శ్రీ దత్త దర్షనము

వికీసోర్స్ నుండి

1. బాల్యము[మార్చు]

  1.జననము

శ్రీమన్నారాయణుని నాభికమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించి సకల లోకాలను సృష్టిచేయడం ప్రారంభించాడు. ఆయన వేద ప్రబోధితుడై పూర్వకల్పానుసారంగా క్రమంగా పదునాల్గు లోకాలను, అనంత జీవరాశులను సృష్టి చేసాడు. ఆ జీవరాసులన్నింటికి తలమానికంగా, మనస్సు ప్రధానంగా కలిగిన మానవ జాతిని ఆయన సృష్టి చేయదలచుకొని మొదటగా మానససృష్టిని ప్రారంభించాడు. అట్టి బ్రహ్మమానసపుత్రులే మరీచి, అత్రి, అంగీరసుడు, వశిష్ఠుడు మొదలుగా గల సప్తర్షులు. వీరుగాక అనేకులు మహితాత్ములు ఆయనకు మానస పుత్రులుగా జన్మించారు. అంతే గాక, ఆయన అవయవలన్నింటినుండి ప్రత్యేకంగా పుత్రులుద్భవించారు. ఆయన నీడలోనుండి తపస్వి శ్రేష్ఠుడయిన కర్దమ ప్రజాపతి పుట్టాడు. ఇలా అనేక విధాలుగా మానససృష్టిని కొనసాగిస్తున్న బ్రహ్మగారికి ఈ అంతులేని సృష్టిక్రియా విధానం శ్రమకరంగా తోచింది. అప్పుడు వేదమాత ఆయనకు సాక్షాత్కరించి, స్త్రీపుంసయోగోద్భవాత్మకమైన సృష్టిరచనా సూత్రాన్ని ఉపదేశించింది. అప్పటినుంచి గార్హస్థ్య ధర్మానుకూలంగా, సృష్టి అంతా తనంత తానుగా వృద్ధిపొంది విస్తరించే విధానంలో, ఆయన తన సృష్టిక్రమాన్ని కొనసాగించసాగాడు. ఆసృష్టికి నాందిగా, ఆయన శరీరపు దక్షిణభాగం నుండి స్వాయంభువ మనువు అనే పురుషుడు, వామ భాగంలోనుంచి శతరూప అనే స్త్రీ దంపతులుగాఉద్భవించారు. ఆ ప్రప్రథమ మానవ పుణ్యదంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు కలిగారు. పుత్రికలకు పెళ్ళీడు వచ్చేసరికి ఆ స్వాయంభువ మనువుకు తగిన అల్లుళ్ళను వెతుక్కోవడం పెద్దపని అయింది. ఆయన తన పెద్దకూతురు ఆకూతిని బ్రహ్మమానసపుత్రులలో ఒకడయిన రుచి మునికి ఇచ్చి వివాహం చేశాడు.

       రెండవ కూతురు దేవహూతి వివాహం ఆయనకు మరింత చిక్కైకూర్చున్నది. ఎంత ఆలోచించినా రూప శీల వివేకాలలో అద్వితీయ అయిన తన రెండవ కూతురికి తగిన వరుణ్ణి నిర్ణయించడం ఆయనకు చాల కష్టమైపోయింది. చివరకాయన బ్రహ్మగారితో యోచించి మహితాత్ముడైన కర్దమప్రజాపతి దేవహూతికి తగిన వాడని నిర్ణయించుకున్నాడు.
    అయితే అప్పటికి ఆ కర్దముడు సిద్దాశ్రమంలో బహు తీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉన్నాడు. మనువుగారు బ్రహ్మచోదితుడయి, తన కూతురిని తీసుకెళ్ళి, సిద్దాశ్రమములోనే కర్దమ ప్రజాపతికిచ్చి వివాహం చేసి మరల వచ్చేశాడు. ఆ తరువాత బహువర్ష సహస్రాలపాటు సుతీవ్రమైన తపశ్చర్యలో మునిగి ఉండిపోయిన భర్తను దేవహూతి కంటికి రెప్పలాగా కాచుకొని, అద్వితీయమైన భక్తితో సేవించింది. 
    సాటిలేని ఆమె పాతివ్రత్యానికి, సపర్యలకు కర్దమ ప్రజాపతి ఒకనాడు కరుణించి కరగిపోయినాడు. అప్పుడాయన భార్య అభిప్రాయాన్ని గ్రహించి, తక్షణమే తన సంకల్పబలంతో అద్భుత భవంతులను, దాసదాసీజనాన్ని, ఒక దివ్య విమానాన్ని సృష్టించటమే కాకుండా, తానే స్వయంగా తొమ్మిది ఆకారాలువహించి భార్యతోనిస్సంగంగా క్రీడించాడు.
అప్పుడా పుణ్యదంపతులకు కల, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఊర్జ్య, చితి, ఖ్యాతి అనే తొమ్మండుగురు పుత్రికలు కలిగారు. ఆ పైన శ్రీమన్మహావిష్ణువు కపిలుడనే పేరుతో వారికి పుత్రుడై   ఉద్భవించాడు.
బ్రహ్మగారి మానససృష్టి నిరంతరాయంగా సాగిపోతోంది. అది రోజురోజుకి మూడు పువ్వులు,  ఆరు కాయలుగా, తామర తంపరగా విస్తరిస్తోంది. కాని, క్రమక్రమంగా జనులు గృహస్థధర్మం పేరిట, గ్రామ్యసుఖాలపట్ల, ఇంద్రియ సుఖాలపట్ల లాలసత్వం జూపుతూ, అంతర్ముఖత్వానికి దూరులౌతూ, ఆత్మతత్వాన్ని ఏమరుతున్న లక్షణాల బీజాలు అప్పటికే ఆయన సూక్ష్మదృష్టికి గోచరమయినాయి. 

ఆయన కది చాలా వేదనా హేతువయింది. ఆయన చాలా తీవ్రంగా ఆలోచించాడు. మహోత్తమమయిన తపోరాశులను ముద్దచేసిన మహాపుణ్యనిధియైన లోకోద్ధారక గురుమూర్తి అవతరించడం ఒక్కటే యీ సమస్యకు శాశ్వతపరిష్కారం కాగలదని ఆయన నిశ్చయించుకున్నాడు. అంతేకాక, మహోత్తమ మహితాదర్శభూత మయిన దాంపత్యజీవనం ఎలా వుంటుందో లోకానికి చూపించడం కూడా మంచిదని ఆయన నిశ్చయించుకున్నాడు . వెనువెంటనే ఆయన కర్దమ ప్రజాపతి పుత్రికలలో రెండవదీ, సమస్త సద్గుణాలలోను అద్వితీయురాలూ అయిన అనసూయను తన మానసపుత్రులలో ద్వితీయుడూ, బ్రహ్మవేత్తలలో అద్వితీయుడూ అయిన అత్రి మహర్షికిప్పించి వివాహం చేయించాడు. “నాయనా ఈ గార్హస్థ్యంతో నీవు నా సృష్టికి సహాయం చెయ్యి” అని ఆయన అత్రి మునిని శాసించాడు. ఆ పుణ్యదంపతులు అనేక వేల దివ్యవర్షాలపాటు తపోమయమైన, నిర్దుష్టమైన, అద్భుతావహమైన, అనన్యమైన, అకామోపహతమైన దాంపత్యజీవితాన్ని గడిపారు.

ఆహా! ఆ దంపతుల తపోమహిమ ఎంతటి దన వచ్చును? 
అత్రి మునీంద్రుడు ఋగ్వేదంలోని శాకలశాఖాపంచమ మండలాన్నితన తపోమహిమచే దర్శించగలిగాడు. ఆ వేదభాగంలో అగ్నిలింగ స్తుతి, అమరేంద్ర ప్రస్తావన మొదలైన అంశాలుండడంవల్ల అది ఐహికాముష్మికాలు రెంటినీ నిరుపద్రవముగా సాధించగల సామర్థ్యంకలది. 

