శ్రీమదుత్తరరామాయణము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

ఉపోద్ఘాతము

–––:o:–––

ఈ మహా ప్రపంచమును సృష్టించిన సృష్టికర్తయే ప్రపం చమందలి జీవకోటి కంతటికిని నధిపతియని మన మొప్పుకొనక తప్పదు. ఆ మహానుభావుఁడే సృష్టి లయ కారకుఁడై ప్రపంచ మందలి యాయా ఖండములలోఁ బలు తెఱంగులఁ గపట నాటక ఖేలన మొనరించు చున్నాఁడు. ఆ మహామహుని లీలల నర్థము చేసికొనఁగల మహాపురుషుఁ డిఁక ముందేమో కాని యిప్పటి వఱకు జన్మించి యుండలేదని మా యభిప్రాయము. ప్రపంచ మందలి మానవకోటి కంతకు నొకే సృష్టికర్త యని మేము మరలఁ జెప్పఁ బని లేదు. అట్టి సర్వేశ్వరుని సృష్టిలో మత కుల భేదములకుఁ జోటు లేకుండెను. అందఱును నాది మధ్యాంత రహితుఁడగు సర్వేశ్వరుని తమ యిచ్చవచ్చిన తెఱంగున సేవించు చుండిరి. అటుల జరుగుచుండ రాను రాను మానవులలో విపరీత బుద్ధులు పొడసూపి,దుర్మార్గులు ప్రబలి సన్మార్గులను బాధింపఁ దొడఁగిరి. సన్మార్గులు దుర్మార్గుల నెదు ర్కొనఁ జాలక ఆదిమూర్తి యగు శ్రీమహావిష్ణువును బ్రార్థించి తముఁ జెనటుల బారినుండి రక్షింపఁ గోరిరి. అందుకు శ్రీమన్నారాయణుఁడు వారిం జూచి శ్లోకము -

                    యదా యదాహి ధర్మస్య
                                  గ్లానిర్భవతి భారత!
                    అభ్యుత్థాన మధర్మస్య
                                  తదాతానం సృజామ్యహం. 1
                    పరిత్రాణాయ సాధూనాం
                                  వినాశాయచ దుష్కృతాం
                    ధర్మ సంస్థాప నార్థాయ
                                 సంభవామి యుగే యుగే. 2
                                              ––– (భగవద్గీత - 4 వ అధ్యాయము.)

అనఁగా సృష్టిలో నేయే భూభాగమున దుర్మార్గులు ప్రబలి ధర్మమును నశింపఁజేసి యధర్మమును స్థాపింపఁ బూనుదురో; ఆ భాగమునందుఁ దా నవతరించి దుర్మార్గులఁ జెండి మరల ధర్మసంస్థాపన మొనరింతును భయపడ వలదని యానతిచ్చెను.

ఆ లక్ష్మీపతి తానానతిచ్చినప్రకారము దుర్మార్గులు ప్రబలినపు డంతయుఁ దానేదో యొక రూపముం దాల్చి వచ్చి దుష్టసంహారంబును శిష్టపరిపాలనంబును గావించుచుండెను. అట్టి భగవంతుని లీలలనే భాగవతు లవతారంబులని పేర్కొనిరి. అట్టి యవతారంబు లసంఖ్యాకములు. అయిన నేలకో ప్రాజ్ఞులు

శ్లో. మత్స్యః కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామనః
     రామో రామశ్చ రామశ్చ బౌధ్ధ కల్కి మేవచః.

అను దశావతారములకే ప్రాముఖ్యము నొసంగిరి. మనము కూడ భగవంతుని యవతారంబు లసంఖ్యాకము లనియు నందు బుధులు సెలవిచ్చిన రీతిఁ బైని బేర్కొన్న దశావతారములకే ప్రాముఖ్యము నొసంగుదము.

ఇఁక నవతారంబు లెన్ని విధంబులో కొంత చర్చించి యావల మన విషయమునకు వత్తము. అవతారంబు లంశావతారంబులు, సంపూర్ణావతారంబులని రెండు విధములు. దశావతారములలో శ్రీరామావతారము సంపూర్ణావతారమని మహనీయు లందురు. కనుక మన కథానాయకుఁడగు 'శ్రీరాముని' అవతారమును గూర్చి చర్చింతము.

పూర్వము సనకసనందనాది మహాఋషుల శాపంబునకు గుఱియైన జయవిజయులను లక్ష్మీకాంతుని ద్వారపాలకులు తాము సత్వరముగ శ్రీమహావిష్ణుసన్నిధానమును జేర నుద్దేశించి మూఁడు జన్మములు నారాయణునకు విరోధులుగనే జన్మింపఁ గోరినది సర్వజనవిదితము. ఆరీతిగా జయవిజయులు ముందు హిరణ్యాక్షహిరణ్యకశ్యవులుగ జన్మించి శ్రీమన్నారాయణమూర్తిచేఁ బొలియింపంబడి రెండవ జన్మంబున రావణ కుంభకర్ణులై జనించిరి. అద్దానవుల నిర్జించుటకే శ్రీ విష్ణుమూర్తి రామావతారమును దాల్పవలసి వచ్చెను.

