శివపురాణము/కైలాస ఖండము/శివనామాష్టకం, ప్రణవార్ధం
పదియవ రోజు...
పురాణ శ్రవణానికి వేంచేసిన మహర్షులందరినీ చూసి,
"శ్రీ శివ మహాపురాణ మందలి కైలాసఖండమును ఈ రోజు మీకు వినిపిస్తాను. శ్రద్ధాసక్తులతో ఆలకింతురు గాక!" అని సూతపౌరాణికుడు కైలాసవాసుని అర్చనారీతులను - పూజాది విధానాలను వివరించే కైలాస సంహితను ప్రారంభించాడు.
శివనామాష్టకం:
భక్తులై ఉండి మంత్రాలు తెలియని వారూ ; జప - పూజా విధానాలను సౌకల్యంగా అర్ధం చేసుకోలేని వారూ అయిన మర్త్యులను సైతం సదాశివుడు కరుణించగలడు.
1. శ్రీ శివాయనమః - ఓం
2. శ్రీ భవాయనమః - ఓం
3. శ్రీ శర్వాయనమః - ఓం
4. శ్రీ రుద్రాయనమః - ఓం
5. శ్రీ ఉగ్రాయనమః - ఓం
6. శ్రీ పశుపతయేనమః - ఓం
7. శ్రీ ఈశాయనమః - ఓం
8. శ్రీ భీమాయనమః - ఓం
అనే ఈ ఎనిమిది నామాలను చెప్పుకుంటూ, లభ్యమయిన పూజా ద్రవ్యాలలో పుష్పాలు, అక్షతలు, గంధం, గన్నేరు పూలు, బిల్వదశాలు ఉండేలా చూసుకొని శ్రీ శివమహాదేవునికి సూక్ష్మపూజ చేయవచ్చును.
ఇంత కొండంత దేవునికీ, భక్తితో అర్పించే ఒక్క మారేడు దశం చాలు! అదీ ఫలితాన్నిస్తుంది.
ప్రా. ఆదిదేవా సదాశివా కైలాసవాసా
సదాశివా - నీలకంఠా - గౌరీసమేతా
సదాశివా - నందివాహనా - నాగభూషణా
సదాశివా - దీనబంధూ - అనాధరక్షకా
సదాశివా - త్రాహిత్రాహి - పాహిపాహి
సదాశివా - హరహర - హరహర
సదాశివా - శివ శివ - శివ శివ
సదాశివా - హరోం, హరోం - సదాశివా||
(అది దేవుడవు, కైలాసవాసుడవు, గౌరితో కూడియున్నవాడవు, నీలకంఠుడవు, నందివాహనుడవు, నాగభూషణుడవు, ఆపన్నులను రక్షించువాడవు, దీనులను ఉద్దరించువాడవు అగు నీవు నన్ను కాపాడు! నీకు ఇదే నా నమస్కారము!)
సూతుడిలా భక్తియుతంగా స్తోత్రం చదవగానే, శౌనకాది ఋషులంతా ఆయన్ననుసరుస్తూ దారుకావనం దద్దరిల్లేలా ఉచ్చైస్వరంతో ఈ స్తోత్రం పఠించారు. అనంతరం...సూతుడు ప్రణవార్ధం వివరించసాగాడు -
ప్రణవార్ధ వివరణము :
ప్రణవమంటే మరేమిటో కాదు! ఓంకారం.
శ్లో. ప్రణవో ధనుః శరో హ్యాత్మా
బ్రహ్మ త ల్లక్ష్య ముచ్యతే !
అప్రమత్తేన వేద్ధవ్యం
శరవత్ తన్మయో భవేత్ ||
(ఓం అనే ప్రణవ మంత్రమే ధనుస్సు. జీవాత్మయే ప్రాణం. బ్రహ్మమే అక్ష్యం. నిర్మలహృదయంతో ఏమరుపాటులేకుండా ఆ లక్ష్యాన్ని చేదించి తన్మయత్వం చెందాలి!)
లక్ష్యాన్ని చేరాలంటే బాణం అవసరం కదా! ఆ బాణం సంధించడానికి ధనుస్సు అవసరం! అటువంటి ధనుస్సే ఓంకారం.
ప్రణవార్ధాన్ని తెలుసుకోవడమే జ్ఞానంగా చెప్పబడుతోంది. శివుడే ప్రణవం. ప్రణవమే శివుడు. బ్రహ్మ జ్ఞానులు ఈ అభేదతత్త్వా న్ననుసరించే సదాశివధ్యానం చేస్తారు. అందుచేతనే..
శ్లో. ఓమిత్యేతదక్షర మిద గ్0 |
సర్వంతస్యోపవవ్యాఖ్యానం భూతం ||
భవద్భవిష్యవతి సర్వ మోంకార ఏవ |
యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ ||
అని, మాండ్యూకోపనిషత్ వివరిస్తోంది.
ఈ దృశ్యాదృశ్య ప్రపంచం ; భూత భవిష్యద్వర్తమానాలు ; త్రికాలాతీత పదార్ధం (ఏదయితే ఉన్నదో) అదే ఓంకారం.
ఒక్కమాటలో చెప్పాలంటే ఓంకారమే భగవంతుడు.
దీనిలో ఆకార, ఉకార, మకారాలు చివర నాదం ఉంటాయి. ఇందులో ఆఖర్న ఉన్న నాదం యొక్క భావాన్నీ - ప్రభావాన్నీ చెప్పడం ఎవ్వరితరం కాదు.
ఓంకారంలో మొత్తం 38 కళలున్నాయి. ఈ తత్వాన్ని వివేకంతో తెలుసుకొని ఉపాసించేవాడే బ్రహ్మవిదుడు.