ఒకప్పుడు, కృతయుగంలో రోగాలు పెచ్చు పెరిగి ప్రాణి లోకానికి హాని అవుతూవుంటే, ఆ మహానుభావుడే ఆయుర్వేదమనే ఉపవేదాన్ని దర్శించాడు. మరొక్కప్పుడు, మనుప్రణీతమైన ధర్మశాస్త్రం దురవగాహంగా ఉందని ప్రజలు చింతిస్తూ ఉంటే, తేట తేట మాటలతో తానే స్వయంగా ఒక స్మృతిని సంతరించాడు. మరొకప్పుడు, దేవదానవ యుద్ధంలో సూర్యచంద్రులు శత్రువులకు బందీలయిన కారణంగా లోకం అంధకారమయం కాగా, దేవతల ప్రార్థనలవల్ల ఆ మహానుభావుడు తానే సూర్యుడు, చంద్రుడు కూడా అయి లోకాలకు వెలుగులను విరజిమ్మాడు. అట్లా ఆయన చేసిన,అద్భుత విశ్వహితకృత్యాలను ఎన్నింటిననిమనం చెప్పగలం! ఇక అద్వితీయ పాతివ్రత్యరూపమహాద్భుత తపః పరమావధియైన ఆ అనసూయామాత చేసిన మహత్తర కృత్యాలకు సాటేలేదు. ఒకప్పుడు, ఎండలు విపరీతమయి గంగానది ఎండిపోతే, ఆ తల్లి మునిజనుల సౌకర్యార్థమై తాను ఆనదిని పునరుజ్జీవింపచేసింది. మరొక్కప్పుడు, మహాక్షామం సంభవించి నేలలో మొలకన్నది లేకుండామాడిపోతే, ఆమె అనేక సహస్ర సంఖ్యాకులయిన మునిజనులను నిరంతరంగా కందమూలాలను సృజించి పోషించింది. వేరొకప్పుడు, పాపరతులయిన జనుల స్పర్శవల్ల గంగాదేవి తన పవిత్రతనుకోల్పోయి నల్లబడి పోగా, ఈ తల్లి తన కమండలోదకాన్ని ప్రోక్షించి గంగాదేవి కాలుష్యాన్నంతా క్షణంలోభస్మీపటలం చేసింది. ఇలాంటి మహా కార్యాలెన్నో చేసింది. అంతటి పుణ్యదంపతులయిన ఆ అనసూయాత్రులు ఆదర్శప్రాయమైన దాంపత్య జీవితాన్ని అనేక వేల సంవత్సరాలు గడిపారు. కాని, తనసృష్టిక్రియకు సహాయం చేయండని బ్రహ్మగారు చేసిన ఆజ్ఞమాత్రం అలాగే ఉండిపోయింది. అది ఆదంపతులకు సహించరానిదయింది. మరయితే అది అంత తేలిక పని కాదు. అందువల్ల తచ్చక్తి సంపాదనకై అత్రిమహాముని భార్యా సహితుడయి నిర్వింధ్యానదీ తీరాన, ఋక్షాద్రి శిఖరాల మీద, అత్యంత సమహర్హమైన ప్రదేశంలో, బహుఘోరమైన తపస్సు ప్రారంభించాడు. ఒంటికాలిమీద గరుడాసనములో నిల్చి, ప్రాణాయామ విధానంతోమనసును బంధించి, వాయుభక్షణ చేస్తూ, సంపూర్ణంగా నూరేళ్ళపాటు నిర్వికల్పసమాధిలో మునిగి తపస్సు చేశాడు. ఇతరుల కసాధ్యమైన ఆ తపశ్చర్యలో ఆయన సమస్త త్రిపుటులను అతిక్రమించడంవల్ల,దేవర్షిగణాలాయన్ని అత్రి, అత్రి అని సార్థకంగా కీర్తించసాగాయి. భర్త అలాంటి ఘోరమైన తపశ్చర్యలో మునిగియుండగా, అనసూయా మహాసాధ్వి తత్తుల్యమైన నియమాలను స్వచ్ఛందంగా స్వీకరించి, ఆయనకు తపోవిఘ్నాలు కలగకుండా కంటికిరెప్పలాగా కాపా డుతూవుంటే, ఆయన చరిత్ర త్రిలోకాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అపూర్వమైన ఆ ప్రాణాయామము వల్ల మహర్షి శరీరంలో ఒక మహాగ్ని వెలసింది. ఆ అగ్ని ఆయన బ్రహ్మకపాల రంధ్రంలో నుంచి ధూమ్రవర్ణ మహాజ్వాలగా వెలువడసాగింది. ఆ జ్వాలలు అనతి కాలంలోనే ముల్లోకాలను ఆవరించి దహించివేయసాగినాయి. అప్పుడు లోకరక్షణ దీక్షితులయిన త్రిమూర్తులు ఈ తపస్సు తీవ్రతను చూసి పరమానందపడి,దేవర్షి గణ సేవ్యమానులై తరలి వచ్చి, అత్రి మునీంద్రుని ఎదుట సాక్షాత్కరించారు. ముమ్మూర్తుల మూడురంగుల పెను వెలుగులు మనోవీథిని మిరుమిట్లుకొలుపగా,మనోనయన దుస్సహమయిన ఆ వెలుగుల తీవ్రతకు నెవ్వెరపడి తొట్రుపడిన మునీంద్రుడు ఎట్లెట్లోతెప్పరిల్లి, సమాధిచాలించి, కనులు తెరచి చూచే సరికి, ఎదురుగా - హంసవాహనుడైన బ్రహ్మ, గరుడవాహనుడైన విష్ణువు, వృషభ వాహనుడైన మహేశ్వరుడు ఎరుపు, నలుపు, తెలుపు రంగుల కాంతుల నెగచిమ్ముతూ, మందహాస మధుర ప్రసన్నవదనులై సాక్షాత్కరించియున్నారు. మహర్షి మహానందభరితుడై, సాష్టాంగదండప్రమాణాలాచరించి, దోసలి ఒగ్గి, కనులలో ఆనందబాష్పాలు దొరలుతూవుండగా, ఆనందవశాన కంఠం డగ్గుత్తిక పడుతూవుండగా, ఆ ముమ్మూర్తులను స్తోత్రం చేసాడు. “తత్త్వమూర్తివయిన ఓ పరమేశ్వరా, నీకు నమస్కారములు. నీవు స్వయంగా నిర్గుణుడివి. సాక్షిమాత్రుడివి. మాయాగుణాలయిన రజస్సత్వతమస్సులను లీలగా అవలంబించి, బ్రహ్మవిష్ణుమహేశ్వరులనే మూడు రూపాలను భక్తానుగ్రహార్థమై స్వీకరిస్తూవుంటావు. ఆయా రూపాలతో సృష్టి స్థితి సంహారాలను చేస్తూ వుంటావు. ఓ ఆదిపురుషా! నామ రూపాతీతుడ వయిన, అద్వితీయుడవయిన నీకు నమస్కారము. పుత్రార్థినైన నేను, నిన్నుఒక్కడిగానే ధ్యానించాను. ఆహా దేవా నీ కరుణ ఎంతటిదో! మాబోటి అల్పుల ఊహకైనా అందరాని దివ్యతేజస్సులను వెలారుస్తున్న, ఈ మూడు రంగుల దివ్యరూపాలతో నాకు సాక్షాత్కరించావు. నన్ననుగ్రహింప వచ్చావు. ఏమి నా అదృష్టము! ఓ త్రిమూర్తులారా! మీకు నమస్కారము. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా మీకు నమస్కారము.” త్రిమూర్తులు మునీంద్రుని భక్తితత్పరతకీ, తత్వతత్పరతకీ కూడా సంతోషించి ఇలాఅన్నారు: “మునీంద్రా! నీవు సత్యాత్మకుడివి. కనుక నీ సంకల్పము కూడా సత్యమే. అది ఎప్పటికీ వ్యర్థము కానేరదు. మరి నిర్గుణ పరతత్వం ఏకమే అయినా, నీవు త్రిగుణాధారంగా ఆతత్వాన్ని ధ్యానించావు కదా మరి. ఆ నిర్గుణతత్వం సగుణమయ్యేసరికి మూడు మూర్తులు ఏర్పడక తప్పదు కదా! కనుక, మా మా అంశలతో నీకు పుత్రుని ప్రసాదిస్తాము. మునీంద్రా! నీవు భక్తిభావంతో మాకు ఆత్మార్పణం చేసుకున్నావు. మేము నీ యందలి ప్రేమాతిశయముచేతా, నీ తపో మహత్వం చేతా, మమ్మల్నిమేము నీకు ఆత్మదానం చేసుకొంటున్నాము. మేము నీకు దత్తులము. నీకు కలగబోయే సంతతి వల్ల నీ ఆశయం సంపూర్ణంగా నెరవేరుతుంది. నీకుశుభమగుగాక”

ఈ విధంగా వరాలిచ్చి ఆ త్రిమూర్తులదృశ్యులయ్యారు. వెనువెంటనే ఆ పుణ్యదంపతుల ఎట్టఎదుట, ముద్దులు మూటగట్టే బాలమూర్తి ఒకటి ప్రత్యక్షమైనది. ఆ బాలుడికి మూడు శిరస్సులున్నాయి. ఆరు చేతులున్నాయి. నడుమున పీతాంబరము వుంది. మెడలో దివ్యహారాలున్నాయి. ముంజేతుల బంగరు మురుగు లున్నాయి. ముల్లోకాలను మోహపరచగల ముత్యాల నవ్వులున్నాయి. లోగన్నుల తెరిపించగల దివ్య కాంతులున్నాయి. 
ఆ బాలుని చూచేసరికి దంపతులిద్దరికీ మేనంతా పులకలెత్తింది. ఆనందం పొంగుకు వచ్చింది. భక్తిభావం వరదలైంది. ఆ బాలుడు చేతులు చాచి, అమ్మా! నాన్నా! అని పిలిచాడు. మునిదంపతుల హృదయకుహరాలలోని వాత్సల్యగ్రంథులు జలదరించి నట్లయింది. 

కాని వరదలై ఉన్న భక్తిభావం వాత్సల్యాన్నిముంచివేసింది. ఇటు వాత్సల్యంలో, అటు భక్తిలో ఉయ్యలలూగుతూ, తటపాయిస్తూ, నిలిచియున్న ముని దంపతులను చూచి లీలాబాలుడు ముగ్దమనోహరంగా నవ్వాడు.

అమ్మా!  నాన్నా! మీ భావం తెలిసింది. పవిత్రమైన మీ కడుపున పుట్టే భాగ్యంకోసం నేను కూడా ఉవ్విళ్ళూరుతున్నాను. అలా జన్నించి, బాల క్రీడలతో మీ వాత్సల్యాన్ని తనివితీరేలాగా నేను మీకు పుత్రత్వాన్ని పొందుతాను. చెప్పానుకదా, నేను మీకు దత్తుణ్ణి. కొంచెం కాలం ప్రతీక్షించండి. అని ఇలాగ మళ్ళీ వరమిచ్చి ఆలీలాబాలుడంఏతర్థానమయ్యాడు.
ఆ విధముగాసిద్దార్థులయిన మునిదంపతులు ఆనందమగ్నులయి, దండకారణ్యసమీప భూములలో ఉన్న తమ ఆశ్రమపదానికి మరలి వచ్చి, శిష్యగణసేవితులై తమ నిత్యతపశ్యర్యలలో ఆనందంగా కాలం గడపసాగారు.

