శివపురాణము/రుద్ర ఖండము/వైశంనాధావతారుడిగా శివుడు

వికీసోర్స్ నుండి

దూర్వాసావతారం

మన మహర్షి శ్రేణిలో దూర్వాస మహామునికి ఓ ప్రత్యేకత ఉన్నదని గతంలోనే, రెండు ఘట్టముల ద్వారా మీకు చెప్పిన అంశాలు గుర్తున్నాయి కదా! ఆయన ఎవరనుకున్నారు? దూర్వాసముని సాక్షాత్తు రుద్రావతారుడే! అత్రి మహామునికి రుద్రాంశతో పుత్రుడిగా జన్మించాడు. భక్తులను పరీక్షించడం - ఉద్ధరించడంలో విచిత్రమైన పద్ధతులేన్నో అవలంబిస్తుండే వీరికి ఆగ్రహం అధికం. అనుగ్రహమూ అధికమే! సమయా సమయము లెరిగి ప్రవర్తిల్లిన వారికి, ఆయన శాపాను గ్రహాలు రెండూ అనుభవైక వేద్యమే! ఓ ఉదాహరణ చెబుతా వినండి -

సూర్యవంశ సంభవుడైన అంబరీషుడనే రాజు ఏకాదశీవ్రతా నంతరం ద్వాదశీ బ్రాహ్మణ సంతర్పణం తరుచుగా చేస్తున్నట్టు తెలిసిన దూర్వాసుడు అతని వద్దకు శిష్యసమేతంగా భోజనానికి వస్తున్నట్లుగా కబురంపాడు.

కాని, స్నానం నిమిత్తం కావాలనే జాప్యం చేస్తూవుండడంతో, ద్వాదశి పారాయణ సమయం దాటితే వ్రత భంగమవుతుందని శాస్త్రవిధి ఉన్నందున, సమయం మించకుండా గుక్కెడు గంగాజలం పుచ్చుకున్నాడు.

వస్తూనే దూర్వాసుడు, మహారౌద్రంగా "నన్ను భోజనానికి పిల్చి - నువ్వు ఎంగిలిపడ్డావు కదూ! నిన్ను శపించేస్తాను" అంటూ హడావుడి చేయసాగాడు.

ఆ గర్జనలకు, అక్కడే వున్న అంబరీష సంరక్షణార్ధ "సుదర్శనం" అనే చక్రం దూర్వాసుడి పైకి లేచింది. "శివాంశ సంభూతుడు - దూర్వాసుని ప్రసన్న చేసుకో!" మంటూ అశరీరవాణి పలికిన పలుకులకు, సుదర్శన చక్రాన్ని ఉపసంహరింపజేసి అంబరీషుడు దూర్వాసుని పలువిధాల స్తుతించగా, ఆయన సాంతించడమే గాక,అంబరీషునికి వరాలు ఇచ్చాడు కూడ.

వైశంనాధావతారుడిగా

పూర్వం నంది గ్రామంలో మహానంద అనే వేశ్య వుండేది. ఆమె కులానికి కులట అయినా, భక్తిలో మాత్రం సాటిలేనిది. నిత్య శివారాధకురాలు.

ఆమెను పరీక్షించదలచిన శివుడు, ధనవంతుడైన వైశ్యునిగా ఆమె వద్దకు వేషం ధరించి వెళ్లి తన వేష భూషణాదుల చేత ఆకట్టుకున్నాడు.

అందులో భగంగానే, మూడురోజులు (శివరూపుడైన వైశ్య) ధర్మపత్నిగా ఉండడానికి అంగీకరించిన మహానంద, శివుడు పెట్టిన పరీక్షలో ఓడిపోయింది. ధర్మపత్నిగా - తనకూ ఆ సమయానికి భర్తగా ఉన్న ఆ వైశ్యునితోపాటే సతీసహగమనం చెయ్యడానికి సైతం వెనుకాడలేదు. ఆమె నిజంగా పతితకాదని - పతివ్రతా ధర్మాలకు ప్రతీక అని సంతసించిన శివుడామెకు శివసాయుజ్యం ప్రసాధించాడు.

ఇంకా..

అంతేకక - సత్యరథుని కుమారుడైన ధర్మ గుప్తునికి బాల్యమందు తల్లితండ్రులు మరణించగా, అతడ్ని పెంచి పెద్ద చేయడానికి ఓ బ్రాహ్మణ స్త్రీకి భిక్షువుగా కనిపించిన శివుని రూపమే వైశంనాధావతారము.

అట్లే ఆహుక - ఆహూకుడనే దంపతులకు యతినాధ వేషంలోనూ, వారిని మరుసటి జన్మలో తిరిగి దంపతులుగా కలపడానికి హంసరూపుడిగానూ శివుడు అవతరించాడు. నలదమయంతులే పూర్వజన్మలో ఈ యతీశ్వరుని కృపకు పాత్రులైన భిల్లదంపతులు. నిత్య శివసేవా పరాయణులైనందుననే వారికి కనిపించాడు శివుడు.

కొన్ని అవతారాలను స్థూలంగా - కొన్ని అవతారాలను సూక్ష్మంగా ప్రస్తావించి, ఆనాటికి 'రుద్రఖండము' పూర్తిచేసిన సూతమహర్షి సాయం సంధ్యా వందనాదికాల నిమిత్తం మహర్షి గణాలకు సెలవిచ్చాడు.

                                       రుద్రఖండము సంపూర్ణము