శివపురాణము/యుద్ధ ఖండము/ఈశుడు త్రిపురాంతకుడైన వేళ

వికీసోర్స్ నుండి

మహానగసమనమైన ధనువుకు, ఆదిశేషుడిని అల్లెత్రాటిగా బిగించి, అగ్నిసూచీముఖశౌరిని శరంగా సంధించి త్రిపురాలను ఏకకాలంలో కొట్టడానికి, సరైన గురిచూస్తూ మిట్టమధ్యాహ్న వేళకు గురిచూడ్డం ముగించాడు.

చంద్రుడు పుష్యమీ నక్షత్రాన ఉండగా, అభిజిముహూర్తంలో హఠాత్తుగా ఉరిమి వర్షిస్తున్న పుష్కలావర్త మేఘాల నడుమ గురిచూసి ఏకకాలంలో త్రిపురాలనూ కొట్టాడు ఈశ్వరుడు.

మూడు నగరాలు ఒకేసారి మండిపోసాగాయి. ఆ దృశ్యం చూశాకనే దేవతల హృదయం చల్లబడింది.

జయజయధ్వానాల నడుమ దేవతలంతా ఉత్సవాలు జరుపుకొంటూ ఉండగా, నిరుత్సాహంగా ఓపక్క నిలబడిన అరిహంతుని చేరబిలిచిన శ్రీహరి "నాయనా! అరిహంతా! నువ్వేమీ దిగులు చెందవద్దు! నీకు అవసరార్ధం సంప్రాప్తించింది ఈ అంశ. కనుక నీకు పూజలు తథ్యం! అయితే అది - ఈ యుగంలో కాదు! కలియుగంలో - మిమ్ము నమ్ముకొని పూజించేవారూ ఉంటారు" అని దీవించాడు.

క్షీరసాగర మథనం - వెనుక కథ

దూర్వాస మహాముని ముక్కోపి అని అందరికీ తెలిసిందే! ఆయన ఎంతో మహిమాన్వితుడూ - వశ్యవాక్కు గలవాడూ కూడా!

గతంలో ఒకసారి ఆయన, దేవేంద్రుడికిచ్చిన అపురూపమైన పుష్పమాలిక నిర్మాల్యం, అడవి ఏనుగు పాలబడిన వైనం ఎవరోచెప్పగా విని దేవేంద్రుడ్ని ముందే హిచ్చరించినా, నిర్లక్షం చేసినందువల్ల కినిసి, మొత్తం దేవజాతి నంతటినీ శపించేశాడు.

"మీ దేవగణాలకు ఈమధ్య మునీంద్రులంటే లక్ష్యం లేకుండాపోతోంది. స్వర్గవాసంలోని సుఖభోగాలు అనుభవిస్తూ కన్నుమిన్ను గానకున్నారు. మీ ప్రభువు మరీనూ! అతడికి ఎంతో వివరంగా చెప్పి మరీ బహూకరించిన పుష్పమాలికను ఏనుగుల పాల్జేసినందుకు ఇదే నాశాపం! స్వర్గంలోని ఉత్తమోత్తమైన వస్తువులన్నీ, సముద్రంలో పడిపోవుగాక! లక్ష్మీతో సహా సముద్రం పాలగును గాక!" అన్నాడా మునీంద్రుడు.

అంతే! స్వర్గంలోని విలువైన వన్నీ అమృతభాండం, చింతామణి, రత్నం, కల్పవృక్షం, కామధేనువు మొదలుగాగల వస్తు సముచ్చయంతోబాటు లక్ష్మి కూడా స్వర్గాన్ని వీడి సముద్రుడ్ని చేరింది.

తాను చేసిన పొరపాటుకు క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయిన దేవేంద్రుడు ఖిన్నవదనుడై, ఏం చెయ్యడానికీ తోచక, తన దుష్కర్మను నిందించుకుంటూ కుందసాగాడు.