ఇపుడు కొందఱు వితండవాదులు శ్రీవిష్ణుమూర్తి 'రామ' అను పేరు తోడనే యేల అవతరింప వలెనని వాదింతురు, భగవంతుఁ డేనామమున యవతరించినను ఫలిత మొకటియే యని గుర్తింపవలెను. అందునను 'రామ' అను నామకరణము కేవలము దశరథమహారాజు కోరికపై వసిష్ఠమహర్షి కౌసల్యాదేవికి జనించిన పుత్రునకుఁ జేయఁబడినదని తెలిసి కొందురు గాత. ఇఁక 'రామ' అను నామ మందలి గూఢార్థమును దెలిసి కొందము. రామ నామమున కనేకు లనేకార్థముల నొసంగు చున్నారు, 'రామ' అను శబ్దమున ర-అ-మ అను మూఁడు వర్ణము లిమిడి యున్నవి. ర, అను నక్షరమునకు శత్రువుల భస్మీకరించు వాఁడనియు, అ, యను వర్ణమునకు ప్రకాశ ప్రతాపాది గుణముల నొప్పువాఁడనియు, మ, యను నక్కరమునకు నాహ్లాదమును గూర్చు వాఁడనియు నర్థముఁ జెప్పుదురు.

అదియుఁ గాక యోగిపుంగవులు సమాధి కాలమున నతని యందు రమిం తురు గాన 'రామ' అనీ యందురు. జనులను సౌందర్యాది గుణములచే రమింపఁ చేయు వాఁడు, 'రాముఁడు' అని చెప్పుదురు. ఆశ్రితుల నానందింపఁ జేయువాఁడు “ రాముఁడు'. ఇటులనే ' రామ నామపుఁ జెలమ'ను జల్లు కొలఁది, అందుండు నానార్థ జలరాశి యూరుచునే యుండును. కనుక రామనామ మందలి గూఢార్థ చర్చ నింతటితో ముగింతుము.

మన దేశము హిందూదేశము. మనము హిందువులము, మన మతము హిందూమతము. అట్టి హిందూ మతమునకు సర్వేశ్వరుని దివ్య ప్రభావమును విశదీకరించి భగవంతుని యందు భక్తిని నెలకొల్పు వేదములే ప్రామాణిక గ్రంథములు. వేదములు మనకెట్లు ప్రామాణికము లయ్యెనో యటులనే వాల్మీకిమహర్షి వలన రచింపఁబడిన శ్రీమద్రామాయణము స్రష్ట యాజ్ఞానుసారము నారద మహాముని యుపదేశము ననుసరించి రచింపఁ బడినందున నీగ్రంథమునకుఁ బ్రామాణిక గ్రంథముల ఘనత సంభవించె ననుటలో నతిశయోక్తి దోసము కలుగదు.

సంపూర్ణావతారుఁడగు శ్రీ రామచంద్రుని చరిత్రయే శ్రీమద్రామాయణ మని మరలఁ జెప్పఁ బని లేదు. అట్టి మహాకావ్యమును రచించిన యాదికవి శ్రీ వాల్మీకిమహర్షి కీర్తిచంద్రికలు నల్దిశల వ్యాపించి స్థిర స్థాయియై వెలయుటయే గాక యమ్మహర్షి శ్రీరామచంద్రుని కరుణా కటాక్షములకుఁ బాత్రుఁడై మోక్షమును సాధింపఁ గలిగెను.

భగవంతుని కృపాకటాక్షము వలన మనకు లభించిన యా శ్రీరామ చంద్రుని చారిత్రక పవిత్ర గ్రంథ రాజమును జతుర్విధ పురుషార్థములఁ గాంక్షించి పఠించినచో వారి జన్మము సార్ధక మగుననుట తథ్యము, శ్రీ రామ అను పవిత్ర నామ మందలి శక్తి నిరుపమానము. అందులకే భారత దేశ మందు శ్రీరామాలయము గాని, రామ మందిరము గాని, కడకు రామ భజన సమాజము గాని లేని గ్రామ ముండదని గట్టిగఁ జెప్ప వచ్చును. పౌరాణికుని వలన రామాయణ కథను జెప్పించుకొని విని యానందింపని మానవుఁ డుండఁడనియే యనవలసి యున్నది.

శ్రీమద్రామాయణము సంపూర్ణ ప్రబంధ లక్షణములతోడను, నెనిమిది వందల ముప్పది సర్గల తోడను, బాల అయోధ్య అరణ్య కిష్కింధా సుందర యుద్ధ ఉత్తర కాండలను సప్త కాండములలో దేవ భాష యందు రచింపఁ బడియెను.

