శ్రీ రామకృష్ణ సూక్తిముక్తావళి/27వ అధ్యాయము

వికీసోర్స్ నుండి

27వ అధ్యాయము.

ఆత్మావలోకనదశ.

550. ప్రశ్న:- సమాధిదశయందు మనస్సుయొక్క స్థితి ఎటుండును?

జవాబు:- కొంతసేపు నీటివెలుపల నుంచబడిన చేప తిరిగి నీటవిడువబడినప్పుడు, ఎట్టిఆనందమును అనుభవించునో, అట్టి స్థితిలో నుండును.

551. పరుశువేదిని తాకిన ఉక్కుకత్తి బంగారుగ మారును. అప్పుడు దాని ఆకారము మారకున్నను ఉక్కుకత్తివలె దేనిని ఛేదింపజాలదు. ఆతీరుననే భగవత్పాదారవిందముల తాకిన మనుజుని పైరూపుమారకున్నను, అత డేదుష్ట కార్యమును చేయనోపడు.

552. అది ముందుకు వెనుకకు పోవుచుండుస్థితి. నీవు పరబ్రహ్మమునకై మరలిపోవుదువు; నీవ్యక్తిత్వము ఆబ్రహ్మభావమున కలిసిపోవును; అదియే సమాధి: ఆపిమ్మట నీవు తిరుగుముఖము పెట్టుదువు. నీవ్యక్తిత్వమును నీవుపొంది, నీవు మొదట ప్రస్థానము (ప్రయాణము) సాగించిన తావునకు వచ్చి చేరుదువుకాని నీఆత్మ అల పరమాత్మనుండి పుట్టినదే యనియు, ఆయేకైక సత్పదార్ధమునుండియే ఈశ్వరుడు, నరుడు, ప్రకృతి అనునవి అంశరూపమున పుట్టునవనియు తెలిసిపోవును. కాబట్టి నీవా రూపాంతరము లందొక్కదాని తత్వమును గట్టిగ పట్టుకొంటివా నీవన్నింటి తత్వమును ఎఱింగిన వాడవగుదువు.

553. సమద్రమునమునిగియున్న సూదంటురాతికొండ దానిపైగపోవు ఓడను ఆకర్షించి, దానియందలి యినుపమేకుల నన్నింటిని లాగివేయును. అంతట ఓడచక్కలన్నియు, ఒక దానినుండి యొకటి సడలిపోయి, ఓడసముద్రమున మునిగిపోవును; అటులనే భగవంతుని ఆకర్షణశక్తి అనగా విశ్వచైతన్యశక్తి జీవాత్మను ఆకర్షించునప్పుడు, ఒక్కక్షణములో నరుని వ్యక్తిత్వభావమును స్వార్ధపరతయు రూపుమాయును. అంతటజీవాత్మ భగవంతుని అనంతప్రేమజలధియందుమగ్నమై పోగలదు.

554. పాలునీటితోచేరినప్పుడు సులభముగా దానితో కలిసిపోవును. ఆపాలనే వెన్నగామార్చుము. అప్పుడది నీటిలో కలిసిపోక దానిపై తేలియాడును. అదేవిధముగ జీవాత్మఒక్కసారి బ్రహ్మభావనను పడసెనా, అది నిరంతరము, అనుక్షణము, అనేకములగు ప్రబోధశూన్యములగు జీవాత్మలతో కలిసియుండుగాక, ఆదుస్సాంగత్యము దానిని చెరుపజాలదు.