దేవతలందరికీ అమృతమే ఆహారం కదా! అది లేకపోయే! కల్పవృక్షం కోరిన కోరికలు తీరుస్తూండేది. అదీ లేకపోయె! రంభాది అప్సరసలతో సహా అంతా సముద్రగర్భాన చేరిపోయే సరికి దేవేంద్రుడికి, ఈ ఆపదను దేవగురువు బృహస్పతుల వారొక్కరే తీర్చి తరుణోపాయం ఉపదేశించగలరని తోచి ఆయన దర్శనం చేసుకున్నాడు.

ఎంత తీవ్రంగా యోచించినా బృహస్పతికీ ఏంతోచక, దేవరాజుతో సహా ముక్కోటి దేవతల్ని వెంట బెట్టుకుని బ్రహ్మలోకం చేరుకున్నాడు ఆయన.

బ్రహ్మ వారందర్ని చూసి - ముఖ్యంగా దేవేంద్రుడిని చూసి 'ఇదంతా నీ స్వయంకృతాపరాధమే! ప్రభువై ఉండీ, యావత్ జ్ఞాతికే చేటు తెచ్చిన ఘనుడివైతివి! ఏ దేశమందగానీ - ఏ కాల మందుగానీ, ప్రభువు పొరబాటు చేస్తే అది జాతి మొత్తానికే కళంకం తెస్తుంది. ఇది కాలం నిరూపించిన సత్యం! దీనికి తిరుగులేదు. ముని శ్రేష్ఠు డాదూర్వాసుడు. ఇతర మునులకు కోపం, తపోక్షీణతకు కారణం కావచ్చుగాని - అదే ఆయనకు బలం. తెలిసీ చేసిన తప్పిదం ఇది" అంటూ ఇంద్రుడ్ని నానా చీవాట్లూ వేశాడు.

"తరుణోపాయం చూడవయ్యా తామరచూలీ అంటే, తప్పు దొరికింది గదా అని తెగ దూరుతూన్నావు! బాగానే వుంది! నువ్వు పితామహుడివీ, అనదగ్గవాడివీనూ! మేం పడదగ్గ వాళ్లమే! కావచ్చు! కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితి గట్టేక్కేలాచూడు పరమేష్ఠీ!" అని వేడుకున్నాడు బృహస్పతి.

వాస్తవానికి విధాత దగ్గర కూడా, అందుకు పరిష్కారం లేదు. బృహస్పతి సూటిగా అడిగేసరికి, తాను ఏమీ బదులు చెప్పలేక, సంభాషణను దారిమళ్లించి "నేను ప్రస్తుతం శ్రీ మహావిష్ణువును సేవించడానికి వైకుంఠానికి వెళ్తున్నాను. మీరంతా కూడా నన్ను అనుసరించడి!" అన్నాడు పరమేష్ఠి.

అందరూ కలిసి వైకుంఠవాసుని దర్శించారు.

త్రికాలజ్ఞుడైన శ్రీ మహావిష్ణువుకు తెలీనిదేమున్నది? దేవతలు ఇంకా ఆయనకు ఏ సంగతీ విన్నవించకుండానే "దేవేంద్రా! మీ దేవతా సమూహమంతా ఏ విషయమై వచ్చారో నాకర్ధమైంది. నేనూ శాపోపహతుడినే! నా లక్ష్మితో సహా అంతా నీటిపాలైన మనవైభవం తిరిగి మనం పొందాలంటే సముద్ర మథనం కంటే వేరే తరుణోపాయమేదీ లేదు" అన్నాడు.

నారదుని ఉపాయం

దేవతలంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.

ఇంతలో అక్కడికొచ్చాడు నారదుడు. ఆ తాపసోత్తముడు తనకు తోచిన ఉపాయం చెప్తానన్నాడు.

తంపులమారి తతంగాలేవీ లేకుండావుంటే చెప్పమన్నారు దేవతలు.

