శివపురాణము/పార్వతీ ఖండము/బృహస్పతి హితోపదేశం

వికీసోర్స్ నుండి

బృహస్పతి హితోపదేశం

"పాకశాసనా! పార్వతీదేవి సతి అవతారం అనేది పరమశివునికి తెలీదా? కానీ, అతడు అంత సులభంగా స్త్రీవ్యామోహాన్ని పొందేవాడా? అక్కడ పార్వతీదేవి ఆయన్నే వివాహ మాడగోరి, సాన్నిధ్యాన వసిస్తూ, ఆయన అనుగ్రహం కోసం వేచి ఉంది. ఆవిడపై ఆయనకు ప్రీతి కలిగితేనే కదా - కార్యం సఫలమయ్యేది. ఇందుకు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని తనయుడు పూనుకుంటే తప్ప ఫలితం సిద్ధించదు. కనుక అతడ్ని రప్పించి, ఏదో రీతిన అర్ధించి అయినా సరే!...కార్యం ఫలవంతం అయ్యేలా చూడు! అప్పుడే బ్రహ్మవాక్కు ఫలించేది" అని దేవగురువు తన హితోపదేశంతో దేవేంద్రునికి కర్తవ్యబోధ చేశాడు.

మీనకేతనుడ్ని మనసారా తలుచుకున్నాడు - దేవేంద్రుడు. సుందరీమణుల కనుబొమలను పోలిన విల్లు ధరించి, చిగురాకులు గొడుగు పట్టగా, మలయా నిల పరివేష్టితుడై, చంద్ర వసంతులనే చెలికాళ్లను వెంటనిడుకొని రాజశుక రథాన్నెక్కి అక్కడికొచ్చాడు వలరేడు.

తలచినదే తడవు, ఆ రీతిన వేంచేసిన రతిపతిని, శచీపతి సాదరంగా ఆహ్వానించాడు. తన వల్ల ఏదో ముల్లోకాలకూ ఉపకరించే పనిపడందే, దేవేంద్రుడు పిలువనంపడని ఆ క్షణమే అర్ధమై పోయింది కందర్పుడికి.

మదనుడికి మహామర్యాద

ఒకవేళ దేవేంద్ర పదవి నాశించి ఎవరైనా ఘోరతపస్సు చేస్తున్నారేమో! అందుకే ఇంద్రుడు కలవరపడి, తపోభంగ నిమిత్తం తనను రప్పించాడా?..ఆలోచిస్తున్నాడు మన్మధుడు. ఒక్క నిమిషం ఆగి, ఆవిషయమే అడిగేశాడు కూడా!

"ఇంకెక్కడి పదవి మన్మధా! అదెన్నడో తారకాసురుడి పాలైంది! పదవే వుంటే, దేవ సభలో ఉండక ఈ రహస్య స్థావరంలో దేనికి ఉంటాం?" నీరసంగా అన్నాడు ఇంద్రుడు.

"అయ్యో! అలాగా! నాకీ సంగతి తెలీదే!"

"సర్లే! నీకు తెలీకపోవడంలో ఆశ్చర్యపడవలసిందేం లేదు. తెలిసుంటేనే ఆశ్చర్యం! ఎందుకంటే..నీ కార్య రంగమే వేరు! నీ ఆనందమే వేరు! అపార్ధం చేసుకోకు మన్మధా! నువ్వు నిత్యసంతోషివి.." అంటూ జరిగిన సంగతి యావత్తూ మదనుడికి వివరించాడు దేవేంద్రుడు.

"అలాగే! ఇంత జరిగిందన్నమాట! నావల్ల దేవగణానికంతటికీ ఎలాంటి మేలు జరుగుతుందని నీవు ఆశిస్తున్నావో - దానికి నేనేం చెయ్యగలనో చెప్పు! శక్తి వంచన లేకుండా చేస్తాను" అని హామీ ఇచ్చాడు మీనధ్వజుడు.

"నా ధైర్యం కూడా అదే! నీవంటి హితులు నాకు అండగా ఉండగా, సుర పతినైన నేను గర్వించకుండా ఎలావుంటాను? ధైర్యంగానే ఉన్నాను.."

ఏదో నాయందు అభిమానం చేత అలా అంటున్నావుగాని సురపతీ! నీ వజ్రాయుధం ముందు ఎంతటి అసురులైనా తుత్తునియలు కారా?"

"అ ఆయుధం విఫలమైంది. అదీ వాడి వరగర్వం!"

"అంతకంటే శక్తి గల ఆయుధం!"

"ఉంది! అది నీ సుమశరమే!

"చిత్రంగా ఉన్నదే! కఠిన సదృశమైన వజ్రాయుధానికే లొంగనిది, మెత్తని పూ విల్లుకు సాధ్యమగునా? చూడగా - ఇందులో ఏదో గూఢార్ధం ఉందని తోస్తోంది.

"అదేం లేదు. కానీ..." ఇంచుక సంశయం చేత ఆగాడు శచీపతి.

"సంకోచమేల? సవివరంగా చెప్పు సురపతీ! ఏ సుందరినైనా, వానిపై క్రమ్మచేయమంటావా? ఏ మోహిని వలలోనైనా చిక్కించమంటావా?"

"ఆ అసురుని విషయంలో, సుకుమారమైన నీవంటి మారుని ప్రసక్తి ఉండదు. అంతా బలాత్కారమే! వాడికంటికి నచ్చుట, నీ ప్రమేయమున ప్రేమ అంకురించుట అనేవే జరగవు..."