ఆదికవి వాల్మీకి మహాముని రచించిన యీ మహ కావ్యమును నతని పిమ్మట గీర్వాణ భాష యందే పలువురు కవిపుంగవులు గద్య నాటక చంపూ సంగ్రహ గ్రంథములఁ బెక్కింటి రచించి యున్నారు. గీర్వాణాంధ్ర భాషలలో శ్రీ రామాయణమును గద్య పద్య ద్విపద పద యక్షగాన రూపములుగ రచించిన కవిశిఖామణులను వారి గ్రంథములను లెక్కింప వీలు గాదనుటలో మా పొరపాటుండదని మనవిఁ జేయుచున్నాము. ఇఁక నన్య భాషలలో భాషాంతరీకరణ మొనరింప బడిన కవులను వ్యాఖ్యాన కర్తలను విమర్శకుల నిందఱని చెప్పఁ గలవారెవరును లేరు. శ్రీమద్రామాయణ మహాకావ్యోత్కృష్టతను గుఱించి వివులముగఁ జర్చింపఁ దలఁచుట కిది సమయము కాదని యింతటితో విరమించు చున్నాము.

శ్రీరామ కథను ఎందఱెన్ని విధముల రచించినను, నెన్ని సారులు చదివినను విన్నను మానవులకుఁ దనివి తీరుట లేదు, అందువలననే యాదికవి సంస్కృతమున రచించిన గ్రంథము సామాన్యులు చదువుటకును నందలి రసమును గ్రోలి యానందించుటకును నవకాశ ముండదని తర్వాతి కవులు తదితర బాషలలో వ్రాయఁ దలఁచి వ్రాసిరి. అట్టి వారిలో ముఖ్యులఁ గొందఱ మాత్రము పేర్కొందుము.

రంగనాథకవి- శ్రీమద్రామాయణము నాంధ్ర భాషలో రచించిన కవులలో రంగనాథ కవి ప్రథముఁడని యాంధ్రలోక మంగీకరించెనని మేమనఁ బని లేదు. ఈకవి పుంగవుని జనస్థాన వంశ కుల గోత్ర సూత్రాదులఁ దెలిసికొనుట కేయాధారములు గన్పట్టక పోవుట సారస్వత దీక్షాపరులకుఁ జింతఁ గలిగింపక పోదు. రంగనాథకవి కోనబుద్ధ రాజు (బుద్ధారెడ్డి) ఆస్థానకవియై యుండెనని పెద్దలు నిశ్చయించిరి. అతఁడు తన ప్రభువును మెప్పించి బిరుదులనో లేక బహుమతులనో పొందఁగోరి తన పేరున రంగనాథ రామాయణమును ద్విపద కావ్యముగ రచించెను. అద్దానిఁ గొందఱు కోన బుద్ధారెడ్డి యే రచించి తన తండ్రియగు విట్టల రాజున కంకిత మొనరించె నందురు. ఇది విశ్వసనీయమా? అని ప్రశ్నించిన నంతరాత్మ కాదని వెంటనే ప్రత్యుత్తర మిచ్చునో లేదో చూడుఁడు. కోనబుద్దారెడ్డియే రచించి యుండినచోఁ దన విరచిత గ్రంథమునకు రంగనాథుని పేరేల తగిలించియుండును? కష్టపడి వ్రాసినకవి పుంగవుఁడు తన గ్రంథమున కితరుల పేరు పెట్టుట కంగీకరింపఁడు. అందువలన రంగనాథరామాయణము రంగనాథునిదే యనక తప్పదు. ఒక వేళ రంగనాథకవి ధనాకాంక్షచేతనో ప్రబలభీతిచేతనో తన రామాయణమునకు కోనబుద్ధరాజును కర్తగా జేయుట కంగీకరించి యుండి యుండవచ్చును. పాపము కవి యేకారణముచేతనో తన ప్రభువును రామాయణకర్తగాఁ జేయనెంచినను, భగవంతుఁడు సత్యమును వెల్లడించుటకేఁ గాబోలు దానికి రంగనాథరామాయణ మను నామమునే ప్రసిద్ధి యగునటు లొనరించి రంగనాథకవియే రంగనాథరామాయణకర్తయని నిరూపించెను. అదియుఁ గాక రంగనాథుఁడే రామాయణోత్తరకాండను గూడ రచించి కోనబుద్దరాజును కర్త నొనరించె నందురు. ఈవిషయమును గుఱించిన చర్చను బండితులకు వదలెదము.