కొనగోటి చినుకులు ఇలా ఉండగా ఒకనాడు నారదమునీంద్రుడు వచ్చి, అనసూయాత్రుల మహత్వాన్ని వేనోళ్ళ పొగడి, తనదగ్గరున్న శనగలను సాతాళించి పెట్టమని అనసూయామాతను ప్రార్థించాడు. అవి ఏ శనగలో గాని ఇనుపగుళ్ళ లాగా ఎంతకీ ఉడకలేదు. కాని, అనసూయా మాత సంకల్పబలంతో అవి అవలీలగా మ్రగ్గి క్రమంగా సువాసన లీయసాగాయి. నారదముని మహానందభరితుడై శలవు తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. ఒకరోజున, మధ్యాహ్నవేళ, అత్రి మునీంద్రులు స్నానానికై నదికి వెళ్ళిన సమయాన ఎవరో ముగ్గురు ముని యువకులు అభ్యాగతులై ఆశ్రమానికి వచ్చారు. వారు తీవ్రమైన ఎండలో బహుదూర ప్రయాణం చేసినందువల్ల నిస్త్రాణతో సోలిపోతున్నారు. ఎండిన పువ్వులులాగా ముగ్గురూ వ్రేలాడిపోతున్నారు. “అభ్యాగతః స్వయం విష్ణుః” అనే ధర్మసూత్రానికి బద్ధురాలవటమే కాక, వారిని చూచిన దగ్గరినుంచి అపూర్వమైన వాత్సల్యంతో తడిసిముద్దయి పోతున్న అనసూయామాత వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం చెయ్యమంది. తమకు చాలా కఠిన నియమములు ఉన్నాయనీ, అవన్నీ నిస్సంకోచంగా పాటిస్తానని మాట యిస్తేనే తాము ఆథిత్యాన్ని అంగీకరించగలమనీ, వారు నిర్మొహమాటంగా చెప్పారు. వాత్సల్యపూరితయైన ఆ తల్లి వెంటనే అంగీకరించి విస్తళ్ళలో భోజనం వడ్డించింది. తీరా విస్తళ్ళముందు వచ్చి కూర్చున్నాక, ఆ ముని యువకులు తమకామె వివస్త్రయై ఆపోశన వడ్డిస్తే తప్ప తాము “అమృతమస్తు”అనమన్నారు. ఇదివారి నియమమట.

అనసూయామాత నివ్వెరపోయింది. బిత్తరపోయింది. దిమ్మెరపోయింది. వణికిపోయింది. అవాక్కయిపోయింది. అతిథులను, ఆకలిగొన్నవారిని, తాపసులను, పుణ్యమూర్తులను ఆరాధించటమా? ఈ రాక్షస నియమధారులను పాపులని వెళ్ళగొట్టడమా? ఆలోచించేందుకు వ్యవధి లేదు. వారప్పుడే కోపగించుకొని, విస్తళ్ళ ముందునుంచి లేచిపోతున్నారు.

చిరకాల నియమాలవల్ల పదునుతేరిన ఆమె మనస్సు అప్రయత్నంగా పతిని ధ్యానించింది. వెంటనే ఆమెకొక ఆలోచన మెరుపులా మెరసింది. ఆతల్లి కొనగోటి నీళ్లు ఆ ముని యువకుల శిరస్సులపై తక్షణం చిందులాడినై. అంతే! మరుక్షణంలో మునియువకులు ముగ్గురూ ముద్దులొలికే పసికందులైపోయారు. ఆ ముద్దుబిడ్డలను చూచిన తక్షణమే అనసూయామాతకు రొమ్ములలో పాలు ధారలు కట్టినై, ప్రేమ వరదలై పొంగింది. ఒళ్లు తెలియని ఆనందావేశములో, ఆ తల్లి ముద్దుబిడ్డలను ముగ్గురిని ఒకేసారి ఒడికెత్తుకొని, పాలిచ్చి పరవశించిపోయింది. ఆ పైన వారిని ఉయ్యాలలో వేసి, జోలపాటలు పాడి నిద్దరూపసాగింది. నదినుంచి తిరిగి వచ్చి అత్రిమునీంద్రుడీ అనూహితమైన సంతానప్రాప్తికి ఆశ్చర్యానందమగ్నుడైయ్యాడు. ఆశ్రమ పదనివాసులయిన మునిదంపతులంతా కూడా ఆ ముద్దుకూనల తేజోవిషేషాన్ని చూచి, ఆశ్చర్యపరవశులయి, అనసూయామాత మహత్వాన్ని వేనోళ్ళ స్తుతించారు. ఆపిల్లల బాల్య క్రీడలలో మునిదంపతులకు కాలం తెలియకుండా గడచిపోతోంది. ఆ పిల్లలే వారికి లోకమైపోయారు. వారి లాలనలే వారికి తపశ్చర్యలైపోయినాయి. అలా కొంత కాలం గడచింది. మునిదంపతుల ఆనందానికి మేర లేకుండా వుంది. ఒక రోజున హఠాత్తుగా ముగ్గురమ్మలు, లక్ష్మి, పార్వతి, సరస్వతులు వారి ఆశ్రమానికి విచ్చేశారు. మునిదంపతులు వారి రాకకు సంతోషించి అర్ఘ్యపాద్యాదులిచ్చి అర్చించారు. కాని ఆ తల్లుల ముఖాలలోని దీనత్వాన్ని చూచి వీరికి లోలోన బెరుకుగా తోచసాగింది.

	సముచిత మర్యాదలన్నీ అయిన తరువాత ఆ జగన్మాతలు ముగ్గురూ అనసూయామాత ఎదురుగా కొంగుచాచి, మాకు పతిభిక్ష పెట్టమని దీనంగా యాచించి, కళ్ళనీళ్లు క్రుక్కుకున్నారు. ఆ తల్లికి విషయం అర్థం కాలేదు. పైగా యీ అనూహిత విచిత్ర పరిస్థితిలో ఆమెకు మనస్సు మొద్దు బారినట్టయింది. ఎలాగో మనస్సు కుదుటపరచుకొని అసలు విషయం ఏమిటని మాత్రం ప్రశ్నించగలిగింది.

