కాని వానిని ఆచరించువారు అరుదు అని దీనిభావము.

180. గురువు అను సంధానకర్త ప్రేయసీప్రియులను కూర్చు దూతవలె, గురువు నరుని భగవంతునితో చేర్చును.

181. ఒకడు తనగురువుయొక్క వర్తననుగురించి వివాదపడుచుండుటచూచి శ్రీపరమహంసులవారు యిట్లు మందలించిరి:- ఇట్టి వ్యర్ధపువాదనలతో నీవేల కాలము వృధాచేయుచున్నావు? ముత్యమును తీసుకొని ముత్యపుచిప్పను పాఱవేయుము. నీకు గురువు ఉపదేశించిన మంత్రమును పునశ్చరణముచేయుము. ఆగురునిదోషములయొక్క విచారణను వదలివేయుము. పొమ్ము!

182. మనకు ఏదేని బోధించినవారినెల్ల గురువు లనుకొనకుండ, ప్రత్యేకము ఒకరిని గురువు అనిచెప్పుకొనుటకు అవసరమేమి? నీవు పరదేశమునకు పోవునప్పుడు దాఱితెలిసిన ఒకమార్గదర్శిని నమ్ముకొనవలయును. అటులగాక అనేకుల సలహాలను అనుసరించితివా గందఱగోళమున చిక్కిపోవు దువు. అటులనే బ్రహ్మమును చేరగోరుదువేని, బ్రహ్మవేది అగు ఒక్కగురుని బోధనే నమ్ముకొని పూర్ణముగ విధేయుడవై నడువవలయును.

183. గాఢమగు ధ్యానము, నిశ్చలవిశ్వాసము తీవ్రవేదనముకలిగి బ్రహ్మమును చేరబోవునతనికి గురువు అవసరము లేదు. కాని అటువంటి తీవ్రహృదయావేదన కల్గుట చాల అరిది. కావునగురువుయుండుట అవసరము. గురువు ఒక్కడుగనే యుండవలెను; ఉపగురువులు పెక్కండ్రు ఉండిన యుండవచ్చును. మనము ఎవనియొద్ద యేమినేర్చినను అతడు యుపగురువు అనబడును. అవధూతస్వాములవారికి యిరువది నల్గురు గురువులుండిరట.

184. అవధూతస్వాములవారొకసారి డోళ్ళు, సన్నాయి, బాకాలు మొదలగు వాద్యవిశేషములతో పెండ్లివారు ఒక డొంకత్రోవనుపోవుట గాంచిరి. ఆఉత్సవము పోవుచున్న డొంకకు చేరువనే పొంచియుండి యొకపక్షిపై గుఱిపెట్టుచు, ఆవాద్యఘోషను లక్ష్యపెట్టక, ఒకసారియైనను వారివైపు కన్నుత్రిప్పక తదేకదృష్టి నిలిపియున్న బోయవానిని చూచినారు. అవధూతలవారు వానిని సమీపించి చేతులు జోడించిమ్రొక్కి "అయ్యా, మీరు నాకు గురువులు, నేను ధ్యానములో కూర్చుండు సమయమున, మీమనస్సు ఆపిట్ట పైన ఏకాగ్రమైనవడువున, నామనస్సుధ్యేయమూర్తిపైని ఏకాగ్రమైనిలుచునట్లు చేయుడు" అనిరి. 185. ఒకడు చెఱువులో గాలమువేసి చేపలుపట్టుచుండెను. అవధూతలవారు వానిదగ్గఱకుపోయి "అన్నా! కాశికి త్రోవయెద్ది?" అని యడిగిరి. నీటిపైని బెండు అప్పుడే చేప యొకటి ఎఱను పట్టబోవునట్లు సూచన తెలుపుచుండెను. కాబట్టి ఆమనుష్యుడు మారుపలుకక తదేకదృష్టిలో నుండి పోయెను. చేప గాలమునకు తగుల్కొనినపిమ్మట యతడు వెనుకకుతిరిగి "అయ్యా, మీరడుగుచుండినదియేమి?" అని విచారించినాడు. అవధూతలవారు వానికి నమస్కారముచేసి "అయ్యా మీరు నాకు గురువులు. నేను పరమాత్మధ్యానము చేయుచు కూర్చుండుసమయమున, నేనుమీపోల్కిని అనసరించి నాధ్యానము ముగియువఱకును, యితరమును లక్షించ కుండునటుల చేయుడు." అనివేడిరి.

