శివరాత్రిమాహాత్మ్యము/పీఠిక

వికీసోర్స్ నుండి

పీఠిక

“మహిమున్ వాగనుశాసనుండు సృజియింపన్ గుండలీంద్రుండు త-
న్మహనీయస్థితిమూలమై నిలువ శ్రీనాథుండు ప్రోవన్ మహా-
మహులై సోముఁడు భాస్కరుండు వెలయింపన్ సొంపు వాటించు నీ
బహుళాంధ్రోక్తిమయప్రపంచమునఁ దత్ప్రాగల్భ్య మూహించెదన్”

-రామరాజభూషణుడు

కవిసార్వభౌముడైన శ్రీనాథుడు పుంభావసరస్వతి. ఆంధ్ర గీర్వాణ భాషలు ఆతని కన్నుసన్నల మెలగినవి. ఆతడు బ్రాహ్మీదత్తవరప్రసాదుడు. సమస్త శ్రుతి స్మృతి పురాణ శాస్త్రముల నాపోశనము పట్టినవాడు. సంస్కృత వాఙ్మయభాండాగారమును కొల్లగొట్టి ఆంధ్రవాఙ్మయమునకు పుష్టిని తుష్టిని కూర్చినవాడు.

“సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య | భాషాపరిజ్ఞానపాటవంబు
పన్నగపతిసార్వభౌమభాషిత మహా- | భాష్యవిద్యాసమభ్యాసబలము
నక్షపాద కణాద పక్షిలోదీరిత | న్యాయకళాకౌశలాతిశయము
శ్రుతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంత | కబళన వ్యుత్పత్తిగౌరవంబు
పూర్వకవిముఖ్య విరచితాపూర్వకావ్య- | భావరస సుధాచర్వణప్రౌఢతయును”

కలవాడని దగ్గుపల్లి దుగ్గన కొనియాడినాడు. అతివేలములైన ప్రతిభాపాండిత్యములు కలవాడగుటచే బ్రతికినన్నాళ్ళు వాఙ్మయరంగమున తన కెదురొడ్డువారు లేక దేశదేశములు తిరిగినాడు. ఉన్నతమైన పదవు లలంకరించినాడు. సమస్తవైభవము లనుభవించినాడు. అటు కర్ణాటమునకు పోయి ప్రౌఢదేవరాయల ఆస్థానమున ఉద్దండపండితుడైన డిండిమకవిసార్వభౌము నోడించి కనకాభిషేకగౌరవ మందినాడు. ఇటు రాచకొండ కేగి సర్వజ్ఞసింగభూపాలుని మెప్పించి తన యేలిక కోరిక తీర్చి మనసు కెక్కినాడు. ఇక కొండవీటి రెడ్డిరాజ్యమున పెదకోమటి వేమారెడ్డి యాస్థానమున దాదాపు రెండు దశాబ్దములు విద్యాధికారిగా నుండి ఆతడు నెరపిన యధికారము వర్ణింపరానిది.

శ్రీనాథుని తాత కమలనాభామాత్యుడు గొప్ప కవియట. భీమాంబా మారయామాత్యు లీతని గన్న ధన్యులు. పాకనాటిలోని కాల్పట్టణ మీతని జన్మస్థలము. శ్రీనాథుని దేశకాలముల గూర్చి పెద్దరగడ జరిగినది. వీరేశలింగంపంతులుగారు మొదలుకొని ఆరుద్రగారి వరకున్న సాహిత్య చరిత్రకారు లందరును శ్రీనాథుని దేశకాలములు, ఆతని జీవితవిశేషములు, ఆతడు సృష్టించిన వాఙ్మయమునుగూర్చి విపులముగా చర్చించియున్నారు. వాని నన్నింటి నిట ప్రస్తావింప నక్కరలేదు. పదునాల్గవ శతాబ్దము నాల్గవపాదము, పదునేనవ శతాబ్దము పూర్వార్ధ మాతని వాక్కు ఆంధ్రదేశ మంతటను మేఘగంభీరనాదముతో ప్రతిధ్వనించినదని తెలిసికొనుట చాలును.

మహాశివభక్తుడైన శ్రీనాథుడు తన రచనముల నన్నింటిని శివభక్తులకే కృతినిచ్చుట విశేషము. చతుర్విధ పురుషార్థముల నాతడు చూరగొన్నాడు. విధివశమున జీవితసంధ్యాసమయమున దైన్య మనుభవించినాడు. ఆతని నాదరించి పోషించిన మహాసామ్రాజ్యములే కూలిపోయినప్పు డొకవ్యక్తికి కలిగిన దైన్యము చెప్పుకొన నక్కరలేదు. ఆతని పండించిన కీర్తి రెడ్డిరాజులకు, ఆతని దండించిన యపకీర్తి యొడ్డెరాజులకు శాశ్వతముగా దక్కిపోయినవి. ఆత డెక్కి తిరిగిన పల్లకీ మోసిన బోయల ఓంకారనాదము, ఆరగించిన రుచులు, అలదుకొనిన కస్తూరీచందనములు, సేవించిన తాంబూలము పచ్చకప్పురపు గమగమలు, ధరించిన తారహారముల ధగధగలు, కర్ణకుండలముల వజ్రాల తళతళలు ఈనాటికిని ఆతని సాహిత్యమున మన కనుభూత మగుచున్నవి.