భాస్కరుఁడు—శ్రీరామాయణము నాంధ్రీకరించినవారిలో భాస్కరకవి రెండవవాఁడు. రంగనాథుఁడు రామాయణమును ద్విపద కావ్యముగ రచింప భాస్కరుఁడు గద్యపద్యాత్మకముగ రచించెను. రంగనాథరామాయణ కర్తను గుఱించి కలిగిన సందేహమే భాస్కరరామాయణ కర్తను గుఱించియుఁ గలిగినందులకుఁ జింతింపవలసియున్నది. అందులకుఁ గారణ మొకేపేరుగల భాస్కరులు పెక్కురుంటచేతనే యనక తప్పదు. ఏది యెటులున్నను మహనీయులు సరి యగు 'భాస్కర రామాయణ’ కర్తను నిర్ణయింపఁగలిగిరి. అతనినే హళక్కి భాస్కరుఁడని దృఢపఱచిరి. ఈ భాస్కరుని యింటిపేరు మంగళపల్లివారనియు నతఁడు తన యసమానపాండిత్యమునుఁ జాటి యగ్రతాంబూలమును బొందెననియుఁ దాంబూలమునకుఁ గన్నడమున 'హళకి' యను పేరుండుటచే ఆపదమును భాస్కరుఁడు అను నామమునకుఁ బ్రథమమునఁ గూర్చి హళకి భాస్కరుఁడని పిలువఁ దొడఁగి రనియు, నయ్యదియె క్రమముగ హళక్కిగ మాఱి అతనికి మంగళపల్లి భాస్కరుఁడను పేరు మాసి 'హళక్కి భాస్కరుఁడు' అను పేరు నిలిచెనని కొందఱందురు. ఇతఁడు ప్రతాపరుద్రుని పండితసభలోఁ బ్రఖ్యాతి గాంచఁగలిగెను, ఇతఁడు రంగనాథకవికి సమకాలికుఁ డనియుఁ గోనబుద్దరాజు ఆస్థానకవి రంగనాథుఁడు రామాయణమును ద్విపదకావ్యముగ రచించి ప్రభువు మన్ననలకుఁ బాత్రుఁడు గానున్నాఁడని తాను గూడ ప్రభువు మన్ననలఁ బడయఁ గోరి రామాయణమును గద్యపద్యాత్మకముగ రచించి రంగనాథకవి రాజస్థానమునుఁ జేరుసమయమునకేఁ దాను గూడ వెళ్లి తానొక రామాయణమును రచించినట్లును, దానిని ప్రభువున కీ దలఁచి నట్లును జెప్ప నా ప్రభువు కవిద్వయమును బోనాడఁ జాలక నిరువురి గ్రంథముల నందుకొనె ననియు; అట్లందుకొనుటలో రంగనాథ రామాయణమును గుడి చేతను, భాస్కర రామాయణమును నెడమ చేతను నంచుకొనుట చే భాస్కరుఁడు తన పొత్తమునకు వన్నె తఱిగినట్లు భావించి ప్రభువు పై గినిసి నరాంకితము కంటే భగవదంకితమె లెస్సయని శ్రీకృష్ణ భగవానున కర్పించె ననియుఁ జెప్పుదురు. ఇట్టి యంశము లన్నిటిని నిచ్చటఁ జర్చించుటకంటే శ్రీరాముని చరితంబును నాంధ్రీకరించిన వారిలో భాస్కరకవిచంద్రుఁఁడు రెండవ వాడని పాఠకులకు మనవి చేయుచున్నాము.

గోపీనాథకవి - శ్రీరామచంద్రుని దివ్యచారిత్రమును దెనిగించిన వారిలో నీకవి పుంగవుఁడు మూఁడవ వాఁడుగ గణింపఁ బడెను. ఈతడు నెల్లూరు మండలము నందలి కావలి తాలూకా యందలి లక్ష్మీ పురమున జన్మించె ననియు నిక్కవి వుంగవుని వంశమున కాదిపురుషుఁడు గోపీనాథుని వేంకటశాస్త్రి యనియు, వేంకటశాస్త్రికిఁ గామాక్షీ దేవియను కళత్రము వలన బుచ్చన [బుచ్చనార్యుఁడు] యుదయించె ననియు ఆ బుచ్చనార్యునకుఁ గోనమాంబయను భార్యవలన నరస శాస్త్రి, జనించె ననియు ఆతనికి వేంకటాంబ వలన పద్మనాభ శాస్త్రి, బుచ్చన్న అను పుత్రులు జన్మించి రనియు నందు పద్మనాభునకు లక్ష్మీ దేవి యను నర్థాంగి వలన వేంకటనాథుఁడు అను పుత్రుఁడు జనించె ననియు ఆ వేంకటనాథుడే గోపీనాథ రామాయణమును రచించె ననియుఁ దెలియు చున్నది.

ఈ కవికుల తిలకుఁడు పై రంగనాథ భాస్కరుల వలెనే రామాయణమును వాల్మీకి రామాయణము ననుసరించియే గద్యపద్యాత్మికముగ రచించి భాస్కరుని వలెనే తన కృతిని నరాంకిత మొనరింపక శ్రీకృష్ణ భగవానున కర్పిత మొనరించి శ్రీ రామచంద్రుని కరుణా కటాక్షమునకుఁ బాత్రుఁడై స్వర్గము నలంకరించెను.

