Jump to content

శృంగారపంచకము/జాబులు

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

జాబులు

మొదటిభాగము

శ్రీమద్రమాకుమార స
తీమహితవిలాసవతిని దీర్ఘాయువుగా
ప్రేమంబున దీవించుచు,
ఆమీఁదటఁ బ్రియుఁడు వ్రాయునది యేమనఁగా.

1


ఉ.

ఏనిమిషంబునందు నిను నేఁ గనుఁగొంటినొ యంతనుండి నా
మానస మన్యచింతలను మాని, యదేమి కతంబొగాని, నీ
పైనె స్థిరంబుగా నిలిచి, పంతము పట్టినయట్టి మాడ్కి నీ
ధ్యానముతప్ప వేఱువిషయంబులు తోఁ పగ నీయదో చెలీ.

2


చ.

రమణుని నాల్కపై నొకసరస్వతిమాత్రమె సంతతంబు వా
సము నొనరించు నందు; రది; సత్యముకాదు, మదీయజిహ్వపై
రమణి చిరనితనంబుగ నిరంతరమున్ వసియింతు నీవు ధ్యా
నము జపమున్ ఫలించి, మఱి నాకు లభించుత నీదు పొందికన్.

3


ఉ.

ఇందిత యోర్తె తాను హృదయేశుని డెందము పాయ దన్న పే
రొందె నటంచు లోకు లనుచుందురు, నీవును గాపురంబు నా
డెందము నందుఁ బెట్టి కదలింపవు కాలిని నిన్ను నాదు భా
గ్యేందిర వందునో, స్మర జయేందిర వందునొ! సుందరీమణీ.

4

చ.

సగముశరీర మొక్కతె కొసంగె, శిరంబునఁ దాల్చె నొక్కతెన్
తగులము కల్గి యీశ్వరుఁడు తన్విరో, నేనును నీ నిమిత్తమై
సగ మయితిన్, భవచ్చరణ సారసమున్ శిరమందుఁ దాల్ప నుం
టిఁ గనుకఁ గైకొనంగదవెనీ హృదయేశ్వరుఁగా గృపన్ ననున్.

5


ఉ.

కన్నులు వేయి యింద్రునకుఁ గల్గుట నిక్కమొ గాదొగాని, వే
గన్నులు నేను బెట్టుకొని గౌతమనాతిని బోలు రూపసం
పన్నను, నిన్నుఁ గందుజుమి, భామిని నీ యొడ లెల్ల రాయి గా
కున్నను, నకటా! హృదయ మొక్కటి మాత్రము రాయియే యగున్.

6


ఉ.

చాలరు నీకుఁ గంతు దొరసానియు, మంతన కెక్కినట్టి యా
వేలుపుసానియున్ సరసవిభ్రమరూప విలాససంపదన్
లోలవిలోచనా, జగతిలో దొరసానులు సాను లెల్ల నీ
కాలిని గల్లు గోళ్ళ కెనగా రిఁక జక్కనిచుక్క లైననున్.

7

(గొలుసు సీసము)

సీ.

ఔ బళా! యో యబలా నీ కులుకులు! రూ
            పునకు గోవునను నిన్ బోలరు నర
లోకమున కలుకులును, వేలుపుఁ జిలుక
            లకొలుకలు, నహబళా! మదనుప
దను ములుకు లగుఁ గదా నీ కనుబెళుకు
            లు? బళీబళీ! నీ జిలిబిలి పలుకు
లు? పులకండపలుకులు, బళీ! నీ మెయ తళు
            కులు తొలి మెఱపులకుం గరపుఁ గ


తే.

ళుకులు, మొగము నెన్నెలలఁ జిలుకును, పెదవి
నుండి యొదవి! మధు తొలుకును, ప్మధివిని నే
ఱికురు లసిత కాంతులతో నలుకును, ముంగు
రు లళికులమునకు సమకూరుచు నళుకును.

8

ఉ.

నమ్ము సుమాస్త్రు నానగ ఘనమ్ముసుమా నెరవేణి, మేను నూ
నమ్ముసుమా, ముఖమ్ము నతినమ్ముసుమా, చిఱునవ్వు నవ్వ ఫే
నమ్ముసుమా, మెఱుంగు రతనమ్ముసుమా యధరమ్మ, చూపుమీ
నమ్ముసుమా, మృగాక్షి గగనమ్ముసుమా నునుగౌను నీ కహా!

9


ఉ.

చిల్వలరాయ డూడిగము చేయఁగ వచ్చును నీదు వేణికిన్,
కల్వలవిందు నీ మొగము కన్గొని నంతనె జో హుక మ్మనున్
కొ ల్వొనరించు నీదు తళుకుంగనుదోయికి గండుమీలు, నీ
చెల్వము నెన్న నల్వకును చిల్వలఱేనికి నౌనె చెల్వరో.

10


ఉ.

కోకిలకాకలీధ్వనులకున్ గురుపీఠము నీదుకంఠఁ మిం
తీ, కలహంససంతతికి నీ గమానం బునదేశకర్త, నీ
యాకృతి మేన కాదిలలతాంగులకున్ బడి పెద్ద, యద్దిరా!
నీకడనేకదా యొరులు నేర్పులు తీర్పులు నేర్చు కోవలేన్.

11


సీ.

కడుపునఁ గన్నట్టి గారాబుబిడ్డలు
            మొలకతుమ్మెదలు నీ ముంగురులకు,
దరిఁ జేరి త్రుళ్ళెడి దగ్గరచుట్టాలు
            గండుబేడిసలు నీ కన్నుఁగవకు
చెవిలోన మంతనాల్ చెప్పునేస్తంబులు
            వదరుకోయిలలు నీ పలుకులకును,
అడుగుల మడుగులొత్తెడి పనికత్తెలు
            చిగురుగుత్తులు నీకు చేతులకును,


ఆ.

ఒదిగి మెదిగి తిరుగు చున్నట్టి యాశ్రితు
లంచగములు నీదుయానములకు,
జాతిబందుగులు పనం దైనజాజులు
కులుకులాడి, నీదు పలువరుసకు.

12

ఉ.

చాన సువర్ణదానమును సల్పును నీదు శరీరకాంతి, భూ
దానము సల్పు నీ కటి, నదా తిలదానము సల్పు నాస, యౌ
రా! నిరతాన్నదాన మమరాళికి సల్పును నీదు మోవియున్,
నే నిను నీవి వేఁడితిని నీవిక లే దనఁ బోకొసంగుమా.

17


చ.

రజమును దాల్చు పుష్పనికరంబును, చెమ్మను బూను పల్లవ
వ్ర్రజమును, తేజముం గల సువర్ణము, గాలికి నూఁగు తీఁగ ల
భ్రజనితమైన క్రొమ్మెఱుఁగుపంక్తియు నీ తనువందుఁ గూర్చి ని
న్నజుఁడటు పంచభూతనిచయంబువఁ సృజీయంచెఁ గోమలీ.

18


ఉ.

తేనె యనంటిపండ్లఁ గల తీయఁదనంబల దొండ్లపండ్లలోఁ
గానఁగ వచ్చునేని, యటుగాక యనంటికి దొండపండ్ల కెం
పైనను గల్గెనేని, సరియౌ ననవచ్చును నీదు మోవికిన్,
మానిని! నీ బెడంగు లసమానములై విలసిల్లు సృష్టిలో.

19


ఉ.

తామరతూండ్లటంచును, లతాయుగమంచును, బువ్వుదండలం,
చీ మెయి నీదు బాహువుల నెన్నుదు రన్నివిధాల నందఱున్,
కాముఁడు వీడకుండ నను గట్టిగఁ గట్టిన మోహపాశము
ల్గా మది నేఁ దనంచెనను గామిని, గంధగజేంద్రగామనీ.

20


చ.

ఇలపయి నీదు కౌను గుఱియించి వివాదము లుద్భవిల్లఁగా,
కలదని, మింటికీం బయిని గ్రాలు నటంచును గొందఱాస్తికుల్
పలుకుదు రద్ది కేవల మబద్ధ, మొకింతయుఁ గౌను నీకుఁ దొ
య్యలి, సహి, లేదు, లేదనుచు నాస్తికవాదము లిను సల్పెదన్.

21


చ.

మదనునిదంతి వేటకు సమంబుగ నీనడ లేన్లు నెన్నడల్
గద, తొడ లేన్గుతుండములె, గండరుచుల్ కరిదంతతుల్యముల్
గద, మరి యొక్కసామ్యమును గద్దది చెప్పితినేని, నీకు సి
గ్గొదవునటంచు జంకుమెయి నూరకయుందుఁ జకోరలోచనా.

22

ఉ.

లేతగులాబిఱేఁకల వలెం జెలు వాఱును నీ కపోలముల్,
వాతెఱ జాతి కెంపనఁగ వచ్చును, సంపెంగ వాస, చంద్రులో
పాతిక నెన్నొసల్, కనులు పద్మదళంబులు, శ్రీలు కర్ణముల్
నాతి, భవన్ముఖంబు నలినంబులవైరియె యెల్ల రీతులన్.

23


శా.

పట్టాకత్తియె సుమ్ము నీదుజడ, యాపై కన్బొమల్ విండ్లె, య
ట్టింట్టుం బర్వెడి చూపులమ్ములె, యయారే! నీయొయారంబు లే
కొట్టన్ వచ్చిన యట్టిమాడ్కిగను నాకుం జూడఁ జూడంగఁ జూ
పట్టెన్ నిన్ శరణంటి నన్ గరుణఁ జేపట్టంగదే యంగనా.

24


సీ.

గిరగిర నీదు ముంగురుల సుళ్ళంబడి
            మరలలేకుండె నా మానసంబు,
బిరబిర నీదు బిత్తరపుఁ జూపుఁదూపు
            గుములు నాఁటెను నాదు గుండెయందు,
గరగర లాడు నీబిరుసు పయ్యెదవల
            లోఁ జిక్కుపడియె నా లోచనములు,
జరజర నీదు కేశంబులం దొరఁగు చీఁ
            కటి నాకు కామాంధకార మయ్యె,


గీ.

పరపరన్ గుత్తుకను గోయు కిరుసుకత్తి
యౌచు నీదు కీల్జడ నాకు దోఁచు చుండె
చుఱచుఱన్ వెన్నెలట్లు నీ చిఱునగవును
సోఁగుచుండె నా మేనికో సుందరాంగి.

25


చ.

దిరిసెనపూవె చూవె భవదీయశరీరము, నీదు నేత్రముల్
విరిసిన కర్వపువ్వు, లరవిందము నీవదనంబు, మల్లెపూ
వరుసను బోలుఁ బల్వరుస, వాతెఱ మంకెన, పుప్వుబోఁడి,
దరిసెన మబ్బు మున్ను సుమధన్వుని బువ్వులఁ బూజ చేసినన్.

26

సీ.

చక్రసామ్యంబు నీ జఘనప్రదేశ మొ
            క్కటికె కా, దింక రెండిటికిఁ గలదు
దాడిమీజయము నీ దంతవితాన మొ
            క్కటికె కా, దింక రెండింటికిఁ గలదు
కరులతో వాదు నీగమనవిలాస మొ
            క్కటికె కా, దింక రెండింటికిఁ గలదు,
బింబరూపము నీ పెదవి చక్కఁదన మొ
            క్కటికె కా, దింక రెండింటికిఁ గలదు


గీ.

తరుణి, సంఖ్యచే రెండని ద్వైతముగను
చెప్పుటే గాని, సరిగ చర్చించి చూచు
వారి కెల్ల నభేదభావంబు తోఁచు
చుంట నద్వైతముగఁ జెప్పు టుచితమేమొ.

23


శా.