శ్రీనాథ సాహిత్యమునుగూర్చి సాహిత్యచరిత్రలందే కాక ప్రత్యేకగ్రంథములందును వివిధ వ్యాసములందును కాననగును. శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి (శృంగార శ్రీనాథము), శ్రీ గడియారము వేంకటశేషశాస్త్రి (శ్రీనాథుని కవితా సామ్రాజ్యము), శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రి (శ్రీనాథకవితా సమీక్ష), ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు (శ్రీనాథ భారతము), శ్రీ కుందూరి ఈశ్వరదత్తు (శ్రీనాథుని కవిత్వతత్త్వము) వంటివారు ప్రత్యేక గ్రంథములే వ్రాసినారు. శ్రీ శ్రీహరిగారు, శ్రీ కొర్లపాటి శ్రీరామమూర్తిగారు సిద్ధాంత రచనలు చేసి Ph.D. పట్టము లందుకొన్నారు. శ్రీ బండారు తమ్మయ్యగారు, శ్రీ నిడుదవోలు వేంకటరావుగారివంటి పెద్దలెందరో యమూల్యవ్యాసములు ప్రకటించినారు.

కృతులు

కాశీఖండమున శ్రీనాథకవిసార్వభౌముడు తన రచనములగూర్చి యీ విధముగా చెప్పియున్నాడు.

సీ. చిన్నారి పొన్నారి చిఱుతకూఁకటినాఁడు | రచియించితి మరుత్తరాట్చరిత్ర
    నూనూఁగుమీసాల నూత్నయౌవనమున | శాలివాహనసప్తశతి నొడివితి
    సంతరించితి నిండు జవ్వనంబునయందు | హర్షనైషధ కావ్య మాంధ్రభాషఁ
    బ్రౌఢనిర్భరవయఃపరిపాకమునఁ గొని- | యాడితి భీమనాయకుని మహిమఁ
గీ. బ్రాయ మెంతయు మిగులఁ గై వ్రాలకుండఁ | గాశికాఖండమను మహాగ్రంథ మేను
    దెనుఁగుఁ జేసెదఁ గర్ణాటదేశ కటక- |పద్మవనహేళి శ్రీనాథభట్టసుకవి. (I-7)

ఇందులో మొదటి రెండుకృతు లిప్పటికి లభించలేదు. నైషధము పెదకోమటి వేమారెడ్డి (క్రీ.శ. 1402-1420) మంత్రి మామిడి సింగనామాత్యున కంకితము. భీమేశ్వరపురాణము అల్లయ వీరభద్రారెడ్డి (క్రీ.శ. 1423-1448) మంత్రి బెండపూడి యన్నయమంత్రి కంకితము. కాశీఖండము వీరభద్రారెడ్డి (క్రీ.శ 1423-1448) కంకితము. పై పద్యమున పేర్కొనని కృతులు హరవిలాసము, శివరాత్రిమాహాత్మ్యములు. హరవిలాసము శ్రీనాథుని బాల్యసఖుడును, కుమారగిరిరెడ్డి (క్రీ.శ. 1386-1402) కడ సుగంధభాండాగారాధ్యక్షుడుగా నుండినవాడునగు అవచి తిప్పయసెట్టి కంకితము. ప్రకృతగ్రంథమైన శివరాత్రిమాహాత్మ్యము శ్రీశైల మందలి భిక్షావృత్తిమఠాధ్యక్షులగు శాంతభిక్షావృత్తియతీశ్వరుల మూలభృత్యుడు ముమ్మయ శాంతయ కంకితము. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు శ్రీనాథుని పేరుతో ప్రకటించిన పల్నాటి వీరచరిత్ర మాతని కృతి కాదనియు, దాని రచయిత మరియొక శ్రీనాథుడై యుండుననియు శ్రీ శిష్టా రామకృష్ణశాస్త్రిగారి యభిప్రాయము. [1]శ్రీనాథుడు రచించిన కాటమరాజు కథ, పండితారాధ్యచరిత్ర, ధనంజయవిలాసములు కూడ లభించలేదు. వినుకొండ వల్లభరాయడు రచించిన క్రీడాభిరామమున శ్రీనాథుని తోడ్పాటున్నట్లు పండిత పరిశోధకుల తీర్మానము. శ్రీనాథుని పేరుతో చాటువు లనేకములు ప్రచార మందున్నవి. [2]వీనిలో శ్రీనాథునివేవో కానివేవో శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు నిష్కర్ష చేసియున్నారు. [3]ఇట్టి కృతులే కాక శ్రీనాథుడు రచించిన ఉపలభ్య శాసనముల వివరములు శ్రీ చాగంటి శేషయ్యగా రిచ్చి యున్నారు.[4] శివరాత్రిమాహాత్మ్యము: శ్రీనాథుని జన్మస్థలము, జననకాలములవలెనే ఆతని గ్రంథముల పౌర్వాపర్యము కూడ వివాదాస్పదము. వీరేశలింగంపంతులుగా రిది భీమఖండమునకు పూర్వకృతి యనిరి. నాగపూడి కుప్పుసామయ్యగా రిది శ్రీనాథుని బాల్యకవిత యనిరి. కాని జీవితము ప్రొద్దువ్రాలు సమయమున ఆశ్రయులు, దాతలు అడుగంటిపోయిన తరువాత శ్రీనాథుడు చిత్తశాంతికై శ్రీశైలక్షేత్రమునకు కడపటిసారిగా పోయి శాంతభిక్షావృత్తియతీశ్వరుల యాదేశమున క్రీ.శ. 1440 ప్రాంతములందు దీనిని రచించినట్లు [5]శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగారు నిర్ణయించినారు. శ్రీయుతులు [6]వేటూరి ప్రభాకరశాస్త్రి, [7]బండారు తమ్మయ్య, [8]చాగంటి శేషయ్యగారలు తదితరు లందరును అటులే తలంచినారు. ఇటీవల [9]శ్రీ చన్నాప్రగడ తిరుపతిరావుగారు శ్రీనాథుని వివిధపద్యముల శాతమునుబట్టి దీనిని కాశీఖండమునకు పూర్వరచన మన్నారు.

