శేషార్యోదాహరణము

వికీసోర్స్ నుండి

శేషార్యోదాహరణము

బాలకవి: అనంతయ

శేషార్యోదాహరణమునఁ బ్రశంసితుఁడైన శేషార్యుఁడు నల్లందిగళ్ వంశమునకుఁ జెందినవాఁడు. ఈ నల్లందిగళ్ వారి వంశావళిని ' సీసమాలిక గా' పై......గూర్చినాఁడు - దానినుండి మనకు ప్రస్తుతమగు భాగమును యిచ్చుచున్నాఁడను-

శ్రీ......మన్మథ మన్మ
           థాకృతివైన నిన్నందు వెనుక
శ్రితజన సంస్తుత్యు శేషయామాత్యు ప
           ర్వతధైర్యు వేంకట రాఘవార్యు
ఘనకీర్తినిస్తంద్రు కస్తూరిమండ
           ......తేజోరూపవైభవముల
తొలుతన సకలవిద్యలు నేర్చి నా నాఁట
           నభివృద్ధిఁ బొందుచు నహరహంబు
నీమాట జవదాట కామోదమును గూర్చు
           చలరామచంద్రున కనుజులైన
శత్రుఘ్నభరతలక్ష్మణుల చందమునను
           తమ్ములై నీకు చిత్తమ్ము లలర
సేవ సేయుచు పాండ్యసింహాసనస్థుఁడై
           దక్షిణరాయలై తనరు విజయ
రంగ చొక్కనృపాలు రత్నసమ్ముఖమున
           ఆప్తులై మిత్రులై యధికులగుచు

కొలువఁగా వారిలో గుణఖనియైన వేం
           కటరాఘవాచార్యు కదనశౌర్యు
మెల్లనె పాండ్యభూమిపతి చేపట్టె........
           ...........నతఁడు విలసిల్లు
అతని కూరిమి తమ్ముఁడైన కస్తూరయ్య
           పరిఢవిల్లె......కడుకీర్తి
గాంచెనా ఘనుని కగ్రజుఁడైన
           శేషార్యు డంచితశ్రీ వహించి
బాంధవతతికి కల్పకభూరుహంబయి
           కవులకు నిక్షేపకలనఁ దనరి
ఆశ్రితతతులకు నమరనగంబయి
           యంగనలకుఁ గుసుమాయుధుఁడయి
తన చెలికాండ్రకుఁ దంగేటిజున్నయి
           తమ్ములకెల్ల మోదప్రదుఁడయి
పేదయౌ జనముల పెన్నిధానంబయి
           యకలంకకీర్తిచే నతిశయిల్లె-

(నల్లందిగళ్ వారి వంశావళి - అముద్రితము. Government Oriental Manuscripts Library, Madras. R. No. 759 Pages 7 & 8.) పై యుధ్ధృతాంశమును బట్టి, శేషార్యుఁడు క్రీ. శ. 1704 - 1732 వఱకును మధురను పరిపాలించిన - సుప్రసిద్ధాంధ్రనాయకుఁడు విజయరంగ చొక్కనాథునికాలములో నున్నవాఁడని స్పష్టమగుచున్నది. కృతికర్తయగు అనంతయ, బాలకవి బిరుదాంకితుఁడు - ఈతఁడు తన గాధేయోపాఖ్యానమును బదిర కృష్ణభూపాలున కంకిత మిచ్చుచు, నందులో తన వంశవృక్షము నిట్లిచ్చియున్నాఁడు-

....................................రేవూరి కాళహస్తికవి
...............................................లింగకవి
కాళహస్తికవి.......అనంతకవి.......ఏకామ్రకవి.......గురువకవి.....శివానందకవి
.........................కాళహస్తికవి
..........................................అనంతకవి

సీ॥ ఘనమౌని కులమాన్యకౌండిన్యగోత్రప
           విత్రుఁ డాపస్తంబసూత్రమహిత
గతి హారి రేవూరి కాళహస్తి కవీంద్ర
           పౌత్రు లింగకవీంద్రపుత్రుఁ గాళ
హస్తి మహాకవి యగ్రజన్ము నేకామ్ర
           కవిశిఖామణి గుర్వ కవితిలక శి
వానందసుకవుల యగ్రజన్ముని ఘటి
           కాశతగ్రంథసంఘటకు లేఖి
నీశితివరేణ్య కవితాప్రకాశకుని ది
నప్రబంధ నిబంధను నను ననంతు
తన రుచిరబోధయుత మనోవనరుహమున
తనరు నెనరున గనుగొని యనియె నిట్లు.

