Jump to content

శివపురాణము/విద్వేశ్వర ఖండము/లింగార్చన రీతులు

వికీసోర్స్ నుండి

సకల శుభకరమైన ఏదైనా దివ్యముహూర్తంలో, భక్తుల నిమిత్తం పుణ్యనదీ తీరాన లింగాన్ని ప్రతిష్ఠించాలి. ఇందుకు పార్ధివ లింగం గాని; తేజోమయ లింగంగానీ శ్రేయస్కరం. చరలింగమైతే చిన్నదిగా, స్థిరలింగమైతే పెద్దదిగా ఉండాలి. లింగం పానవట్టం ఒకే పదార్ధంతో చేయబడిందై ఉండాలి.

ప్రతిష్ట చేయుటకు ముందు గోపురంతోకూడిన మందిరం కట్టించాలి. లింగప్రతిష్ఠాపనవేళ హవనం చేయాలి. శివ పరివారాన్ని కొలవాలి. గురుసత్కారం చేయాలి. ఇది స్థిరలింగ ప్రతిష్ఠ. అయితే, కాలక్రమాన అక్కడ ఆలయం ఏర్పడవచ్చు!

పార్ధివ లింగం :

ఇది స్త్రీలు - పురుషులూ ఆచరించదగినది - నీటిలోని మట్టిని తీసుకుని, శ్రీ గంధం - పాలతో రంగరించి సాధకుడే స్వహస్తాలతో లింగం అకృతి కల్పించాలి. దానికి షోడశోపచార పూజచేయాలి. అభిషేకం చేయబోయేటప్పుడు ధారగ పోయరాదు. చిలకరిస్తే చాలు! వరి అన్నమే నైవేద్యం - ఆయుర్‌ వృద్ధికిది దోహదం.

శివపూజా నంతరం, జపం - నమస్కారం ముఖ్యం. బ్రాహ్మణులకు భోజనం పెట్టడం శ్రేయోదాయకం. శక్తికొద్ధీ సంతర్పణ చేయాలి.

మఘ బహుళ చతుర్దశీ శివరాత్రియందు శివారాధనం అపమృత్యు నివారకం.

లింగభేదములు - వివరణ :

ఇవి రెండు రకాలు 1. స్థావర లింగాలు ( పర్వతాలు, వృక్షాలు మొ||)

2. జంగమ లింగాలు (క్రిమికీటకాదులు)

స్థావరాన్ని సేవించడం - జంగమాల్ని సంతృప్తులను చేయడం కూడా శివారాధనే అవుతుంది.

ఇవి గాక, ప్రణవ జపాదులు ఉండనే ఉన్నాయి. ఓం అని మకారాంతం గానే పలకాలి తప్ప, ఈతరత్రా జపించకూడదు.

శివానుగ్రహం కోరేవాళ్ళు శివక్షేత్రాలలో నివసించాలి. శివాలయాల్లో స్థావరాదులైన చెట్లకు నీరుపెట్టి పోషింఛాలి. పశు పక్ష్యాదులకు యుక్తమైన ఆహారాన్నిచ్చి సంతృప్తిపరచాలి. క్షేత్రవాసం పుణ్యం కదా అని చెప్పి, అక్కడ పాపకార్యాలు చేయరాదు. ధర్మకార్యాలు చేయాలి.

ఇవి రెండు రకాలు.

1. ద్రవ్యంతో చేసేవి (యగాలు - దానాలు మొ||)

2. దేహంతో చేసేవి (తీర్ధయాత్రలు - స్నానపానాలు మొ||)

ధీశాలి రెండూ ఆచరిస్తాడు. ధర్మాచరణ వల్లనే సఖశాంతులు లభిస్తాయి.

లింగారాధన చేయలేనివారు, నాగభూషణ - నీలకంఠ, వ్యాఘ్రాంబర, ఫాలనేత్ర, సర్పహార, చంద్రకళాధరాది సర్వోన్నత తత్త్వాలతో కూడిన శివమూర్తిని పూజించినా సత్ఫలితం సంప్రాప్తిస్తుంది.

కోరికల నిమిత్తం పూజనీయ లింగాల సంఖ్య

వివిధ కోరికలతో, ఎవరైనా లింగపూజ చేయదలచిన పక్షంలో దానికీ ఓ నిర్దుష్ట సంఖ్య ఉన్నది.

ముముక్షువు (మోక్షార్ధి) కోటి పార్దివ లింగాలను అర్చించాలి. సర్వ కోరికలు సిద్ధించడానికి 10 వేల లింగాలు, దారిద్ర్య విధ్వంసనానికి 3 వేలు, భూతప్రేత నివారణార్ధం 500, విద్యాభివృద్ధికి - భయనివృత్తికి 1000 పార్దివ లింగారాధన చేయవలసి ఉంటుంది.

నిత్యారాధకులు, రోజుకో పార్దివలింగ పూజ చొప్పున తమ కార్యసాఫల్యం చెందేంత వరకూ పూజించడం విధి. త్రికాలములు ( ఉదయ - మధ్యహ్న, సాయం సంధ్యలందు) మూడు శివలింగాలు అర్చిస్తే ఎటువంటి కోరికైనా నెరవేరగలదు.

ఈ సంసారార్ణవాన్ని తరించడానికి లింగార్చన కంటే ఉత్తమ మార్గం మరొకటి లేదు.

లింగారధకులు ఉత్తరాభిముఖంగా కూర్చొని అర్చించాలి. ప్రధానంగా వీరు 3 ద్రవ్యాలను సమకూర్చుకోవాలి. అవే...

1. రుద్రాక్ష, 2. భస్మం, 3. మరేడు.