ముగ్గురమ్మలు మెల్లమెల్లగా అసలు విషయం బైటపెట్టారు. ఋక్షాద్రిపై తపస్సు ఫలించాక ఈ మునిదంపతుల కీర్తి ముల్లోకాలకు పాకిందట. అందులోనూ అనసూయామాత పాతివ్రత్య వైభవం లోకోత్తరంగా విఖ్యాతమైందట. ఒకనాడు నారదమునీంద్రులు వచ్చి ముగ్గురమ్మలసమక్షంలో అనసూయామాత మహాసాధ్వి, సాధ్వీత్వమహత్వం అద్వితీయం, అనుపమానమని మైమరచి కీర్తించసాగాడట. చిత్రమేమోగాని ముల్లోకాలకు కన్నతల్లులైన ఆ ముగ్గురమ్మలకు సామాన్య మానవమాత్రురాలి ప్రశస్తి అసూయాహేతువైనదట. తమ ఎట్ట ఎదుట మరొకతె అంత పెద్దచేసి కీర్తింపబడుట వారికి దుస్సహమైందట. దాంతో వారామెను పరాభవించాలనే ఉద్దేశ్యంతో ఇనుప శనగలను సృష్టించి నారదుని చేతికిచ్చిపంపించారట. అనసూయామాత చేతిలో అవి అవలీలగా మ్రగ్గిపోగా ఆ తల్లుల మనసులు మాడి మసిబొగ్గులే అయినాయట. నారదుని ఎదుట తమకు జరిగిన ఈ పరాభవం భరింపరానిదై వారు పట్టుబట్టి ఈమారు స్వయంగా తమ భర్తలనే అనసూయామాతను పరీక్షించి ఓడించేందుకు పంపించారట. వారే ముని కుమారులై వచ్చిఆ తల్లిచేతుల్లో పసికందులై, ఇప్పుడు వారి యింటి ధూళిలో కేరింతలాడుతున్నారట! అదీ అసలు జరిగినకథ! కనుక అనసూయామాత ఒడిలో కేరింతలాడుతున్న ముద్దుకుర్రలే ముగ్గురయ్యలు. వారినే యాచిస్తున్నారు ముగ్గురమ్మలు. అది విని అనసూయామాత మ్రాన్పడిపోయింది. తోటి ముని జనులంతా ముగ్గురయ్యలనే ముద్దు బిడ్డలను చేసుకోగలిగిన ఆ తల్లి అద్భుత మహత్వాన్ని లోలోన వేనోళ్లా కొనియాడుతున్నారు. అత్రి మునీంద్రుడు గంభీరంగా నిలబడిపోయాడు. ప్రాణాధికంగా పెంచుకుంటున్న పసివాళ్ళను వదలిపెట్టడం ఆ దంపతులకు తమ గుండెలను కోసి యివ్వటమే అయింది. అయినా ముగ్గురమ్మల దైన్యాన్ని చూచి, ముల్లోకాల హితాన్ని చూచి, ధర్మప్రకృతిని చూచి, ఆ తల్లి గుండె రాయిచేసుకొని, తన పిల్లలకు యథార్థరూపాలను ప్రసాదించి ముగ్గురమ్మలకు ఇచ్చివేసింది. ఆమహత్తర కార్యానికి దేవర్షిగణాలు మహానందపడి పుష్పవృష్టులు కురిపించి, ఆ దంపతులను అనేక రీతులుగా స్తుతించినాయి. చేతికందిన సంతానం చూస్తూండగనే చేయి దాటిపోగా, ఈ తల్లికిమాత్రం హృదయంలో చెప్పరాని వెలితి ఒకటి గూడుకట్టి నిలచిపోయింది. అయినా వారి తపః కార్యక్రమాలు యథాప్రకారంగా సాగుతూనే ఉన్నాయి. చాలాకాలం గడిచింది. కాలానికి మానని పుండుండదు కదా! క్రమంగా మునిదంపతుల హృదయాలలోని దిగులు సన్నగిల్లిపోయింది. వారి తపస్సులు నిరాఘాటంగా సాగిపోతున్నాయి. సుమతి అలా ఉండగా ఒకనాటి రాత్రి ఎప్పటిలాగానే నిద్దుర లేచి సూర్యోదయానికై ప్రతీక్షిస్తున్న ముని జనుల కానాడెంతసేపటికీ సూర్యోదయం కాకపోవడంతో ఆందోళన బయలుదేరింది. మునిజనులంతా వచ్చి అనసూయాత్రుల చుట్టూ చేరి బిక్కు బిక్కుమంటూ కూర్చుండిపోయారు. లోకంలో అకాల మహోపద్రవలక్షణాలు కనిపించసాగాయి. చూస్తుండగానే సుమారు పది రోజులు కాదగ్గకాలం ఆ సుదీర్ఘ తమోమయ రాత్రిలోనే గడచిపోయింది. ఈ ఉపద్రవాన్నీ, తల్లక్షణాలనీ విమర్శించి చూస్తున్నకొలదీ లోక హితకరులైన మునీశ్వరుల హృదయాలలో తొట్రుపాటు చెలరేగసాగింది. “ఇది యెందువల్ల వచ్చింది? ఎవరు దీనికి కారకులు?” అని వారంతా ఆలోచించసాగారు. అంతలో సమస్త దేవదేవర్షి గణ పరివృతుడైన దేవేంద్రుడు దీనవదనంతో యెట్టయెదుట సాక్షాత్కరించి, అనసూయాత్రుల పాదాలకు సాష్టాంగవందనం చేసి, దోసిలియొగ్గి, “ఈ ఘోరవిపత్తునుంచి ముల్లోకాలను నీవే రక్షించాలి తల్లీ. అన్యథా శరణం నాస్తి”అని అనసూయామాతను ప్రార్థించాడు. అసలు విషయమేమిటో తెలుపమని శాసించిన మునిదంపతుల కాదేవేంద్రుడు దీర్ఘంగా నిశ్వాసించి దీనంగా మనవి చేయసాగాడు.“భగవన్నత్రిమునీంద్రా!భగవతి అనసూయామాతా! తమరు దయవహించి సావధానంగా వినండి. ప్రతిష్ఠానపురంలో కౌశికుడనే బ్రాహ్మణుడున్నాడు. అతడు విద్వాంసుడే అయినా, పూర్వకర్మవల్ల దురభ్యాసపరుడై క్రమంగా క్రూరమైన కుష్ఠువ్యాధికి గురి అయ్యాడు. అమ్మా, అతని పుణ్యమంతా అతని భార్య రూపంలోఅతనిని వెన్నంటిందనిపిస్తోంది. ఆ సాధ్వి పేరు సుమతీదేవి. ఆ పేరు ఆమెకే తగును. అమ్మా, నీముందు మరొకరిని పెద్దచేసి పలుకరాదు. కాని ఆహా! ఆతల్లి పేరు నిద్రలేచి తలచుకుంటే చాలు, మానవులకు సకల సద్గతులూ లభించడం తథ్యమని సత్యలోకంలోని దివ్యర్షులు కీర్తిస్తున్నారు. ఆమె తన భర్తను దైవంకన్న మిన్నగా ఆరాధిస్తుంది. కుష్ఠురోగంతో ఒళ్ళంతా కుళ్ళి, పుచ్చి పురుగులు లుకలుకలాడుతున్న ఆ పాడు బ్రాహ్మణ్ణిచూచి ఆమె అసహ్యించుకోదు సరికదా, ఆమె కంటి కతడు అత్యంత ప్రియదర్శనుడుగా కనిపిస్తాడు. ఇక ఆమె చేసే సపర్యఆశ్చర్యకరంగా ఉంది. అతని పుళ్ళని ప్రతిరోజూ గంగాజలంతో కడిగి, తుడిచి, కట్లుకట్టి, కాళ్ళుపిసికి,విసనకర్రతోవిసిరి, కమ్మని కబుర్లు చెప్పి, అనుక్షణం సేద తీరుస్తూనే ఉంటుంది. మనసుకు ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది.మలమూత్రశ్లేష్మాలు ఎత్తిపోస్తుంది. చీము నెత్తురులోడే కురుపులను అనుక్షణంతుడిచి, మందులు రాచి, ఈగలు వ్రాలకుండా జాగ్రత్త చేస్తుంది. ఇంతెందుకు, తల్లి కాదుకదా, కంటిని రెప్పకూడా ఆమె భర్తను రక్షించుకున్నంత శ్రద్ధగా రక్షించుకోదు. తన ఇంట వెలసిన అదృష్టదేవతలాగా తన భార్య తన్నింతగా సేవిస్తూఉంటే,ఆ క్రూరాత్ముడు ఆమెననుక్షణం ఏదో ఒకనెపం మీద కసురుకుంటూనే ఉంటాడు. దెప్పిపొడుస్తూనే ఉంటాడు. తిట్టిపోస్తూనే ఉంటాడు. చురచుర చూస్తాడు. గుడగుడ గొనుగుతాడు. రుసరుసలాడుతాడు. వుండివుండి ఒళ్ళు హూనమయ్యేలాగా కొడతాడు. ఇన్నిచేసినా, ఆ చల్లని తల్లికి మనసు చెదరదు. ఆమె మారు మాటలాడదు. ఎదురు తిరుగదు. ఆగము చేయదు. ఏడవదు. తప్పెత్తిచూపదు. సరికదా అనునయిస్తుంది. తనదే తప్పంటుంది. అనటమే కాదు. అనుకుంటుంది. బ్రతిమాలుతుంది. ప్రియంగా మాట్లాడుతుంది. మొత్తానికి భర్తను శాంతపరచి సంతుష్టుణ్ణి చేస్తూవుంటుంది. ఇది రోజూ జరిగే గోలే. అయినా ఆమెకు విసుగులేదు. శ్రమ అంతకుముందే లేదు. ఇలా ఉండగా ఒకనాడు ఆమె భర్తకు స్నానం చేయించి, పంచలో మంచంమీద పడుకోబెట్టి, ఇంటిపనులు చేసుకోవడం కోసం లోపలికి వెళ్ళింది. వీడి కప్పటికే కుష్ఠుముదిరి,వ్రేళ్ళు వ్రేలాడి, కీళ్ళు బిగిసి, తనంతతానుగా కదిలే స్థితి పోయింది. నడుము విరిగిన గొడ్డులాగా కుక్కిమంచంలో పడివుండి, కళ్ళప్పగించి వీథిలో ఇటు అటు పోయేవారిని చూస్తూవున్న ఆ దౌర్భాగ్యుడికి దారిన పోతున్న ఒక వేశ్యాయువతి కంటపడింది. అమ్మా! నీ దగ్గర యిలాంటి దుష్కథలెత్త రాదు. కానీ, మన్మథుడికి ఉచ్చనీచాలు లేవు. క్షుద్ర మనస్కులకు కార్యాకార్యాలు లేవు. అది కాక మంకుతనమన్నది కౌశికుడి రక్తంలో జీర్ణించి ఉంది. వాడెంతో ప్రయత్నించి కూడా తన పుర్రెలో పుట్టిన ఈ పురుగును పారద్రోలలేక