ఈతఁడు వృద్ధాచలమహాత్మ్యమును రచించి పంట లింగారెడ్డి కంకితము గావించెను- ఈతని పౌత్రుఁడు 'అనంతకవి' తన శ్రీముష్ణమహాత్మ్యమను గ్రంథములో నీ యనంతుని నిట్లు ప్రశంసించియున్నాఁడు-

సీ॥ ఐదేండ్లనాఁడె వేదాదివిద్యలు నేర్చి
           విభుల మెప్పించె గర్వితుల నణఁచి
అట్టి ప్రాయమునాఁడె యష్టభాషల జతు
           ర్విధకృతుల్ ధరవి నిర్మించి నిలిపె
ఘటికాదిశతదినైకప్రబంధముల మై
           సూరి చెంజిండ్ల మెచ్చులు ఘటించె
నూఱుఘంటములకై నోరూరఁగ ఘనాఘ
           నంబున కవిత మిన్నంది పలికె
నేకసంధావధృతధృతనేకవిబుధ
దుర్గ్రహగ్రంథసాహస్రతూర్ణతుష్ట
మండలాధీశదత్తసమ్మాన బాల
కవి యనంతేంద్రు నెన త్రిలోకములఁ గలరె?

ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక - 3 సం. పరిషత్పుస్తక భాండాగారము.)

ప్రథమావిభక్తి

శా॥ శ్రీనల్లందిగళన్వనాయ మవనిన్ - జెన్నొందు నేవంశమం
     దానారాయణ జియ్యరం చనఁగఁ దా - నారాయణుం డుద్భవం
     బైనాఁ డందు జెలంగు తిర్మలసుధీ - యాదోధిచంద్రుండు దా
     నానూనస్థిరకీర్తిశేషఘనుఁ డు - ద్యద్ధర్మశర్మాఢ్యుఁడై.

కళిక

మఱియు సారసగర్భసార స-మగ్రసారసమాన్యచరితుఁడు
పర సభారస భావ భారస-వర్ణ్యభారసమానరీతుఁడు
చందనాచలచారు తాచయ...........సతిహృదయుఁడు
నందివాహనమతి విమోహన-నయనమోహనమహితసద
దిక్పతిప్రతిమాన ధీప్రతి-తిక్షుతాప్రతి పక్షశౌర్యుఁడు
దృక్పరిక్షిత సుజనరక్షిత - ధీరదీక్షిత భావవర్యుఁడు
కులవధూజనభావ భాజన-కుశలతాజన వంద్యశీలుఁడు
ఖలనిరోధన ఘన విబోధన-ఖడ్గసాధన......ఖేలుఁడు

ఉత్కళిక

అరిభుజంగమ గరుడ మంత్రము
సరసజనవర సస్యయంత్రము
సాఁగఁదనరెడు నీతితంత్రము
నాగమోక్తముగాఁగ మంత్రము
నెడలఁ గైకొనఁ గవి నియోగము
నెడఁదఁ గైకొన కది నియోగము
యోగమున మను వినయసాంద్రుఁడు
భోగమున మను భూమహేంద్రుఁడు

ద్వితీయావిభక్తి

శా॥ రాకేందుద్యుతి తిర్మలార్యసుతు భా-రద్వాజుగోత్రున్,
     లోక శ్రీకరుఁడయ్య వారయకు మే-లుంగూర్చు వేతమ్ములం
     జోకం వేంకటరాఘవార్యునకు కస్తూరయ్యకున్ పెద్దనార్యు
     లోకైకస్తుతకీర్తిశేషఘను సు-శ్లోకున్ బ్రశంసించెదన్

కళిక

మఱియు మద మెదలేని - మహిమఁగాంచినవాని
మెఱయు వన్నెకడాని - మించు మించినవాని
తొలఁకు పలుకు హిమాని - తులకింప నగువాని
సొలపుపూవిలుకాని - సొబగు ననుదగు వాని

కలితనముఁగైకోని - ఘనత మెఱసిన వాని
నెలమి వేలుపుమ్రాని - యీవి నెలసిన వాని
పరమధృతిఁ గొఱగాని • పనులఁ గొల్పని వాని
అరు లెదిర్చిన యేని - యాపు నిల్పని వాని.

ఉత్కళిక

శూరతయు, దాక్షిణ్య
సారమును, నైపుణ్య
మును(వి)నయసంసక్తి
యును విచక్షణతోక్తిఁ
గాంచి మధురాధీశుఁ
డంచి తామాత్యేశుఁ
డనఁగఁదగు ధృతివాని
ననఘ మగుమతి వాని

తృతీయావిభక్తి

శా॥ ఆనందంబున చంద్రశేఖర జటా-నంతాపగాంభోజ మా
     ధ్వీనవ్యోరు రసప్రధానకృతు లెం- తేపల్కి కైకొండ్రు నా
     నానల్పాంబర హేమరత్న బహుమా-నంబుల్ కవీంద్రుల్ ఘనుం
     డానల్లంది గళీశ తిర్మలయ శే-షామాత్యుచేతన్ ధరన్.

