శివపురాణము/లీలా ఖండము/గుహుని గాథ

వికీసోర్స్ నుండి

శివరాత్రి విశిష్టత

ఈ పుణ్యతిథి యందు లింగోద్భవం జరుగుతుంది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథి ఇది. ఆ రోజున శివుని లింగాత్మకంగా గాని, మూర్త్యాత్మకంగా గాని ఆరాధించినవాడు పురుషోత్తముడు అవుతాడు.

"కనీసం (మున్నూట అరవై దినాలూ ఏ పుణ్యం చేయకున్నా) ఒక్క శివరాత్రి పర్వదినాన అహోరాత్రాలూ ఉపవాసం ఉండి, నన్ను ఆరాధించి, జాగరణ చేస్తే ఆ ఫలితం సంవత్సరానికి సరిపోయేటంత ఉంటుంది" అని శివుడే స్వయంగా వచించినాడు.

శివప్రతిష్ఠకూ, శివకళ్యాణానికీ కూడ ఇది ప్రశస్తమైన రోజు. ఈ రోజున నన్ను పూజించువారు, నాకు కుమారస్వామికన్నా ఇష్టులవుతారనీ శివుడు పల్కెను..." అంటూ ఆపాడు సూతుడు.

గుహునిగాథ:

"శివరాత్రి మాహాత్మ్యంతో కూడిన శివలీలలను వినిపించ వలసింది"గా కోరిన శౌనకాది మహర్షులకు గుహుని వృత్తాంతం తార్కాణంగా చూపించ గలిగేలా గుహుని భక్తిగాధ చెప్పసాగాడు సూతుడు.

"ఈ గాధ పరమ అద్భుతమైనది. శివారాధన పట్ల పరిపూర్ణజ్ఞానం లేకున్నా - శివపూజాఫలం దక్కించుకో గలిగాడు గుహుడు. చాలా కాలం నాటి గాథ ఇది.

గుహుడనే ఒక కిరాతుడు వేట జీవనాధారంగాను; అది సాగనపుడు దారి దోపిడీలతోను బ్రతికేవాడు.

ఇలాటి వారికి శివరాత్రి అనేది ఒక పర్వదినం అనీ, ఉపవాస జాగరణలు ఆనాడు జరిపినవారికి అత్యంత ఫలితాన్నిస్తాయనీ ఏం తెలుస్తుంది?

యథారీతిన శివరాత్రి వచ్చింది. వేటలో అఖండుడైన గుహుడు, నాడు కూడా వేట తమకంలోనే ఉన్నాడు. ప్రొద్దుగూకేదాకా కాపుకాసిన ఒక్క జంతువూ దొరకలేదు. ఇంతలో ఒకలేడి అటుగా రావడం గమనించి, ఓ మారేడు చెట్టెక్కి - దాహం కోసం వెంట తెచ్చుకున్న తాబేటికాయ బుర్రలో నీళ్ళు కాసిని త్రాగాడు. లేడి ఆచెట్టు దాపునకు రాగానే బాణంవేయాలని ప్రయత్నం.

మొదటిజాము గడిచేలోగా లేడి ఆ ప్రదేశానికి వచ్చింది. వెంటనే బాణం సంధించాడు. ఈ సన్నాహంలో అతడి వద్దనున్న నీళ్ళు కొన్ని - మారేడు దశాలు కొన్ని సరిగ్గా ఆ చెట్టు క్రింద ఉన్న శివలింగం పైన పడ్డాయి. సగం పాపాలు పోయాయి ఆ కిరాతుడికి.

ఆప్రయత్నంగానే జరిగినా, అతడికి దక్కాల్సిన పుణ్యఫలంలో మాత్రం మార్పులేదుకదా! కాని - వేటగాడి జాడ పసిగట్టి లేడి పక్కకు తప్పుకుంది - బాణం ఎత్తబోగా, పట్టుదలగా అక్కడే మాటువేశాడు - రెండో జాములోగా మరోసారి అటుగా వచ్చింది.

ఇంతకు ముందు జరిగినట్లుగానే కాసిని నీళ్లూ - కొన్ని బిల్వ పత్రాలు శివలింగంపై బడ్డాయి. లేడితప్పుకున్నది. ఫలితం మాత్రం కిరాతుడికి తప్పలేదు.