555. క్రొత్తగా కాపురమునకువచ్చిన యువతి గృహకృత్యములందు గాఢముగమునిగియుండును; అటులుండుటఆమెకు పుత్రుడొకడు పుట్టువఱకే. ఆమెకుపుత్రోదయము కాగానే, సామాన్యపు యింటిపనులనన్నింటిని ఆమె విడిచివేయును. వాని యందామెకు ఉత్సాహముండదు. అందుకుమారుగా ఆమె తనబిడ్డను దినమంతయు లాలనసేయుచు, ఆనందముతో ముద్దులాడుచు నుండును. ఈతీరుగ, పామరత్వమున నున్న మనుజుడు నానావిధకర్మలను జేయుచు దీరికలేకుండును. కాని వాని హృదయములో ఈశ్వరసాక్షాత్కారమైన తోడనే వానికిఆకర్మకలాపమునఆనందముండదు. ఇప్పుడతడు సదా భగవత్సాక్షాత్కారము ననుభవించుచు, వాని యిచ్చను పాలించుచు మురియుచుండును. వానికింక ఏయితర వ్యాపారమునందును సంతోషము కలుగదు. ఆదైవసంసర్గముయొక్క ఆనంద పారవశ్యమును పోగొట్టుకొన నిష్టపడడు.

556. కప్పపిల్లయొక్క తోక రాలిపోయినపిమ్మట, అది నీళ్ళలోను మెట్టమీదనుకూడ నివసించగలదు. భ్రాంతిగొలుపు అజ్ఞానమను తోకరాలిపోయిన మనుజుడు ముక్తుడగును. అంత నాతడు భగవంతునిలోను లోకములోను భేదములేక యుండగలడు.

557. యూదియా జాతివారు ఏసుక్రీస్తును శిలువపైని మేకులతో బంధింపజేసినప్పుడు, తాను అత్యంతబాధానుభవమునందుండియు, ఏసుక్రీస్తు "వారుక్షమింపబడుదురుగాక"యని ప్రార్ధించగల్గుటకు హేతువేమి;

పలుగుతోగ్రుచ్చి లేతకొబ్బరికాయ పెచ్చుతీయునప్పుడు, పలుగు దానికొబ్బరిలోనికి కూడ దూరిపోగలదు. కాని కురిడీకాయ లోనికొబ్బరి, చిప్పనుండివేఱుపడియుండి, పలుగుచే చిప్పపగిలినను లోని కురుడీ హానిచెందకయుం డును. ఏసుక్రీస్తు కురిడీకాయవంటివాడు; వానిఆత్మ వాని స్థూలశరీరమునుండి విడిపోయినది. కాబట్టి వానిస్థూలశరీరబాధ వానిని అంటలేదు. గ్రుచ్చిగ్రుచ్చి వానిశరీరమున మేకులు కొట్టినను, ఆయన పరమశాంతముతో శత్రువులక్షేమముకొఱకై ప్రార్ధన చేయగల్గినాడు.

558. ఈప్రపంచములో అయిదురకముల సిద్ధులు కాన్పించుచున్నారు.

(1) స్వప్నసిద్ధులు:- కలలయందు సుబోథముపొంది పరిపూర్ణతను పడసినవారు.

(2) మంత్రసిద్ధులు :- ఏదేని పవిత్రమంత్రోపాసన మూలమున సిద్ధత్వము నందినవారు.

(3) హఠాత్సిద్ధులు:- ఆకస్మికముగా గొప్పధననిధిని కనుగొనియో లేక శ్రీమంతురాలిని పెండ్లియాడియో ధనికుడయిన పేదవానిబోలి తటాలున పూర్ణత్వమును పొందినవారు ఇట్లు అనేకులు పాపులుయేదోతీరునహఠాత్తుగ పావనులై దేవరాజ్యముంజేరుదురు.

(4) కృపాసిద్ధులు:- ఈశ్వరానుగ్రహ ప్రాప్తిచేత పరిపూర్ణులగువారు. ఒకడు అడివిని నఱుకుచుండగా వానికొక ప్రాచీనసరోవరమో లేక భవనమో కాన్పించుననుకొనుడు. అతడికిబాధలుపడికష్టములకోర్చి వానిని నిర్మాణము చేసికొను యవసరముండదుగదా! ఆతీరుననే అదృష్టవశమున తామేమియు ప్రయత్నముచేయకయే పూర్ణజ్ఞానులగుట కలదు. (5) నిత్యసిద్ధులు:- పుట్టువుతోడనే సిద్ధులై యుండువారు. సొర గుమ్మడి మున్నగుతీగెలందు పూమొగ్గలు విచ్చుటకు పూర్వమే పిందెలుకానవచ్చును. అటులనే నిత్యసిద్ధులు పరిపూర్ణులయియే జన్మింతురు. సిద్ధత్వముంగూర్చి వారుచేయు నటుల కాన్పించుసాధనలన్నియు, మానవజాతికి ఆదర్శముం జూపుట కొఱకుమాత్రమే అగును.

