శివపురాణము/వాయువీయ ఖండము/యోగ విషయం - జపం ; జపమాలిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

యోగ విషయం

యోగ విషయమై, ప్రాణాయామం అతి గొప్ప సాధనగా విజ్ఞులు గుర్తించారు. దీనివల్లనే దివ్యసిద్ధులు చేకూరుతాయి. ఇవి నాలుగు రకాలు.

1. శాంతి = సర్వాపదలూ నశించడానికి

2. ప్రశాంతి = బైటా లోపలా ఉండే దుఃఖాలకు విరుగుడు.

3. దీప్తి = దేహ, హృదయాలలో చైతన్యం నిండుట.

4. ప్రసాద = అత్యద్భుతమైన ధీ వికాస విలసనానికి.

ప్రాణాయామాది యోగాభ్యాసం లేకుండా ధ్యానం సిద్ధించదు. ఒక దాంతో ఒకదానికి అవినాభావ సంబంధమున్నది.

ధ్యానంతో సమానమైన తీర్థంగానీ, యాగంగానీ, తపస్సూగానీ లేదు. శివ యోగుల్ని సేవించడం కూడా ఓ విధంగా శివారాధనే!

యోగ విఘ్నాలు :

ఆలస్యం, పొరపాట్లు, అశ్రద్ధ, సందేహం, చిత్తచాంచల్యం, భ్రమ, సంకట ప్రాప్తి, తీవ్ర వ్యాధులు, ఇంద్రియ భోగవాంచ, మనో వేదన అనే ఈ 10 రకాలూ యోగ విఘ్నకారకాలు.

ఇటువంటి దశవిధ విఘ్నాలనూ అధిగమించిన వారి ఎదుట - మళ్లీ 6 రకాల యోగాలు దర్శనమిస్తాయి. ఆ యోగాలు ఇవీ :

1. ఆస్వాదం , 2. నివేదన, 3. దర్శనం, 4. శ్రవణం , 5. వార్త, 6. ప్రతిభ.

ఇందులో ఎవరు ఏ యోగం కోరుకుని సాధన చేస్తే, వారికి శివసంకల్పానుసారం అది లభించి తీరుతుంది.

పృథ్వీతత్త్వ, జలతత్త్వ, ఖతత్త్వ, వాయుతత్త్వ, అగ్నితత్త్వ, గాణపత్తత్త్వ, విష్ణుతత్త్వ ఐశ్వర్యాదులూ ఉన్నాయి.

ఏవిధమైన ఆయాసాలూ - అనారోగ్యాలూ లేనివాళ్లే యోగ సాధనకు అర్హులు. నిశ్శబ్దం - నిర్భీతి గల తావులయందే యోగాభ్యాసం చేయవలసి వుంటుంది. అర్హమైనచోట - పెద్దలచే చెప్పబడిన సర్వవిధ వసతులు గల చోట చెయ్యాలి!

యోగ పంచకం

'యోగః చిత్తవృత్తి నిరోధకః' అని శ్రుతి.

యధేచ్చావిహారం చేసే మనస్సురీతిని కొంతవరకు అడ్డుకట్ట వేయగలిగి; సాధన మీద పూర్తిగా పట్టుసాధించడం యోగం అనబడుతున్నది. ఇది ఐదురీతులు. అవి :

1. మంత్ర, 2. స్పర్శ, 3. భావ, 4. అభావ , 5. మహాయోగం.

ఎటువంటి యోగ సాధనకైనా యమ, ప్రాణాయామ, నియమ, ఆసనమనే 4 గుణాలు ముఖ్యం.

దేహాన్ని వదలనిదే ధనుంజయ వాయువు.

ఎడ తెరిపి లేని ఏకబిగి చింతనమే ధ్యానం!

కనుక - యాగం ప్రారంభించ దల్చుకునేవాడు (ఇతడినే ధ్యాత అంటారు) ధ్యానం, ధ్యేయం, ప్రయోజనం స్పష్టంగా రూపొందించుకోవలసి ఉంటుంది.

జపం ; జపమాలిక :

జపం అనేది 3 రకాలు.

1. ఉదాత్త అనుదాత్త స్వరాలతో అందరికీ వినిపించేరీతిలో చేసేది. దీన్ని వాచక జపం అంటారు.

2. పెదాలు కదుపుతూ స్వరం బైటకు వినిపించకుండా చేసేది. దీన్ని ఉపాంశు జపం అంటారు.

3. పెదవులు సైతం కదపకనే తనలో తానే జపం చేసుకోవడం. దీన్ని మానస జపం అంటారు.

(ఇవికాక - ఇంకా సగర్భ జపం, అగర్భ జపం అనేవీ ఉన్నాయి.)

ఒకదాని కంటె ఒకటి మిన్నగా ఫలితాలు ఇచ్చే జపమాలలు ఉన్నాయి. హస్తరేఖల మొదలు - బంగారపు జపమాల వరకూ జపసంఖ్య తెలిపేవిగానే గాక, విశేష ఫలదాయినులైన మాలలున్నాయి.

శంఖ మణిమాలల కన్న ప్రవాళమాల, దానికంటె స్ఫటికమాల, అంతకంటే ముత్యాలమాల, అంతకంటె పద్మబీజాలమాల అధిక ఫలదాయినులు.

స్వర్ణ, రుద్రాక్ష, కుశ గ్రంధ మాలల ఫలితం ఎన్ని రెట్లుంటుందన్నది ఊహాతీతం!

ఇంట్లో జపం కన్నా గోశాలలో గోవు ఎదుట జపం సర్వ శ్రేష్టం. ఆలయాలు, కొండలు, బ్రాహ్మణ, గురుసన్నిధి, నదీతీరాల యందు జపం ఉత్తమం!

కామక్రోధ వికారాదులకు అతీతంగా జపం చేయాలి. అపవిత్రంగా జపం చెయ్యరాదు. జప సమయంలో తుమ్ములూ - దగ్గులూ - అపాన వాయువులూ రాకూడదు. అవి వస్తే జపం విడిచి, వేరే అనుకూల సమయాన్ని ఎంచుకోవాలి.

శునకం, నీచులు, అశుభ సూచనలు, ప్రకృతి భీభత్సాలు కనిపిస్తే జపం నిలుపుదల శ్రేష్ఠం. కొనసాగిస్తే అరిష్టం.

నడుస్తూనో, పడుకొనో, యథాలాపంగా కూర్చొనో, రాజ వీధుల్లోనో, అపవిత్ర స్థలాల్లోనో జపం సర్వదా నిషిద్ధం!

ఈ జపవిధి కృతయుగంనాటిది. వచ్చే కలియుగంలో మర్త్యులు యోగసాధనకు తగినంత కాయసిద్ధి లేక పంచాక్షరీ జపం చేసేసరికే పైన చెప్పిన రీతి పాటించలేరు. ఇక విశేష జపాలకు పాటించగల రనడం శుద్ధ అపనమ్మకం. వారి కీరీతి వర్తించదు. కనుక శివపంచాక్షరి అనే ఓం నమశ్శివాయః కు మాత్రం నిషేధం లేదు. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ జపించుకోవచ్చు!

యోగాలు - సాధకులు మాత్రం యుగధర్మం ఏది ఎలావున్నా విధి విధానం పాటిస్తేనే ఫలసిద్ధి. అగ్నికి ఏవిధంగా నిత్య పరిశుద్ధత ఉంటుందో - యోగులకూ నిత్య పరిశుద్ధత ఉంటుంది గనుక ; సదా ధ్యాన తత్పరులైన వీరికి ఏ సూత్రాలూ వర్తించవు.