శివరాత్రిమాహాత్మ్యమందలి అవతారిక మరియు ఆశ్వాసాంతపద్యములు శ్రీనాథుని రచనములు కావని శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగారి అభిప్రాయము. కాని యవి కూడ శ్రీనాథవిరచితములనియే నా నమ్మకము. ఇన్నాళ్ళకు మనకు లభించిన ఒండురెండు శిథిలప్రతు లాధారముగా అవతారికాభాగము శ్రీనాథునిది కాదనుట సమంజసము కాదు. శివరాత్రిమాహాత్మ్యము జంగము మఠములందు తలదాచికొని కొనయూపిరితో నిలిచినది. దానిని చదువుకొనుచు పుత్రికలు వ్రాసికొనుచు ఇన్నాళ్ళు బ్రతికించినవారిలో పండితులెందరో కానివారెందరో తెలియదు. అవతారికలో కొన్ని పద్యములు శిథిలములైపోగా నెవరైన పూరించి యుండవచ్చును లేదా వ్రాయసకాని పొరపాటులేమైన చేరియుండవచ్చును. కాలక్రమమున పాఠాంతరములు ప్రవేశించి యుండును. శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారు చూపిన పండ్రెండు దోషములలో ఒకటి,

“సకల సద్గుణ విఖ్యాత సారసాఖ్య
మహిత పంచాక్షరీమంత్ర మానసాత్మ”

యనునది. ఇది క్రొత్తగా లభించిన తాళపత్రగ్రంథమందలి పాఠాంతరములవలన (I-30) నిర్దుష్టమైపోయినది.

“కాకోదరగ్రామణి కంఠగ్రైవేయు” (I-64) అనునది వచనములోని భాగము. తాళపత్ర గ్రంథములందు గుడిదీర్ఘము లుండవని విజ్ఞు లెరుగుదురు. కనుక దీనిని ‘గ్రామణీ’ యని తలచవలెను. వారెత్తి చూపిన తక్కిన పది దోషములును అప్రౌఢకవితాబంధములును ఈ క్రొత్త తాళపత్ర గ్రంథమున గూడ నటులే యున్నందున వాని నట్లే యుంచినాను. వీనిలో “వడి ప్రాస విడంబబంధమై” (I-16) యనునది సమాసముగా కాక వ్యస్తపదములుగా గ్రహించినచో దోష ముండదనుకొందును.

‘కృతిపతులగు కవిముఖ్యుల’ (I-14) అనునది కృతిభర్తలగు కృతికర్తల (తిక్కనవంటివారి) గురించిన మాట యని భావించవలెను.

శ్రీ సాంబమూర్తిశాస్త్రిగా రెత్తిచూపిన తక్కిన దోషము లివి.

సుతుని న్నుద్యుక్తశాంతాత్మునిన్. (I-1)
పుణ్యఋషీశ్వర సప్తతుల్యులం బోలిన. (I-25)
వైభవప్రఖ్యాత వరహరిశ్చంద్రుండు. (I-26)
ఘనుఁడు కొమరగిరీంద్రుండు కలిగియుండు (I-26)
నేర్పరతడు. (I-28)
పరమపాతివ్రత్యభావంబు తలఁపంగ గౌరి గాఁబోలు నీ కాంత తలఁప. (I-40)
నల్విటు చింత. (I-62)

శాస్త్రిగారు చూపిన యప్రౌఢబంధములే కాక నాకు మరికొన్ని తోచినవి. I-18 వచనమున శాంతభిక్షావృత్తియతి శాంతయ్య కంకితముగా శ్రీనాథుని కృతి రచింపుమని కోరిన సందర్భ మేమాత్రమును అన్వయము సరిగా లేదు. కృతిభర్త వంశావతారమును వర్ణించు పద్యములు కూడ కొన్ని యటులే యున్నవి. I-40 వచనము చివర భాగముకూడ అన్వయము సరిగా లేదు. ఇవి చూడగా కాలక్రమమున పెక్కుదోషము లిందు చేరినవని తెలియుచున్నది. అవతారికలోని కొన్ని పద్యములు మాత్రము (1, 6, 8, 9, 34) తప్పక శ్రీనాథునివే యని చెప్పవచ్చును.