నాణెం బౌ రతనాలదుద్దులును, సొన్నాటంకపుం బేరు వి
న్నాణంబౌ పుదుచేరిచేఁత జిగినీ నానున్ సువర్ణంపు టొ
డ్డాణంబున్, రకమైన నాగరము మేల్వంకీలునున్ కంకణాల్
రాణింపన్ మరురాణివాస మన నారాణీ, విరాజిల్లవే.

24


ఉ.

కామిని, పచ్చపట్టురవికన్ బిగి గల్గ ధరించి, మేలి బా
లామణిచీరఁ దాలిచి, తళ త్తళ లాడెడి దుద్దు లాదిగా
హేమవిభీషణప్రతతు లెన్నియొ మేనున బూని నట్టి నీ
గోము తలంచుచున్ మఱపు గొందుఁగదే యితరప్రపంచమున్.

25


శా.

జాకెట్టున్ జలతారుచీరయును భూషల్ దాల్చి, దోషాకరున్
చేకొట్టం గలమోముతో వెలయు నీ చెల్వంబు వీక్షించినన్
వాకట్టౌఁ గద యెట్టివారికిని, చెల్వా విల్వకే యిత్తువో,
తాకట్టుంతువొ? నీమనంబు వశ మొందంజేయుమా నాఁకికన్.

26

చ.

విపులము గాఁగ కుచ్చెళులు వీచులమచ్చున తోచుచుండ పైఁ
టపరికిణీని కట్టుకొని, దగ్గఱపింజలు కల్గినట్టి స
న్నపుతెలిరైకయుం దొడిగి, నాడెపుగుమ్మట మట్లు నీవు నా
కెపుడును దోఁచుచుందువుగదే జగదేకవిలాసినీమణీ.

27


ఉ.

జాఱుగ కేశముల్ ముడిచి చక్కనిదొక్కగులాబిపువ్వు పై
జేరిచి, బాగుగా చలువచేసిన తెల్లనిచీర కట్టి, క
బ్బారవికన్ ధరించి, మెయి భారపుసొమ్ములు లేని నీదు సిం
గారము కన్నవారలకు కన్నులపండుగ కన్నెమిన్నరో.

28


చ.

వదులుగ నల్లినట్టిజడ, వంగి మొగంబున మూఁగుముంగురుల్
నుదుటి సిలాయిచుక్కయు, కనుగవ కాటుకరేఖ, సన్నవై
పొదలెడి తెల్లపుట్టమును పుక్కిటవీడెముచేత నెఱ్ఱనౌ
పెదవియు, నీకు పెట్టియును బెట్టనిసొమ్ములు కావె కొమ్మరో.

29


ఉ.

బాపురె! నీ మొగంబునకు పౌడరు చల్లుట యేల? సబ్బుతో
రాపిడి యేల మేని? కధరంబునకుం దములంపుఁ గెంజగిం
దోపగ జేయ నేల? కనుదోయికి కాటుక యేటి? కో పడం
తీ! పునరుక్తిదోషమున కివ్వి యుదాహరణంబు లౌఁ జుమీ.

30


చ.

దిటముగ నల్లి గుండ్రముగ దీర్చిన కీల్జడ యొక్కమారు, వ్రేల్
జట యొకమాఱు, గుత్తమగు జార్ముడి యింకొకమాఱు, మేలిము
చ్చటముడి యొక్కమారు, కడుచక్కనియొస్సిగ యొక్కమారుగా
కుటిలకచా, భవత్కచము గూర్తువు నామది చిక్కు పొందగన్.

31


చ.

విరియని మల్లెమొగ్గ లొకవేళను, వీడిన యిట్టిసంపెఁగల్
మఱియొకవేళ, చక్కలిగులాబులు వేరొకవేళ, గేదగుల్
మఱియొకవేళ గాఁగ కుసుమంబులు వేణిని దాల్చి పువ్వుబోఁ
డిరొ, పువువిల్తునారసము ఠేవను నాఁటెదు నామనంబునన్.

32

చ.

సగము సరీరమున్ తలుపుచాటున దాఁచి, సగంబు వీథిలో
కగపడు నట్లుగా నహరహంబును నిల్చినయట్టి నిన్ను ర
క్తిగఁ గనుచుండుట భ్రమరకీటకనీతిని నాశరీరమున్
ముగుద సగంబె యయ్యెఁ బరిపూర్ణకృపం గనిపింపుమా యిఁకన్.

33


ఉ.

పేశలవార్ర, స్నానమయి పెన్నెరులం దడియార్చి మేడపై
కేశచయంబు చిక్కు తొలఁగించుచు నీవు పచారు చేయుచో,
రాశిగనున్న మబ్బులఁ దొరంగు శశాంశునిబోలు నీమొగం
బాశ మదీయదృక్కువలయంబులకుం గలిగించు టభ్రమే.

34


శా.

డాబామీఁదను సందెచీకటితఱిన్ డాబొప్పఁగా నీవు ము
స్తాబై చల్లనిగాలికై దిరుగఁగా, స్వర్లోకమందుండి రం
భాబింబోష్ఠి యై యేగుదెంచెనని విభ్రాంతినిన్ దలంతుంగదే?
యో బాలా! నినుఁ గోరకుండెడి శుకుం డుర్వీస్థలిం గట్టునే.

35


ఉ.

అద్దము ముందు పెట్టుకొని యందముగాఁ గనునీవు పాపటన్
దిద్దుచు నుండగా, తెరువదేయని చొచ్చిన నాదుచూపులో
ముద్దియ, రెండుచెంపలక మూఁగి నొసంటకి సాఁగి చెక్కులన్
కొద్దిగ, నాఁగి, మోముపయి గ్రుమ్మరసాగెను జాపలంబునన్.

36


ఉ.

గానకళావిశారదపు గావున చల్లనివేళ, ముందు హా
ర్మోనియ మీవు పెట్టుకొని మోహనగాత్రిరొ, జంత్రగాత్రముల్
వీరుల కొక్కరీతి వినిపింపఁగఁ బాడిన పాటచేత నా
మానసమందు కోర్కె పలుమారు చిగిర్చె, ఫలించు టెన్నడో.

37


ఉ.

బాలిక స్నానమున్ సలిపి, పట్టుదుకూలము కట్టి నీవు దే
వాలయసీమ చేర నుపవాసముచే పసివాడి ముచ్చటం
జాలఁగ గొల్పు నీ మొగము చందము కన్గొని మోహ మొంది, యా
వేళను నీదుపొందు నొదవింపుమటంచును దేవుఁ గొల్చితిన్ .

38

ఉ.

చేతను బుస్తకంబులను జేకొని మెల్లగఁ బాఠశాలకై
యో తరళాక్షి, నీ వరుగుచున్నెడ, మన్మథబాధచేత నా
చేతము వ్రీలుచుండ, నినుఁ జీమయుఁ గుట్టినయట్లు కాదయో
భూతదయాగుణం బెదను బుట్టని నీచదు వేలఁ జెప్పుమా?

39


చ.

నెలఁత, కొళాయి కీ వరిగి నీళ్ళను బట్టుచు నిల్చియుండఁగా,
బొళబొళ మంచు గొట్టమున బుట్టిననీళులు నీదుబిందెలో
పలఁ బడినట్టిరీతి నుతిపాత్రమవౌ నిను జూచి నామన
స్థలిని ద్రవించుకోరికలు ధారను గట్టి స్రవించె నీపయిన్.

40


ఉ.

బోటిరొ, మొన్న నాటకము చూచుటకై చనుదెంచి, యచ్చటన్
బోటులలోల నిన్నుఁ గని బుద్ధిమరల్పఁగ లేనివాఁడనై,
నాటక మేమియో యెఱుఁగ, నాయకి వీ వగు చిత్రనాటకం
బాటగ మన్మథుండు ననువాఁడగ జేసెను సూత్రధారుఁ డై.

41


ఉ.

సంబర మీవు చూచుటకు చక్కనివేషముతోడ బండిలో
నం బయికాస్యమించుగ కనంబడునట్లుగ వంగియున్నచోఁ
శంబర నేత్ర నేత్రములు నాపుగ విప్పుచు నిన్నుఁ జూచుటే
సంబరమయ్యె నాకు, పయిసంబర మతయు వ్యర్థమే సుమీ.

42


శా.

బొట్లం జెప్పఁగ భూషితాంగి నగుచుం బువ్విల్తు పట్టపుటే
న్గట్టి వేగుచునుండ, దీపపువెలుగందున్ నినున్ గాంచి, చీఁ
కట్లన్ నీమెరు?గారునవ్వులె తొలంగంజేసెనో లేక గా
స్లైట్లే మూలకుఁ ద్రోసెనో, యెరుఁగ కాశ్చర్యంబు కంటిం జెలీ.

43


ఉ.

బందుగులింటిపెండ్లికయి బాలరొ నీవును నేనుఁ బోయి యం
దరుం బెండ్లిసందడులయందు మునింగి మెలంగఁగా, నదే
సందడియంచు నుంటి మదిజ్ఞాపక మున్నదొ లేదొ! నాఁటి యా
నందము నిన్ను నేఁ గలిసినంగద క్రమ్మరఁ గల్గగావలెన్.

44

చ.

 చిలుకలు పెల్లుగాఁగ రొదసేయు, బికంబులు కూయ, షట్పదం
బులు కడు మ్రోయఁ దీవగమి పూయఁగఁ బూవులు తావులీయనిన్
గలిసి విహారమున్ సుమవనంబుల సల్పఁగ నేర నేని తొ
య్యలి, మఱి యీవసంతము నిరర్థకమే ఋతురాజ మయ్యునున్.

45


ఉ.

ఆతపతాప మొక్కదెస, నంగజతాప మింకొకదిక్కునన్
నా తను వేర్చుచున్నయవి నాతిరొ, గంధపు లేతపూతలన్
శీతలమైన నీయెదను జేరిచి తాపము బాపకున్న, నే
రీతిగ నాతరం బగును గ్రీష్మదినంబుల నెల్ల దాటగన్.

46


చ.

జలదము మూసిపెట్టి దివసంబులు రాత్రులఁ జేయుచుండ, లో
పలియడు గించుకేనియును పైకిడనీయని వాన జోరుగా
ఇలఁ బడుచుండ, వెచ్చఁదన మిచ్చెడి యింటను రేపవళ్ళు నిన్
గలిసి సుఖింపగా మదిని గాంక్ష జనించెను గామినీమణీ.

47


ఉ.

నీరదపంక్తిలేమిని వినిర్మలమౌ గగణస్థలంబునన్
శారదపూర్ణచంద్రముఁడు చల్లెడి చల్లని చంద్రికల్ భవత్
స్మేరముచే నిరర్ధకత చెందుచునుండఁగ, నిన్ను గూఁడి యిం
పార సుభాంగి, వెన్నెలబయిళ్ళ సుఖించుట యింద్రభోగమే.

48


ఉ.

ఇంతయు సందు లేక బిగియించిన గాఢపుకౌగలింతలన్
సంతస మీవు నా కొసఁగ సమ్మతిలన్ వలె నట్లు కానిచో,
కాంతరొ మంచుచే వడఁకు గల్గగ చేసెడి దీర్ఘమైన హే
మంతపురాత్రులం గడప మార్గము లేదు మఱేది యేనియున్.

49


చ.

కుటిలశీరోజ, దిట్టమగు కుంకుమచర్చలచేత రక్తిమన్
దిటముగఁ బూనినట్టి భవదీయకుచద్వితయంబు ఱొమ్ముకుం
పటులవిధాన కట్టుకొని, మానునొ యీశిశిరంబునందు హృ
త్పుటముననుండి పుట్టు చలి పోవునె యిందుకే పాటుపడ్డటున్.

50

ఉ.