పోయాడు. చివరకు గత్యంతరంలేక తన భార్యకే తన కోరికను వ్యక్తం చేసాడు. అది విని ఆ తల్లి బిక్కచచ్చిపోయింది. ఆమెకు తాను సగం చచ్చినట్టనిపించింది. ఏంచేయాలి? భర్త స్థితి అలా వుంది. అతని కోరికేమో ఇలా వుంది. అతడన్నం ముట్టనంటున్నాడు. ముఖం ముడుచుకొని కూర్చున్నాడు. ఆమె కతని సంగతి పూర్తిగా తెలుసు. వాడికొకటి పుట్టనేరాదు. పుట్టిందా దాన్ని తిప్పటం బ్రహ్మతరం కాదు. సరే, దైవంమీద భారం వేసి, ఆమె అతడి కోరిక తీరుస్తానని, చీకటి పడనిమ్మని వాగ్దానంచేసి, బతిమాలి, ఒప్పించి అన్నం తినిపించింది. చీకటి పడ్డది. కౌశికుడు తొందరపడ్డకొలదీ పొద్దు నిదానంగా గడచింది. కర్మకు తగ్గట్లే ఆనాడు మబ్బులు క్రమ్మి సన్నగా చినుకులు పడసాగినై. చీకటి పడ్డ దగ్గరనుంచే ఇక బయలుదేరమని కౌశికుడు తొందర పారంభించాడు. ఆమె ఎలాగో బ్రతిమాలి, భంగపడి, ఊరు సద్దుమణిగేదాక సంబాళించి, కదలలేని భర్తను గంప నెత్తుకొని నెత్తిన పెట్టుకొని సానివాడకు నడవసాగింది. చిమ్మచీకటి, పైగామబ్బులు, అది చాలక సన్నని చినుకులు. చలిగాలి చెవులలోకి రివ్వున కొడుతోంది. నెత్తిమీద బరువుకు మెడనరాలు విరిగిపోతునట్లున్నాయి. కాళ్లు పట్టు తప్పుతున్నాయి. బురదకు అడుగులు జారిపోతున్నాయి. ప్రాణాలు కళ్ళల్లో బిగపట్టుకొని, పంటి బిగువున ఎట్లాగో తన్ను భార్య మోసుకుపోతూవుంటే, ఈ నీచుడు ఆనందాతిరేకంతో కాళ్ళువిసురుకొంటూ, చప్పట్లు చరుచుకొంటూ మీదగంపలో కూర్చుని వెకిలివేషాలు వేస్తున్నాడు. ఈ కుదుపులకు ఆమె శ్రమ మరింత దుస్సహమవుతోంది. కదలవద్దని ఆమె చేసే ప్రార్థనలు ఆ మూర్ఖుడి చెవికి సోకటం లేదు. ఆమె అలాగే నడుస్తోంది. సానివాడ చేరడానికి ఒక చిన్న స్మశానం పక్కనుంచి పోవలసివుంది. ఆమె చీకట్లో కొద్దిగా దారితప్పి శ్మశానం లోనుంచి నడవవలసి వచ్చింది. ఆనాడా వూళ్లో మాండవ్యుడనే మహర్షిని దొంగ తాపసని భ్రమించి రాజు కొరత వేయించాడు. సుమతీ సాధ్వి నడిచే దారిపక్కనే ఆ ముని శిక్షను అనుభవిస్తూ కొరత మీద వున్నాడు. చీకటిలో ఏమీ కనిపించటం లేదు. వినాశకాలం దాపురించి ఆ కటిక చీకటిలో ఆనందం పట్టరాక కాళ్ళు విరజిమ్ముకొంటున్న ఈ కౌశిక బ్రాహ్మణుడు ఆ మాండవ్యమునీంద్రుని గట్టిగా తన్నాడు. అసలే ప్రాణాలు బిగపట్టుకొని, ఆగ్రహాన్ని దిగమింగుకొని, కర్మశేషమనుకొని, శిక్ష అనుభవిస్తున్న ఆ మునీంద్రునికి ఈ అకారణ పాదతాడనంతో ప్రాణాలు కడబట్టి దుఃఖము, క్రోధము, పట్టరానివయినాయి. దాంతో “నన్ను అకారణంగా తన్నిన పాపాత్ముడు రేపు సూర్యోదయానికల్లా చచ్చితీరుతాడ”ని ఆ మహర్షి తిరుగులేని శాపమిచ్చాడు. ఆ మహా పతివ్రత చెవులకాశాపం శూలంలా తగిలింది. ఆమె అదిరిపడింది. మరుక్షణంలో “అట్లాఅయితే సూర్యోదయమే కాకుండుగాక!” అని ఆ మహాసాధ్వినోట అప్రయత్నంగా వెలువడింది. భార్య నెత్తిమీద అప్పటిదాకా వెర్రికులుకులు కులుకుతున్న కౌశికుడికీ మహర్షి శాపం వినగానే మరణ భయం ముంచుకొచ్చి గంగవెర్రులెత్తసాగింది. అతడికి భార్యమీద విశ్వాసం లేనే లేదు. మరణభయంతో గడగడ లాడుతూ అతడిక భార్యను ఇంటికి నడవమన్నాడు. ఆమె మళ్ళీ అతడి మాటను శిరసావహించింది. ఆ మహాసాధ్వీమతల్లి నోటి అలవోక మాటవల్ల సూర్యుడి రథచక్రం బిర్రబిగిసిపోయింది. ఆ రథం మరి కదలలేదు. అమ్మా! నీకు తెలియనిదేముంది. కాలగతి అంతా సూర్యభగవానుడిపై ఆధారపడి వుంది. ఒక్క కాలగతి యేమిటి? సమస్త లోకాలగతి ఆ లోకబాంధవుడి మీదే ఆధారపడి వుంది. ఇపుడు సూర్యగతి ఆగిపోవడంతో జగత్తంతా చీకటిముసుగులో మునిగిపోయింది. సప్తర్షిమండలం దిక్కులేక గుడ్లగూబవలె తల్లక్రిందులుగా వ్రేలాడుతోంది! నక్షత్రాలనాథల వలె సొమ్మసిల్లి పడివున్నాయి. అమ్మా, ఇంతెందుకు! నక్షత్ర గ్రహతారలలో చలనాలన్నవిక లేవు. ఇకప్రాణులు ప్రళయోన్ముఖులైవున్నారు. ఇక సూర్యభగవానుని సంస్తభనంతో సకల కర్మగతులు కూడా స్తంభించిపోయాయి. కాలగతిమీద క్రతువుల ప్రవృత్తి ఆధారపడివుంది. ఇపుడా కాలం గతిమాలి వుంది. కనుక క్రతువులు అంతరించిపోయాయి. క్రతువులు లేకపోవడంవల్ల హవిర్భాగాలే భోజనంగాగల మాబోటి దేవతావర్గాలందరు నిరాహారులై నిర్వీర్యులై పోయారు. అందువల్ల భూమికి వర్ష సంపద కరువై సస్యవృద్ధి క్షీణించింది. దీనివల్ల మానవులకు ఆహార హాని అవుతోంది. తల్లీ! ఇంతెందుకు. మామూలుగా మానవులు హవిర్భాగంతో మమ్ములని సంతృప్తులను చేస్తే, మేము వారిని సువృష్టులతో, సద్గతులతో సంతృప్తులను చేస్తూవుంటాము. అలాకాక మాకు హవిర్భాగాలు యీయకుండానే సంపదనంతా మెక్కే దుశ్శీలులని మేము శిక్షిస్తూవుంటాము. ఇది మామూలు పద్ధతి. ఇట్టి ఈ వ్యవస్థ విచ్ఛిన్నమవుతోంది. కనుక సకల జగత్ క్షేమమే విచ్ఛిన్నం కాబోతోంది. ఇట్టి ఈ విపత్కర పరిస్థితులలో మేమంతా దిక్కుతోచక లోకపితామహులయిన మీ మామగారి దగ్గరకు వెళ్ళి శరణు వేడుకొన్నాము. వారు మా మీద కృపవల్ల తరుణోపాయాన్ని మాకుపదేశించారు. “ఇపుడీ ఉపద్రవం ఒక మహా పతివ్రత ప్రభావంవల్ల వచ్చింది. ఉష్ణ ముష్ణేన శీతలం కనుక మరొక మహా పతివ్రతామతల్లి పాతివ్రత్య ప్రభావమే ఇపుడు తరణోపాయం చూపడానికి సమర్థ మవుతుంది. అలాంటి పతివ్రతా మతల్లి కావాలంటే ఇపుడు అనసూయా సాధ్వికన్న వేరెవ్వరూ మూడు లోకాలలోను లేరు. కనుక మీరా తల్లిని ప్రార్థించి, ఆమె కరుణవల్ల శుభపరంపర లందుకోండి.” అని ఈ విధంగా చతురాననులు చేసిన ఉపదేశంవల్ల తల్లీ, మేము ఇక్కడికి వచ్చి నిన్ను శరణు వేడుతున్నాము. కనుక తల్లీ!మమ్ము కరుణించు, లోకాలను కరుణించు. సూర్య భగవానుని ఉదయింపజేసి సకల జగద్గతిని పూర్వంలాగా ఉండేటట్టు పునఃప్రతిష్ఠ చెయ్యి. తల్లీ! నీవే గతి.” ఈ విధంగా ప్రార్థించిన దేవతాశ్రేష్టుల దైన్యాన్ని చూచి మునిదంపతుల హృదయాలలో దయ పొంగులువారింది. అత్రిమునీంద్రులు అనసూయా మాత వంక సాభిప్రయాంగా చూచాడు. ఆ తల్లి దేవతలకు అభయం ప్రసాదించింది. “అయ్యలారా, పతివ్రతల ప్రభావాన్ని ఉల్లంఘింప గల శక్తి లేనేలేదు. ఆ మహాసాధ్వి చేసిన ప్రతిజ్ఞలు ఆమె అంతట ఆమె తిప్పుకోవాలిగాని ఇతరులు చేయదగినది వీసమంతయినా లేదు. కనుక నేనా సాధ్వీరత్నం దగ్గరకు వెళ్ళి, మీ కొరకై యాచించి, ఆమె చేతనే సూర్యోదయమయేలాగ చేయిస్తాను. అయితే మహర్షుల మాట కూడా తిరుగులేనిదే. అందువల్ల ఆ సాధ్వి భర్తకు కీడు కలుగక తప్పదు. అప్పుడు నేను మీ అందరి అనుమతితో ఆ సాధ్వికి మేలు చేస్తాను. భయం లేదు. నాయనలారా! మీరు నడవండి. వెనుకనే మేము బయలుదేరుతున్నాము.” ఈ విధంగా దేవతల కభయమిచ్చి అనసూయాత్రులు తాము సుమతి ఇంటికి వెళ్ళారు. ముందుగా అనసూయామాత ఇంటిలోకి ప్రవేశించింది. వచ్చిన ఆ పండు ముత్తయిదువను, పరమ పతివ్రతా శిరోమణిని చూచి సుమతీదేవి మహానందంతో ప్రత్యుత్థానం చేసి, అర్ఘ్యపాద్యములతో సత్కరించి, సాష్టాంగ నమస్కారములతో పూజించింది. అనసూయామాత మెల్లగా ఆ మాట, ఈ మాట కలిపి, ఆమెను మాటలలోనికి దింపి, క్రమంగా ఇలా అన్నది. "అమ్మాయి, నిన్నుచూస్తే నాకు చాలా సంతోషముగావుంది. నీవు నీ భర్తకు అధిక శ్రద్ధతో పరిచర్యచేస్తున్నావని నాకనిపిస్తోంది. అందువల్ల ప్రశ్నిస్తున్నాను, తల్లీ! దాపరికం లేకుండా చెప్పు. నీకు నీ భర్తనుచూచేసరికిఒక అనిర్వచనీయమైన ఆనందం హృదయంలో వెల్లివిరిసి ఉంటోందా?