ఇతివృత్తము:

ఈ శివరాత్రిమాహాత్మ్యమునకు మూలము స్కాందపురాణాంతర్గతమగు [10]ఈశాన సంహిత. దానిలో 336 అనుష్టుప్పులందున్న మూడధ్యాయముల కథను శ్రీనాథు డనేక వర్ణనలతో పెంచి ఐదాశ్వాసముల ప్రబంధముగా తీర్చిదిద్దినాడు. ఈ రెంటికి గల పోలికలు భేదములు శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగారు ఈశానసంహితకు తాము వ్రాసిన పీఠికలో నిచ్చియున్నారు.

శౌనకాది మహామునులు సూతుని శివరాత్రిమాహాత్మ్యము నడుగ నాతడు ప్రళయాంతమున శ్రీమన్నారాయణుడు క్రోడాకారమున భూమి నుద్ధరించి గర్వముతో క్షీరసాగరమున శయనించుట, నిద్ర మేల్కాంచిన బ్రహ్మ శివానుగ్రహమున మరల సృష్టిచేసి తానే జగత్కర్తనని గర్వించి పాలసముద్రమున పవ్వళించియున్న నారాయణుని కవ్వించుట, విరించి-నారాయణు లహమహమికతో పాశుపతాస్త్రములు ప్రయోగించుట, లోకములు గగ్గోలువడుట, మాఘకృష్ణచతుర్దశీ మధ్యనిశిని శివు డనలస్తంభాకారముగా నవతరించుట, పద్మజ-పద్మాక్షులు దాని యాద్యంతములు పొడగాననేరక శివుని స్తుతించుట, శివుడు వారికి శివరాత్రివ్రతం బుపదేశించుట, తొల్లి యొక శివరాత్రిదర్శనమున మహాపాపియైన బ్రాహ్మణుడు శివలోకమున కేగెనని సూతుడనగా నా కథ వినుపింపుమని శౌనకాదు లడుగుటతో ప్రథమాశ్వాసము ముగియును దండకారణ్యమున రత్నపురి రాజధానిగా హేమాంగదుడను శబరరాజు పాలించుచుండెను. ఆతని మంత్రి యజ్ఞదత్తుడు. యజ్ఞదత్తుని భార్య సుశీల. ఎంతో కాలమునకు పుణ్యోపవాసవ్రత దానధర్మ దేవతారాధనంబుల వలన నామె గర్భము దాల్చుట, దోహదములు, ప్రసూతిగృహవర్ణనము, సుకుమార జననము, జాతకర్మలు, శైశవము, సంస్కారములు, విద్యాభ్యాసము, యౌవనము, దురభ్యాసములు, తల్లిదండ్రుల హితోపదేశము మున్నుగా గలది ద్వితీయాశ్వాసము.

సుకుమారుని దౌష్ట్యము పెచ్చుపెరుగుట, రాజాతని దేశము వెడలనడచుట, సుకుమారుడు కీకటదేశము మీదుగా హూణమండలమున కేగుచు కాంతారమధ్యమున నొక తటాకముకడ సేదదేరుట, అచటికొక చండాలకన్యక స్నానార్థమై వచ్చుట, పరస్పర మోహశృంగారములు, సాయం-నిశావర్ణనములు, సుకుమారుడు భద్రకాళికాస్థానమున నుండి రహస్యముగా చండాలకన్యకతో కాపురము సేయుట, శబరులతోడి సహవాసము, వారి దుర్వర్తనము హూణమండలమున పొక్కుట, ఇరువురును మరియొకచోటికి వెడలిపో నుద్యోగించుట లాదిగా గలది తృతీయాశ్వాసము.

కాళిజాతర, సుకుమారుడు చండాలకన్యకతో కలిసి కిరాతమండలమున వణిక్పథము చేరి బ్రహ్మపురివాడలో కాపురముండుట, సంతానలబ్ధి, చండాలి మరణము, సుకుమారుడు కూతులతో పాపకార్యము చేయుట, వాని దుశ్చేష్టితము లెరిగి యచటివారు ప్రాయశ్చిత్తములు చేసికొనుట, సుకుమారుడు కూతులవలన సంతానము బడయుట, హేమంతవర్ణనము, నాగేశ్వర వర్ణనము, శివరాత్రివర్ణనము. సుకుమారుడు నాగేశ్వరాలయమునకు వచ్చి శివరాత్రిని దర్శించి విగతకల్మషుడై కొంతకాలమునకు మరణించుట, కాలకింకరులు వాని గొనిపోవ వచ్చుట, శంకరకింకరులు వారి నడ్డగించుట, యుద్ధము, వాదోపవాదములు, యము డులుంబరుని మృత్యువును తన కింకరులకు బాసటగా పంపుట, యమభటుల పరాభవము, ప్రమథులు సుకుమారుని కైలాసమునకు గొనిపోవుట, సుకుమారుడు శివుని స్తుతించి, ప్రమథు డగుట యనువానితో గూడినది చతుర్థాశ్వాసము.