వీథిని బోవ ఱెప్పలను వేయకనన్ కనుగొంటెగాని, నా
బాధ యెఱింగి నీదు మది భావము తెల్ప తెల్పఁ దలంపవేమి? శ్రీ
నాథుని ద్రావిడాంగనల నైజము చూపక, యేనియేనియున్
సాధనమున్ వచింపగ సారసలోచన, గూడి కేళికిన్.

51


ఉ.

ఇష్టము నీకు గల్గినటు లించుక యేనియు నీవుపలుకు ని
స్పష్టము చేయకున్నయెడ, బాకులు కత్తులు నై సుమంబులే
కష్టము పెట్టు నామదిని కామిని, నీదుకటాక్ష మున్నచో,
ముష్టిశరంబులన్ మరుఁడు మూలకు పాఱఁగవైవఁగావలెన్.

52


ఉ.

ఏర్పడజేయకుంటివికదే భవదీయమనంబు నీదు ని
ట్టూర్పులు, పైఁటజార్పులు నొకొక్కపు డాశను గొల్పు, నంతటను
మార్పులు నీప్రవర్తనమునం గనుపట్టి నిరాశపుట్టు నే
నోర్పు వహింప, దర్సకుఁడిఁ కోర్సు వహించునె దర్పహీను డై?

53


చ.

అడిగినయంత నొప్పుకొనునట్టులె కన్పడి, వేఁడి నంత ని
య్యెడఁ గడుబెట్టొనర్తు వహ! యియ్యది తొయ్యలి నీకె కాదు, నిూ
పడఁతుకజాతికంతకు స్వభావము, భావ మెఱింగి నిన్ను నే
విడువకయుంటి, నేలుకొనవే, యిటు బెట్టొనరింప నేటికే.

54


చ.

అభిమత మున్నయట్టు లొకయప్పుడు, లేనటు లొక్కయప్పు డో
యిభగమనా, కనంబడెద వేటికె? కాంతలచిత్తముల్ జగత్
ప్రభుఁడె యెఱుంగఁగా వలయు తావకచిత్తము తెల్పకుంట, బె
ట్టొ, భయమొ? యిట్లు చంపఁగ నెటుల్ మనుదున్ మనసిచ్చి యేలవే.

55


ఉ.

నోటను నాకు తావకమనోవిధముం దెలువంగ నీకు మో
మోటము కల్గెనేని, మునుమున్ కనుసైఁగలు లేవె? లేవె వ్రేల్
మీటులు? మందహాసములు లేవె! య వేవియు చేతగానిచో,
చీటులు లేవె? పంపుటకు చేటులు లేరె? యుపేక్ష యేటికే.

56


ఉ.

సిగ్గును గొంకునుం గలుగు చేడియ లుండరు? వారు నీవలెన్
దగ్గఱ చెంత చేరఁగనె దాఁగఁగ తుఱ్ఱునఁ పాఱిపోదురే?

ఇగ్గతి యిప్పుడైన, మఱియెట్లుగ కౌఁగిట నుండనేర్తువో?
దగ్గిన నూడుముక్కు వనితా, యెటుతుమ్మిన నిల్వ నేరుచున్.

57


ఉ.

సిగ్గునఁ గొంకు చుంటివొకొ చిన్నవయస్సునుజేసి వెన్కకున్
తగ్గుచు నుంటినో? చతురతన్, మఱియున్ మురిపించు చుంటివో
మొగ్గును జూపుచుంటివొకొ! ముద్దియ, మత్కృత మైన దెద్దియో
యెగ్గు ఘటిల్లెనో! దయవహింపుము, దోసిలియొగ్గి వేడితిన్.

58


ఉ.

గుట్టును నేనుదాచనని కొంకుచునుంటివో? చుట్టులైన, నే
నొట్టును బెట్టుకుందు వినుమో చెలి, నామది కా కాముఁడమ్ములన్
గట్టిగ త్రవ్విచూచినను గన్పడకుండెడి లోతునందు నేఁ
బెట్టి, భవత్స్వరూపమును బ్రీతినిగాంచెద దైవసాక్షిగన్.

59


మ.

నెలఁతా, కాళ్ళరుగఁగ నేఁ దిరిగితి, నిల్వంబడఁగా, నదే
నిలజుంటింజుమి నిల్వుబత్తెముగ, నే నిద్రింపనే లేదు రా
త్ప్రులయం, దిట్లుగ నాశ్రయించినను, నాతోఁ బల్కునుంబల్క, విం
దలిబాధన్ సగమేని పడ్డయెలన్, స్వర్గంబె సాధింపనౌ.

60


ఉ.

రోజున కొక్కరీతిని సరోజముఖీ, చరియించుచుందు, న
వ్యాజకృపావిశేషము నొకప్పుడు చూపెద, నొక్కయప్పు డే
దే జగడంబు పెట్టుకొని యొద్దకునైనను జేరనీయ, వ
న్నా! జవరాండ్రచిత్తగతులన్న, క్షణక్షణముల్ నిజంబుగన్.

61


ఉ.

సమ్మతి నీకు లేదని నిటమ్ముగఁదోఁచిన లేదటంచు స్ప
ష్టమ్ముగఁ జెప్పకుండ ననుఁ జంపగ నేటికి, చెప్పినంత, ప్రే
మ మ్మొదవింపఁగాఁగలుగు మందులు మ్రాకులు నెల్లఁ దెచ్చి వ
శ్య మ్మొనరించుకొందు వనజాస్య, యవశ్యముగాఁగ నిన్నికన్.

62


శా.

అంగీకారములేనిచోఁ దెలుపరాదా? పామునున్ చావకుం
డగాఁ, గఱ్ఱయు సైతమున్ విరుగకుండగా నిటేలా? ప్రసూ
నాంగీ, నీనిరపేక్ష తెల్పఁగనే, నిన్నర్థించుకష్టంబు నా
కుం గోపంబును జూపుకష్టమిఁక నీకు, గల్గకుండుంగదా.

63

ఉ.

దూతికతోడ నీకడకు తొయ్యలి, నేఁగబురంప దానినిన్
బూతులు తిట్టి తోలితఁట! బుద్ధిహీనతయే, మఱోక్తుతో
ఈ తెఱఁగౌ రహస్యమును నేనువచించుట; తప్పువచ్చె నేఁ
జేతులు మోడ్చి మ్రొక్కితిని, జేసినదోసము సైఁచియేలుమా.

64


శా.

సంకేతస్థలి కేను ముందుచని, యో చానా, ఇంకన్ వత్తువో,
ఇంకేవత్తువో?" యందు కాచుకొని, నీవెన్నింటికిన్ రామి “ఆ
టంకంబేదియొకల్గి మానితివొ, యిష్టంబుడమిన్ రావొ?” యన్
శంకంబొందితి, మాకు కాగశలునిరాశల్ చేయ న్యాయంబటే.

65


ఉ.

రాతిరిరాఁగ ప్రొద్దుటను రమ్మని ప్రొద్దుటరాగ నింక నే
నీదోతఱి రమ్మటంచు, నిటులో తరుణీమణి, నన్నుఁ ద్రిప్పుటే
తియఁటే! యేదోయొక నిర్ణయమౌ సమయంబు తెల్పినన్
చేతులు నేను గట్టుకొని చేరనె, యెట్టియకాలమైనన్.

66


ఉ.

కోకలు కోరెదో, నగలు కోరెదో, కానుక లేవి కోరెదో,
రూకలు కోరెదో, చెలియరో, తెలియంగను జేయకీవు న
న్నీకరణిన్ శ్రమంపఱచె దేమిటికే? పులిజున్ను నేనియున్
లోకము లెల్లఁజూచి తృటిలోఁ గొనివచ్చెద నీవు కోరినన్.

67


మ.

ఉవిదా, యక్కర తీరునంతవఱ కేవో యచ్చికల్ బుచ్చికల్
చెవికిష్టంబునఁబల్కి, యా వెనుక నిన్ చేరంగ నేరానొ య
న్న విచారంబును బెట్టుకోవలదు, బ్రాణమున్నిన్ని నా
ళ్ళు విధేయుండను నీకు, నావలపు నేండ్లుంబూండ్లు తగ్గించునే.

68


ఉ.

మక్కువ నీకు కద్దనిన మాత్రముచేత లాభి మేమి? నా
యక్కర దానఁదీఱెనఁటె! యక్కట, నీవిడు ముద్దులబ్బెనో?
అక్కుననిన్నుఁ జేర్చుకొనుట ద్బెనొ? నీమధురాధరోష్టమున్
నొక్కుట యబ్బెనో! మఱి మనోహరి, పట్టిప్రియం బిదేటికే.

69


ఉ.

వారికి వీరికిం దెలియ వచ్చునటంచును జంకుచున్న, నో
నీరజనేత్ర, యెన్నఁటికి నేనియుఁ గార్యము సానుకూలమౌ

నే? రమణీజనంబులకు నిండుగ సాహసముందు సంరు; తే
దారియొ చూపి, నాదుసరదా కొర దాపడకుండఁ దీర్పుమా.

70


శా.

పాతివ్రత్యము కల్గుదానివలెనే భాషించుచున్ నిష్ఠలున్
నీతుల్ పల్కిన, ముద్దరాల వనుచున్ నిన్నందురే? యెన్నియో
చేతుల్ చూచిన జాణవం చెరుఁగనా? చెల్వా, యిదేరీతిగా
చాతుర్యంబులు చూప కేలుకొనవే సంప్రీతిచేతస్కవై.

71


చ.

మగఁడు మనంబునందు ననుమానము పొందెను గాన నన్ను రాఁ
దగదని వార్తపంపితివి, తప్పుకొనన్ మిషగాని, నిశ్చయం
బుగ మదిలోన నీవు వలపుం గలదానవయేని, భర్తక
న్నుఁగవను గప్పనేరవె మనోహరి, యింతటిజాణ వయ్యునున్.

72


శా.

గోడల్ గొందులు దాటి, జంకు మఱి గొంకున్ లేక, కన్దోయి కె
వ్వాఁ డింపై కనిపించినన్ సరియె యవ్వానిను యథేచ్ఛను రతి
క్రీడం దేల్చిన ప్రౌడవీవని ధరిత్రిన్ నీదు విఖ్యాతి వి
న్నాఁడను; నేఁడు ననున్ వరింతువని యున్నాఁడను పువుబోఁడిరో.

73


ఉ.

చెప్పెద నింటివారి కనిచీకటినన్ బెదరించల? యే
తప్పునుమోసి చెప్పెదవు? తావకరూపము చూడఁగూడదో
యొప్పుమటంచు వేఁడదగదో? యటు చెప్పెదుగాని, ముందుగా
తిప్పలు పెట్ట కేలుముగదే జగదేశవిలాసినీ ననున్.

74


చ.

అతివరొ యింటఁ దెల్పెదనటంచును నన్ బెదరింపఁబోకు, నీ
వు తెలుప, నేనుమాన, తగవున్ విరువారలె తీర్త్రు కాక, యె
ట్లు తొలుత నాశపెట్టితివొ, లోఁకువయైతి నటంచు నెట్లునా
హితమును దీర్ప మానితివో, యీసకలంబును బైకి చాటెదన్.

75


శా.

పాపం బీవనియంచు నన్నిపుడు చేపట్టంగ రా వేని? నీ
కే పాపంబయి, నాకుకాదె, నరకం బీవొంద, నేనొందుదుం
దాపం బచ్చటఁబొందఁగా వలయు నన్నం దాపమిచ్చోట లే
దే? పూఁబోఁడి భయంబు పోవిడిచి, నన్నేలంగదే సత్కృపన్.

76

ఉ.

పాపమటంచు నన్నుఁ బరిపాలన చేయు కొప్పవేల! తా
రావతి నేలినట్టి గురురామకుఁగలగని యట్టిపాపమున్
గోపకుమారు గోపికలు గూడఁగగల్గనియట్టిపాప మో
సీ పువుబోఁడి నీకొకతెకే యిపు డబ్బునె యబ్బురంబుగన్.