ఆంధ్ర వాల్మీకి - రాయలసీమలోఁ గడప మండలము పూర్వము నుండియు మహాకవులకు జనస్థానమై వెలయు చున్నదని వ్రాయుటలో నతిశయోక్తి దోసముండునని పాఠకులు భ్రమింప కుందురు గాక.

అట్టి కడప మండలము నందలి జమ్మలమడుగు పట్టణమున నాంధ్ర వాల్మీకి వావిలికొలను సుబ్బారావు, ఆవల వాసుదాసు అని పిలువఁ బడెడి ఆంధ్రవాల్మీకి జనించెను, ఈ కవికులఁ తిలకుఁడు బహుగ్రంథకర్తయై భక్తశిఖామణి యని పించుకోని బమ్మెర పోతనామాత్యుని వలె రామభక్తుఁడై, ఒంటిమిట్ట యని పిలువంబడు నేకశిలా నగరమందే యాశ్రమము నేర్పఱచుకొని, బమ్మెర పోతనా మాత్యుఁడు భాగవతమును రచించి కోదండరామున కర్పించి నటులఁ దాను సహితము వాల్మీకి రామాయణమును మూలము ననుసరించి యాంధ్రీకరించి యా కోదండరామునకే యర్పించి శ్రీరామ పాదపంకజములఁ జేరి రామాయణమును రచించిన నాలవకవి యనిపించుకొనెను.

జనమంచి - జనులందఱచేతను మంచివాఁ డనిపించుకొని మరణించిన యీ కవిశిఖామణికి జనమంచి యను నామము సార్థకమయ్యెను. కావ్యసృతితీర్థ కళాప్రపూర్ణ యిత్యాది బిరుదలఁ బడసిన శ్రీజనమంచి శేషాద్రిశర్మగారు శ్రీవాల్మీకి రామాయణమును తెనుఁగున నిర్వచనముగ వ్రాసి వెలయించి భగవంతుని కర్పించి భగవంతునిఁ జేరఁ గలిగిరి.ఈ పండితకవి నెల్లూరుమండలమున గడప జిల్లాకు సరిహద్దులలో నుండు కలవాయి యను గ్రామమున జన్మించి కడప మండలమునఁ బెరిగి తమ కవితాకీర్తిచంద్రికల నాంధ్రావనియం దంతటను బ్రసరింపఁ జేసి కడప పట్టణమునఁ బంతొమ్మిది వందల యేబదియవ సంవత్సరము జులై మొదటి తేది (1-7-1950) పరమపదించిరి. శ్రీ రామభద్రుని దివ్య చరిత్రమును రచించిన వారిలో నీకవి పుంగవుఁడు అయిదవ వాఁడు.

శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి - శ్రీమద్రామాయణమును తెలుఁగుబాసలో రచించి కీర్తి వహించిన కవితావతంసులలో శ్రీపాదవారు ఆఱవ వారని తెలియుచున్నది. ఈ మహాకవి భారతమును సంపూర్ణముగ నాంధ్రీకరించుటయేగాగ శతాది గ్రంథకర్తయు కళాప్రపూర్ణ కవిసార్వభౌమ మహామహోపాధ్యాయ బిరుదాంకితులును, ప్రకృతపు ప్రజాప్రభుత్వ ఆస్థానకవియునై ఆంధ్ర భారతిని తన యమూల్య గ్రంధరత్నమాలచే నలంకరించు చున్నాఁడ

పూర్వ కవులలోనేమి, ప్రకృతపు సత్కవులలో నేమి మున్ముందు ఆంధ్ర భారతి పవిత్రగర్భమున నుద్భవింపఁ బోవు కవికుమారులేమి శ్రీ రామాయణము నే రచించి శ్రీరామ కటాక్షమును గడించఁ గలరు. కొందఱు ఆంగ్ల భాషాదురంధరులు ఒక రామాయణము చాలదా? వ్రాసినదే వ్రాయుటకంటెఁ గ్రొత్తమార్గము ననుసరించి సాంఘిక గ్రంథముల నెలకొల్పి సంఘసేవ చేయరాదా? యని యెత్తి పొడుతురు, పాపము వారు శ్రీరామచంద్రుని దివ్యచారిత్రము ఎందఱి కవులచేలిఖంపఁ బడినను ఎన్ని భాషలలోకి భాషాంతరీకరించినను తనివి తీరుట లేదను దానిలోని సత్యమును గ్రహింపరైరి. శ్రీరామాయణము ప్రపంచమున నిందఱు కవులచే రచింపఁ బడెననియు, నిందఱచే నిన్ని భాషలలో భాషాంతరీకరింపఁ బడె ననియు నిష్కర్షగఁ జెప్పఁగల వారు లేకున్నారు. ఏకవి గాని గ్రంథకర్త గాని శ్రీరాముకథ నేవిధముగ వర్ణింపఁ బూనినను దద్రచనచే శ్రీరాముని ప్రేమకుఁ బాత్రుఁడై తద్వారా మోక్షమును బడయు తలంపు ననే యని మా తలంపు.