186. కొంగఒకటి నెమ్మదిగా నీటికడకునడచుచు చేపను పట్టబోవుచుండెను. దానివెనుకనే బోయవాడు కొంగపైని గుఱిపెట్టి బాణమువేయజూచుచున్నాడు. కొంగకు ఆస్పృహయే లేదు. అవధూతులవారా కొంగకు మొక్కి "నేను ధ్యానమున కూర్చుండుసమయమున నీవలెవర్తించి నావెనుక యెవరుండిరో యేమిజరుగుచుండెనో అని తిరిగి చూడకుందును గాక." అని పలికిరి.

187. గ్రద్ద ఒకటి ముక్కున చేపనుకఱచుకొని యెగిరి పోవుచుండెను. అనేకములగు కాకులును, ఇంక గ్రద్దలును, గీపెట్టుచు దానివెంటబడి, ముక్కులతోపొడుచును, ఆచేపను లాగికొన ప్రయత్నించుచున్నవి. అది యేదిశకుపోయినను కాకు లును, గ్రద్దలును, వెంటాడుచునేయున్నవి. విసిగెత్తిపోవ, ఆగ్రద్ద తనముక్కునయున్నచేపను విడచివేసినది. వెంటనే యింకొకగ్రద్ద దానిని ముక్కునకఱచుకొనినది. తక్షణమే యాకాకులును, గ్రద్దలును అప్పుడు చేపనుకఱచుకొనిన గ్రద్దవైపుతిరిగి దానిని వెంటాడసాగినవి. మొదటిగ్రద్ద ఏబాధయు లేకుండ ఒక చెట్టుకొమ్మమీదచేరి శాంతముగ కూర్చున్నది. అదినిశ్చలముగను శాంతముగను కూర్చుండుటను కాంచి అవధూతలవారు దానికి నమస్కరించి "నీవు నాకు గురువు. 'ఓగృధ్రరాజమా! మానవుడు తానుపూనుకొను సంసారకాంక్షలభారమును ఎంతకాలమువిడువడో అంతకాలమును ఆతడు సంసారబాధలనుండి తప్పించుకొని నెమ్మదిని పొందజాలడని నాకు బోధించితివి సుమీ! అనిరి.

188. ఈశ్వరరహస్యములను తెలిసికొను తీవ్రవేదన నీకు కలిగినయడల, ఆయనయే నీకడకు సద్గురువును పంపగలడు. ఓభక్తవరా! గురువును వెదకికొనుటకై నీవుశ్రమపడుట అవసరముండదు.

189. శ్రీగంగానదిలో ముఱికినీళ్లను, పెంటలను, అన్నింటిని పడవేయుచున్నారు. కాని దాని పవిత్రత తగ్గిపోవుటలేదు. గురువు గంగాభవనీవంటివాడు. దూషణములు తిరస్కారములు వానిని అంటజాలవు.

190. గురునిందవాక్యములను నీవు వినబోకుము. అతడు నీజనకునికంటెను, జననికంటెను, ఉత్తముడు. నీయెదురుగా నీతల్లిని, నీతండ్రిని తిట్టినచో నీవు ఊరకుందువా? అవసర మగునెడల దెబ్బలాడియైనను నీగురువుయొక్క గౌరవమును సంరక్షించుము.

191. మానవరూపగురుడు చెవిలో మంత్రమును ఉచ్ఛరించును. శివరూపగురుడు నీహృదయమున ఆత్మప్రభోదమును కావించును.