తన భటుల పరాభవమును విన్న యముడు చిత్రగుప్తుని సంప్రదించి తన యశక్తాధికారము శివునకే విన్నవింప నిశ్చయించుకొని కైలాసమున కేగుట, కైలాసవర్ణనము, శివసందర్శనము, శివస్తుతి, యముడు సుకుమారుని పాపకార్యములు శివునికి వినిపించుట, శివుడు యమునకు శివరాత్రిమాహాత్మ్యము శివభక్తుల లక్షణములు చెప్పుట, యముడు తన లోకమునకు తిరిగివచ్చి తన భటులకు శివరాత్రిమాహాత్మ్యము శివభక్తుల లక్షణములు మరల చెప్పుటతో పంచమాశ్వాసము ముగియును.

ఈ శివరాత్రిమాహాత్మ్యమునకే సుకుమారచరిత్రమని నామాంతరము కనుక శ్రీనాథు డీ సుకుమారుని కథను ప్రబంధోచితవర్ణనలతో పెంచి అట్టి దుష్టుడు కూడ శివరాత్రి దర్శనమున పూతుడైనట్లు స్థాపించెను. కాశీఖండమున (IV. 76-163) గల గుణనిధి కథ యిట్టిదే. పాపకార్యములందు గుణనిధి వెన్నుదన్ని పుట్టినవా డీ సుకుమారుడు. సుకుమార చరిత్రమున శ్రీనాథుడు నైషధము కాశీఖండము మున్నగు తన పూర్వకృతుల నుండియే కాక భట్టబాణుని కాదంబరిలోని రసవంతములగు భాగము లనేకము గ్రహించెను. కనుకనే పూర్వకవిస్తుతి యొనర్చు సందర్భమున అవతారికలో శ్రీనాథుడు తొట్టతొలుత “బాణు నద్భుతశాస్త్ర బహుకళాపారీణు” (I-12) గొనియాడెను.

గీ. వానిఁ గలలోనఁ గానని వనజముఖియు
    వాని మార్పునఁ బేర్కొని మానవతియు
    వానిఁగా నాత్మ భావించి వరునిఁ గవయ
    నప్పళింపని సతియు లేదయ్యె నచట

అను శృంగార నైషధమందలి (I-62) పద్యము శివరాత్రిమాహాత్మ్యమున (II-94) రసవత్తమముగా విస్తరింపబడినది.

కాశీఖండము గుణనిధి చరిత్రమందలి (IV-114) పద్య మున్నదున్నట్లు శివరాత్రిమాహాత్మ్యమున (III-19) అవతరించినది. కాశీఖండమున శివదూతలకును యమదూతలకును జరిగిన సంవాదమందలి (IV-127) పద్యములోని మాటలు కొన్ని శివరాత్రిమాహాత్మ్యమున (IV-73) చేరినవి.

పుష్పదంతుని మహిమ్నస్తవమందలి

“అతీతః పంథానం తవ చ మహిమా వాఙ్మనసయో
రతద్వ్యావృత్యా యం చకిత మభిధత్తే శ్రుతి రపి
స కస్య స్తోతవ్యః కతివిధగుణః కస్య విషయః
పదే త్వర్వాచీనే పతతి న మనః కస్య న వచః”

అను శ్లోకములోని మాటలును, సనత్కుమార సంహితాంతర్గత [11]శివతత్వసుధానిధియందలి శివనామస్మరణాధ్యాయమందున్న

“హరశంభో మహాదేవ విశ్వేశామరవల్లభ
శివ శంకర సర్వాత్మ న్నీలకంఠ నమోస్తు తే”

యను శ్లోకమును గూడ శ్రీనాథుడు (V-21) సంస్కృతరగడలో వాడుకొన్నాడు.

భట్టబాణుని కాదంబరి నుండి శ్రీనాథుడు గ్రహించిన వర్ణనము లనేకము శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగా రుదాహరించి యున్నారు. శివరాత్రిమాహాత్మ్యము II-15, 17, 30, 96, 97, 98, III-21 గద్యపద్యములకు మూలములు కాదంబరిలో గలవు. పాత్రచిత్రణము, గుణశీలస్వభావముల వర్ణనములు కూడ కాదంబరి నుండి సంగ్రహింపబడినవి. ఇందలి కావ్యత్వము గూర్చి శ్రీ చిలుకూరి పాపయ్యశాస్త్రిగారు విపులముగా వ్రాసియున్నారు.[12]

పూర్వముద్రణములు:

ఇంతకు పూర్వము శివరాత్రిమాహాత్మ్యము అసమగ్రముగా మూడుసారులు పుస్తకరూపమున కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తువారు ప్రకటించినారు. ద్వితీయముద్రణము 1930లో జరిగినది. ద్వితీయ ముద్రణ పీఠికలో అప్పటి కించుమించు 12 ఏండ్లకు పూర్వము ప్రథమముద్రణము జరిగినట్లున్నది. తృతీయ ముద్రణ మెప్పుడు జరిగినదో తెలియదు. మొదటి రెండు ముద్రణములకును శివరాత్రిమాహాత్మ్యమును తొలిసారిగా పరిష్కరించిన విద్వాన్ శ్రీ కఱ్ఱి సాంబమూర్తిశాస్త్రిగారి రెండు పీఠికలున్నవి. మూడవ ముద్రణమున గూడ మరల ఆ రెండు పీఠికలే ముద్రితములైనవి. ఆనాడు వారికి లభించినది నాలుగాశ్వాసముల గ్రంథమే కనుక శ్రీనాథు డంతే రచించియుండునని యూహించి శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారు తమ పీఠికలో నటులే వ్రాసినారు. ఒకటి రెండక్షరములు శిథిములైన చోటులు పూరించియు మిక్కిలి శిథిలములైన భాగములు చుక్కల గుర్తులుంచియు గ్రంథమును ముద్రించినారు.

అటు తరువాత శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు సంపాదించి పంపగా శివరాత్రిమాహాత్మ్యమునకు మూలమైన ఈశాన సంహితను గూడ శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారే ఆంధ్ర సాహిత్య పరిషత్తు 44వ ప్రచురణముగా విపులమైన పీఠికతో ప్రకటించినారు. శివరాత్రిమాహాత్మ్యమును శ్రీనాథుడు నాలుగాశ్వాసములుగనే వ్రాసినట్లు శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారును, సంపూర్ణముగా వ్రాసినట్లు శ్రీ బండారు తమ్మయ్యగారును వాదించుకొన్నట్లు వారి పీఠిక మూలమున తెలియుచున్నది. మీదు మిక్కిలి సంస్కృతమున నున్న ఈశానసంహితయే శ్రీనాథుని శివరాత్రిమాహాత్మ్యమున కనువాదమని శ్రీ సాంబమూర్తిశాస్త్రిగా రభిప్రాయపడినారు. ఇంకను శివరాత్రిమాహాత్మ్యమందలి అవతారికాభాగమును, ఆశ్వాసాంతములును శ్రీనాథవిరచితములు కావనియు కృతిపతియో తదాశ్రితుడో ఈ పని చేసినట్లు వారు తీర్మానించినారు. ఆయా భాగములందలి దోషములను అప్రౌఢకవితాబంధములను ఇందు కుపబలకముగా నుదాహరించినారు. భట్టబాణుని కాదంబరీవచనముల నే తీరుగా శ్రీనాథుడు శివరాత్రిమాహాత్మ్యమున అనుసరించినాడో నిరూపించినారు. ఇందు కాంధ్రసాహిత్యలోక మెంతయు వారికి ఋణపడియున్నది.

సమగ్రతాళపత్రగ్రంథము:

ఇన్నాళ్ళకు శివరాత్రిమాహాత్మ్యము సంపూర్ణప్రతి లభించుట మన యదృష్టము. తెలంగాణమందలి మెదకు మండలము అందోలు తాలూకా దన్నారం గ్రామవాస్తవ్యులైన శ్రీ శంకు శంకరప్పగా రీతాళపత్రగ్రంథమును నా కిచ్చినారు. శ్రీ సాంబమూర్తిశాస్త్రిగారికి లభించిన ప్రతి కూడ తెలంగాణకు చెందినదే. ఇతరాంధ్రప్రాంతములందువలె తెలంగాణమున తాళపత్రగ్రంథముల సేకరణ జరుగలేదు, ఇప్పటికిని ప్రాచీనగ్రంథములు తెలంగాణమున లభించుననుట కీ శివరాత్రిమాహాత్మ్యమే సాక్ష్యము. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక (సంపుటి 54-సంచిక 3) లో పాల్కురికి సోమనాథుని క్రొత్తరచనము పండితారాధ్యోదాహరణము ప్రకటించితిని. తెలంగాణమున కొన్ని ప్రాచీనవీరశైవమఠము లున్నవి. ఆయా మఠములందు నేలగాబులలో నూర్లకొలది తాళపత్రగ్రంథములు గడ్డ కట్టుకొనిపోవుచున్నవి. వాని నుద్ధరించు నాథుడు లేడు. ఇప్పటికే కడచిన ఇరువది ముప్పదేండ్లలో కొన్ని యమూల్యగ్రంథములు మనకు శాశ్వతముగా దక్కకుండ పోయినవి. మా యింటినుండి శ్రీనాథుని శాలివాహనసప్తశతి పోవుట నే నెరుగుదును. పూర్వసంస్థానాధీశ్వరుల కడను కొందరు వ్యక్తులవద్దను పోయినవి పోగా మిగిలియున్న గ్రంథములనైనను సేకరించి ప్రాచ్యలిఖితపుస్తకభాండాగార మొకటి స్థాపించవలెనని ప్రభుత్వమువారికిని ప్రజాసంస్థలకును ఒక దశాబ్దముగా మొరపెట్టుకొనుచున్నాను. కాని యది యరణ్యరోదనమైనది. ఇక కొన్నాళ్ళకు మిగిలిన గ్రంథములు కూడ పాడైపోయిన తరువాత ఎవ్వరును చేయగలిగిన దేమియు నుండదు.