ఉత్తర రామాయణము - ఇంతవఱకు శ్రీ రామాయణమును గుఱించియు, ఆరామాయణమునే పలువురు కవులు గ్రంథకర్తలు అనేక రీతుల సంస్కృతాంధ్ర భాషలలో రచించుటను గూర్చియు దానిని బహుభాషలలో తర్జుమా చేయుటకు హేతువును గూర్చియు వివరించితిమి. ఇఁక ఉత్తరరామాయణమును గూర్చి చర్చింతమన్న దీని నెందఱోకవులు రచ్చింప లేదు. ఇప్పటివఱకు ఉత్తర రామాయణమును రచించిన కవిపుంగవులలో భవభూతి సంస్కృతమున ఉత్తర రామచరితము అను పేర నాటక రూపమునను, మహాకవి తిక్కన తెనుఁగున ఉత్తర రామాయణమును రచించినట్లు తెలియుచున్నది. ఆగ్రంథములు పాఠకులకు లభ్యము కాగలవు. ఈ గ్రంథద్వయము తప్ప నితర గ్రంథములు కంకంటి వారి ఉత్తర రామాయణమునకుఁ బ్వూరము రచింపఁబడినవి కానంబడుట లేదు. పై మూఁడు గ్రంథములలోఁ గంకంటివారి ఉత్తర రామాయణమునకున్న వ్యాప్తి తక్కిన రెండు గ్రంథములకు లేదని చెప్పుటలోఁ బొరపాటుండదని తలంచు చున్నాము. పది గుడిసెలు గల పల్లెటూరు మొదలుకొని పట్టణముల వఱకు నాంధ్రభాషను జదువ నేర్చిన యెవ్వరిని గాని ప్రశ్నించిన కంకంటి పాపరాజు కృత ఉత్తర రామాయణము నే బేర్కొందు రనుటలో నతిశయోక్తి లేదనక తప్పదు. పూర్వకవులలో నేమి,ఇప్పటికవులలో నేమి ఉత్తర రామాయణమున కంటె లావు గ్రంథముల రచించినవారనేకులు గలరు కాని పాప మేలకో వారికిఁ గాని వారి గ్రంథములకు గాని కంకంటి పాపరాజుకు నతని ఉత్తర రామాయణము నకుఁ గలిగిన వ్యాక్తి కలుగక పోయినందులకు మేమెంతయుఁ జింతించు చున్నామన నా గ్రంథకర్తల కెట్లుండునో గదా!

కంకంటి పాపరాజు - ఈ ఉత్తర రామాయణమును సృష్టించిన శ్రీకంకంటి పాపరాజు సుమారు వంద సంవత్సరములకు పూర్వముండిన కవులలోఁ జేరిన వాడు. అనఁగాఁ బదు నెనిమిదవ శతాబ్ది మధ్యభాగమున నీయుత్తరరామాయణమును రచించినట్లు తెలియుచున్నది.

ఇతఁడు బడగలనాటి కన్నడ తెగనుండి యుద్భవించిన నియోగిశాఖ యుపశాఖలగు నందవరీక ఆర్వేల అను నియోగి శాఖలలో ఆర్వేల నియోగి శాఖకుఁ జేరినవాఁ డనియు, అబస్తంభసూత్ర శ్రీవత్స గోత్రజుఁ డనియు గ్రంథకర్త పీఠికలోని ఇరువది యేడవ పద్యమునుఁ జదివినచోఁ దెలియఁ గలదు. ఇక గ్రంథ కర్త వంశమును గూర్చి పరిశీలించిన నిట్లున్నది.


ఇంతటి పాండిత్యమును ననర్గల కవితాధారయుఁ గలిగిన యిక్కవికుల తిలకుఁడు వాల్మీకి మొదలుగాగల మహాకవులు శ్రీమద్రామాయణమునే సంస్కృతాంధ్రములలో రచించి శ్రీరామకటాక్షముసకుఁ బాత్రులు కాఁగోరి నటులఁ దాను కూడ రామాయణకథనే రచించి శ్రీరామచంద్రుని కటాక్షమును సంపాదింపఁ గోరక యేలకో ఉత్తర రామాయణమునే రచించి భగవంతుని యనుగ్రహ మునకుఁ బాత్రుఁడు కాఁగోరెను.

