శివపురాణము/పార్వతీ ఖండము/మేనక - హిమవంతులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తనచుట్టూ పరివేష్ఠితులై యున్న మహాముని జనావళిని దయా దృక్కులతో వీక్షిస్తూ, శ్రీ మహా శివపురాణాంతర్గతమైనదీ - ముచ్చటైనదీ అనదగ్గ మూడవ సంహితను, సమ్మోహ - సమ్మోదాలతో ప్రారంభించాడు సూతమహర్షి. అంతా శ్రద్ధాళువులై వినసాగారు.

"యజ్ఞ గుండంలో ఆత్మార్పణ గావించిన సతీదేవి మరణం, ఈశ్వరుని ఎంతో విరాగిగా మార్చేసింది. అంతటి మహాదేవుని మన్నశ్శాంతినే హరించిన ఆ అవతార పరిసమాప్తితో పరమేశ్వరు డొక్కచోట నిలువలేక పోతూన్నాడు. నిరంతరం సంచారమే పనిగా పెట్టుకున్నాడు.

అలా కొంతకాలం హిమాలయాలన్నీ పావనం చేసి, ఒక దివ్య సుందర ప్రదేశం మహాదేవుని కించుక ఉల్లాసం కలిగించగా, అక్కడ తపోనిష్ఠకు అనువుగా ఉన్నదని భావించి అక్కడే తిష్టవేసి తపస్సు చేసుకోసాగాడు.

ఈలోగా... ముల్లోకాల్లోనూ ఎన్నెన్నో మార్పులూ - చేర్పులూ; వింతలూ - విశేషాలు జరిగాయి.

తారకాసురుడనే వరగర్విత దానవుడి పీడ దేవతల కథికమై తలనొప్పి కలిగించసాగింది.

శివ వీర్యసంజాతుడు తప్ప తారకుడిని జయించేవాడే లేడు. బ్రహ్మదేవుడి వరప్రభావం అది.

సతీదేవి లేనందునా - శివుడు తపోదిక్షలో ఉన్నందునా ఇదెలా సాధ్యం?

విష్ణుమూర్తితో సమాలోచన:

బ్రహ్మది దేవతలందరూ విష్ణుమూర్తితో కలిసి మంత్రాలోచన జరిపారు. "ఏదోవిధంగా పరమశివుని ఒప్పించి, ఏదో ఒక పిల్లని తెచ్చి కట్టబెడతాం అనుకోండి! ఆ పిల్ల శివ తేజోపుంజానికి తట్టుకోవద్దూ?" అని సందేహం వచ్చింది.

అదీ నిజమే! అయినా "ఈశ్వరుడు ఏ పిల్లనంటే ఆపిల్లని చేసుకొనే వాడా?" అనే ఇంకోసందేహం మరికొందరికి కలిగింది.

శ్రీ మహావిష్ణువు అందరికీ ధైర్యం చెప్పాడు. అట్టి మహాశివతేజాన్ని భరించగలిగేది సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపిణి అంశతో జన్మించనున్నది. ఆమె హిమవత్పర్వతరాజతనయ అని సూచనప్రాయంగా తెలియజేశాడు.

తారకాసుర సంహారార్ధం, ఎంతో పకడ్బందీగా దేవతలందరూ ఆ పర్వతరాజతనయనే శంకరునికి పత్నిగా చేయు ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

ఇంతకూ - అసలావిడ జన్మించనేలేదప్పటికి.. అంటే... ప్రాభవ వైభవాల దగ్గర్నుంచీ తమ ప్రయత్నం మొదలెట్టారన్నమాట.

మేనక - హిమవంతులు

జంబూ ద్వీపంలో గొప్ప పర్వతాల్లోకెల్లా గొప్ప పర్వతం హిమవత్పర్వతం. అది నిరంతరం మంచుచేత కప్పబడి ఉంటుంది. దానిని మించిన పర్వతం ఏదీ ఈ భూప్రపంచం మీద లేదు. గంగ వంటి పుణ్య నదులకు ఇదే పుట్టినిల్లు. ఇక్కడి గుహలలో ఎందరో ప్రసిద్ధ మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉంటారు. యక్ష కిన్నెర కింపురుషాది దేవతాగణాలు, ఈ హిమవన్నగ శిఖరాలను వ్యాహ్యాళిగా చుట్టి వెళ్తుంటారు.

పితృదేవతలకు కన్న కూతురు మేనకాదేవి. (ఈమె దేవలోక నాట్యసుందరి మేనక కాదని గమనించాలి) హిమవంతుని ధర్మపత్ని ఈమెయే!

హిమవంతుడు ప్రాక్పశ్చిమ సముద్రాలను అన్నిటినీ వశపర్చుకున్నాడు. భూమి వెడల్పుకు పెట్టిన కొలబద్దా అన్నట్లుండేవాడు. సకల సద్గుణాలు రాశిపోసిన రీతిలో మంచును ఆ రాశిమీద కప్పుకున్న గాంభీర్యం అనిపించేలా దేవతలకు మంచి మిత్రుడుగా మెలిగేవాడు. అనంత వైభవం, అన్యోన్యానురాగంతో మేనక సలక్షణ విభూషితయై హిమవంతునికి తగ్గ ధర్మపత్నిగా మెలుగుతూ ఉండేది. ఆ దంపతులిద్దరూ దాంపత్య సౌక్యాలనుభవిస్తూ యధేచ్చగా ఆనందిస్తున్నారు.

సదా దేవతలను ఆదరించే ఉదార స్వభావియైన హిమవంతుని ఇంట, తమకు జరిగిన సత్కారాది భోగాలకు సంతుష్టులైన దేవతలు నిండుగా హిమవంతుని దీవించారు. "పుత్రపుత్రికాది సర్సంతాన ప్రాప్తిరస్తు" అన్నారు.

కాలక్రమేణ వారికి, ఆదిపరాశక్తి అనుగ్రహాన తొలిసంతానంగా మైనాకుడనే పుత్ర డుదయించాడు. ఆ కాలంలో కొండలన్నిటికీ రెక్కలుండేవి. అవి కూడా పక్షుల లాగానే ఒక చోటునుంచి మరొక చోటుకు ఎగురుతూ ఉండేవి. ఒకానొక కొండ చేసిన ఆకతాయిపని లోక కంటకంకాగా, కోపంతో ఇంద్రుడు కొండలన్నిటికీ రెక్కలు తరిగేయసాగాడు. ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకు, కొండలకు కీడు మూడుతోందన్న వార్త తెలిసి మైనాకుడు సముద్ర గర్భంలోనికి వెళ్లి దాక్కున్నాడు. కొంత కాలానికి సురపతి ఆగ్రహం చల్లారాక, వెళ్లి శరణుకోరి అభయంపొందిన మైనాకుడు, తన రెక్కలసహాయన అప్పుడప్పుడు తల్లితండ్రులను చూడవచ్చేవాడు.