శివపురాణము/సతీ ఖండము/ప్రకృతి మాహత్యం
స్నాన సంధ్యాద్యనుష్ఠానాలు ముగించుకుని, నైమిశారన్యముని వాటిక మొత్తం, మరలా మరుసటి రోజు యథావిధిగా సూత పౌరాణికుని చుట్టూ పరివేష్టించి,శ్రీ మహా శివపురాణము నందలి ద్వితీయ ఖండమగు సతీ ఖండము ప్రారంభించవలసిందిగా ప్రార్థించిన మీదట సూత పౌరాణికులు, మొదటి రోజు కథాగమనాన్ని మరొక్కపరి మదిలోనే మననం చేసుకుని ఈ విధంగా కొనసాగించారు:
"అన్ని లోకాలకూ పైన ఉన్న శివలోకంలో ఆ పరమేశ్వరుడు, ఆదిశక్తితో విహరిస్తుంటాడని మీకు గతంలోనే వివరించి ఉన్నాను. ప్రపంచం యావత్తూ ఆ అంబికా సదాశివుల విహారస్థలమే! ఏది వినాశనం పొందినప్పటికీ, కైలాసవాసుని నిజనివాసమైన శివలోకం మాత్రం ధ్రువంగా నిల్చి ఉంటుంది.
నిజానికి పరమేశునికీ - పరాదేవికీ భేదము అన్నదేలేదు. బింబ ప్రతిబింబ - భావము. లోక వ్యవహారములో మూర్తి భేదముచేత వేరుగా తోచవచ్చును! పరమార్థ దృష్టితో పరికీంచేవారికి ఆ తేడా తెలియదు. కల్పాంతమందు ఏకమూర్తి. స్త్రీ, పురుషుడు, నపుంసకుడు, స్థావర - జంగమ పదార్ధవ్యాపి. త్రిమూర్తులూ - త్రిమాతలు అన్నీ ఆ ఏకమూర్తి అంశలే!
పరమ మాహేశ్వరుని చేత ఆనతిని పొంది సృష్టి ఆరంభించాడు బ్రహ్మ. పంచ విధ సృష్టి ఏర్పడుతూఉన్నది. విష్ణువు సలహాపై శివార్చన చేయడంతో, బ్రహ్మ కనుబొమల మధ్య 'అవియుక్తం' అనే నాసికమూలం నుండి మహేశ్వరుడు సంపూర్ణాంశతో అర్థనారీశ్వరుడుగా ప్రభవించాడు. ఆయనే రుద్రుడు. ప్రవచన ప్రారంభంలొ మనం స్తుతించినది ఈ రుద్రమూర్తినే ఆయన పుడుతూనే అనేక రుద్రగణాలను ఆవిర్భవింప చేసుకున్నాడు. సకలాంబిక ప్రకృతి అయింది. ఈమె 'ఉమ' అనే పేరిట రుద్రుని చేరగలదు. ఈ ప్రకృతి ద్వితీయ, తృతీయ రూపాలైన సరస్వతి, లక్ష్మి వరుసగా బ్రహ్మ విష్ణువులను పొందారు. లీలార్థం ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా విడివడినట్లు కనిపించిందంతా వాస్తవంలో ఈ త్రిమూర్త్యాత్మక మూర్తి ఒక్కటే! పదే పదే ఈ సంగతి స్ఫురణకు తెచ్చుకోవడం ఎందుకంటే - మనం ఎప్పటికప్పుడు మాయా మోహితులైపోతూ, జ్ఞప్తిని కోల్పోతూ ఉంటాం గనుక - విస్మరించడం అనే గుణం మాయయొక్క మహామహిమ గనుక.. ఇంతగ చెప్పడం జరుగుతున్నది.
ప్రకృతి మాహత్యం:
శైవజ్ఞాన జిజ్ఞాసువులారా! సమస్త జగదాధారమైన ప్రకృతి మాహాత్యాన్ని మీకు వివరించనున్నాను. శ్రద్ధాళువులై వినండి!
ఒకానొక సమయమందు ఆదిపురుష - ఆదిప్రకృతుల మధ్య ఈ రీతిగా సంభాషణ జరిగింది:
సకలాంబికా ! పదునాల్గు భువనాలలోనూ నేను శ్రేష్ఠుడను. అగ్రగణ్యుడను. వాటిని సృష్టించి, పరిపాలించువాడను. చివరికి సంహరింప చేయువాడను కూడా నేనే అగుచున్నాను. నా త్రిగుణాల వల్ల బ్రహ్మ, విష్ణువు, మహేశ్వర రూపాలు మూడింటినీ పొందుచున్నవాడను! భక్తులకు, తాపసులకు, రాక్షసులకు సహితం వరదాత నగుచున్నాను. అంతేనా? ఒకప్పుడు నేను ఐదుముఖాలను, మరొకప్పుడు ఏకముఖాన్ని ధరించి ఉంటాను. హాలాహలాన్ని భక్షించి లోకాలను రక్షించినదీ నేనే! ఎట్టి వికారమును లేక దిగంబరినై సంచరించునదీ నేనే!" పార్వతి వంక సమ్మోదంగాచూస్తూ అన్నాడు.