నీవు సమస్తదేవతలకన్న నీ భర్తనే అధికుణ్ణిగా భావిస్తున్నావా? అనునిత్యం అతనికన్న ముందుగా నిద్రలేచి అతని పాదాలకు దేవతాబుద్ధితో నమస్కరిస్తున్నావా? అదికాక, అమ్మాయీ, భర్తృమాంగల్య కారకాలైన పసుపు, కుంకుమ, మట్టెలు,ముక్కెర పుస్తెలు మొదలయిన మంగళాభరణముల విషయంలో ఏమరపాటులేకుండా వున్నావా? అన్నింటికీ మించి అతనికన్నివేళల అనుకూలంగా ఉంటున్నావా? శాస్త్రాలలో పతివ్రతాలక్షణాన్నిఎలా నిర్వచించారో ఎరుగుదువా? ఆర్తార్తే ముదితా హృష్టే ప్రోషితే మలినా కృశా। మృతే మ్రియేత యా నారీ సా స్త్రీజ్ఞేయా పతివ్రతా।। పతివ్రతకు భర్తతోడిదే లోకం. అతడు సంతోషముగా ఉంటేనే ఆవిడకి సంతోషం. అతడు దగ్గర వుంటేనే ఆవిడకి పుష్టీ, అలంకారాలూనూ. అతడు పచ్చగా వున్నంతకాలమే ఆమెకు బ్రతుకు. అలాంటిది పతివ్రత అంటే. నీవలాంటిదానిలాగానే కనిపిస్తున్నావు. అమ్మాయీ, ముసలితనపు ఛాదస్తమనుకొని నామాటలు కొట్టివేయకు. నీకింత ఎందుకు చెబుతున్నానంటే, పాతివ్రత్య ఫలమెలావుంటుందో నేననుభవ పూర్వకంగా ఎరిగినదాన్ని. మీతాతగారి పేరూ, నామాటా, నీవు కాస్త వినేవుంటావు. అన్ని మంచి కార్యాలు చేసే శక్తి అంతా నా కీ పాతివ్రత్య వ్రతపాలనవల్లే వచ్చింది. నాకు వేరే దైవమూ లేదు.వేరే ఉపాసనా లేదు. వ్రతమూ లేదు. చూశావా, మగవాడెన్నెన్నో కష్టాలుపడి నానాధర్మాలు ఆచరిస్తేనేగాని అతడికి పుణ్యసంచయం లేదు. మరి మనకో, కేవల భర్తృశుశ్రూష ఒక్కటి చాలు. అదే సమస్తఫలాన్ని అవలీలగా సాధిస్తుంది. నువ్వు అత్యంత శ్రద్థగా శ్రమపడి పతి శుశ్రూష చేస్తున్నావని తెలిసి, సంతోషంకొద్దీ ఇంత చెబుతున్నా నీకు. అమ్మాయీ. ఇది మళ్ళీ విను. స్త్రీలకి వేరే వ్రతాలు వద్దు. నియమాలు వద్దు. ఉపాసనలు వద్దు. పతి ఒక్కడే ఆడదానికి దైవం. పతిసేవే ఉపాసనం. నేను దానితోనే మహత్తర ఫలాన్ని పొందాను. నీవుకూడా ఆ దారిలోనే నడుస్తున్నావు కనుక నీకు మహత్తరమైన సద్గతి నిశ్చితం. సరి సరి, నే నింత మాట్లాడుతున్నాను. నువ్వు నోరు తెరచి ఒక్కమాటయినా మాట్లడవేమిటితల్లీ! అని ఈ రకంగా చనువుతో, ఆనందంతో, ప్రేమతో మాట్లాడుతున్న అనసూయామాతను చూచి సుమతీ దేవికి చాలా ఆనందమయింది. ఆమె ఆ తల్లికి మళ్ళీ నమస్కరించి పలుకసాగింది. “అవ్వా! చిన్ననాటినుండి దేన్ని మనసారానమ్మి, త్రికరణశుద్ధిగా ఆచరిస్తున్నానో, సరిగా అదే వ్రతం ఇప్పుడు నీ నోట ఉపదేశంగా వెలువడి నాశ్రద్ధను వేయింతలుగా చేస్తోంది. అవ్వా, యథాశక్తిగా నీబోటి పెద్దలు నడచిన మార్గంలోనే నడుస్తున్నాను. అవ్వా, నువు దర్శనమిచ్చి నన్ను అనుగ్రహించావన్నది చాలా సంతోషమే. కాని నువ్వు ప్రయాసపడి మా యింటిదాకా రావాలా? కాకితో కబురంపితే మేమే మీ దగ్గరకు రామా? ఇంతకూ నామీద అనుగ్రహముతోనే నీవింత శ్రమ తీసుకున్నావనేది తథ్యం. అయితే, అవ్వా, నీవింటినుండి బయలుదేరావంటే,ఏదో లోకహితము లేనిదే బయలుదేరవనేది నిశ్చయం. అందులో అల్పురాలను నేను చేయగలిగినది ఏమయినా ఉందా? దయతోచెప్పవలసింది.” అని ఈ విధంగా మాట్లాడుతున్న సుమతి తెలివిని, వినయాన్ని చూచి అనసూయామాత లోలోన మురిసిపోయింది. ఇక కాలహరణం పనికిరాదు. తన పని బయట పెట్టేందుకు ఇదే మంచి అదను అని ఆమె నిశ్చయించుకుంది. తన ముఖానగల చిరునవ్వు తెరలో ఎంత వద్దన్నా గాంభీర్యరేఖ తళుకుమంటూ వుండగా, అనసూయామాత ఇలాగ అంది. “అమ్మాయీ, నీవన్నది నిజం. నేను పనికలిగే ఇల్లు కదలి ఇక్కడకు వచ్చాను. నేనేకాదు, నన్ను పురస్కరించుకొని ఇంద్రాది దేవతలు కూడా నీతో పని కలిగే నీ ఇంటికివచ్చారు. మరి ఈ దేవతలు తమ స్వార్థానికై నీ దగ్గరకు రాలేదు. జగత్ హితాన్ని కోరి వారు నిన్ను యాచించడానికి వచ్చారు. అయినాకూడా వారు నీ ఎదుట పడడానికి భయపడుతూనే ఉన్నారు. అమ్మాయీ, నీవెరుగనిది ఈ ముల్లోకాలలో అణువంతైనా లేదని నే నెరుగుదును. ఈ దేవతలు కూడా ఎరుగుదురు. అహర్నిశాత్మకమైన కాలవ్యవస్థ ఇపుడు నీ గుప్పిట బిగిసి ఉంది. తల్లీ! అహర్నిశాసంస్థ లేకపోతే ధర్మాలు లేవు. యాగాలులేవు. వానలు లేవు. బ్రతుకులు లేవు, అమ్మాయీ, వీటి పరస్పర సంబంధము నేను నీకు వివరింపబనిలేదు. అమ్మాయీ, నిన్ను చూచి ఈ మాట ఒక్కటి తలచుకొంటే నాకు కళ్లనీళ్ళ నాపుకోవడం కష్టమవుతోంది. తల్లీ, దైవం నీకిలాంటి క్లిష్టస్థితిని రాసి పెట్టింది. నీ పాతివ్రత్య మహాప్రభావమంతా జగత్ప్రళయానికి పాకం పడుతోంది. తల్లీ! ఈ మాట అనటమే కష్టముగా ఉంది నాకు. నీ చిక్కు నాకు తెలుసును. కాని ఈ అకాల జగత్ప్రళయానికి నీలాంటి సత్వశీల అంగీకరింప వచ్చునా? ఇది జాగ్రత్తగా ఆలోచించు. ఇప్పటికి పదినాళ్ళకాలం చీకటి కడుపులో మునిగిపోయింది. పరిస్థితి చెయ్యి దాటబోతోంది. ఇందరు మహనీయులు వచ్చి నీ ఎదుట యాచనా దీనులై నిలబడి వున్నారు. నేను నిన్నుయాచిస్తున్నాను. నీ నోటిమాట ఒక్కటి ఇప్పుడు సమస్త చరాచర జీవకోటిని కన్నతల్లియై సాకగలదు.” కనుక, అమ్మాయి సుమతీ! నా మాట విను, త్వరపడు, లోకాలననుగ్రహించు.” సహజసిద్ధమైన మితభాషిత్వాన్ని వదలిపెట్టి, ఒక ఆవేశంలో ఆపులేకుండా మాట్లాడుతున్న అనసూయామాతను చూచి సుమతీ దేవి బిత్తరపోయింది. ఆమె కెటూ పాలుపోవడం లేదు. ఎదురుగా ఉన్నది ముగురమ్మల మొదటి అమ్మ! ఆమెగాక దేవతాగణాలు! మరి ఇటు చూస్తేనో......అమ్మో! ఆ భావమే ఆమెకు సుదూరంలో ఆగిపోతోంది. “అవ్వా, ఏమిచెప్పను? నాకు లోకబాంధవునిపై కోపమా? లోకాలపై కోపమా? నేనేమి చేయగలను?నా కర్మమమిలా పట్టింది. మాండవ్యముని శాపము... ” సుమతీ దేవి కంఠం ఆపైన సాగలేదు. ఎగదోసికొని వచ్చిన గాద్గద్యాన్ని ఆమె ఎలాగో లోలోన అణచివేసుకుంది. అనసూయామాత ఇంక జంకలేదు. ఆలసించలేదు. వెంటనే ఇలా అంది. “నాతల్లీ! నీకు కీడైతే, నీ భర్తకు కీడైతే, ఈ సాధుమూర్తులు దేవతలంతా చూస్తూ ఊరుకుంటుంరా? నేనుఊరుకొంటానా? నేననేమిటి? భూమిమీద వున్న ఏ పతివ్రత అయినా ఊరుకొంటుందా? ఆ భయం లేదు. మళ్ళీ చెబుతున్నాను. భయం లేదు. ఇక జాగు చెయ్యకు, సూర్యభగవానుని ఆహ్వానించు. లోకాలను బ్రతికించు.” గుడిలోని జేగంటలాగ ఖంగుమని మ్రోగుతున్న అనసూయామాత మాటలు విని సుమతి దేవి మంత్రముగ్ధలాగా లేచి నిలబడింది. భర్త కొకసారి మనసారా నమస్కరించి, చేతులెత్తి సూర్యభగవానుని ఉద్దేశించి నమస్కరించింది.