559. ప్రశ్న:- సిద్ధిపొందినపురుషుడు పొందుస్థితియెట్టిది?

జవాబు:- (నరుడుసాధించు పరిపూర్ణతను, బాగుగవండినకాయకూరలస్థితిని సిద్ధిఅనవచ్చును - శ్లేషాలంకారమునకు అవకాశముగలదు)

చిలుగడదుంపగాని, వంకాయగాని, సిద్ధినిపొందినప్పుడు (అనగా చక్కగా ఉడికినప్పుడు) మెత్తబడిగుజ్జువలె నుండును. అటులనే సిద్ధినిపడసినపురుషుడు, (అనగా పూర్ణత్వమును పొందినమనుజుడు) నిండునమ్రతయు, సాధుత్వమును కలిగియుండును.

560. పాదరసముగల పాత్రలో పడవేసిన సీసపుముక్క దానిలో కఱగిపోవునటుల వ్యష్టిజీవాత్మ బ్రహ్మసాగరమున బడినప్పుడు తనప్రత్యేకతను విడిచివేయును.

561. ధ్యానినిష్ఠయందుండి, పక్షులుతనజూట్టులో గూండ్లు కట్టినను తెలియజాలనంతగా స్మృతివిడిచిన యతనికి ధ్యానసిద్ధి లభించినదనవచ్చును. 562. ప్రశ్న:- సమాధిఅవస్థయందు దృశ్యప్రపంచజ్ఞానము (పరమహంసులవారికి) ఉండునా?

జవాబు:- సముద్రములోపల గుట్టలు, పర్వతములు, గుహలు, లోయలు, కలవు కాని అవి పైకికానరావు. అటులనే సమాధి అవస్థయందు యతివిశాలమగు సచ్చిదానంద మహాసాగరము కానవచ్చును. వ్యక్తిజీవభావము దానిలో అణగిపోయి అవ్యక్తరూపమున నుండును.

563. ప్రశ్న:- దేవుడు నరుని హృదయమున ప్రవేశించుచో సూచనలెటులుండును?

జవాబు:- అరుణకాంతులు సూర్యునిరాకను ముందుగ సూచించు విధాన, స్వార్ధత్యాగము, అమలత్వము, సచ్ఛీలము అనునవి స్వామిరాకను ముందుగ తెలుపును.

564. రాజు సేవకునియింట విందారగింపబోవుచో, తన భాండారములనుండియే. ఆసనములు, అలంకారములు, భోజ్య పదార్థములు, సమస్తమును ముందుగ సేవకుని యింటికి పంపును. అప్పుడు సేవకుడు తనస్వామికి తగినటుల మర్యాదలుచేసిగౌరవించును. అట్లేభగవంతుడు రానున్నప్పుడు ముందుగనె భక్తిని, గౌరవమును, విశ్వాసమును, సద్భక్తుని హృదయమునందు ముందుగప్రవేశపెట్టును.

565. పరుశవేదితాకున బంగారముగ మారినయినుమును నేలలో పాతిపెట్టవచ్చును. లేదా పెంటకుప్పలో పాఱవేయవచ్చును. అది బంగారుగనే నిలిచియుండునుగాని పూర్వపు స్థితికిమారదు. ఒక్కనారియైననుసరియే పరమేశ్వరుని పాదారవిందములు సోకిన నరునిదశ అటులుండును. ఆతడు లౌకిక వ్యవహారాడంబరములోనున్ననులేక అడవులందు ఏకాంతముగనున్నను వానికి ఏకళంకమును అంటబోదు.