Jump to content

శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అనుబంధము 4

వికీసోర్స్ నుండి

వర్ణములవారికిని శాఖలవారికిని గీత బోధింపబడుటకు ధనము మొదలయిన తృప్తికరములగు సదుపాయములు చేయబడిన వని నేను బ్రతికియుండగనే వినగోరుచున్నాను.


ఇది శ్రీకృష్ణునికి ప్రీతికర. మగుగాక!


____________


అనుబంధము 4.

గీత: జీవనమార్గము.

(డాక్టరు అనీబిసెంటు)


మహాభారతమను మహాకావ్యములో అమూల్యము లగు బోధనలలో భగవద్గీతవలె అరుదైనదియు నమూల్య మైనదియు మరియొకటి లేదు. యుద్ధభూమిలో శ్రీకృష్ణుని ముఖమున నది బయలువెడలి తన శిష్యుడును సఖుడునునగు నర్జునుని మనోద్వేగమును శాంతింపచేసినపిదప నెందరో క్షుబ్దహృదయుల కది శాంతినిచ్చి బలపరిచినది, క్లేశము ననుభవించు నెన్నియో యాత్మల నాతనిదరికి చేర్చినది. కేవల కర్మఫలత్యాగమను సాధారణావస్థనుండి, కామము లన్నియు నశించి, శాంతముగ నిరంతరధ్యానమగ్నులయిన యోగావస్థయను నున్నతపదమున చేర్చి, దేహమును మనస్సును జీవితమున యదృచ్ఛముగా సంభవించు సన్నివేశము లందు కర్మములను జేయునట్లు సాధకున కది యుపకరించును. అధ్యాత్మజీవనము చేయువాడు సన్న్యాసి కానక్కరలేదనియు, ప్రపంచకార్యములమధ్యనే యుండి సాయుజ్యము నొందవచ్చుననియు, సాయుజ్యమునొందుట కాటంకములు మనకు బయటగాక మనలోపలనే యున్నవనియు, ఇదియే భగవద్గీతలోని ప్రధాన బోధన


అది యోగశాస్త్రము. యోగ మనగా కూడిక. మనోవేగములన్నియు స్వాధీనము చేసుకొని భగవద్ధర్మము లోలీనమగుటయే యోగము. ఈయవస్థ నందుటకు శాంతి కావలెను. సమచిత్తముకావలెను. అందుమూలమున జీవాత్మ పరమాత్మతో చేరును. అప్పుడది సాధకులు కాని వారిని ముందుకును వెనుకకును నూగులాడించు సుఖదుఃఖములు, ఇచ్ఛా ద్వేషములు మొదలగు ద్వంద్వభావముల నాత్మలంట కుండ చేయును. మితత్వము గీతబోధించు పరమార్థము. మనుష్యునిసర్వస్వమును బ్రహ్మముతో సంపూర్ణముగ ననుసంధానమునొంది యుండవలెను. సాధకుడు దీనినే లక్ష్యము నందుంచుకొనవలెను. అత డాకర్షించుదానిచేత నాకర్షింప పడకూడదు. వికర్షించుదానిచేత వికర్షింప పడకూడదు. ఆక ర్షణవికర్షణముల ురెండును నేకేశ్వరునిలక్షణములనిగ్రహించి, అవితనకు మార్గమునుచూపునుపదేశములుగ నెంచవలెనుకాని తన్ను బంధించుపాశములుగ తలపకూడదు. కష్టములమధ్య నాతడు శాంతి కధినాధుడైన ఈశ్వరునందు విశ్రాంతికొని ఫలమును కోరక కర్తవ్యతాబుద్ధితో తనధర్మములను సంపూర్ణముగ నిర్వహింపవలెను. అతనిహృదయము యజ్ఞ వేదిక: అతనియెడ తనకుగలప్రేమయాయజ్ఞకుండమున ప్రజ్వలించు జ్యోతి; తనశారీరక మానసికకర్మము లన్నియు నాహుతులు. ఆయాహుతులను వేల్చినపిదప నతనికి వానితో మరిపనిలేదు.


ఈబోధ హృదయమున నాటుకొనుటకో యనునట్లు యుద్ధభూమిలో వీరరాజకుమారుడైన నర్జునునకు తన యన్న రాజ్యాధికారము నిలుపవలసిన విధియై యుండెను; రాజ్యము నాక్రమించి దేశమును నాశనము చేయుచున్నవాని నంతము నొందింపవలెను. రాజకుమారుడును యోధుడును నైనందున దేశము శత్రుబాధలనుండి తప్పించి శాంతిధర్మములను పునః ప్రతిష్ఠింపవలెను. ఈయుద్ధము మరింతఘోరముగ కాన్పించుట కిరుపక్షములందును తన ఇష్టులును, సఖులును నిలిచియుండిరి. అతని హృదయము దుఃఖముతోను, వేదనతోను నిండి యున్నది. జరుగబోవునది శారీరకసంఘర్షణమేకాక ధర్మ సంఘర్షణముకూడను. ప్రేమగౌరవముల కాస్పదములైనవారి నాతడు చంపవలెనా ? బాంధవ్యబంధముల నాతడు త్రెంపి వేయవలెనా ? న్యాయమార్గము నవలంబింపవలెను; లేకున్న ధర్మాతిక్రమణము జరుగును. కాని, పాపము కలుగకుండ చంపుటెట్లు ? ఈప్రశ్న కుత్తరమే గీతలోని విషయము. విషయములతో నీకు సంగమువలదు. జీవితమున నీకుగల స్థానమునకు విధింపబడిన ధర్మము నాచరించుము. ప్రపంచమును శాంత్యానందములలో పరణమింపజేయువా డీశ్వరు డనియు, ప్రభువును నతని యాజ్ఞయుకూడ నతడే యనియు గ్రహించుకొనుము; భక్తితో నతని యైక్యము నొందుము; పిదప కర్తవ్యతాబుద్ధితో కర్మము నాచరింపుము. కామమోహములను, క్రోధద్వేషములను విడిచి నీపనిని చేయుము. అట్టి కర్మము నిన్ను బంధింపదు. నీకు యోగము కుదురును. తన్మూలమున నాత్మకు మోక్షము ప్రాప్తించును.


ఈ పవిత్రగ్రంథమున స్పష్టముగ బోధింపపడిన దిదియే. కాని, అవతారపురుషుని కర్మములన్నియు చిహ్న ప్రాయములు. కాబట్టి యీ బాహ్యయుద్ధమాంతర యుద్ధమునకు గురుతుగా గ్రహింప వచ్చును. కురుక్షేత్రయుద్ధ మాత్మయుద్ధము; ధార్తరాష్ఠ్రు లాత్మకు గల శత్రువులు; అర్జునుడు మోక్షమునకై పెనగు లాడుచున్న సాధకుని యాత్మ. శ్రీకృష్ణుడు కూటస్థబ్రహ్మము. ఈరీతిగా పురాతనకాలపు యుద్ధభూమిలో చేయబడిన యుపదేశము సనాతనోపదేశమగుచు కంటకావృతమై కష్టభూయిష్టమైన మార్గమున శాంతినిబొందుటకు సాధకునకు శిక్షణము నొసగు చున్నది. ప్రాచీప్రతీమలలో నట్టి యాత్మల కన్నిటికి నీదివ్య బోధనలు చేయబడుచున్నవి. మార్గమొక్కటే, పేళ్ళు వేరు. తమ యైక్యమును గుర్తించుకొనలేకపోవచ్చునుగాని, యన్ని యాత్మలకును గమ్యస్థానముమాత్ర మొక్కటే.


____________