"ఇదింతా చిత్రంగా ఉంది! మరి నా పాత్ర!?"

"అదే! ఆ విషయానికే వస్తున్నాను. నీ సుమశర ప్రయోగాలు సాంబశివుని మీద సాగాలి!"

"ఏమీ! సాంబశివుని పైనా?"

"భయమా?"

స్వాతిశయంతో కాస్త బింకంగా పైకి కనిపించినప్పటికీ, మన్మధునికి మనస్సులో భయమే కలిగింది. అయినా , గుంభనగానే ఉన్నాడు మారుడు.

పెద్దపెట్టున నవ్వేస్తూ "నాకు భయమేల? ఆ సంగతి నీ వెరుగవా? నేను అందరికీ అజాతశత్రువును కదా! నన్ను మిత్రులుగా భావించనివారు ఈ ముల్లోకాల్లోనూ (స్వర్గ, మర్త్య, పాతళ) ఉన్నారా?" అని గంభీరంగా ప్రశ్నించాడు.

"నాకు మాత్రం తెలీదా ఏం?! నువ్వు ఘటనాఘటన సమర్ధుడవు కనుకనే, ఈ విషయమై నిన్ను అర్ధించినది" అంటూ పొంగ వేసి, మెల్లగా - ఒక్కొక్క అంశాన్నీ ప్రస్తావనలోకి వదలసాగాడు పాకశాసనుడు.

"ప్రస్తుతం సదాశివుడు హిమవన్నగాలపై నున్న 'ఓషథీప్రస్థం' అనే ప్రాంతంలో తపస్సు చేస్తున్నాడు."

"ఆశ్చర్యంగా ఉందే! తాపసులంతా, ఆయన గురించి తపస్సు చేస్తుంటారు. ఇక ఆయన తపం ఎవరికోసం చెప్మా?"

"నిజమే! మాకు ఈ ఆలోచన తట్టనేలేదు సుమా! ఎంతైనా సుమశరుని బుద్ధికుశలతే వేరు! నీ పూలబాణాల్లాగే మహా పదును!" అని మరింత మెచ్చుకొని "అది అ మహానుభావునికే ఎరుక! దైవత మాత్రులం... మనం ఏం తెలియగలం? ఆయన లీలలు మనకేం అర్ధం అవుతాయంటావు కందర్పా!"

ఓ క్షణం ఆలోచించి "అదీ నిజమేలే! అది ఆయనకే తెలియాలి" అన్నాడు మారుడు.

"గతంలో - తండ్రిమీద కోపం వహించి, యోగాన్ని చేత దాక్షాయణి తన దేహాన్ని దగ్ధం చేసుకొన్న వైనం నీకు తెలిసిందే కద!"

"తెలుసు! ఆసంగతి విన్నాను!"

"ఆమె ప్రస్తుతం హిమవంతుని బిడ్డగా పుట్టి పార్వతిగా పెరుగుతున్నది. యౌవనవతి అయిన తన కుమార్తెను హిమవంతుడు, సపర్యలు చేసే నిమిత్తం అతడే స్వయముగా శివుని సన్నిధిని విడిచివచ్చాడు."

"మేలు!మేలు! వారిరువురూ భార్యభర్త లయ్యేందుకు మంచి అవకాశమే లభించాలి కధా!"

"మనసిజా! ఆ పని అంత సులభసాధ్యం కాదు! అందులో నీ ప్రమేయం ఆవశ్యం! అతని హృదయమున ప్రేమ రేకెత్తాలంటే, నీ సుమశర ప్రతాపం రుచి చూపించాలి! తద్వారా వారిరువురికీ ప్రణయం అంకురించి, అది పరిణయంగా పరిణమిస్తేనే, తారకాసురవధ అనే కథ జరగ్గలదు! ఆ కార్యక్రమ నిర్వహణకే నిన్నాహ్వానించింది.."

మొదట సంకోచించినా మునిజన, దేవతాగణాల హితం కోసం కనుక, నెమ్మదిగా తలూపిన సుమశరుడు అందరికీ సమ్మేదం చేకూర్చాడు. తన పరివారంతో సహా పెద్దల ఆశీస్సులు తీసుకొని అటనుండి కదిలిపోయాడు.

సూతమహర్షి చెప్తున్న కథా సంవిధానం సంభాషణాత్మకంగా ఉండడంతో, ఆయా దృశ్యాలు అన్నీ తమకళ్లకు కట్టినట్టు - అవన్నీ తమ కళ్ల ఎదుటనే జరుగుతున్నట్లు అనుభూతి చెందిన శౌనకాది మహామునులందరికీ ఒక సందేహం ఉదయించింది. అది వెంటనే నివృత్తి చేసుకోదలచి "మహాత్మా! పౌరాణికగాధా శ్రవణానందబ్రహ్మా! మాకొక సందేహం! దేవతలనింతగా బాధిస్తున్న ఈ తారకాసురుడెవరు? అతడు పొందిన వరమేది? ఈ గాధతో సంబంధం వున్నందున అతని వృత్తాంతము కూడ వివరించ గోరుచున్నాము" అని పలికారు.

"అవశ్యం! అట్లే చేసెద" అని ఆ రోమహర్షణపుత్రుడు తారకాసుర కథ నిట్లు చెప్పసాగాడు.