ప్రస్తుతము లభించిన శివరాత్రిమాహాత్మ్యము తాళపత్రప్రతి వయస్సు ఇన్నూరేండ్లకు పైగా నుండును. వ్రాయసకాని పొరపాటులు కొన్ని యున్నను ఇది మిక్కిలి చక్కనిప్రతి. చక్కనిదే కాదు సమగ్రమైన ప్రతి. దీనిలో నైదాశ్వాసము లుండుటే కాక పూర్వముద్రితములైన నాలుగాశ్వాసములందు లేని కొన్ని క్రొత్త పద్యము లధికముగా నున్నవి. పూర్వముద్రణములందలి శిథిలభాగము లన్నియు దీనిలో భద్రముగా నున్నవి. ఇంకను దీనిలో కొన్ని పాఠభేదములు కూడ ఉన్నవి. పూర్వముద్రణములందు దోషజుష్టము లనుకొన్న భాగములు కొన్ని ఈ క్రొత్త పాఠములవలన గుణయుక్తము లగుచున్నవి. ఐనను ఒండురెండు శైథిల్యములు గ్రంథపాతము లిందును లేకపోలేదు. మరియొక ప్రతి యెన్నడైన లభించినచో అప్పు డీ శివరాత్రిమాహాత్మ్యము సమగ్రతరమగును.

పంచమాశ్వాసము:

పూర్వముద్రణములందు లేని పంచమాశ్వాస మిందు గలదు. చతుర్థాశ్వాసాంతమున మునులు సూతునితో “చిన్నవోయి యముం డేమి చేసెఁ బిదప” అని యడిగిన ప్రశ్నకు సమాధాన మీ పంచమాశ్వాసము. ఇందు 91 గద్యపద్యము లున్నవి. శివదూతలవలన తన భటులకు జరిగిన పరాభవమును విన్న యముడు చిత్రగుప్తుని సంప్రదించి తన యశక్తాధికారమునుగూర్చి పరమశివునకే విన్నవింప నిశ్చయించుకొని కైలాసమునకు పోవుట, కైలాసవర్ణనము, శివస్తుతి, సుకుమారుని పాపకార్యములు చెప్పుట, శివుడు సమాధానముగా శివరాత్రిమాహాత్మ్యమును శివభక్తుల లక్షణములను చెప్పుట, యముడు తన లోకమునకు తిరిగి వచ్చి తన భటులకు శివుడు చెప్పినవన్నియు మరల చెప్పుట యిందలి వృత్తాంతము. ఈశాన సంహితయందలి (1-130 శ్లోకములు) చివరి యధ్యాయమున కిది తెలుగుసేత.

అధిక పద్యములు:

పూర్వముద్రణము నాలుగాశ్వాసములలో లేని కొన్ని పద్యములు దీనిలో అధికముగా నున్నవి. అవి యివి.

ప్రథమాశ్వాసము 7-11, 123
ద్వితీయాశ్వాసము 103-107
తృతీయాశ్వాసము 45, 123లో కొంత, 131
చతుర్థాశ్వాసము 9లో కొంత, 14

పూర్వముద్రణమున నున్న కొన్ని పద్యము లీ తాళపత్రగ్రంథమున లేవు. అవి యివి

ప్రథమాశ్వాసము 96
ద్వితీయాశ్వాసము 59, 105
తృతీయాశ్వాసము 24, 132

ఈ పద్యములం దవసరమైనవాని గ్రంథభాగమున జేర్చి యనవసరమైనవాని నధోభాగమున జేర్చినాను.

పరిష్కరణము:

పూర్వముద్రణమందలి శిథిలభాగము లీ క్రొత్త తాళపత్రగ్రంథము సాయమున పూరించినవి స్పష్టముగా తెలియుటకై (...) ఇట్టి కుండలీకరణములం దుంచినాను. పంచమాశ్వాసమున నిట్టి కుండలీకరణములు కొలది యాధారములతో నేను పూరించినవాని కుపయోగించినాను. వ్రాయసకాని పొరపాటువలననో మరెందుచేతనో జారిపోయిన భాగము లే యాధారము లేకుండ నేను పూరించినవానిని [...] ఇట్టి గుర్తులం దుంచినాను. పూర్వముద్రణమున నుండియు ఈ తాళపత్రమున లేని భాగములకు *(...) ఇట్టి గుర్తులుంచి యధోజ్ఞాపికలందు పేర్కొన్నాను.