77


మ.

అతివా, అంగననమ్మరా, దనెడి పద్యంబెన్నడో మున్ను చి
న్నతనంబందు పఠించినాఁడను, ననున్ నమ్మించి నమ్మించి, యి
ట్లుతుదన్ నీ వొనరించు మోస మిపు డాలోకించుచును, దానికిన్
స్తుతికా, దక్షరలక్ష లీయఁదగునంచున్ నేడు నేనెతెంచితిన్.

78


చ.

నెలఁతరొ, కన్నెప్రాయమున నీవు మదంకము నెక్క, నీదుచం
కల గిలిగింతగొల్పుచును, కాయము నెల్ల స్పృశించి బుగ్గ ము
ద్దులు గొనుచున్, నన్ను వలచితివో వగలాడి! యటన్నవ్వి "నా
వలవుల కాంత ”నంటి; వల వాక్యము నిక్కము సేయు మియ్యెడన్.

79


ఉ.

ఈడుకు నీవు వత్తువన, నింటను గల్గినవారు నిన్నుఁగా
పాడుచు చేడియాఁ బయట పాదము పెట్టఁగనీనివేళ, నిన్
చూడఁగ నేనుబడ్డశ్రమ చూచితివేనియు, నిప్పుడైన నా
వేడుక దీర్పకుండుదువె వేవురుకాఁపుగ కూరుచుండినన్.

80


ఉ.

ఎన్నటికింక నీ వెదిగి యీడుకు వత్తువొయన్న వాంఛతో
కన్నులనీదు సౌష్టవ మెగాదిగిఁ జూచుచు వత్సరంబు లే
నెన్నుచునుండ, నిప్పటికి నీవు రజస్వల వైతి, వింక నో
కన్నె యుపేక్షమాని వడిగా మదపేక్షను దీర్చి ప్రోవుమా.

81


ఉ.

సుందరి, పెద్దదానవయి శోభిలుకాలమునందు నొంటిగా
నందు లభించినంత, కనుసైగలు, నవ్వులు, మేనిరాపులున్
తొందరపాటుముద్దులును దొంగతనంబుగ మార్చుకొన్న యా
చందము నీకించుకయు జ్ఞప్తియులేనటులుంటి వియ్యెడన్.

82


చ.

ఇఱుగుగలట్టిదారి మనమిద్దఱ మొంటిగ తారసిల్లఁగా,
చిఱునగవొప్ప నీభుజముచే ననుఁ జెచ్చెరఁ ద్రోసికొంచునీ

వరిగిన నాటిచందమును నందము డెందమునందు నాటుటన్
మఱవకయున్నవాడను సుమా కుసుమాంగి సుమాస్త్రునానగన్.

83


ఉ.

అంటెనొ నీకు నూత్నముగ నచ్చట నేదియొ? భాగ్యమత్తవా
రింటికిఁ బోయి వచ్చిన యిటీవల బాల్యపునేస్తకాని నన్
కంటను జూడవైతివి, ముఖాముఖమైన, మొగంబు వాల్చుకొం
చుంటివి, బాల్యకాలపుప్రియుల్ కనిపింతురె భర్త వచ్చినన్.

84


చ.

పొరుగున కీవు వచ్చుటను బుణ్యముపండెను నాకటంచు సం
బరపడుచుండ నన్నుఁ గన బైకినిరా, వొకవేళ వచ్చినన్
శిరమును నెత్త, వెత్తినను, జేసిన సైఁగకు మారుచేయ, వీ
విరుగునఁ జేరినట్టిఫలమే కనిపింపక తూన్నదో చెలీ.

85


సీ.

బొట్టు పెట్టమి మచ్చకట్టకుండఁగఁ దేట
            యై ముచ్చటం గొల్పు మోముతోడ
నగలు క్రిందను మీఁద దిగవేసుకొనమి న
            ల్పొందక జిగి గల్గు నొడలితోడ
నూనె వాడుకను మానుటఁ జేసి జిడ్డును
            బొరయకయున్న పెన్నెఱులతోడ
రవిక లేమిఁ దెలిచీరను స్పష్టమౌ నటు
            కనిపించు మేని పొంకంబుతోడ


గీ.

తరుణీ, యిప్పటి బాలవితంతురూప
మే! వెనుకకంటే నెక్కువ హితముకొల్పె
భర్తకంటెను నీ కుపభర్తనౌచు
నెక్కువహితంబు కూర్తు నే నింకమీద.

86


మ.

విధవాత్వంబున కీవు చింతిలకుమీ వీరేశలింగంబుగా
రు ధరన్ మీకొరకే జనించి రలవారున్ దారిచూపింపకు
న్న, ధృతిన్ మానఁగబోకు, నీకు దయ యున్నంజాలునో బాలికా
వృధగా నీయెలప్రాయముం గడవఁగానీయంజుమీ యెన్నడున్.

87

ఉ.

బొట్టును బెట్టుకోఁదగిన పుణ్యము పోయెనటంచుఁ గుందకే,
ఇట్టులు లేఁతప్రాయమున స్వేచ్ఛలభించుట భాగ్యమే గదా;
ఎట్టివిధంపులోప ముదయింపని యబ్లుగ, నీకు బొట్టునుం
బెట్టి ప్రియంబునం బిలుఁతు బ్రేయసి, రాఁగదె నాదుప్రక్కకున్.

88


సీ.

ముంగురుల్ నొసటిపై ముసరితుం పెసలారఁ
            గను నీవు నాట్య మాడిన తెఱంగు
వీనులఁ దేనెల సోనలఁ గురిపించు
            చను నీవు పాట పాడిన తెఱంగు
కరకంకణముల నిక్వణ మనుక్షణము గ
            ల్లనఁగ నీ వభినయించిన హొరంగు
తూపుల రూపున చూపఱ హృదయముల్
            కలిగించు నీదు చూపులు మెఱుంగు


గీ.

మేళములతోడి వారకామినులతోడఁ
గూడి నీవున్న యట్టి యంగును గనుంగొ
నంగనె యనంగుఁ డేచఁ గడంగె; నంగ
నామణీ నీమఱుంగు నొందంగ నిమ్మ.

89


శా.

కొక్కోకంబును నేర్చి, వాక్కులును టక్కుల్ పెక్కుగా నేర్చి వే
ఱొక్క ర్తెవ్వర్తె నీకు సాటియగు నోహో! వేశ్యలం దేనియున్
రొక్కం బెంతయినన్ సరే యొసగెదన్ రో చేడెరో,నన్నికన్
చొక్కింపంగదె, నేర్పు లెన్ని కలవో చూపించుచున్ మక్కువన్.

90


ఉ.

కాంతలె మాయకత్తె లనఁగా వెలకాంతయు మాయకత్తెలం
చింతరొ, వేఱె చెప్పవలెనే యిది స్పష్టముగా నెఱింయున్,
స్వాంతము నందు నిన్ వలచి వచ్చితి, తక్కిన వేశ్వలట్లే కా
వింతువొ, నమ్మకంబు నొదవింతువొ యీపయిఁ జూడగా వలెన్.

91


మ.

మగవారల్ వశమౌట కెల్ల గణికల్ మందుల్ ప్రయోగింతురం
ట! గుణంబిచ్చునటంచు నాకెవియొ పెట్టంబోదు వేమోసుమీ;

వగలాఁడీయటు పెట్టకున్నపుడె యోర్వన్ రాని యీబాళినిం
డెఁగదా? పెట్టిన, మన్పధుండసువు లేనిన్ నిల్వంగానిచ్చునే?

92


సీ.

చవిచూపితినెకాని చాన, నీయధరసు
            ధల్ పల్మొనలుగ్రుచ్చి త్రావనైతి,
ఆనించితినెకాని యతివ, చెక్కిటమోవి
            ననుకొన్నరీతి ముద్దాడనైతి,
స్పృశియించితిని చెలి, నీయురోజమల్
            గట్టిగా పలుమారు పట్టనైతి,
తగిలించితినెకాని తరుణి, మేన్ మేను న
            ల్లికగొనఁగాఁ గౌఁగలింపనైతి,


గీ.

మచ్చుచూచితినెకాని మగువ, ప్రథమ
నిధువనంబౌటఁ దృప్తిజనింపఁగా ర
మింపనైతిని, గాన నేయింపుమై పు
నస్సమాగమనంబునకు నింతగఁ దపింతు.

93


ఉ.

కౌఁగిట నిన్నుఁ జేర్చుకొనఁ గల్గెడిభోగము నింద్రభోగముం
గా గణుతింతు, నెంతనినుఁ గౌఁగిటఁజేర్చినఁ దృప్తికల్గలే
దో గజరాజయాన! యిఁకనొక్కపరిన్, మఱియొక్కమాఱు, త
ద్భోగము నేనుబొందఁదలఁతున్ విసువుంగన కట్లొసంగుమా.

94


ఉ.

కాముకవృత్తిమై రకరకంబుల భామలతోడ నేస్తమో
కామిని మున్ను సల్పితినిగాని యొకర్తుక యేని నేర్పునన్,
గోమున, నిన్ను బోలఁగలకోమలి కన్పడలేదు, నేనిఁకన్
కామునిసాక్షి గాఁగ నినుఁగాక మఱొక్కతె నొల్ల నెన్నఁడున్.

95


ఉ.

ఓ ఫణిరాజవేణి, మన మొండొరుమోములు చూచుకొన్న వే
ళాఫలమో, మఱేమియొ, బళా! నినుఁ గన్నులఁ గన్న దాదిగా
సాపుగ నన్యకామినుల సంగతికిన్ మనసొగ్గదాయె, ద్వై
రేఫము వేఱువువ్వులఁజరించునె, నీరజమే లభించినన్.

96

చ.

జలజదళాయతాక్షి సరసంబునకుం బొలయల్కయుండఁగా
వలయునటంచు నల్గితివొ? వ్యర్థపుఁగోపము తెచ్చుకొంచు, నీ
వులుకకపల్క కీకరణి యూరకయుండుటనీతికాదు, నన్
పిలిచి, యథాప్రకారముగఁ బ్రేమనుగౌఁగిటఁ జేర్చుకోఁగదే.

97


ఉ.

ఇంకొక కామినిన్ మరిగి యిప్పుడు పోవుచునుంటినటంచు నో
పంకజనేత్రి యట్టియపవాదమునాపయి మోఁపెదేల? యి
ఱ్ఱింకులుగొన్న మోహమున నిప్పుడెకా, దిఁక నెప్పుడున్ భవత్
కింకరుఁడన్, మఱింకఁ దొలఁగించుకొనంగదె నీదుశంకలన్.

98


శా.

ఏయాటంకము లెన్ని కల్గినను నిన్నే నేను, నన్నీవు కాం
తా! యిన్నాళ్ళును నాశ్రయించుకొని యున్నా, మింతొ యంతో సుఖం
బే యెల్లప్పుడుఁ బొందినారము గదా! యిట్లున్న యన్నాళ్ళునున్
హాయింగూర్పఁగ నిన్ను వేడుకొనెదన్, దైవంబు, బ్రార్ధించెదన్.

99


మంగళం బగుఁగాక మానీనీ తారకా
            సఖములౌ తావకనఖములకును!
మంగళం బగుఁగాక మగువ, చక్రప్రతి
            బింబమౌ నీదునితంబునకు!
మంగళం బగుఁగాక మహిళామణీ, కోక
            రాజములౌ నీయురోజములకు
మంగళం బగుఁగాక మదిరాక్షి శశికళా
            సదనమౌ భవదీయ వదనమునకు!


గీ.

