శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/5వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

5వ అధ్యాయము.

భగవంతుడు — జీవుడు

154. బ్రహ్మముమాత్రము సత్యము; వానివ్యక్తరూపములగు జీవజగత్తులు అసత్యములు - అనిత్యములు.

155. మాయాబంధయుతజీవుడు నరుడు; బంధరహితుడు ఈశ్వరుడు.

156. ప్రకృతిలోని పంచభూతముల సంగమున జిక్కిన బ్రహ్మము బాధితుడగును.

157. జీవాత్మ పరమాత్మలకుగల సంబంధమెటువంటిది? ప్రవాహమునకడ్డముగా బల్లనొకదానిని నిలిపినయెడల, అందలి జలము రెండుగాచీల్చబడినట్లు అగపడును. అటులనే మాయోపాధివలన అద్వైతబ్రహ్మము ద్వైతమైగోచరించును. యదార్థమునకు రెండులేవు, ఒక్కటియే.

158. జలమును బుద్బదమును ఒక్కటియే. బుద్బుదము (బుడగ) నీటిలోనెపుట్టుచున్నది, నీటిలోనెతేలుచున్నది. తుదకానీటిలోనె అడగుచున్నది. అదేతీరున జీవాత్మయు పరమాత్మయు ఒక్కటియే. అంశభేదముమాత్రము కలదు. ఒకటి ఖండము, రెండవది అఖండము, ఒకటి పరతంత్రము, రెండవది స్వతంత్రము.

159. చమురులేక దీపమువెలుగనిరీతిని, నారాయణుడు లేక నరుడు జీవింపజాలడు. 160. ఇనుమునకును నూదంటురాతికినిగల సంబంధమే నరునకును , నారాయణునకును గలదు. అటులయ్యును నరుడు నారాయణునిచేత ఆకర్షింపబడడేమి? దుమ్ములోపూడి పడియున్న ఇనుము సూదంటురాతిచేత ఆకర్షింపబడనివడువున మాయచేత దట్టముగకప్పబడియున్న నరుఁడు నారాయణుని చేత ఆకర్షింపబడుటలేదు. నీటితోకడిగి దుమ్మునుతొలగించిన యెడల ఇనుమునకు ఆఠంకముతీరి సూదంటురాతిచేతఆకర్షింపబడును. అటులనే నరుని ఇహాలోకమున నంటిపట్టియుంచు మాయామలమును పశ్చాత్తాపముతోగూడిన ప్రార్థనలచే పొరలివచ్చు కన్నీటితోకడిగివేసినయెడల అతడు నారాయణునిచేత ఆకర్షింపబడును.

161. బ్రహ్మము అనంతుడు; జీవుడోపరిమేయుడు. ఈపరిమేయుడు అనంతుని యెఱుంగజాలుటెట్లు? అట్టిప్రయత్నము ఉప్పుబొమ్మ సముద్రపులోతును కనుగొనజూచుటను పోలియుండును. ఆప్రయత్నమున ఉప్పుబొమ్మ సముద్రపునీటిలో కఱిగి నాశముచెందును గదా? అటులనే జీవుడుగూడ బ్రహ్మమును పరిశీలించి తెలిసికొనవలయునను ప్రయత్నమున తానుభిన్నమను జ్ఞానమునే కోల్పోయి బ్రహ్మము నందు లయముచెందును.

162. జీవాత్మపరమాత్మల ఐక్యత గడియారమునందలి చిన్నముల్లును, పెద్దముల్లును. గంటకొకతడవ కలియుటవంటిది. ఆరెండును పరస్పరము సంబంధముగలవై, ఒకదానిపై నొకటి ఆధారపడి నడచును. సాధారణముగా వేర్వేఱై యున్నను అనుకూలావకాశములు పొసగినప్పుడెల్ల కలియుచుండును.

163. ఒకటికి సున్నలుచేర్చుచుపోగా, దానివిలువ నెంతగానైనను పెంచవచ్చును. ఆఒకటితొలగెనా, ఎన్నిసున్నలున్నను విలువయుండదు. అదేవిధమున అద్వితీయుడైపఱగు బ్రహ్మము నంటియుండనంతవఱకును జీవునకు విలువయుండదు. సమస్తమునకును బ్రహ్మముతోడి సంబంధముచేతనే విలువ ఘటిల్లుచున్నది.

164. అట్లే ఒకటినిబోలుబ్రహ్మమును అంటియుండి తన కర్మలన్నింటిని బ్రహ్మముకొఱకుగానె నిర్వహించుచుండునంతవఱకును జీవుడు క్రమాభివృద్ధి గాంచుచుండును. అందుకు మారుగా యతడు బ్రహ్మమును నిర్లక్ష్యభావముతోజూచి, తానుగావించు కృత్యములనేకమును ఘనకార్యములుగ గణనచేయుచు, సర్వమును తనగణ్యతకొఱకే పఱగునట్లెంచుకొనెనా, అందువలన అతనికి ప్రయోజనముండజాలదు.

165. నారాయణుడే నరరూపమున లీలలుసలుపుచుండును. అతడు యింద్రజాలికుడు; జీవజగత్తులనెడు ఈవిచిత్రజాలమెల్ల వానిఇంద్రజాలమే. జాలకుడొక్కడే సత్యము. జాలము మిధ్య అగు గదా!


____________