శ్రీమదుత్తర రామాయణమును తాను రచింపఁ బూనుటకుఁ గల గారణము పాపరాజు రచించిన కృతిప్రశంస లోని పదునాలవ పద్యమును జదివినఁ దెలియఁ గలదు.ఈకవి తన పదునైదవ పద్యమున అన్నిటికంటే నుత్తమమైన మానవ జన్మము నెత్తిన వాడు విద్యాధనమును గడించి కవియై శ్రీరాముని దివ్యచరిత్రమును బాడికీర్తింపనిచో నట్టి పురుషుని జన్మము నిరర్థకమని వాక్రుచ్చెను. అనఁగా పాపయామాత్యునకు శ్రీరామచంద్రుని మహాశక్తి యందును, శ్రీరామచరిత్ర మును రచించుట యందును నంత నమ్మక ముండినదని తెలియు చున్నది. వాల్మీకి మున్నగు కవులవలె రామాయణమునే కాక శ్రీరాముని మహిమలఁజాటు నేగ్రంథమైనను సద్గతిఁ గూర్పఁ గలదను నమ్మకము తోడనే పై కవులవలె రామాయణమును గాక తాను ఉత్తర రామాయణమును రచింప సంకల్పించెను. ఆవలఁ దన కృతికిఁ దగిన కృతిభర్తను సంపాదింప నెంచి యోజించుచు నిద్రింప స్వప్న మందు శ్రీమదనగోపాలుఁడు సాక్షాత్కరించి, నీవింతకుముందు రచించి నాకు సమర్పించిన విష్ణుమాయావిలాసము అను యక్షగానము వలెనే ఉత్తర రామాయణమును గూడ సమర్పింపు మనియు, నందు వలన నతనికిని నతని గ్రంథమునకును శాశ్వకీర్తి కలుగఁ గలదని చెప్పి యదృశ్యుండై నట్లుఁ గవి తన 19-22 వ పద్యములలో లిఖించెను.

పాపరాజు వేకువన నిదుర నుండి లేచి స్వప్నమున శ్రీమదనగోపాలుడు నాక్షాత్కరించి పలికిన వచనములఁ దనమిత్రుఁడగు పుష్పగిరి అప్పయ్య కుమారుఁ డగు తిమ్మయ్యను బిలిపించి యున్నదున్నట్లు వచింపఁ దిమ్మయ్య మిక్కిలి సంతసించి అన్నా! నీవు కృతిభర్తకై వెదకుచుండ శ్రీకృష్ణభగవానుఁడే నీపుత్రినిఁ బ్రేమించి తనకు సమర్పింపఁ గోరెను కదా! శ్రీమదనగోపాలుఁడే నీయల్లుఁడాయెను గదా! ఔరా! నీవు ధన్యుఁడ వై తివి. నీజన్మము సార్థక మాయెను ,లెమ్ము. సత్వరమున నీకృతిని ముగింపుమని తన మిత్రునిఁ బ్రోత్సహించి తన నిజసదనంబున కేగిన వాఁడయ్యె.

ఇచ్చట మఱియొక యంశమును జర్చింప వలసి వచ్చినది. కొందఱు కంకంటి పాపరాజు తన ఉత్తర రామాయణమును పుష్పగిరి తిమ్మకవి సహాయముతో వ్రాసె ననువారును, పాపరాజు గారికిఁ దాను ఋణపడిన విత్తము నీయఁజాలక తిమ్మ కవి ఉత్తర రామాయణమును రచించి పాపరాజున కొసఁగి తన యప్పును దీర్చుకొనె ననువారును, నట్లొసగిన గ్రంథమును వేయిన్ని యేడువందల తొంబదవ సంవత్సర ప్రాంతమున బాపరాజు తనపేరఁ బ్రకటించు కొనెననువారును గలరు. కాని వీరి పలుకు లన్నియు సత్య దూరములని యించుక యోజించినచోఁ దెలియఁ గలదు. ఈ వదంతి గల్పించిన వారి పలుకులు నమ్మదగినవి కాదని యీ కింది విషయములు చెప్పుక చెప్పుచున్నవి.

1. కంకంటి పాపరాజు కవిత్వము చేతఁగాని దద్దమ్మకాదని యతఁడు వ్రాసిన యాశ్వాసాంత గద్యములే చాటు చున్నవి. అట్టి మహాకవి యితర కవిచే వ్రాయఁబడిన గ్రంథమును దన పేరఁ బ్రకటించు కొనెనను వారాకవి పుంగవునకు మహాద్రోహ మొనర్చిన వారు కాఁగలరు. 2. పుష్పగిరి తిమ్మనార్యుఁడు ఉత్తరరామాయణమును వ్రాసి యుండినచో పాపరాజు తన స్వప్న వృత్తాంతమును తిమ్మకవిని తన యింటికిఁ బిలిపించుకొని చెప్పవలసినంత యవసర ముండి యుండదు కదా! అంతకు ముందు తిమ్మకవి యేమైన ఉత్తరరామాయణమును రచించినట్లు గాని రచింప నున్నట్లు గాని యితరు లట్లుండఁ దిమ్మకవియైనను నెచ్చటను వ్రాసి యుండ లేదు.