ద్వి|| మంత్రంబు చెవినూదు మానవగురుడు
      ఆత్మలో ముద్రించు నలశివగురుడు.

192. సముద్రమున అడుగుననుండు ముత్తెపుచేప స్వాతినక్షత్రము మింటనుండగాపడు వానచినుకును నోటపట్టుకొనుటకై పైకివచ్చునని కధచెప్పుదురు. అని చెప్పనుతెఱచుకొని స్వాతిబిందువుకొఱకై నీటిమీద తేలుచుండునట. ఒకచుక్క నోటపడగానే నీటమునిగి అడుగునకుపోయి ఆవానచినుకును ముత్యముగా మార్చువఱకును అటనుండి కదలదందురు. అదేతీరుస కొందఱు ముముక్షువులు[1] తమకొఱకై ముక్తిద్వారముల తెఱచిపెట్టగల మంత్రవాక్కును ఉపదేశించగల సద్గురువు కొఱకై ఎల్లెడల సంచారములు చేయుచుందురు. అట్టి సద్గురువు లభించి మోక్షద్వారములతెఱచు మహామంత్రమును ఉపదేశించునంతటి అదృష్టము పట్టినతోడ్తోడనే, సంగమును వీడి హృదయ గుహయందుచేరి" నిత్యానందప్రాప్తి కలుగువఱకును అందే నిలిచియుందురు. 193. అటువంటి సద్గురువు పండితుడుగా కాన్పించకున్నను శాస్త్రగ్రంథములను పఠించినవాడు కాకున్నను, అలజడి చెందకుము. ఆతనికి పుస్తకజ్ఞానమేలేకున్నను భీతినందకుము. ఎన్నడును భయసంశయముల పొందకుము. జీవనప్రజ్ఞానమున వానికికొదువలేదు. పుస్తకమువలన లభించుజ్ఞానమును మించు సాక్షాత్కారమువలన లభించిన దివ్యజ్ఞానసంపద వానికడ అనంతముగా ఉండును సుమీ!

194. చదరంగపు ఆటను ఆడువారికికంటె చూచువారికి సరియైనఎత్తులు గోచరించుచుండును. సంసారులు తామెంతయు తెలివితేటలు కలవారమని తలంచుచుందురు. కాని ధనము, గౌరవము, యింద్రియసుఖములు మొదలగు లౌకికవిషయములందు చిక్కుకొనిపోదురు. ఆటలోప్రవేశించియున్న వారి వలెను సరియైన ఎత్తునుగ్రహించనేలేరు. సంసారముల త్యజించినస్వాములు చిక్కులులేనివారు. చదరంగపుఆటను పైగానుండి చూచువారిని పోలియుందురు. సంసారులకంటె విషయములను వీరు చక్కగా విచక్షణచేయగలరు. కావున నిజమౌ పుణ్యజీవనమును నడపజూచువారు, భగవధ్యానశీలురగునట్టియు బ్రహ్మవేదులగునట్టియు మహానీయులమాటలనే నమ్ముకొనవలయును. నీకు వ్యాజ్యసంబంధమైనసలహా కావలసినప్పుడు ఆవృత్తి చేయు న్యాయవాదికడకేగదా పోవలయును! దాఱినిపోవు ఎవనిసలహానైనను సరియేయని నీవు గ్రహించతగదు గదా! 195. ప్రకృతిశాస్త్రము ఖండజ్ఞానమును మాత్రమే ఒసగగలదని ప్రజలు గ్రహించలేకున్నారు. ఆఖండరాజ్యమునుండి దానిద్వారమున సందేశము లభింపజాలదు. అటువంటిసందేశమును పురాణఋషిసత్తములవంటి బ్రహ్మద్రష్టలు మాత్రమే తేగల్గిననారు. "భగవల్లక్షణములు యిటువంటివి" అని పలుకుటకు వారికి మాత్రమే అధికారము కలదు.




  1. మోక్షమునుగూర్చి వాంఛించువారు.