అంతటి విరాణ్మూర్తికే అహం అంకురించడం ప్రకృతి రూపిణికి కొంత చివుక్కు మనిపించింది. నిజానికి పురుషునికి - ప్రకృతికి తారతమ్యము లేకున్నను, పురుషుడు ప్రకృతి స్వాధీనుడై ఉన్నాడు. ప్రకృతి సహాయంలేనిదే పురుషుడెట్టి కార్యమైనను చేయజాలడు.
క్రమంగా అమ్మ ఆ మహాపురుషునికి మితిమీరుతున్న అహంకారాన్ని ఆదిలోనే త్రుంచ నిశ్చయించింది అంబిక.
సల్లాపాలు కొనసాగిస్తూనే, చేత్తో ఇంత మట్టితీసి, అది బంతివలె చేసి, దానిపై నవరత్న సువర్ణ రజితాది విశేషాలు పొదిగి కడు రమ్యముగా తయారు చేసి, భర్తకిచ్చి 'దీన్ని చిత్తగించండి ' అన్నది.
విరాట్పురుషుడు అది చూసి, అటూ ఇటూ త్రిప్పగా, దానికొక చిన్నద్వారం కనిపించింది. సూక్ష్మ దేహధారిగా అందులోకి ప్రవేశించాడు శివుడు.
అంబచేతిలో ఇమిడిపోయేంత! అంత చిన్న బంతిలో ఎన్ని వింతలు ఎన్ని విశేషాలు? వర్ణనాతీతంగా ఉన్న ఒక గొప్ప ఉద్యాన వనంలోకి ప్రవేశించాడు. సమస్తజాతి వృక్షాలూ, పొదలూ, ఫల పుష్పాదులతో కనిపించాయి. ఆ వెనుక కలువలు పద్మాలతో నిండిన సరోవరాలు, అందు జలపక్షులు చరించుచున్నట్లే - వృక్షాలపై నివసించే పక్షులు కొన్ని కనిపించాయి.
ఇంకొక ద్వారము దాటి లోన ప్రవేశింపగా అందు దశముఖుడు, నలభై బాహువులు గలిగి, తనవలెనే నాగాభరణాది విశేష భూషణాలతో, జడలతో, సమస్తమైన ఆయుధాలతో మరొక శివుడు కనిపించాడు. అక్కడ ఆ శివుడిముందు, అంతకు వందరెట్లు ప్రమాణంలో అంబ కనిపించింది. ఆమె ముందు ప్రకృతే గొప్పదంటూ ఒప్పుకుంటూన్నాడు శివుడు.
మరొక ద్వారము దాటి చూడగా, ఒకగొప్ప దివ్యభవనం, అందులో నవరత్న సింహాసనారూఢయై దేవి - ఆమె కిరుపార్శ్వముల యందు బ్రహ్మ విష్ణువులు స్తోత్రము చేయుచుండ, నటరాజమూర్తియై ఆమె ఎదురుగా నాట్యము చేయుచున్న తననుబోలు మరొక శివమూర్తిని ధర్శించాడు విరాణ్మూర్తి.
ఇంకా, మరికొన్ని ద్వారాలు ఉన్నాయి. అప్పటికే అహంకారం పూరిగా అణగిపోయిన ఆ పరమస్వరూపుడు వాటిని తరచి చూసే ప్రయత్నం చేయలేదు. అంబా! అవునవును! అంతటా నీవై ఉన్నావు అంటూండగానే బంతి ఠప్పున పగిలిపోయింది. విరాట్పురుషుడు ఎప్పటిలాగే నిజదేహంతో, తన సకలాంబికతో సల్లాపాలాడుతూ యథాప్రకారంగానే ఉన్నాడు.
'నేనే గొప్ప అనుకొవడాన్ని మించిన అపరాధమే మరొకటిలేదు. మహావిశ్వరూపుడికైనా దీని నుంచి మినహాయింపు లేదు' - అని తెలుసుకున్నవాడై ఆ విరాణ్మూర్తి ప్రకృతి స్తోత్రం చేసి అంబ అధిక్యత ఒప్పుకొనగా ఆమె ఎంతో వినయంగానూ - సానునయంగానూ "నాథా! మనం ఏక రూపులమే! మనమధ్య ఎట్టిభేదము లేదు" అని పతిని కౌగలించుకొనెను.
"ఈ ఆదిదంపతుల మనోమయాత్మక అవ్యాజానురాగాన్ని ఎవరైతే సుజ్ఞానులై అర్థం చేసుకుంటారో, వారికి శివలోక సాయుజ్యం తథ్యం" అని బ్రహ్మ తన కుమారునికి శివతత్వరహస్య బోధనలో భాగంగా ఉపదేశించాడు.