3. పుష్పగిరి తిమ్మకవి భర్తృహరి నీతిశతకమును, సమీరకుమార విజయమును దప్పఁ దదితర గ్రంథముల రచించినట్లు సాక్ష్య మిచ్చు వారెవరును లేరు,

4. ఏదో పాపరాజుగారి కిచ్చిన గ్రంథమును గుఱించి నేనేలఁ బదుగురకుఁ జాటవలెనని తా నెచ్చటను దాని నామమైనఁ గనఁబఱచ లేదనియు, నటులఁ గనఁ బఱచినఁ బాపరాజున కపయశముఁ దెచ్చిన వాఁడనగుదుననియు భావించి తిమ్మనార్యుడు ఉత్తరరామాయణ ప్రశంసను బొత్తిగ వదలెనని యనుకొందమన్న; తిమ్మ కవి కవిత్వమునకును; ఉత్తరరామాయణ రచనకును నేలాటి సంబంధ ముండి నట్లు కనఁబడదు.

5. కవిత్వమను కళ ప్రారంభమైనది మొదలు గ్రంథకర్తల రచనలఁ బరి శీలించి చూచినచో నే రెండుమూఁడో అంతకంటె యెక్కువో వ్రాసిన ఒక గ్రంథ కర్త శైలిని పోకడలను జూచిన నతని ప్రతి గ్రంథములోని శైలి యుద్దేశములు మున్నగునవి కొంచె మించుమించు ఒకే విధముగ నుండునని పండితులకు మేము చెప్పఁ బని లేదు. ఇఁకఁ బుష్పగిరి వారి గ్రంథములోని రచన పోకడలు మున్నగు వానిని; ఉత్తర రామాయణ రచన పోకడలతోఁ బోల్చి చూచినచో నేలాటి సంబంధ మున్నట్లు కనఁబడనందున నుత్తరరామాయణకర్త కంకంటి పాపరాజు గారే యని తీర్మానింప వలసినదే కాని మఱొకరీతి తీర్మానించుటకుఁ గారణ మగు పడుట లేదు.

గ్రంథప్రాశస్త్యము - ఇక మహా కావ్య లక్షణముల యందించు కేని కొఱత లేకుండ రచింపఁ బడిన యీ గ్రంథ రాజ లక్షణములఁ గూర్చి మేము వ్రాయఁదలఁచుట కంటెఁ బాఠకుల కే వదలి మాశ్రమ తగ్గించుకొనుట లెస్సయని మాతలంపు. ఒక వేళ నాప్రయత్న మొనరించినను దివ్యతర ఫలాహారాదుల ముందిడుకొని తినఁబోవు వారికి దూరమునఁ గూర్చుండి యా పదార్థముల రుచిని వర్ణింపఁ బూని నట్లుండునని మాయభిప్రాయము, వేయేల. ఈ గ్రంథరత్నమున శ్రీ కారము మొదలుకొని యంత్యాక్షరము వఱకుఁ గల ప్రతి పద్యగద్యాక్షరముల పొందికలో గొప్ప పటిమ గలదనియు, నేపద్యమును జదివినను మనోహ్లాదమును గలిగించు ననియు, నిట్టి కవితాధార యేవుణ్య పురుషునకో గాని యెల్లర కలవడదనుటలో నతిశయోక్తి లేదనియు మా నమ్మకము, ఇటుల వ్రాసినందులకు భావ నవ్యసాహిత్య వస్తోంది పోతోంది వచ్చారు పొయ్యారు వ్రాతల వ్రాయు కవిపుంగవులు మాపై గుడ్లెఱ్ఱ జేసినఁ జేయవచ్చును, కాని యందులకు భయఁపడి సత్యమును దాఁచుట తప్పు కదా?

కంకంటి వారి ఉత్తర రామాయణమును జదివినచో ఉత్తరరామాయణముతో, బాటు రామాయణమును గూడ జదివి నట్లగుననుట కీకవిపుంగవుఁ డిందు సంగ్రహముగ ఎనుబదియేడు పద్యములలో రచించి ముగించిన రామాయణమును జదివినవా రెఱుంగఁ గలరు. ఈ గ్రంధమును సంపూర్ణముగఁ జదివినను, పురాణ శ్రవణము గావించినను శ్రీమద్రామాయణమును ఉత్తర రామాయణమును జదివిన ఫలమును బొందఁ గలరు. ఇట్టి యుత్తమగ్రంథమును పండితులచే సరిచూపించి కాకితము లభింపని యీ కఱవు దినములలో వ్యయ ప్రయాసల లెక్కింపక మంచి కాగితములపై జక్కఁగ ముద్రించి సామాన్యుల కందు బాటగు మూల్యమును నిర్ణయించితిమి. ఇందేమైన ఇంకను పొరపాట్లుండినచోఁ బాఠక మహాశయులు మాకు దయతోఁ దెలిపిన రెండవ ముద్రణమున సవరింపఁ గలము. ఆంధ్రలోకము ఆంధ్రభారతికి మేమొనరించు సేవ నెట్లుఁ బోత్సహించునో చూడవలసి యున్నది.

మదరాసు
30-6-1951

సి. వి. కృష్ణా బుక్కు డిపో.

This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.