కళిక

మఱియు వారి వాహభూరి - మహిమహారిదాసుచేతఁ
గఱకు వైరిఁ గలనఁజేఱి - గదుము శౌర్యభానుచేత
జగముఁ బొగడ యశము నెగడ - సవతు దెగడు ధీరుచేత
పొగరు మగుడ నొరసిబెగడ - బుధులు నిగుడ భీరుచేత
కవి చకోరకములు జేరఁ - గల యుదార చంద్రుచేత
జవవిహారతురగవార - చతురచారసాంద్రుచేత
విజయడిండిమముల నిండి - వెలయుదండి యోధుచేత
ప్రజలు ... పసిఁడి ... ప్రబలుదండిసాధుచేత

ఉత్కళిక

మదవదరులఁ గన్న లేటి
కొదమలనుచు నెంచి సూటి
గదిమి చిదిమి యదిమి మట్టి
కదన గరిమ గదుర గట్టి
బిరుదు(లు) గైకొనఁగ నేర్చి
కిరుదు డొనని పటిమఁ జేర్చి
మెలగినట్టి శూరుచేత
కలిత కీర్తి హారుచేత

చతుర్థీవిభక్తి

మ॥ అలయించున్ వితతానురక్తగతి శూ-రానంగతాపాదియై
     బలిమిం గుత్తుకలాను చెల్మిబలె నే-భ వ్యాత్ముకౌక్షేయకం
     బలధీరాకృతినట్టె తిర్మలబుధేంద్రాంభోధిచంద్రుండనన్
     గల శేషార్యునికై యొసంగుదురు స-త్కావ్యంబు లార్యోత్తముల్

కళిక

మఱియు ననుక్షణ శిక్షణ వీక్షణ - మర్దిత మదనతరపువారునకై
కఱకువజీరుల,భీరుల భేరుల-గర్భవినిస్రుతు లిడుశూరునకై
గడిదొరలందఱఁ జిందఱవందఱ - గాఁ దఱిమిన తేజోవంతునకై
కడిద్విపదంబుల కొమ్ములచిమ్ముల-కరినయననురొనబలవంతునకై
మొకురుదు నేలని తేలని వాలని - మొనలిడ లోగొను వీరాంకునకై
నికటపుసోదన సాధన వాదన - నెలకొను నిర్భయనిశ్శంకునకై

ఉత్కళిక

జగడపుటంగులు విని విని బలుకై
పలువగ లెత్తుచు తులువల వగకై
కావరమున నలుఁగులు కొని శిఖికై
కావిరి దనురారవపరులైకై

లాటపుచివ్వలరువ్వెడు శిఖికై
లాటన పటులగు ద్రోహులు దెగకై
కొనియసివిసరెడు నుద్దామునకై
ఘనరణపుంగవతాభీమునకై

పంచమీవిభక్తి

శా॥ శ్రీరంగేశపదాబ్జభక్తినిధియై, చింతామణీకల్పకో
     దారోదారత యాచకుల్ ధరణిదాతల్ గా భుజాభోగరే
     ఖారూఢిన్ దిగిభేంద్రహస్తపటిమల్ గైకొంచు పెంపొందుల
     క్ష్మీరాజన్మతి శేషయార్యువలనన్ - చెల్వొందు సత్కావ్యముల్

కళిక

మఱియు, నాశ్రితభరణ - మహనీయుగుణువలన
వఱలు మతివిస్ఫురణ - వాస్త వార్హణువలన
అన్వీక్షకీవరణహార్ద - గుణచణువలన
అన్వయ జనాభరణ - హర్ష మర్షణువలన
హరి దయోదయ కరణ - హతవైరిగణువలన
వరకవిజనాదరణ - వచనభూషణువలన
శరణాగతోద్ధరణ - చాతుర్యధనువలన
సరసతావిస్తార - సర్వజ్ఞఘనువలన

ఉత్కళిక

ప్రబలకృత దిగ్విజయ
సబలవతరిపునిచయ
సమ్మర్దరణభరిత
సమ్ము.....పచరిత
సురపురీవిస్ఫార
వరగోపురద్వార
మణిసౌధతటువలన
ఫణిపభుజవటువలన

షష్ఠీవిభక్తి

మ॥ అలరారున్ వలరాజుచక్కదన మార్యాధీశదూష్యంబు, రి
     క్కలఱేఁడక్కొగు నీవి ఠీవియు కళంక్కు స్ఫార గుర్వర్థ ధి
     క్కలనం...........బేటికని పల్కన్ తిర్మలాచార్య వం
     శలలామోజ్జ్వల శేషయార్యునకు నెంచన్ సాటిగా సత్కవుల్