"ఈ నారద మౌనిని నిజానికి అంతా జగడాలమారి అని ఆడి పోసుకుంటారే గాని, జగత్ కల్యాణకారకుడిగా నేను చేసిన మహాకార్యాలెన్ని లేవు" అన్నాడు ఆయన శాంతంగానే.

"ఇప్పుడా జడదారిని ఏదోలా పొగిడి, పనిసాధించుకోవాలి! ఈ మాత్రం లౌక్యం లేకపోతే ఎలాగయ్యా దేవేంద్రా?" అని బృహస్పతి సర్దేస్తూ "తాము తాపసోత్తములు. తామేం చేసినా లోకాల మేలు కోరే చేస్తారు తప్ప తమకోసం చేసుకోడానికి తమకు సంసార ఝం ఝాటమా? ఏమన్నానా! మీరు కానివ్వండి మహర్షీ!" అన్నాడు కార్య సాధనాతత్పరుడైన బృహస్పతి.

"దేవతలు సుకుమార దేహులు. సముద్ర మథనం వారి వల్ల సాధ్యమయ్యే కార్యం కాదు. దీనికి దేవతల కంటె దానవులే సమర్ధులు. ఏమిటి? దేనికి - ఎందుకూ? వంటి ప్రశ్నలు అనేకం వేస్తారు వాళ్లు. అయినప్పటికీ - పని చక్కబెట్టాలంటే, కొంతఅయినా నిజం చెప్పక తప్పదు.

ముఖ్యంగా - ప్రస్తుతం రాక్షస ప్రభువైన బలిచక్రవర్తిని మనం ఆశ్రయించాలి. అడిగిన వారికి లేదనడు - కాదనడు. మహాదాత అని ఖ్యాతి గడించినవాడు. ఆయన తల్చుకుంటే ప్రభువు గనుక తన వారినందరినీ ఆజ్ఞాపించగలడు" అని సాంగోపాంగంగా వివరించాడు నారదుడు.

తన పుత్రుడికి కలిగిన ఆలోచనాపాటి, తన క్కలగక పోయిందే...అని కాస్త చిన్నబోయాడు బ్రహ్మ. అయినా, తన కొడుకు నాలుగు చోట్లా తిరిగి, రకరకాల తత్త్వాల్ని చూశాడు! అలా లోకాటనచేస్తే తెలివితేటలు తనకూ రాకుండా ఉంటాయా! ఏదో ఆ మూలకూర్చుని సృష్టి కార్యక్రమంలో తలపండి పోయినా, తీరిక లేక ఎటూ వెళ్లలేకపోతున్నాడు గాని!...అనుకుంటూనే పుత్రుడి వంక ప్రశంసగా చూసి " భేషైన యోచన చెప్పావు కుమరా!" అన్నాడు.

"నాదేముంది? అసలు యోచన అంతా యోగీశ్వరమూర్తి శ్రీమన్నారాయణునిదే కదా! దీనికి నా సలహా పొడిగింపే తప్ప వేరేమీ కాదు" అని లౌక్యంగా ఆ ప్రతిభనంతా పరంధాముడికే అంట గట్టాడాయన. మొత్తం మీద అందరికీ తక్షణ కర్తవ్యం ఏమిటన్నది అర్ధమైంది.

'కార్యసాఫల్యం కోసం అయితే మాత్రమేం - మనం యాచించాలా? అడిగేవారికి లేదనక ఇచ్చేవారు దేవతలు. మనం చెయ్యి జాపటం ఏమిటి?' అని కొందరికి చర్రున కోపం వచ్చింది.

"ఈ బింకాలూ - బెట్లుసరులూ, ముని శాపం పొందక ముందు సంగతి. ఇప్పుడు మనం సర్వం కోల్పోయిన వాళ్లం. మన చేయి క్రింది కొచ్చి, దానవులచేయి పైకొచ్చింది. తప్పేంలేదు" అని కొంత మంది సమర్ధించారు.