పూర్వముద్రణముతో నీ క్రొత్త గ్రంథమును పోల్చి చూడగా పాఠ భేదము ల నేక ము కనబడినవి. కొన్నిచోట్ల పూర్వముద్రిత పాఠములే సమంజసముగా నున్నవి. మరికొన్నిచోట్ల తాళపత్రప్రతిలోని పాఠములు సమంజసములని తోచినవి. నా బుద్ధికి సమంజసములని తోచినవానిని గ్రంథభాగమున నుంచి తక్కినవాని నధోజ్ఞాపికలందు పేర్కొన్నాను. పూర్వముద్రణ పాఠములకు ము. అనియు కొత్త తాళపత్రపాఠములకు తా. అనియు గుర్తులుంచి యథాసంఖ్యముగా అధోజ్ఞాపికలం దాయా పాఠాంతరములు పేర్కొన్నాను. ఈ రెండు తీరుల పాఠములను సరికావనుకొన్న చోటులందు నా మాటలుంచి రెండువిధముల పాఠములు దిగువన పేర్కొన్నాను. పంచమాశ్వాసము కొత్తదగుటచే దానికి పూర్వముద్రిత పాఠము లీయనక్కరలేకపోయినది. కేవలము తాళపత్రపాఠములు క్రింద సూచించి నా సవరణలతో పూరించినాను. కొన్ని తావులందు వ్రాయసకాని పొరపాటులని స్పష్టముగా తెలియువానిని కూడ క్రింద సూచించినాను. తాళపత్రగ్రంథములోని విషయము లెట్లున్నవో తెలియవలెనను ఉద్దేశముతో నట్లు చేసినాను. ఛందోభంగములు నాకు తెలియని పదబంధము లున్నచోట ప్రశ్నార్థక చిహ్నములుంచి విడిచినాను.

చతుర్థాశ్వాసము పుట 132లోని 88వ తాళవృత్తము లక్షణము తెలియరాదు. దీనిని ప్రస్తరించి చూడగా హరిగతి రగడకు రెట్టింపని తోచినది. నాలుగేసి మాత్రల గణము లెనిమిదింటి కొకపాదముగాను ఐదవగణము ప్రథమాక్షరము యతిగాను ఉన్నట్లు తెలియుచున్నది.

పంచమాశ్వాసము పుటలు 142-143 లోని 21వ సంస్కృతరగడ తాళపత్రగ్రంథమున గజిబిజిగా నున్నది. మొదటి నాల్గుపాదముల చివరన విరుపు గుర్తులున్నవి. తక్కినదంతయు వచనమువలె గుర్తులు లేక యున్నది. ఈ భాగము కూడ రగడకు చెందినదేయని తెలిసికొనుటకు చాల సమయము పట్టినది. వ్రాత తప్పులు గ్రంథపాతము లిందు పెక్కులున్నవి. పై తాళవృత్తమునకును దీనికిని లక్షణము సామాన్యము. ఈ రగడను ఆర్యావృత్తములుగా విభజింపవచ్చును కూడ.

కృతిభర్త యింటి పేరు పువ్వలపువారని పూర్వముద్రణమున నున్నది. కాని నాకు లభించిన తాళపత్రమున నుప్పలపు వారని యుండుటచే నేనీ పాఠమే సమంజసమని తలంచుచున్నాను. ఉత్పలమను మాట కిది వికృతియై యుండవచ్చును. కృతిభర్త వంశమునకు మూలపురుషుడైన పోలిదేవయ్య “కడిమిమై నిరువత్తుగండనిచే మల్లికార్జును కుత్పలం బర్థిఁ బడసె” (I–22), కావున నిట్టి పేరు కలిగియుండునని ఊహించుచున్నాను.

నా పరిష్కరణము, పాఠాంతరముల నెన్నుకొను విధానము నిర్దుష్టమని ఘంటాపథముగా చెప్పజాలను. నా యల్పబుద్ధికి తోచినంత నేను చేసినాను. పండితులు సహృదయులు సవరణలు సూచించినచో మలిముద్రణమున దిద్దుకొందును. అచ్చుతప్పులు లేకుండ తెలుగు పుస్తకము ప్రకటితమగుట పూర్మజన్మసుకృతము. నే నంతటి పుణ్యమునకు నోచుకొనలేదు. చిట్టచివరన సవరణల నిచ్చియున్నాను. సహృదయు లది గమనింప ప్రార్థన.

  1. ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక, సంపుటము 54, సంచికలు 1, 2, విశ్వావసు చైత్ర-ఆషాఢములు, కాకినాడ.
  2. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు, శృంగార శ్రీనాథము - 1923.
  3. శ్రీనాథ కవితాసమీక్ష ప్రథమసంపుటము, కాకినాడ - 1960.
  4. ఆంధ్రకవితరంగిణి, ఐదవ సంపుటము, పుటలు 25-31.
  5. శివరాత్రిమాహాత్మ్యము - పూర్వముద్రణ పీఠికలు.
  6. శృంగార శ్రీనాథము, పుట - 276.
  7. రెడ్డి సంచిక, పుట - 301.
  8. ఆంధ్రకవితరంగిణి - ఐదవసంపుటము.
  9. “శ్రీనాథుని రచనలు-పూర్వాపరాలు”, సాహితి, సంపుటము 5, సంచికలు 4, 5. జులై-ఆగస్టు, 1966. (ఏలూరు)
  10. ఆంధ్ర సాహిత్య పరిషత్ప్రకాశితము-44, కాకినాడ.
  11. అనుముల రామనాథశాస్త్రి పరిష్కృతము, శ్రీ ముదిగొండ బుచ్చిలింగయ్యశాస్త్రిగారి పంచాక్షరీ ముద్రాక్షరశాలలో ముద్రితము, హైదరాబాదు- 1932.
  12. ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక, సంపుటము 40. సంచికలు 500, కాకినాడ.