Jump to content

శ్రీకృష్ణుడు చూపిన మార్గము/అధ్యాయము 10

వికీసోర్స్ నుండి

కర్మవిధి. హిందూధర్మమున నడగియున్న సిద్ధాంతమిది. కారణ కార్యముల నిరంతరసంబంధముమీదనేర్పడిన సిద్ధాంతమిది. కారణమునకు కార్యము సమము. కారణము ఫలమునివ్వక తప్పదు. కారణమునకు మరురూపమే ఫలము. కావున దేహ వియోగము తరువాతను నాత్మయున్నదనిన నది తాను చేసిన చేతలఫలమును గ్రహించియే యుండును. ఇదియే కర్మవిధి. 'ఇన్సాల్వెన్సీకోర్టు'లో అప్పులను రద్దుచేసి విడుచునట్లు కర్మ విధిలో పొసగదు. ప్రాతయప్పులను తీర్చియే తీరవలెను.


(10)

కర్మఫలము.

ఒకకొలనిలో నొక రాయివేసిన నది నీటిని కలతబెట్టి యలలను గలిగించును. ఎంతటి చిన్నరాయియయినను దాని వేగమునకును భారమునకును తగిన యలలను కలిగించును. ఆకలత కంటికి కనబడనంత చిన్నదైనను దానివేగముచే నలలేర్పడి యొడ్డును తాకును. ఒకయల మరియొకయలను విరుచును. ఒకదానితోనొకటి కలిసి పెరుగుటయు క్రుంగుటయు కలదు. కావున నెంతటి చిన్న చలనము వ్యర్థముకాదు. ఈవిధముగనే మనచేతలును ఆత్మకు చెందినంతమట్టుకు మన స్సున నుదయించు కోరికలును ఆశలును చేతలే యగును. కడురహస్యమైన మనోవికారములుగూడ పరతత్త్వమను ఆకాశసముద్రమందలలను కలుగచేసి చరించును. అవి తమ ఫలములను కలిగించియే తీరును. ఆఫలములను తెచ్చుకొనిన జీవుడు వానిని మరల ననుభవించియే తీరవలెను. ఒకడు తక్కినజీవులకు కలిగించు సుఖమునకును దుఃఖమునకును తగిన బహుమతియో దండనయో పొందును. మన మాలోచించు నొక్కొక యాలోచనయు, చేయు నొక్కొకచేతయు వెంటనే మనలనే తాకుచుండును. ఒకచేతను చేయువాడే దానిఫల మును మొదట పొందును. ఇపుడు నేనొక మంచి యాలోచన నాలోచించినయెడల, లేదా మంచిపనిచేసినయెడల, దాని ననుసరించి ఆగుణము వెంటనే మంచిదగును. ఒకచెడుగు నాలోచించినను, ఒక చెడ్డయాలోచనకు మనస్సులో నెడ మిచ్చినను దానిననుసరించి యాత్మ కీడునుపొందును. కంసాలి బంగారునగనుచేసి రూపమునిచ్చునట్లు మనయాత్మను మనము కర్మమను సుత్తితో ప్రతిక్షణమును కొట్టుకొనుచునే యున్నాము. దేహమునువిడిచి మరియొక దేహమును పొందు నపుడు పూర్వముచేసిన కర్మములఫలమును, ఆలోచించిన యాలోచనఫలమును పొందియే యుందుము.

ఇప్పుడు నేను కోపమునడచికొన్న యెడల, రేపువచ్చు కోపము నడచుకొనుట సులభమగును. తాల్మియే స్వభావమై నిలుచును. ఇప్పుడు కామపరమగు నాలోచన కెడ మిచ్చిన యెడల రేపుదాని వేగము నరికట్టజాలను. అదే అభ్యాసమై నిలుచును. చేసినచెడుగునకో ఆలోచించిన చెడ్డ ఆలోచనకో నేడుపశ్చాత్తాపము పొందియున్న యెడల ఆగుణము రేపు మరి పుట్టదు. ఇట్లేమంచిగుణములును. చనిపోవుకాలమున తలపును నిట్లే. కడచినకాలము నెట్లుపయోగింతుమో యట్లే మరుజన్మములోని తలపులుండును.


(11)

కర్మవిధికి ఆక్షేపములు.

'అంతయును విధికి లోబడియున్నది. మనమేమిచేసిన నేమి?' అని చెప్పుట కర్మవిధి కాదు. కర్మవిధియని హిందూ శాస్త్రములందు చెప్పబడు సిద్ధాంతము వేరు. 'పురుష ప్రయత్న మావశ్యకము; అదే ముఖ్యము' అనుటయే కర్మ విధి. 'పురుషప్రయత్నమువలన ఫలములేదు.' అని చెప్పిన కర్మవిధికి శుద్ధవిరుద్ధము. నిన్న చేసిన చేతకు ఫలమును నే డనుభవించియే తీరవలెననుటవలన మనుష్యుని స్వాతంత్య్రమును తీసివేయుట కాదు. పురుషప్రయత్నపుశక్తికి హిందూ మతసిద్ధాంతము సంపూర్ణప్రాముఖ్యమును,సంపూర్ణ స్వాతంత్య్రమునుు మనుష్యున కిచ్చుచున్నది. 'అంతయు నీశ్వరుని పని. ఈశ్వరుని యనుమతిలేక యొక్కటియుగాదు' అనుట