శ్రీ భ్రమరాంబాష్టకమ్

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

రవిసుధాకర వహ్నలోచన రత్నకుండల భూషిణీ
ప్రవిమలంబుగ మమ్మునేలిన భక్తజన చింతామణీ
అవనిజనులకు కొంగు బంగారైన దైవశిఖామణీ
శివుని పట్టపురాణి గుణమణి శ్రీగిరిభ్రమరాంబికా

కలియుగంబున మానవులకును కల్పతరువై యుండవా
వెలయగను శ్రీశిఖరమందున విభవమై విలసిల్లవా
ఆలసింపక భక్తవరులకు అష్టసంపదలీయవా
జిలుగు కుంకుమ కాంతి రేఖల శ్రీగిరిభ్రమరాంబికా

అంగవంగ కళింగ కాశ్మీరాంధ్ర దేశములుందునన్
పొంగుచును వరహాట కొంకణ పుణ్యభూములయందునన్
రంగుగా కర్ణాటనాట మారాటదేశములుందునన్
శృంగిణీదేశముల వెలసిన శ్రీగిరిభ్రమరాంబికా

అక్షయంబుగ కాశిలోపల అన్నపూర్ణభవానివై
సాక్షిగణపతి గన్నతల్లివి సద్గుణావతి శాంభవీ
మోక్షమొసగెడు కనకదుర్గవు మూలకారణశక్తివీ
శిక్షజేతువు ఘోరభవముల శ్రీగిరిభ్రమరాంబికా

ఉగ్రలోచన నటవధుమణి కొప్పుగలిగిన భామినీ
విగ్రహంబుల కెల్ల ఘనమైవెలయు శోభనకారిణీ
అగ్రపీఠమునందువెలసిన ఆగమార్థవిచారిణీ
శీఘ్రముగనే వరములిత్తువు శ్రీగిరిభ్రమరాంబికా

నిగమగోచరణీయ కుందన నిర్మలాంగి నిరంజనీ
మిగుల చక్కని పుష్పకోమలి మీననేత్రదయానిధీ
జగతిలోన ప్రసిద్ధికెక్కిన చంద్రముఖి సీమంతినీ
చిగురుటాకులవంటి పెదవుల శ్రీగిరిభ్రమరాంబికా

సోమశేఖర పల్లవాధరి సుందరీమణిధీమణీ
కోమలాంగి కృపాపయోనిధి కుటిలకుంతలయోగినీ
నామనంబున బాయకుండుమ నగకులేశుని నందినీ
సీమలోన ప్రసిద్ధికెక్కిన శ్రీగిరిభ్రమరాంబికా

భూతనాథుని వామభాగము పొందుగా చేకొంటివా
ఖ్యాతిగను శ్రీశైలమున విఖ్యాతిగానెలకొంటివా
పాతకంబుల బారద్రోలుచు భక్తులను చోకొంటివా
శ్వేతగిరిపై వెలసినట్టి శ్రీగిరిభ్రమరాంబికా

ఎల్లవెలసిన నీప్రభావము విష్ణులోకమునందునన్
పల్లవించెను నీదుభావము బ్రహ్మలోకమునందునన్
తెల్లముగ కైలాసముందున మూడులోకములందునన్
చెల్లునమ్మత్రిలోకవాసిని శ్రీగిరిభ్రమరాంబికా

కరుణశ్రీగిరి మల్లికార్జున దైవరాలభామినీ
కరుణతోమమ్మేలు మెప్పుడుకల్పవృక్షముభంగినీ
వరుసతో నీఅష్టకంబును వ్రాసి చదివినవారికీ
సిరులనిత్తువునెల్లకాలము శ్రీగిరిభ్రమరాంబికా