మధుపుక్రోవియౌ మోవికి మంగళంబు
మల్లెపువులగు నవులకు మంగళంబు!
మరులు గనులగు కనులకు మంగళంబు!
మధుకరులగు ముంగురులకు మంగళంబు!

ప్రథమభాగము సంపూర్ణము.

జాబులు

రెండవభాగము

శ్రీనందన సమసుందరుఁ
డైన మనోహరునకుఁ బ్రియురా లనురాగం
బూని కవుంగిట గాఢము
గా నణఁచుచు మ్రొక్కి, చేయగల విన్నపముల్.

1


ఉ.

కంటికి నింపుగాఁగ నినుఁ గన్నది యాదిగ కామబాధచే
గంటసమయ్యె నాబ్రతుకు, కంటికి నిద్దుర రాకయుండె, ఆ
కంటికి నన్నమైనఁ దినఁగా వెగటయ్యెను, నిన్నుఁ గానమిన్
గంట యుగంబు కైవడిని కన్పడుచున్నది ప్రాణనాయకా.

2


చ.

అల దినమందు నా సమయమం, దల, చోటున, నీటుగోటు, లిం
పులు పలు సొంపు, లందమును బొల్పగు చందము, షోకుఠీకు, లే
పులు బలుకోపులుంగల యపూర్వపు నీచెలువంబు చూచి, నా
తలఁలు నీపయిన్ నిలిచె, తపవయో! యెటు త్రిప్పుకొన్ననున్.

3


సీ.

లేఁతవెన్నెలను బోలిన చిఱునవ్వుతో
            మురియుచునున్న నీముద్దుమొగము
కర్నరంధ్రము లడ్డుగా రాఁగ నిల్చిన
            గతిఁ బొల్చచున్న నీకన్నుదోయి,

వలరాజు పూర్తిగా వంచిన విండ్ల వై
            ఖరిఁ జెలువారు నీ కన్నుబొమలు
మోవి తేనియ మీఁద ముసరు తుమ్మెదలట్లు
            మిసమిసలాడు నీ మీసములను


గీ.

నీవెడఁదఱొమ్ము మఱియు నీనిడుదభుజయు
గమ్ము నీనడల్ నీయొడల్ గాంచి మది
రించి, తపియించుచుంటి నో ప్రియుఁడ యెట్టి
గతిగఁ బ్రోతువో? యిఁక నాదుగతివి నీవె.

4


ఉ.

చక్కదనంబునన్ సరిగ సంపెఁగమొగ్గయు, తమ్మిపువ్వు,
ముక్కు, మొగంబు వానిఁగని మోహముపొందితి, నాదుప్రాణముల్
దక్కకయుండ, సంపెగఁలుఁ దామరలున్ మదనుండు నాపయిం
గ్రక్కున వేయసాగె, ననుఁ గావుము నీమరుగిచ్చి నాయకా.

5


ఉ.

సంపెగమొగ్గతో తగవుసల్పెడిముక్కును, మల్లెమొగ్గలన్
చెంపలగొట్టు పల్వరుస, సింగములన్ బెదరించు మధ్యమున్
కెంపురు నీరసంబనుచు గేలియొనర్చెడి మోవిగల్గి, నీ
వింపు ఘటింతువోయి హృదయేశ్వర, నాకనుదోయి కెప్పుడున్.

6


ఉ.

తుమ్మెదఱెక్కతోడ తులఁతూగఁగజాలెడు నీదుమీసమున్,
తమ్ముల నేను నీకనులు, తల్పునుబోలె వెడందయైన నీ
ఱొమ్మునుగాంచి, మోహము నెఱుంగని నామది యిప్పు డక్కటా
కుమ్మరిసారెలోపల తగుల్కొనునట్లుగ నాయె నాయకా.

7


ఉ.

 నాపెనుమోహమంతయుఁ గనంబడునట్లుగ మాటిమాటికిం
జూపులఁ దెల్పుచుంటి, ననుఁ జూచుచు నవ్వుచునుంటి నీవునున్
నాపయి కూర్మి పుట్టి యటు నవ్వితివో, యటుగాక నాదు సం
తాపము గాంచి బేలవని నవ్వితివో, యెఱుఁగన్ మనోహరా.

8

చ.

సరిగను, మోడిగాఁగ, సరసంబుగ, తేలికగాఁగ, నోరగా
చుఱుకుగ నన్నుఁ జూతు వల చూపులభాషను నే నెఱుంగ; పల్
తెఱవక, యించుకే తెఱచి లేఁతగ పూర్ణముగాఁగవిప్పి సుం
దరముగ నవ్వుచుందు, వలనవ్వులభాషను నాకు నేర్పరా.

9


శా.

నీ వెవ్వడవు, నే నెవర్తె? నహహా! నీమీద నీమాడ్క నా
భావం బేటికి నిల్వ, కల్వవిరికిన్ పద్మారిపైరీతి? యా
పూవుంబోలిక దూరపుంజెలిమియే పొందక నాకబ్బునో?
నీవున్ నేనును బూవుఁదావియు బలెన్ నెయ్యంబుమైనుందుమో.

10


చ.

ఒకరికి మెచ్చుగొల్పుసొగ, సొక్కరికంటికి నచ్చదోయి నా
యక భవదీయరూపము మదక్షులకుం బ్రియమైనయట్టి పో
లికగనె, నాదురూపమున లేని విలాసములేని నీదుకం
టికిఁ గనిపించుత, న్మరుఁడు నేర్పుమెయిన్ ఘటియించు మాయచే!

11


ఉ.

ఒక్కొకకాంత కొక్కొకప్రియం గనునంతకు లోకమంతయున్
నిక్కముగా నెడారివలెనే కనుపట్టును, కన్నదాదియున్
చక్కని నందనోపవని చందమునం గనుపట్టు, నీవు నా
దృక్కుల పడ్డయంతటనె, దిక్కులు పుష్పమయంబు లయ్యెరా.

12


ఉ.

ఓరమణుండ, స్త్రీపురుషు లొండొరులన్ సమవాంఛ నేలఁగాఁ
బో "రది జన్మవాససయె పో” యని పెద్దలు పల్కలేదె! తా
గోరిన పూరుషుండు తనుఁగోరుటకంటెను భాగ్యమున్నె? నిన్
గోరితి, నీవు నాకు ననుకూలుడఁ వౌదువొ, లేదొ, యక్కటా!

13


చ.

వల పెద లేనియట్టి మగవానిపయిన్ మనసుంచి, వానితోఁ
గలయఁగ గోరుకంటె నరకం బిక స్త్రీలకు వేఱెకల్గునే?
తెలియని నీపయిన్ నిలిపితిన్ మది, నీవయి నీదుచిత్తమో
చెలువుఁడ నాదుభాగ్య మిదె చేతులు మోడ్చితి యేలుమా ననున్.

14

మ.

వలపుం దాతురు గాని, పూరుషులతో వాయెత్తి స్పష్టంబుగం
దెలుపంజూడరు స్త్రీలు, నాదువలపున్ నేనాపుకోలేక, ల
జ్జిలకుండన్ వెలిఁ బెట్టుకొంటి ననుచున్ సిగ్గయ్య, నెమ్మోమునిం
కిలలోఁ జూపఁగలేను, దాఁచుకొననిమ్మా నాథ నీగుండెపై.

15


ఉ.

కన్యనొ యన్యకామినినొ కావలెనంచుఁ దలంపఁ బోక, సా
మాన్యగ నెంచి ప్రాపకము మాటతలంపుము నిన్నుఁ దక్కనే
నన్యుల కంటకైన నరయన్ రతివేళనె వేశ్య నౌచు నిన్
ధన్యునిగా నొనర్తుఁ, గులనారు లెరుంగని యట్టినేర్పుతో.

16


మ.

నినుఁ జూడన్ వలెనంచు, వీలయినచో నీతోడ సంభాషణం
బు నొనర్పన్ వలెనంచు, వాకిటనె ఱేపున్మాపు నేఁ గాఁపురం
బొనరింపందొరకొంటి, మోహమున నోహో! సాహసం బెక్కు వా
యెను: నే నే చనుదెంచి, పైఁబడెదజుమ్మీ నీవు రాకుండినన్.

17


ఉ.

నిన్నుఁ గనంగ, నామనసు నిక్కముగా సెగపొంత వెన్నయౌ,
“వెన్నవలెం గరంగు నలవేణుల కౌఁగిటఁ జేర్చుటే సుఖం,”
బన్న వరూధినీవచన మారసి, నన్ వరియింపు, మట్లుగా
కున్నను, నామన స్సుడుకునో నవమన్మథ, మన్మథాగ్నిచే.

18


మ.

మగరాజా, బిగువేల? బ్రహ్మ భవదాత్మం జేసెనా యేమఱా
యిగ? నేనే మగవాడనై, మఱియు నీవేకాంతవై, నాపయిన్
మిగులన్ మోహముచేతఁ గ్రాఁగుచును నీమే నున్నచో నూర కీ
పగిదిన్ బెట్టొనరించి నీయుసురులన్ బాలౌటకుం జూతునే.

19


ఉ.

నమ్మక మైనదాన ప్రియనాయక, నాహృదయంబు నీకు నే
నమ్మెద రమ్ము నీదయకు, నయ్యది చాల ప్రియంబటంచు బే
రమ్మును బెట్టి నీవు కొసరం దొడఁగన్, పయిపెచ్చుగా మదం
గమ్ము నొసంగెదన్ వదలఁగా వల దింతటి చౌకబేరమున్.

20

చ.

అవసరముండి నేఁబలుకుమన్నను బల్కవు. పంచదారచి
ల్క వంటర! నిశ్చయం బగు శుకంబుగ నాభుజపంజరంబునన్
వివిధవినోదవాక్కులను వీనులవిందుగఁ బల్కుచున్ వసిం
తువనిన, నీకు నాపెదవిదొండను తిండిగఁ బెట్టెదం బ్రియా.

21


చ.

వనిత దనంతఁ దా వలసివచ్చినఁ జుల్కనయంచు, నన్నుఁ జు
ల్కనగను జూడఁబోకుముర, కాదని చుల్కగఁ జూడ నెంచుకొ
న్నను, పురుషాయితంబులను నామెయిభారముగాఁగనుండఁ బో
దని యయివన్ ననుం గలయరా వలరాయనికేళి నాయకా.

22


చ.

మగఁడన కంటికింపగుచు మక్కువగొల్పు నతండెయంచు ము
న్తగవును దెల్పెఁదార, యలతారకుఁ జంద్రుఁడువోలె నీవు నా
మగఁడవు త్రాఁడులేని యనుమానము తీఱఁగ, బాహుపాశమున్
బిగువుగ నాగళంబులను బ్రేమను గట్టఁగదోయి నాయకా.

23


సీ.

ముద్దాడెదను రార మోహనాకార నన్
            ముద్దాడ నీకు మోమాటమైన,
పెదవి నొక్కెద రార ప్రియనాయకా నాదు
            పెదవి నొక్కుట నీకు బిడియమైన,
కౌఁగిలించెద రార కామినీమార నన్
            కౌఁగిలించుట నీకు కష్టమైన,
సరస మాడెద రార సరసుఁడా, నాతోడ
            సరసమాడుట నీకు శంకయైన,
కటకటా! నోట వ్రేల్ వెట్ట కఱవలేని
కరణి నున్నావుగాని, యెందఱపెదవుల
గఱచినట్టి భుజంగశిఖామణి వొకొ!
ఎట్టిపుట్టలో, నేపామొ యెవరి కెఱుక?

24

శా.

నీసౌందర్యము కాంచి యాశ వడితిన్ నీచిత్త మేతీరొ నీ
మీసం బట్లు ప్రసన్నమై తనరునో? యారీతిగాఁ గాక, నీ
మీసం బట్టులు వక్రమో యెఱుఁగ; నీమీసాలలో నవ్వులున్
నాసందేహము వృద్ధిచేసె; నది మాన్పం జిత్త మిమ్మాప్రియా.