కళిక

మఱియు శౌరి శౌరి మను పరీక్షకునకు
కఱకు చెఱకుపాల దేల కడవనుడువరక్షకునకు
రాజరాజ దానధార రంజ మంజిమావకునకు
భోజరాజ సాహితోప ... మోపరోపధీవహునకు
బాహురాహులీఢ గాఢ వైరి భూరిహిమకరునకు
సాహసాహవాగ్ర నిగ్రహాభిశోభి శరధరునకు
శూరవార పోషకైక చూడ జూడ మోహనునకు
గౌర గౌర సౌధ యూధ.......కవిత వాహనునకు

ఉత్కళిక

చటుల నిటలనయన సయన
పటలకుటిల జయన పయన
మమర సమర విజయ విజయ
గమగతమక విచయ విచయ
నీయ గేయ శోభనాభి
ధేయ రాయ బిరుదశోభి
తాగ్ర విగ్రహోదయుసకు
నుగ్ర విగ్రహాభయునకు

సప్తమీవిభక్తి

మ॥ స్థిరలక్ష్మీకర వేంకటాంబికయెడన్ శ్రీతిర్మలార్యుండు, భా
     స్వరశశ్వద్రఘువంశభర్తలవలెన్ - పాటిల్లఁగాఁ గన్నసు

     స్థిరులౌ పుత్రులు నల్వు రందును జగత్ - శ్రేయాంకసాంద్రాదరా
     ఢ్యరసజ్ఞత్వములొందు శేషఘనునందశ్రాంత దానోన్నతిన్.

కళిక

మఱియు నిజజయభుజ - మాన్యునందు
మఱవక తనుధృతిశత - మన్యునందు
జగదేకహేవాక - చరితునందు
ప్రగమితాజ్ఞాచక్ర - భరితునందు
పటుభీమ సంగ్రామ - పార్థునందు
చటు సామవాగ్భూమ - సార్థునందు
దీనవరదానసుర - ధేనునందు
భానుపమ కీర్తి హిమ - భానునందు

ఉత్కళిక

వదనముననిందు
కదనముననిందు
ధర గెల్చి క్రిందు
పఱచుసుధతాబిందు
విడుపలుకులెందు
తొడివిను నెందు
లొసగుఘనునందు
ప్రశమదనునందు.

సంబోధన

మ॥ అవనీపాలసభావహాబహుమహావ్యాహారహారిప్రభా
     భవనీభూతముఖాముఖాబ్జభవ! సం- పధీర్గుణీదార,
     రవధూవ్యద్రిపుజాల! జాలపదగౌరస్ఫారసత్కీర్తిభాం
     ధవ! శ్రీతిర్మలమంత్రి శేషసచివేంద్రా! దానసాంద్రాదరా!

కళిక

మఱియు మధురాధీశ - మహితకరుణావేశ!
తరమెఱిగి విబుధేశతతులమను పరమేశ!
సంగీతసాహిత్య సంగ్రహైకస్తుత్య!
సంగరజయౌన్నత్య - సాంద్రద్యుతిసాహిత్య!
కవినిరీక్షణమాత్ర - కలితదానవిచిత్ర!
నవనవప్రియమిత్ర - నవ్యవనికాచైత్ర!
సముదారసద్ధర్మ - సముచితాంచితశర్మ!
విమతసేనామర్మ - వేదిపటుశరధర్మ!

ఉత్కళిక

శ్రీరామపదభజన
సారస్వతాద్యజన
సారళ్యసంప్రాప్త
వైరళ్యరహితాప్త
రక్షణవినిస్తంద్ర
వీక్షలక్ష్మీసాంద్ర
నవ్యనిజమణిసౌధ
భవ్యగుణగణబోధ!

సార్వవిభక్తికము

మ॥ కులరత్నంబవు నీవు ని న్నెనయుశ్రీ, కొల్వొప్పు నీచేత, కీ
     ర్తులు నీకై హరియిచ్చు, నీవలన మీఱు న్వన్నెయు న్వాసి, నీ
     కలరున్ సొమ్ములు, విద్యహృద్యమగు నీయం దార్జవం బౌర! చం
     చలదృక్పంచశరాంక! తిర్మలయశేషా! పోషితార్యోత్తమా!

అంకితాంకము

క॥ చెలఁగు నుదాహరణం బిది
     నలసన్నిభ బాలకవియనంతయ నీకై

     వెలయించె దీనిఁ గైకొను
     మలఘుసమున్మేష! తిరుమలార్యునిశేషా!

ప్రాచ్యలిఖితపుస్తకభాండారము - ప్రతి - సంఖ్య. R. 186 - (M. S. కాగితపుఁబ్రతి).