	శ్లో।।నమస్సవిత్రే జగదేక చక్షుషే, జగత్ప్రసూతి స్థితినాశహేతవే। 

త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే, విరించినారాయణ శంకరాత్మనే।। అని ఆమె సూర్యభగవానుని ధ్యానించి, తండ్రీ, సూర్యనారాయణా! నా అపరాధాన్ని మన్నించు. నీ ప్రయాణాన్ని సాగించి లోకాన్ని రక్షించవయ్యా తండ్రీ, అని గద్గద కంఠంతో పలికింది. తక్షణమే సూర్యరథం కదిలింది. ఆనందం వెల్లివిరిసింది. శిష్టజనులు అప్పుడే స్నానాలకు, సంధ్యోపాసనలకు ఉపక్రమించారు. సూర్యభగవానుడు ఉదయాద్రి కెక్కాడు. జగత్తులో ఏ మూల చూచినా ఆనందం నవకమలంగా రేకులు విప్పుకొని ఉంది.

      కాని ఈ మూల, అయ్యయ్యో, గుడ్లు తేలవేస్తున్న మగడి తల ఒడిలో పెట్టుకొని దీన దేవత అయి కూర్చున్న సుమతీ దేవి ముఖంలో గతకాలపు దట్టపు చీకట్లన్నీ గూడుకట్టుకొని కూర్చున్నాయని లోకాలకు పట్టనేలేదు.	 ఆ అమాయక సాధ్వి రాను రాను కొయ్యబారిపోతున్న తన భర్తదేహాన్ని నిస్సహాయంగా నిమురుతూ, తన ఏడుపును తన గొంతులోనే నొక్కివేసుకుంటూ, నేలమీద కూలబడి పోయింది.

ఆమెకు వేరేలోకం కనబడటం లేదు. వెనుకటి కథలేవీ ఆమెకు గుర్తు రావటం లేదు. కనీసం పక్కనున్న అనసూయామాత ధ్యాస అయినా ఆమెకు లేనేలేదు. లోకాలన్నీ సుమతీదేవి మాట మరచి ఆనందంతో గంతులేస్తున్నాయి. కానీ, ఆ నిస్సహాయ నిశ్చల దీనమూర్తికి పక్కన మరొక మంగళమూర్తి మాత్రం బాసటగా నిలచి, నిబ్బరంగా పరిస్థితులను గమనిస్తోంది. అటు కౌశికుడి ప్రాణాలు అనంతవాయువులలో కలిసిపోయాయి. ఆమాట సుమతీదేవికి తెలిసేలోపే జయఘంటంలాగా ఖంగుమని మ్రోగుతున్న ఒక కంఠస్వరం ఆ సాధ్వి మనస్సునాకట్టుకొని నిలిపివేసింది.

         “ఓ దీర్ఘసుమంగళీ... .”

ఆ పిలుపొక గర్జనలాగా ఉంది. ఒక ఉన్మత్త ఆక్రోశనంలాగా ఉంది. ఒక సింహనాదంలాగా ఉంది. ఆ కంఠం అనసూయామాతది. ఆమె కళ్ళలో ఏవో దివ్యతేజోమయ జ్వాలలు భగభగమంటున్నాయి. సుమతి నిశ్చలంగా వింటోంది. మళ్ళీ వినిపిస్తోందా కంఠం. “ఓ దీర్ఘసుమంగళీ, అధైర్యపడకు. అటు తపశ్శక్తి-ఇటు పతివ్రతా శక్తి. ఇప్పటిదాకా తపశ్శక్తి నాటకం నడిపింది. ఇక ఇప్పుడు పాతివ్రత్యశక్తి భరతవాక్యం పలుకుతుంది.” అనసూయామాత ఒక్కక్షణం భర్తను మౌనంగా ధ్యానించుకొంది. ఆ తరువాత ఆమె కంఠంలో నుంచి గంభీరస్వరంతో మాటలువెలువడసాగినై. “రూపంలోగాని, శీలంలోగాని, బుద్దిలోగాని, శక్తిలోగానీ, తపస్సులోగానీ మాధుర్యంలోగాని, ఇంకా ఏ సద్గుణంలో కాని నే నెన్నడు పరపురుషుణ్ణి నా భర్తతో సముణ్ణిగా తలచి ఎరుగని దానినైతే- ముల్లోకాలలోని ఏ దేవతను నా భర్తతో సమంగా నే చూడని దానినైతే - మనో వాక్కాయాలు మూడింట నేను ప్రీతిపూర్వకంగా భర్తను ఆరాధించిన దానినైతే - ఈ కౌశిక బ్రాహ్మణుడు తక్షణమే జీవించి, రోగరహితుడై, ధర్మనిరతుడై వెయ్యేళ్ళు వర్థిల్లుగాక!.” అనసూమాత కంఠం ఒక దివ్యశంఖారావంలాగా ఆకాశవీథిలో మారుమ్రోగింది. తక్షణమే నిద్రలేచినట్లే లేచి కూర్చున్నాడు కౌశికుడు. అతనికిప్పుడు ఏ వ్యాధులూ లేవు. శరీరం వజ్రకాయంగా వుంది. ఆ శరీరంలో దివ్య కాంతులు ధగధగమని మెరుస్తున్నాయి. అంతేకాదు. అతని మనసుకూడా నిర్మలమై ప్రశాంతంగా వుంది. అతనికిపుడు ధర్మతత్వం ప్రస్ఫుటంగా గోచరిస్తోంది. వెనువెంటనే అతడు లేచి అనసూయామాత పాదాలకు నమస్కరించాడు. దేవతలు అనసూయామాత మీద కురిపించిన పుష్పవృష్టులు అభిషేక తీర్థంగా కౌశికుడి శిరస్సుమీదికి జారినై. దివ్యదుందుభులు, అప్సరసల నాట్యాలు ఆకాశంలో చెలరేగినాయి. దివ్యర్షుల జయజయధ్వనాలు మిన్నుముట్టాయి. అట్టిసమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ ఒకేసారి ఆకాశంలో ప్రత్యక్షమైయ్యారు. వారిని చూచీ చూడడంతోనే అనసూయాత్రులు సాష్టాంగ వందనాలు చేశారు. ఇతరులు వారిననుసరించారు. ఆనంద విస్ఫారిత వదనులై త్రిమూర్తులు ముల్లోకాలకు అసాధ్యమయిన ఈ అద్భుత దేవ కార్యాన్ని సాధించినందుకు అనసూయామాతను ఇనుమిక్కిలిగా అభినందించి, చివరికి తమ అనుగ్రహ చిహ్నంగా ఏదైనా వరం కోరుకోమన్నారు.

        అది విని ఆ సాధ్వీమతల్లి వినయపూర్వకంగా దోసిలి ఒగ్గి, శిరసున దాల్చి- “అయ్యలారా! నేను వరదానానికి తగినదాననయితే, నా భర్తకోరినవరాన్నే మళ్ళీ కోరుతాను. భర్తకు ప్రతిబింబంకదా భార్య! త్రిమూర్తులారా! మీరు మాకు పుత్రులై పుట్టండి.  సర్వదుఃఖాలను అధిగమించి ఆవలకు పోగలమహాయోగాన్ని అనుగ్రహించండి..” అని సౌమ్యస్వరంతో పలికింది.

అది విని ఆమె వివేకాన్ని మెచ్చుకొని త్రిమూర్తులు తథాస్తని దీవించి అంతర్థానమయ్యారు. ఆ తరువాత సుమతీదేవి ఆనంద వికసిత వదనయై వచ్చి కృతజ్ఞతా పూర్వకంగా అనసూయామాత పాదాలకు ప్రణామం చేసింది. అనసూయామాత సుమతీదేవిని సాదరంగా ఆలింగనం చేసుకుని ఆనందభాష్పాలు రాల్చింది. అటుతరువాత ముని దంపతులు కౌశిక దంపతులతో కలసి ఇష్టప్రియ సంభాషణాదులతో కొద్దికాలం గడపి తమ ఆశ్రమపదానికి మరలి వచ్చేశారు. మళ్ళీ అనసూయాత్రుల తపస్సులు నిరుపద్రవంగా ఆనందంగా సాగిపోతున్నాయి. అలా చాలాకాలం గడచింది. ఒకనాడు అత్యంత మనోహరాకారంతో మిలమిల మెరసిపోతున్నతన భార్యను చూచి అత్రిమహాముని, ఇది సంతానం పొందటానికి అర్హమైన సమయమని నిశ్చయించుకొన్నాడు. బుద్దివృత్తులన్నిటిలోను పతితోడి అనురూప్యాన్ని చిరంతనంగా సంతరించుకొని ఉన్న ఆ మహా సాధ్వి భర్తభావాన్ని తక్షణమే గ్రహించింది. కాని మరక్షణమే వారిద్దరి కనుబొమ్మలు ముడివడినై. అనేక సహస్రదివ్య వర్షాలు, ఇంద్రియవృత్తులకు సుదూరంగా, పవిత్రమైన, నిశ్చలమైన జీవితాన్ని గడపుచున్న ఆ తాపస పుణ్యదంపతులకీనాడు, సంతానార్థమే అగుగాక, ఈ కశ్మలగ్రామ్య ప్రవృత్తిని పొందవలసి రావటం పరమ జుగుప్సాహేతువయ్యింది. వారి మనస్సు అందుకంగీకరించలేదు. వెంటనే, భావనామయమైన ప్రవృత్తిని మాత్రమే అవలంబించడానికి వారిద్దరు నిశ్చయించుకున్నార కాని ఈ అనూహితమైన భావనాపరంపరలో నిర్నిమేషంగా భార్యవంక చూస్తున్న ఊర్ధ్వరేతస్కుడైన అత్రి మహర్షి తేజస్సు ఆయన కన్నులలోనుండి తటాలున వెలువడి క్రిందపడసాగింది. అది చూచి వాయుదేవుడు త్వరపడి తటాలున మహావేగంతోవచ్చి ఆ తేజో బిందువులను నేలపాలు కాకుండా పది దిక్కులకు ఎగజిమ్మాడు.