25


ఉ.

నాయక, నీవు నన్ వలచినాఁడ వటంచును నాకుఁ దెల్పఁగా
నే, యొడలెల్ల జల్లుమనియెన్, వలిగాలికి తీవకైవడిన్;
కాయము దాల్చినందులకుఁ గల్గె నదృష్టము నేఁటి: కింక నా
ప్ర్రాయము ధన్యమయ్యె; నిటుపై మఱి యే దెటు లైననున్ సరే.

26


ఉ.

ఎన్నఁడు నీకు మోహ ముదయించునొ నాపయినంచు నుండగా
ఇన్నిదినాల కద్ది లభియించెను కాంతల ప్రాయమన్ననో
క్రొన్ననవంటి దోయి 'యిదిగో' యన నాఱునెలల్ గతింపకుం
డ, న్నను ధన్యురాలిఁగ నొనర్పఁగ రాఁగదవోయి నాయకా.

27


ఉ.

కోకలు గోర, రూకలును గోరను, సొమ్ముల బెట్టఁగోర, నే
శోకము గోర నీకరుణ సోకుటయే పదివేలు నాకు, నీ
రాకనె కోరుచుండెదను రాకను జెందొవ గోరుమాడ్కి న
ఱ్రాకలు నన్ను బెట్టకుమురా. కలకాలము నేలరా కృపన్.

28


చ.

తనప్రియుఁ గూడకుండ వసుధం గులకాంతకు నత్త యంచు. మా
మని, మఱియాడుబిడ్డలని యడ్డులు గంగకు నొడ్డులట్లుగా
కని కనినాదు కాఁపురము గంగను దింప తెగింపు పుట్టెను, గం
గను శివుఁ డేలుకొన్నటులుగా నను నేలెద వన్నచో ప్రియా.

29


చ.

పురుషవరేణ్య! స్వాతికయి ముత్తెపుఁజిప్పలరీతి నాకనుల్
త్వరపడుచుండె తావకవిలాసము కన్గొన స్వాతిబిందువుల్,
కురిసినగాని ముత్తియపు కోవ జనింపదు శుక్తులందు ని
న్నరయనికాలమందె యుదయంబగు నాకనులయందు ముత్యముల్.

30

మ.

నిదురన్మాని మెఱుంగగా నలికితిన్ నీవచ్చుదారుల్ పదిం
బది నాకాటుకకన్నులం బఱపి, రమ్మా, నాకు కన్పండుగౌ,
ఎదురుం జూచుచు నుంటి 'ఇల్లలుకంగానే పండుగా?' యంచున
వ్వెదవేమో? యొకయిల్లెగా, కలికితిన్ వీథిన్, మఱిన్వాడయన్.

31


ఉ.

మందులు మంత్రముల్, వలెనె మామకచిత్తము మెత్తఁజేయ నీ
సుందరమందహాసములె చొక్కఁకఁ జేసెడి మందులౌ భవ
చ్ఛందనశీతలోక్తులె ముదం బిడు మంత్రము లౌనుఁ డెందమా
నందముఁ బొంద నన్ కలిపి నవ్వుచు కేరుచు నుండరా ప్రియా.

32


చ.

రమణుఁడ, నాదు మానస సరస్సుదరిన్ వలరాజు నీదు మీ
స మనెడి మేలిగాలపుకొసన్ నునుమోవియెరం దగిల్చి నే
ర్పు మెయిని వేటలాడఁగను, మోసమెఱుంగనిదై మదాత్మమ
త్యమకట! యందుఁ జిక్కుపడి యట్టిటు కొట్టుకొనంగఁ జొచ్చెరా.

33


శా.

నాకున్ నీకున్ గొంత యున్నదని నానారీతులం బేరులన్
లోకుల్ వెట్టిరి, వాడు రాఁదగిన డెట్లున్ వచ్చె, పో దెన్నఁడున్
కాకుల్ లోకులనంగఁబోకు, జనవాక్యంబద్ది కర్తవ్యమే,
కైకొమ్మా ప్రియకాంత గాఁగ నను నేకాంతంబునం గాంతుఁడా.

34


ఉ.

రోసము కల్గినట్టు లతిరూక్షముగాఁ గను నన్నుఁ జూచుచున్
మీసము త్రిప్పె దేమిటికి? మేటిమగండవె యైన జంకులే
కో సుకుమార, ర, మ్మతనుయుద్ధమునందు పెనంగి చూత, మా
యాసమటంచు ముందెవర మందుమొ వారలె యోడినట్లగున్.

35


ఉ.

వ్యాకులమేల? వల్లభ, పరాంగనఁ గూడినఁ బాపమంచు తా
టాకులలోన వ్రాసిరనియా? యల వ్రాతలెటున్న, నేమిరా
నీకును నాకు బ్రహ్మమును నిక్కముగాఁగను వ్రాసియుంచె, నే
పోకలఁ బోయినన్ జరుగుఁబో తుద కాతనివ్రాఁత రీతిగన్.

36

ఉ.

వాసనచూడ నట్టి ప్రవసంబు నటంచును గొప్పలేల? వి
న్మా, సరసాళులన్ వలపునం దనియించినదాన; వీవునున్
వాసిగ నెన్నిపూవులనొ వ్రాలినతేఁటివి యూట చేత, ఏ
దీ; సరసుండ, నాపెదవి తేనెరుచుల్ చవి చూచి చెప్పుమా.

37


మ.

అనురాగం బెద నీకు నాపయిని లే దన్నట్టి లోపంపు మా
టను బల్కంగనుబోకు; కుంకుమతోడం గూడి వాసించు చం
దనపుంబూతల నెఱ్ఱనైన యురముందాఁకించిన నిన్ కౌగిలిం
తును బ్రాణేశ్వర, దాన నీహృదయమఁదున్ రక్తికల్గుంజుమీ.

38


శా.

ఆకాంక్షన్ నిను నేఁ గడున్ వలచి నిద్రాహారముల్ మానుటం
జేకూరెన్ శివరాత్రిజాగరణసంసేవాఫలంబున్, విశు
ద్ధైకాదశుపవాసపుణ్యఫలముం; బ్రాణేశ, కైలాసమున్
వైకుంఠంబునుగాఁగ నీ కవుఁగిలిన్ వాంఛించి నేఁ నాంచెదన్.

39


చ.

ముడుపులు గట్టుకొంటి, మఱి మ్రొక్కులు మ్రొక్కితి, దేవుఁ డెవ్వఁ డె
క్కడఁ గనఁబడ్డ నీ గులిమి కల్గఁగఁ గోరి లభింపదాయె నా
ముడుపులు నీవె కైకొనుము, మ్రొక్కులుఁ గైకొను, మీవె నాదుదే
వుఁడవు, దయాస్వభావుడవు ప్రోవుము నన్నిక జీవితేశ్వరా.

40


చ.

ఇలపయి నాఁడు దౌచు జనియింపఁగరాదు, జనించె నేనియన్
వలపును బొందఁగూడ, దథవా, కలపొందిన, లోనఁ గ్రుళ్లఁగా
నలయునే కాని దాని మగవానికి జూపఁగరాదు; చూపినన్,
చెలువకు రోఁత యై బ్రదుకు ఛీ యనిపించుఁ గదా మనోహరా.

41


చ.

వదనమునైనఁ జూప; విదివాదఁటరా? “యిటరార” యన్న నీ
“నదెయిదె” యందు; విద్దిమరియాదఁటరా? స్ఫుటరాగమూనునన్
కదియవు; భార్యకౌఁగిటనె ఖైదటరా? కట! రాతిగుండె దా
ల్చెదవు; మదీయసంగమము చేదఁటరా? విటరాజశేఖరా.

42

సీ.

కంటిని కన్నుల కఱవు దీఱఁగ, సుమ
            శరు ధిక్కరించు నీ చక్కదనము
వింటిని రతిశాస్త్ర వివిధరహస్యంబు
            లెఱింగిన నెఱజాణ వీవ యనుచు
అంటిని "కరుణామయా, నీకు నే దక్కి
            తిని, నీవె నాకిక దిక్క"టంచు
ఉంటిని, "నీకృప యొకనాడు గాకున్న,
            నొకనాఁటికైన నాకొదవు” ననుచు,


గీ.

వింటిని శరాళి సంధించి విషమబాణు
డొంటిని జురుక్కునం గొట్టుచుండె, వాలు
గంటి, నిదే కేలుమోడ్చి నేగతుల వేఁడు
కొంటిని, గవుంగిటంగప్పు కోడెగాఁడ.

43


ఆ.

నిన్నుఁ గన్న మొదలు నిముసమున్ మగనితో
ఱంకుతన మొనర్ప జంకుపుట్టె
నన్నుఁ జెట్టపట్టి నాదుపాతివ్రత్య
విధిని నిలుపు మయ్య విటవరేణ్య.

44


ఉ.

హేయపుమాట లన్యులన నీ, కులబంధువు లెల్లరున్ వెలిన్
వేయగనీ, చెలుల్ విడువనీ, పతి మున్నగువార లల్లరుల్
చేయగనీ, భయంపడను. చిత్తము నీకయి దాచియుంచినా
నోయిమగండ, వేరు మనముందము రమ్ము యథేచ్చగా నికన్.

45


ఉ.

సామి, యి దేమిపాప! మొకజాబునకైన జవాబు వ్రాయ వే
మీ! మృదులాంగుళంబులకు మిక్కిలి కష్టమటంచు వ్రాయ లే
దేమొ! యిదొక్కకష్టమని యింతభయంపడుచున్న నాయుర
స్పీమను జందనద్రవము చిక్కగ రాయుట కేమి యందువో?

46

ఉ.

చిత్తజరూప నీవు కృపనుతను నా కిపు డంపినట్టి నీ
యుత్తర మందినంతనె, ప్రియు న్నినుఁ గన్నటులాయె, జన్మమే
నెత్తుట రిత్తవోక, ఫలియించిన నట్లునాయె, నేల పై
హత్తక మిన్నుముట్టినటులాయెను, చింతలన్నియున్.

47


తే.

అక్షరము లమృతకణంబు లౌచు మాట
లమృతపుందేట లౌచు, వాక్యంబు లమృత
ధార లౌచు, నా జీవనాధార మయ్యె
నీవు వ్రాసి పంపినచీటి నీటుకాడ.

48


ఉ.

కంటిని నీదుజాబు వగకాడ, కనుంగవ కద్దుకొంటి, జె
క్కిటను జేర్చుకొంటి, నలుక్రేవల ముద్దిడుకొంటి, మానసం
బంటగ నొత్తుకొంటి, శిరమం దిడుకొంటిని, దుంటవింటివాఁ
డింటను బంటు గాఁగ నిక నేలగ నుంటిని నేఁటినుండియున్.

49


ఉ.

సామిగ, నన్ను రమ్మనుచు జాబును బంపితి, వట్లు సేయ, న
మ్మో! మరియింక నేమయిన నున్నదె? యెందఱకైన నేను కన్
బ్రాముదు? నారహస్యమును పైఁబడకుండగ నీవు దాచెదో
యేమనియుంట గోర్కె గలదేని దలంపకు మిట్టికోరికల్.

50


ఉ.

వింటివో, లేదొ? పై కడుగువెట్టగఁ గూడని క్రొత్తకోడలన్
వెంటనె నీదు కోరికకు వీలొదవించుట కెట్లు నేర్తు? పు
ట్టింటికి పోవు నంతవరకించుక యోపిక పట్టితేన, నా
వంటిది యాటకత్తెల ధ్రువంబుగ లేదనిపింతు కాంతుఁడా.