ఇలా ఆ రాత్రంతా అతడికి జాగరణతోనే సరిపోయింది. దినమంతా ఉపవాసం - రాత్రి జాగరణ - పైగా అప్రయత్న లభ్య శివపూజాఫలం విశేషంగా కలబోసినట్లయి అతడిలో ఓ నూత్న జ్ఞానోదయం కలిగింది. కలిగించినవాడు పరమశివుడే.

స్వయంగా - ప్రత్యక్షంగా ఆ కిరాతుని అనుగ్రహించి, శృంగభేరి పురం రాజధానిగా నిషాదరాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. అంతేకాదు! హరి అవతారుడైనా శ్రీరాముని మైత్రి కూడా లభ్యమవుతుందని ఆశీర్వదించాడు.

ఆ శివలీలకు అచ్చెరువొందిన గుహుడు, పదేపదే శివయ్యను స్తుతిస్తూ శ్రీరాముని కోసం, త్రేతయుగ ఆగమనం కోసం నిరీక్షించసాగాడు.

ఎందరెందరో భక్తవరేణ్యులు:

శివారాధనా తత్పరులు ఎందరెందరో, శివలీలలను స్వయంగా అనుభూతి చెంది తరించారు.

మన యాజ్ఞ్యవల్క్యుడు, వ్యాసమునీంద్రుడు, గార్గ్య మహర్షి, పరాశర మునిశ్రేష్ఠులు..ఇలా ఎవరిచరిత్రలు చూసినా వారందరి ఉద్ధతికీ శివారాధనే ముఖ్య సాధనంగా కనిపిస్తుంది.

శివానుగ్రహం వల్లనే సతీ అనసూయ మాత మూడువందల సంవత్సరాలపాటు రోకళ్ల మీద నిలబడి తపస్సు చేసి చంద్ర, దత్త, దూర్వాసులను కుమారులుగా పొందింది.

బ్రహ్మ సృష్ట కర్తృత్వానికీ - మార్కండేయ మహాముని చిరంజీవత్వానికీ - పరుశురాముని ప్రపంచ విజేతగా నిలబెట్టడానికీ పరమశివపూజే ముఖ్యకారణం!

మాండవ్య మహామునిని కాపాడిందీ శివుడే! కనుక - మన మహా ఋషులంతా అనాదిగా శివతత్త్వ చింతనులై, ప్రవర్తిల్లుతూనే ఉన్నారు. శివారాధన సమస్త ఆపదలను తొలగిస్తుంది. పాపాలను నశింప జేస్తుంది. సర్వ శ్రేయోదాయకమై రక్షిస్తుంది.

అని శివలీలా ఖండానికి ఉపసంహారం పలుకుతూ, సూతమహర్షి ఇలా సెలవిచ్చాడు -

కైలాసవాసిగా శివుడు:

సర్వజీవులకు శ్రేయోదాయకుడైన దయామయుడు శర్వుడు కైలాస పర్వతంపై సదా వశిస్తున్నాడు.

ఆయన కైలాసంపై కొలువైన విధం తెలియండి!

కైలాసం అధిరోహించగానే, ఒక్కసారి ఢమరుక నాదాన్ని మోగించాడు. ఆ నాదం ముల్లోకాల పర్యంతం మారుమోగింది.

బ్రహ్మ విష్ణ్వాదులంతా తమ తమ పరివారాలతో వచ్చి ఆయన ఎదుట నిలిచారు.

నారదాది మహర్షులు, సిద్ధులు, ప్రమథగణాలూ - గణాధ్యక్షులూ అంతా భక్త వినమ్రులై అంజలి ఘటిస్తూ కైవారాలు చేశారు.

వారందరికీ అనుకూలమైన నిర్మాణాలు చేయవలసిందిగా శివుడు విశ్వకర్మను ఆజ్ఞాపించాడు.

అనతికాలంలోనే కైలాసపురీ నిర్మాణం జరిగింది.

పుత్ర మిత్ర బంధు సన్నిహిత పరివార సమేతుడై పార్వతీపతి కైలాసంలో కొలువుదీరిన దివ్య స్వరూపాన్ని హృదయ వేదికయందు పదేపదే స్మరించుకుంటూ నేటికీ ప్రవచనాన్ని నిలుపుతున్నాను. సాయం వేళ అయినది. మీకున్న సంధ్యాద్యనుష్ఠానాలు పూర్తి చేసుకోండి!" అని లేచాడక్కడనుండి రోమహర్షణుడు.

శౌనకాది మహామునులు ఆయనను అనుసరించారు.

                                               లీలాఖండము సంపూర్ణము