         అపుడా తేజోబిందు లేశాల్ని దిగంగనలు తమ కడుపులలో ధరించారు. వారి గర్భ ఫలంగానే రజోగుణ ప్రధానుడైన,  చతుర్ముఖాంశ సంభవుడైన,  అమృత స్వభావుడైన, ఓషదీ గణాధిపతియైన చంద్రుడుద్భవించాడు. అతడీ

సమస్తప్రాణులకు ఆయురాధారభూతుడయ్యాడు. ఆ తరువాత శ్రీమన్నారాయణుడు బ్రహ్మరుద్రాంశలను కూడా తనలో తీసుకొని దత్తాత్రేయమూర్తిగాఅనసూయామాత గర్భాన అవతరించి ఆ తల్లి స్తన్యం త్రాగాడు. అటుపిమ్మట అనసూయామాత గర్భం ధరించి ఉండగా హైహేయుడనే రాజుచేసిన అపరాధంవల్ల ఉద్రిక్తుడై ఆ రాజును దహించివేయటానికి, ఏడవ రోజున రుసరుసలాడుతూ, తమోగుణ ప్రధానుడై, రుద్రు డవతరించాడు. అతని పేరే దూర్వాసుడు. అలా అనసూయాత్రులకు త్రిమూర్తుల అంశలతో, ముగ్గురు పుత్రులు కలిగారు. వారిలో చంద్రుడు చంద్రలోకాధిపత్యం వహించి స్వర్గలోక నివాసి అయ్యాడు.

	శ్రీ దత్తాత్రేయమూర్తి యోగీశ్వరుడై, దుష్టదైత్య సంహారకుడై, శిష్టజనపాలకుడై, భక్తులపాలిట కల్పతరువై, జగద్రక్షకుడై, సహ్యాద్రిగుహలలో నివసించసాగాడు. ఇక దూర్వాసుడు  ఉన్మత్త వ్రతం స్వీకరించి, నిర్లిప్తుడై మదాంధులను దహించివేస్తూ తిరుగసాగాడు.                  

దత్తబాల్యము

       ఈ విధంగా  అ పూర్వాలు అనూహ్యాలు అయిన మహాతపస్సులకు ఫలభూతుడుగా దత్తస్వామి లోక రక్షణార్థమై  అవతరించాడు. ఆ స్వామి లోకోత్తరత్వం ఆయన బాల్యంలోనే ఆశ్రమవాసు లందరికీ వ్యక్తంకాసాగింది. దత్తుడు బాలకేళిగా చేసే అనేక విధాలయిన అల్లరిపనులలోనే, మహాయోగసాధనలు అనేక వేల సంవత్సరాలుగా చేసిన ముని వృద్దులకు సైతము అందరాని మహాచిత్రాలు ఉండటం చూచి, ఆశ్రమవాసులయిన మునిజనులందరికీ  దిగ్భ్రమ  అయిపోతోంది.

అనతికాలంలోనే ఆయన అనంత విచిత్ర విభూతి సంపన్నుడని వారంతా గ్రహించారుగాని, ఆ స్వామి అసలు తత్వమేమిటో ఎంత తరచి చూచినా, అందని ద్రాక్షగుత్తే అయింది. ఆబాల్యంలోనే దత్తస్వామి చేష్టలు దురవగాహాలుగా వుంటూ వచ్చాయి. క్రమంగా అనేక మంది మునిజనులకు ఈయన సామాన్యుడు కాడనీ, ఇతని తత్వం ఇదమిత్ధంగా తెలియకపోయినా, ఇతడు మాత్రం బహుమాన్యుడనీ, మనసులో దృఢపడడమేగాక దుఃఖాలను తరించగల ఆత్మయోగం కావాలంటే ఈయన్నే పట్టుకోవాలనే నిశ్చయం తలఎత్తసాగింది. అయితే బాల దత్తస్వామి రానురాను ఏకాంతప్రియుడు కాజొచ్చాడు. ఒకప్పుడాయన సంగాలను ఎడంగా తన్ని ఏకాకిగా యోగనిష్ఠలోదీర్ఘకాలం ఉందామని అనుకోసాగాడు. మునికుమారులది గ్రహించారు. దత్తస్వామి ఇక ఏకాంతములోకి వెళ్ళిపోతే తమ గతి ఏమిటి ? ఇక వారంతా దత్తస్వామి చుట్టూ చేరి తమని శిష్యులుగా స్వీకరించమని బలవంతపెట్టారు స్వామికి వారిని పరీక్షించాలని సంకల్పం కలిగింది. దత్తస్వామి వారంతా చూస్తూవుండగా ఒక సరస్సులో మునిగి మాయమయ్యాడు మునికుమారులిది చూచి అబ్బురపడ్డారు. యోగం మీది ఆసక్తిచేత, స్వామిమీద ప్రీతిచేత, ఆ రూపం మీది వ్యామోహంచేత, వారాయనను విడచి ఇళ్ళకు వెళ్ళలేకపోయారు. త్రిలోక సమ్మోహకమైన దివ్యసుందర రూపాన్ని తలచుకొంటూ వారా సరస్తీరంలోనే నిలచిపోయి, స్వామి కనిపించేదాకా ఇళ్ళకుమరలివెళ్ళరాదని నిశ్చయించుకున్నారు. అలా ఒక నూరు సంవత్సరాలు గడిచాయి సరోవర జలగర్బంలో నిశ్చలసమాధిలో మహానందమయుడై ఉన్నాడు స్వామి. నూరేళ్ళయినాక కూడా మునిజనులు ఇంకా తన కోసం వేచియుండటం చూచి ఆయన సంతోషించాడు. కాని ఆయనకు వారినింకా పరీక్షించాలనిపించింది. దత్తస్వామి ఎంత కరుణాసముద్రుడో, అంత పరీక్షానిష్ఠురుడు. ఆయన ఒకచేత్తో సుందరవనితను, మరోచేత్తో మద్యపాత్రను పట్టుకొని సరస్సులోంచి బయటకు వచ్చాడు. ఆ స్త్రీ ఎలాంటి స్థితిలో ఉందో తలచుకొంటేనే మునిజనులకు అసహ్యంగా ఉంది, దానికి తోడు మద్యం, ఇతరులు చూస్తున్నారని లేదు. వారి ఇద్దరికంటె మ్లేచ్ఛులే నయం. అలా వుంది వ్యవహారం అంతా! ఆ స్థితిలో ఉన్న దత్తస్వామిని చూచి కొందరు ముని కుమారులు విపరీతమైన అసహ్యంతో, “ఏమో అనుకొన్నాము. ఏదో కాస్తయోగం ఉంటే ఉందేమోకాని ఇతడు ధర్మభ్రష్టుడు, ఛీఛీ” అనుకొని ఆయన్ను విడచి వెళ్ళిపోయారు. వారిని చూచి నవ్వుకొన్న దత్తస్వామి పరీక్షాలీల ఇతరుల ఎదుట మరీ పేట్రేగి పోయింది. ఇక దత్తస్వామి, ఆ నిర్లజ్జయువతీ కలసి వారియెదుట జరిపిన క్రీడలు ఇన్నీ అన్నీనా? సంగీతాలేనా, నాట్యాలేనామద్యపానాలేనా, స్వైరవిహారాలేనా, ఒకటని యేమిటి? వారికి అదుపు లేదు. ఈ స్థితి చూచి మరికొందరు ముని కుమారులు విడిచిపోయారు. కొద్దిమంది మాత్రము మిగిలారు. స్వామి చేసే ఈ క్రీడను చూచి లోలోన నవ్వుకొన్నారు. చేతులు మొగిడ్చి యిలా స్తుతించారు. దత్తప్రభూ, యోగేశ్వరా, స్వామీ! మమ్ము కరుణించు.నీవు యోగేశ్వరుడవు. గాలి ఇటు దీపశిఖను ముట్టుకుంటుంది, అటు శవజ్వాలను ముట్టుకుంటుంది. అటు బ్రహ్మర్షుల్ని ముట్టుకుంటుంది. ఇటు పరమ మ్లేచ్చులనీ ముట్టుకుంటుంది. ఆయినా ఆ వాయువుకి ఏగుణమూ అంటదు, దోషమూ అంటదు. అలాగే యోగబలంచేత ఆత్మదర్శనం చేసిన పరాత్పరుడైన నీకు ధర్మంవల్ల వచ్చే పవిత్రతా లేదు, అధర్మంవల్ల వచ్చే పంకమూ లేదు. మాబోటి అల్పబుద్ధులిది తెలియక నూలుపోగుతో మృగరాజును కట్టివేయాలనుకొన్నట్లు, సామాన్య లౌకిక ధర్మసూత్రాలలో నిన్ను బంధించాలని చూస్తారు. మరికొందరు హీనబుద్ధులు నీ ఈ లోకాతీత స్థితిని చూచి, భ్రమించి, గర్వులై, తాము కూడా నీలాగ ప్రవర్తించి ధర్మచ్యుతులౌతూ వుంటారు. అట్టి మూఢులిద్దరికీ నీవు అందనే అందవు. స్వామీ! దయచేత నువ్వే మాకీ సూక్ష్మతత్వం గోచరించేట్టు చేశావు. కనుక ఇక పరీక్ష చాలించి కరుణాసముద్రుడవై మమ్ము తరింపచేయండి ఈ విధంగా స్థిరబుద్ధులై, సూక్ష్మబుద్ధులై తన లీలల తత్వాన్ని గ్రహించిన, ఆ మునికుమారులకు దత్తస్వామి నిజరూపంతో సాక్షాత్కరించి మహాయోగాన్ని ప్రసాదించాడు. దత్తస్వామి కీవిధంగా భక్తుల భక్తి స్థైర్యాన్ని అనేకవిధాలుగా పరీక్షించడమనేది అప్పటికి, ఇప్పటికి అలాగే ఉండిపోయింది. ఎందరెందరో మహా భక్తులు కార్తవీర్యాదులను కూడా ఆయనిలాగే పరీక్షించి చూచారు. మోహంలోను, చాంచల్యంలోను పడిపోకుండా నిలబడ్డవారు స్వామివల్ల మహాఫలాలు పొందారు.