51


ఉ.

చాలును జాలు పూరుషుల సంగతి, యే సతులేని మీపయిన్
బేలతనంబునన్ మనసు పెట్టిన, వారలగుట్టు వీథిలో
నాలవనాటి కుండుగద! నానదు నోటను నూవుగింజయున్
బాలిశ, మీక, గోలనగు బాలను గానుర గోతిలో బడన్.

52

చ.

 సరసుఁడవయ్యు నన్ను వెతసల్సఁగఁ జెల్లునె! చిన్నదాన నే
మెఱుఁగను సిగ్గుదీయ, కవి యెన్నివిధంబుల పాటపాడినన్,
మఱిమఱి ముట్టడించెదవు మామకచిత్తము నీదుమాటలం
గరఁగునొ! నీదు పుణ్యమగుఁగాని, ననున్ విడుమయ్య జారుఁడా.

53


చ.

ఎవరిఁక నిన్ను నమ్మఁగల? రింటికి నింటికి మ్రుగ్గువెట్టినా
వవసర మంతయుం గడచి నంతటనే సుడిపెట్టినాఁడ; నె
ల్లవిభులు నూతనప్రియు లిలాస్థలి న న్నటులే చరించుచుం
టి వవుర! నీదు చెల్మికిని నీకును దండము జారశేఖరా.

54


మ.

ఒకరా, యిద్దఱ, ముగ్గురా, మొదట నెంతో నీవు నమ్మించి గొం
తుకలంగోసిన యాఁడువారు? పదులున్ నూర్లుంగదా? వారు చా
లక, న న్గోతిని ద్రోయ నెంచితివొ? బేలంగాను, నామోహ మా
పుకొనం జూతునుగాని, యెన్నఁడును నీపొత్తొల్ల జారాగ్రణీ.

55


శా.

నీపైనే తమయాశ లెల్లగల కన్నెల్ వేనవేలో ప్రియా!
ఆపై నేనిఁక నేల? మీ చెలిమి కే నడ్డంబుగా వచ్చినన్,
పాపంబబ్బును, వారలన్ వదలి, నాపైనే తమిన్ నిల్పి, న
న్నే పాలింపుమనంగ న్యాయమగునా? నీవైనఁ బాలింతువా?

56


చ.

విభుడ ననున్ వరించుమును వి న్మొకసంగతి, యిప్పుడున్నయీ
రభసము తగ్గినంతటనె రాకెడపెట్టితివేని, న్యాయపున్
సభలకు నెక్కి నేఁదగవు సల్పకమానను నిశ్చయంబుగా,
ఉభయుల మప్రతిష్ట పడకుండెడు మార్గము చూడు మిప్పుడే.

57


శా.

న్యాయంబైన తెఱంగు నేఁ దెలిపెదన్, నా కీవు నీమానసం
బీయన్ వచ్చును, మానవచ్చు నది నీ యిష్టంబె యౌఁ, గాని వి
న్మా, యాదిన్ మనసిచ్చి, యావెనుక మానంబోవ, నే నొప్పుకో
నోయీ నాయక, చక్కగా మొదటనే యూహించి నన్ గోరుమా.

58

చ.

పరవశమయ్యె నాయొడలు, భాగ్యవశంబున నిన్నినాళ్ళకున్
దొరకిన నీదుపొందున, మనోహర యయ్యెడనొత్తుకోని మేల్
పరుపున మెత్తనౌవిరులపైనె పరుంటిమొ, చాపవిూద ని
ర్వుర మెడమీని గుత్తపుగవంగిట నుంటిమొ నే నెరుంగరా.

59


చ.

ఒడలిని చేతితో నిమిరి, యొయ్యన జెక్కులు ముద్దులాడి, నీ
తొడల వసింపఁజేసి, తమితోఁ బ్రియవాక్కుల బుజ్జగించి, నా
జడు పుడుగంగఁజేసి రతిశాస్త్రము నేర్పిన యొజ్జవౌట నీ
కడఁకువతో నొసంగితి బ్రియా గురుదక్షిణ గాఁగ గౌగిలిన్.

60


ఉ.

నీదుకవుంగిలింతలును నీగిలిగింతలు, నీదు వేసమున్
నీ దరహాసమున్, వగల నేర్పులు దీర్పులు, నీ సయాటలున్
నీ నయగల్గు మాటలును, నీమురిపెంపులు బుజ్జగింపులున్
నేఁ దలపోయుచున్ మఱవనేరనురా ప్రియ, నీదుకూటమిన్.

61


సీ.

కను విప్పి నను నీవు కనుఁగొనం దెలికల్వ
            విరులు జల్లునరాలు కరణిఁదోఁచు
మోవి విప్పి యొకింత నీవు నవ్వినఁ బండు
            వెన్నెలన్ మునిఁగిన విధము తోఁచు,
పలువిప్పి తీయ పల్కులు నీవు పల్కిన
            అమృతధారం రోగినట్లు తోఁచు
కేల్గవ విప్పి కౌఁగిట నీవు నను జేర్ప
            స్వర్గంబు నందున్న సరణిఁ దోఁచు,


ఆ.

మనసువిప్పి నీవు మన్నింప, నాదు జ
న్మంబు ధన్యమైన మాడ్కిఁ దోచు
నీదు పొందు కంటె పైదలులకు లేదు.
లేదు, లేదుభాగ్యమో దయితుడ.

62


సీ.

నీ పల్కులను విన్న నిమిషమందే నాకు
            జిల్లునఁ గన్నీరు చిమ్ముచుండు,

నీ కేలుతాకిన నిముసమందే, తను
            వెల్లను నాకు జల్జల్లుమనును
నీవు ముద్దాడిన నిముషంబునందె చె
            కులు మిక్కిలిగ నాకుఁ బులకరించు,
నీకౌగిలిం గన్న నిముషమ్మునందె, డెం
            దమ్ము దట్టమ్ముగా జెమ్మగిల్లు,


ఆ.

నిన్నుఁ గూడి నపుడె నెమ్మేను కంపించు
చేత లుడుగు గనులు మూతపడును.
హృదయ మదరఁ దొడగునది సుఖమో, కష్ట
మో, యెరుంగజాల నోయి సామి.

63


సీ.

పలుమారు నిన్ను ముద్దులు గొంటి, నీదు చె
            క్కిళ్ళు కందునని శంకింపకుండ,
ప్రియమారగా నీదు పెదవి నొక్కితిని, బ
            ల్మొన నాటునంచు మోమోటపడక,
గాడంబుగా నిన్నుఁ గౌగలించితిని, నీ
            యురము నొచ్చునటన్న యూహలేక,
కసితీర నీతోడ గలిసి పెనంగితి,
            నలయుడు వనియును దలఁపబోక


గీ.

మున్ను నీపొందుకై వాచియున్నదాన
నౌట, సివ మెత్తినటుగా నైతిఁ గాని
యింతయొత్తుడు కలిగింప నింకమీఁద,
బెదరు మాని క్రమ్మఱను రాగదర స్వామి.

64


చ.

హృదయములోన భావముల నెల్లను దెల్పఁగఁ బోవ, భీతి నా
పెదవులు దాచియుంచి మన ప్రేమకు నడ్డుగవచ్చె, వాని నీ

పెదవుల బిగ్గఁ బట్టి పలుపీడ లొనర్చుచు శిక్ష చేయరా
బెదరును మానుచున్ మణితభేదములన్ హితమున్ ఘటించురా.

65


శా.

స్త్రీవశ్యంబు లెఱింగి, నామనసు స్వాధీనంబు కావించు కొ
న్నా వం చెంచెద? లేనిచో నెచట నైనన్ నావలెన్ సర్వమున్
నీవేయంచు దలంచి, యొక్కమగవానిన్ నమ్ముకొన్నట్టి స్త్రీ
లీ విశ్వంబున నుందురా? చెపుమ, నీవేయోయి ప్రాణేశ్వరా.

66


చ.

తనివి జనింపకున్నయది తావకరూప మదెంత చూచుచు
న్నను, పలుమారు చూతు ననినం, జనుదేఱక యుంటివీవునున్
విను, సదుపాయ మొండు వినిపించెదఁ బూర్తిగ నిన్ను బోలు చ
క్కని మగవాని నొక్కరుని గాంచుము నావలనన్ మనోహరా.

67


సీ.

అల్లంతదూరంబు నందుండియే నేను
            విన 'ఈలలన్' వేసికొనుచు వత్తు,
వెవరినో వీథిఁ బోయెడివారలం బిల్చి
            నటు గట్టిగను చప్పటు చఱచు.
వింటిగుమ్మమునకు నెదురుగా నిలుచుండి
            కేండ్రించి యుమియగా కేశరింతు,
నేను గన్పడినంతనే స్పష్టముగను జే
            తుల నెత్తి నాకు సైగల నొనర్తు


గీ.

వెవరు చూతురో యనియు నూహింప వేర?
మాయురే పండువంటి నా మనువునకును
నీళ్ళుపోయకయున్నచో, నీవు నాకు
రంకుమగడవు కావటర! విటకాడ.

68


చ.

పలువురిలోన నన్నుఁ గని నవ్వుచు నిల్తువు, కంటిసైగలం
దలఁపు లెఱుంగజేసెద వెదం జెయి చేర్చి శిరంబు వంతు, వూ

ర్పులు నిగిడింతు, వోష్టమును ముద్దుల కొగ్గెద, విట్టులైన, నె
ట్టులు మనగుట్టు నిల్చు? మగడున్ బసినట్టుఁ గదా మనోహరా!

69


చ.

గడె కొకజాబు నంపెదవు, కన్పడకున్నను మాటిమాటి కి
క్కడ కరుదెంతు, వింతతమకంబున వేగిరపెట్ట నా కెటున్
గడచును? నీవు కోరిన ప్రకారముగా నను రేబవళ్ళు నీ
కడఁ బడి కాపులుండుమనఁగా, వశమా? మగనాలరా ప్రియా.

70


చ.

రమణుఁడ, నేను రామికిఁ జిరాకును జెందకు, కత్తికోత కా
డు మగఁడు బ్రహ్మరాక్షసునటుల్ ననుఁ గాఁచియెయుండు నెట్లుగా
సమయము చిక్కునో యెఱుఁగ, సందొకయించుక కల్గెనేని, నీ
సముఖమునందు వ్రాలుదును చప్పున రెక్కలు దాల్చియైననున్.

71


ఉ.

ఇంచుక యేని పై కరుగ నీయవు. పై మగవారితోడ భా
షించుట కొప్ప, విల్ వెడలఁ జేరవలెన్ నిను, పుస్తెకట్టి పో
షించుమగండు నీ యమలు చేయదలంపడు, నీకు లొంగినా
నంచును, నింత లోకువటరా యొనరింతువు జారశేఖరా!

72


ఉ.

అమ్మకచెల్ల! కంచు పదునైనది నీ మది యం చెఱింగి, నా
సమ్మతి యెల్లఁ జంపుకొని, సాధ్య మసాధ్యము నెంచ కీవు న
న్నెమ్మెయిఁ ద్రిప్పుకొన్న నటులే తిరుగాడుచు నుంటి, నిట్లుగా
నమ్మతిఁగాన, నెన్నడును నన్నెడబాయకుఁ బ్రాణనాయకా.

73


చ.

“వలవదు నీదు చెల్మి, మగవారల నమ్మగరా” దటంచు నేఁ
బలుకఁగ, నమ్ముమంచు పలుబాసలు సేయుచు నాదు సమ్మతిన్
బలిమిని బుచ్చుకొంటి, విటుపైఁ గద నీదు నిజం బెరుంగఁగా
వలె? నగకాడ, “నమ్మి చెడువారలే" రనుమాట నిల్పరా.

74


ఉ.

అసలు పుట్టునట్టులుగ నచ్చికబుచ్చిక లాడి, యెన్నియో
బాసఁలుచేసి, యాపయి సెబాసు? మొగంబును జూపవైతి వో

యీ సరసుండ, మోసము సహింపను నీవిటు కృష్ణవేషమున్
వేసిన, భామవేషమును వేసి జడన్ నినుఁ గొట్టెదంజుమీ.

75


చ.

సరసుఁడవంచు నిన్ గని పసందొనరించితిఁ గాని, సందులం
దిరుగు పదారవిందములు నీవన, నెందుకు మోహమొందుదున్?
దిరిగెడికాలు నీ దయినఁ దిట్టెడు నట్టిది నాదునోరు, వే
గిరి మరుదెంచి, ముద్దుల బిగింపుము నా పెదవుల్ మనోహరా.

76


ఉ.

తప్పిద మీవు చేసియును దప్పులు నాపయి మోఁపి చప్పునం
జెప్పక లేచిపోతి వతిచిత్రముగా! నిను నేను వేఁడుకొ
న్నప్పుడె రాఁ దలంచితివొ? నట్టుగ బెట్టుగ కూరుచున్న, నే
నొప్పను నీవె ముందుగఁ బ్రియుండ, ననున్ బ్రతిమాలుకోవలెన్.

77


ఉ.

ఏమిటి నేను తప్పు ఘటియించితిఁ గన్నుల నెఱ్ఱచేసి నె
మ్మోము ముడించి పోవుటకు? ముక్కున నింతటికోపమా? యిదే
బ్రేమకు లక్షణంబొ? యిటు బెట్టొనరించినఁ దాళజాల, రా
రా మఱి యల్క పెండ్లికొడుకా! బ్రతిమాలితి నేనె ముందుగా

78


ఉ.

ఆఁడుది యల్గినం బురుషుఁ డామెను చేర్చుటపోయి, నాపయిన్
నేఁ డిటు నీవె యల్గుటయి నేను నిను న్బ్రతిమాలుకొంటయుం
జూడఁగ వాడవాడలను సుందురు లందఱు నవ్వకుందురా?
మోడిని మాని రాఁ గదర మ్రొక్కెద నీదు పసిండికాళ్లకున్.

79


ఉ.

అట్టె విశేషమోహముస నాఁడుదియు న్మగవాఁడు నుండగన్
కుట్టును ముండదైవమునకున్ మన యిద్దఱప్రేమఁ జూచి, యి
ప్పట్టున నన్యదేశములఁ బట్టఁగఁ జేసెను నిన్ను దేవుఁ! డే
నెట్టు భవద్వియోగము సహింపఁగఁ జాలుదురా మనోహరా?

80


ఉ.

లేచిన దాది నిద్రకయి లేచినగాఁకను నిన్నుఁ గూర్చి యా
లోచనయేకదా? కలలలో నినుఁ జూచుటయేకదా? నినుం
జూఁచిన దాఁక తాళననుఁ జూడగ వీలుఘటిల్లినంతనే
వే చనుదెమ్మ, క్షేమమును వెంటనె వ్రాయుమ యోయినాయకా.

81

చ.

ఉదయమునుండి రాత్రివఱ కోప్రియ, నిన్ను గుఱించి నేఁబదిం
బదిగఁదలంచుచుండెదను, బాపమెటుల్ పలబాఱుచుందువో
గద? యొకమారు నే నటులుగాఁ బలబాఱుటలేదు, నన్ను నీ
వు దలఁచు చుదువో, తలఁపవో పయివింతలలోన మున్గుచున్?

82


ఉ.

ఆ పయిచోట కుల్కు జవరాడ్రునుఁ జక్కనిమాయలాండ్రునుం
గాఁపుర ముండ్రు, వారలు వగల్ కురియింతురు, లేనిమోహమున్
జూపుదు, రిచ్చకంబులకుఁ జొత్తురు, వారలమాయ లందు నీ
వేపగిదిం దగుల్కొనక యిచ్చటికిన్ మరలంగ వత్తువో!

83


ఉ.

ఆ నెన, రా సమాదరణ మావల, పాయభిమాన, మాప్రియం
బానయ, మిన్నియున్ సతములంచుఁ దలంచుచు పొంగుచుంటినే
గాని, హఠాత్తుగాఁగథ మన కాఁపుర మిట్టులు తెల్లవారునం
చే నెరుఁగన్ దినంబులిఁక నెట్టుల దాటును నాకు వల్లభా.

84


ఉ.

కన్నులనీటిచే కరఁగి కాటుకరేఖలు నాదుచెక్కులం
దున్నవి నీవు నిర్దయఁ బ్రియుండ ననున్ విడనాడినంత నుం
డి, న్నిరతంబు నే బడిన నెవ్వగ నియ్యవి లేఖలౌచుఁ దె
ల్పు న్నయనంబులం దెఱచి, పూర్ణకృపం దిలకింపు నాదెసన్.

85


ఉ.

కోరిన పూరుషుండు సమకూరెను, గోరిన యట్లతండు నన్
గూరిమిఁ జూచుచుండె, రమణుల్ మరియెవ్వరు నాకు సాటి? యం
చూరక నేను గొండపయి నుండిఁగ, నన్ విడనాడి నీవు నా
కోరిక లెల్ల నేలకును గూలిచినాఁడవు నిర్దయాత్ముఁడా.

86


చ.

వలచితి నిన్ను, నీ వలపు వాంఛ యొనర్చి గడించితిన్ నినుం
గలిసితి, నీవు నన్ కలియఁగా సుఖవార్థిని మున్గి తేలితిం
జెలువుఁడ, జన్మ సార్థకత చెందితి. నీ వెడఁ బాసి తంచుఁ జిం
తిల, నలనాఁటిసౌఖ్యమె మదిం దలపోయుచుఁ దృప్తి చెందెనన్.

87


చ.

విడిచితి వారు వీరనక విశ్వము నీకొఱ కట్టి నన్నుఁ బో
విడిచితివా? యొకప్పుడును వీడ, న టన్న బ్రమాణవాక్యముల్

విడిచితివా? ధరాజనులు విన్నను సిగ్గగు నన్నభీతియున్
విడిచితివా? సరే, విడిచిపెట్టుము దోసెడునీళ్లు నాకు నై.

88


చ.

విటరాయా, మటుమాయమాటలను వేవేలాడి మున్నీవు న
న్నెటులో యొప్పఁగఁ జేసినాఁడ, వది నేఁడేమయ్యె! మూన్నాళము
చ్చటకా నిన్నిటు వీథిఁ బెట్టితి? వెదన్ జంకైననుం బుట్టలే
దటరా? యప్పుడె క్రొత్త వింత చెడి యాహా! ప్రాఁత రోతయ్యెనా.

89


ఉ.

వేళ లభింపదాయెనని, వీలుఘటిల్లక యున్నదంచు, ని
ల్లాలికి కోపమంచు, మిషలన్ వచియించెద వేర నా పయిన్
బాళి నశించె నన్నిదె ని బద్ధిర నీకిపుడొక్కచొక్కపున్
బాలికయే తటస్థ మయినన్ గ్రహింపక మానుకొందువా?

90


చ.

మనసు నొసంగనో మిగుల మక్కువ చూపనొ! భక్తితోడ నీ
పనుపు లొనర్పనో? హృదయపద్మములోపల నిన్నె దేవుఁగా
ననుదినిమున్ స్మరింపనో? ప్రియా ననుఁబాయుట కేమిదోష మే
నొనరించితిన్ ప్రమాద మెదియో ఘటిల్లిన సైఁపఁజెల్లదే?

91


చ.

కతకము గల్గె మున్ను ననుఁ గూడుట కాతమి యెల్ల నిప్పుడ
ద్భుతముగఁ బోయె నోప్రియుడఁ దూరపుకొ౦డలు చేరువై నఖ
క్షతముల నున్నుపాయుటనొ? కాక తినం దినగారెలందుఁ జే
దు తగులు నట్గుగా నరుచి తోఁచెనో నా మధురాధరంబునన్.

92


చ.

ఒడఁబడకుండ నే బిగిసియున్న దినంబుల నాదు పొందు కై
పడఁగను రాని పాట్లుపడి పల్మరు నన్ బ్రతిమాలుకొంటి, వి
య్యెడ మొగమైనఁజూప విదియేమిఁ యక్కఱ తీరినంత, నె
క్కడ ప్రియు లన్నపాట వగకాఁడ, యదార్థము చేసినాఁడవా.

93


ఉ.

నొచ్చు నటంచు నీ పెదవి నొక్కఁగ నైతిని, నొచ్చుపంచ్చు నిన్
గ్రుచ్చి కవుంగిలింప మదికోర్కులు తీఱఁగ కాల మన్న దం

చిచ్చ యడంచుకొంచుఁ జరియించుచు నుండఁగ, నింతలోననే
తెచ్చె వియోగ మయ్యయొ? విధిన్ మఱి యెవ్విధిఁదిట్టుదుం బ్రియా.

94


మ.

సరసుండై సరిగాఁగఁ బెక్కుసతులన్ సంప్రీతి శ్రీకృష్ణుఁ డొ
క్కరుఁడే సల్పఁగఁజాలె, తక్కొరుల కక్కార్యంబు శక్యంబె "యి
ద్దఱ పొందేలర? మద్దువ" ద్దనిన, మున్ దర్పంబు నీవాడి య
ద్దిర! నేఁ డింటిభయంబు నొక్కమిషగాఁ దెల్పంగ నెట్లొప్పుదున్.

95


మ.

ఎలమిన్ నీవిటులుండ, నేసవతి యో యేరాలొ యీసూని క
న్నులలో నిప్పులు పోసికొంచు మన పొందుంబాపె, నీ కౌఁగిటం
గులుకం గోరియొ? దాని నాయును రిఁకం గొట్టన్ వలెన్ నాథ! నా
వలెనే యద్దియు నీకు దూర మయి తీవ్రగ్లాని పొందన్ వలెన్.

96


శా.

నీవింకొకతెమీఁద రంగుపడి దానింగూడి యుప్పొంగుచున్
వేవేభంగులక్రింద మీఁదఁబడ మీస్వేచ్చావిహారంబులన్
నేవారింపగనుగాని, యొక్కటి మదిన్ నిక్కంబుగా నెంచుకొ
మ్మావంతైనను నీకు నాయుబుసు లేదన్నటులుండన్ వలెన్.

97


ఉ.

వింటిని వింటి నీకిపుడు వేఁడుకకత్తెయొకర్తు క్రొత్తగా
నంటనమయ్యెనంట! యటు లౌటను నన్నెడఁ బెట్టి తంట నా
యింటికి రాకయుండ నదియే మొలలోఁ జెయివెట్టియాఁపెనో!
వెంటనె యాఫలం బనుభవించెద వుండర నీవు ధూర్తుఁడా.

98


ఉ.

ఓరి, ననుం ద్వజించి మఱియొక్కతెకుం దగులాట మైతివా?
కూరిమి మీరలిద్దఱును గుల్కఁదలంచితిరా? సరే మిమున్
దూరము చేసి, నాసవితి త్రుళ్ళడఁగించి కలంపకున్న నా
పేరును బెట్టి నన్నిఁకను బిల్వకురా సరివారి లోపలన్.

99


ఉ.

మంగళ మేను నీకుఁ బలుమారును గోరెద నీవు నన్ను నే
భంగిఁగఁ జేసినన్ సరియె, పాలనుముంపుము, నీళ్ళముంపు, మా
సంగతితోడ నాకొక ప్రసక్తియు లేదు, శుభాంగ, నిత్యమున్
మంగళ మౌతనీకు, జయమంగళమున్, శుభమంగళంబునున్.

100

జాబులు రెండుభాగములు సంపూర్ణము.