Jump to content

శివపురాణము/కుమార ఖండము/బాణ - ప్రలంబాసురుల వధ

వికీసోర్స్ నుండి

తారకాసుర సంహారం జరిగిన వైనం, క్రౌంచుడు అనే పర్వత రాజుకు తెలిసింది. అతడు చాలా కాలంగా బాణాసురునిచేత పీడింపబడుతూ నానాక్లేశాలూ అనుభవిస్తున్నాడు.

దుష్ట సంహరణార్ధం అవతరించిన కుమారస్వామి తప్ప, తనను అన్యులెవరూ రక్షించలేరని నిశ్చయించుకొని ఆయననే శరణు వేడాడు క్రౌంచుడు. కరుణించాడు శరజన్ముడు.

శివస్మరణంతో శక్తిని అభిమంత్రించి, బాణాసురుని పైకి పంపాడు. ఆ శక్తి రివ్వున వెళ్లి ఆ రాక్షసుని దగ్ధం చేసి, తిరిగి కుమార స్వామి కరకమలాలను అలంకరించింది.

ఇంతలోనే - ఇంకొక రాక్షసుని నిర్జించవలసిందిగా కోరుతూ, అది శేషుడికి కొడుకైన కుముదుడు శరణువేడాడు.

తారకుడికి ముఖ్య అనుచరుడైన ప్రలంబుడనే వాడు, తారకాసుర సంహార వేళ ప్రాణభీతితో పారిపోయి పాతాళం చేరుకుని, అక్కడి నాగవాసుల్ని హింసించసాగాడు.

స్కందుడా ప్రలంబుడు దాగిన ప్రదేశాన్ని దివ్యదృష్టితో వీక్షించి, ప్రలంబుడిని లక్ష్యంగా తానున్న చోటు నుంచే శక్తిని ప్రయోగించాడు. అమిత వేగంతో వెళ్లిన శక్తి పాతాళం చేరి, ప్రలంబుని పరిమార్చింది. తిరిగొచ్చి స్వామిని చేరింది. కుముదుడు కుమారస్వామిని వేనోళ్ల స్తుతించాడు. ధర్మ సంస్థాపనార్ధం దుష్టరక్షణచేసి, వరాలిచ్చాడు.

గణేశావిర్భావానికి ముందు..

ఒకనాడు ఇంద్రుడు పుష్పభద్రానదికి వెళ్లి స్నానాది విధులు నిర్వర్తించుకొని, వనవిహారం చేస్తూండగా అప్సర స్త్రీ శిరోరత్నమనదగ్గ రంభ వచ్చిందక్కడికి. ఆమెను చూసి మోహపరవశుడైన ఇంద్రుడు తన కోరికను ఆమెను తెలియజేశాడు. ఆమె కూడా ఇంద్రుని చూసి ఆకర్షిత అయ్యింది. ఆ నిర్జనాటవిలో వారిద్దరూ ఇతర ప్రపంచాలను మరచి సురతభోగ క్రీడల్లో మునిగిపోయారు.

ఇద్దరూ జలక్రీడల్లో అలశారు. ఇంద్రుడు మాత్రం ఇంచుక సేద దీరుదామని వొడ్డుకొచ్చి నిలబడి ఉన్నాడు. రంభ మత్రం నదీ జలాలలోనే ఈత కొడుతూన్నది.

సరిగ్గా అదేసమయంలో మహాకోపి అయిన దూర్వాస మునీంద్రులా దారిన పోతూండగా ఇంద్రుడాయనకు నమస్కరించాడు. ఆయన వద్ద శ్రీకృష్ణుని పూజించిన నిర్మాల్యంగా ఒక మందారమాల ఉండడంతో, తన పట్ల గౌరవం ప్రదర్శించినందున అదే సురపతికి కానుకగా ఇచ్చేశాడు. వెళ్తూ వెళ్తూ "ఇంద్రా! ఇది సాక్షాత్తు విష్ణుమూర్తికి సమర్పించినది. దీన్ని నువ్వు అలక్ష్యం చేస్తే నిన్నొదలి సంపద వెళ్లిపోగలదు సుమా"అని హెచ్చరించి మరీ వెళ్లాడు.

ఇంతలో రంభ మోహావేశాన, అర్ధనగ్నమై ఇంద్రుని మత్తుగా జలకాలాటలకు మరల రమ్మని పిలువగా - కామప్రేరితుడైన ఇంద్రుడు మహా నిర్లక్ష్యముగా ఆ మాల నావల పారవైచి రంభతో జలక్రీడలకు నదిలోకి దిగాడు.

ఇంతలో ఇంద్రుని ఏనుగు ఐరావతం, ఆ సమీపంలోనే సంచరిస్తూ వచ్చి, ఆ మాలను తొండం చేత ధరించి, జంటను వెతుక్కుంటూ అరణ్యాలలోకి వెళ్లిపోయింది.

ఎప్పుడైతే ఇంద్రుడు, శ్రీ కృష్ణునికి సమర్పించిన నిర్మాల్యాన్ని నిర్లక్ష్యం చేశాడో - అప్పుడే లక్ష్మి తొలగిపోయింది. ఇంద్రుని వీడి రంభ కూడా వెల్లిపోయింది.

అరణ్యాలలో తిరుగాడుతూన్న ఐరావతానికి ఒక కరణి (అడవిలోని ఆడు ఏనుగు) జంటగా లభించింది. ఐరావతం వద్ద ఉన్న మందారమాల ఆ ఏనుగు పరిగ్రహించిన అనంతరం సుఖభోగాల్లో తేలియాడిన ఆ ఆడఏనుగు, వరప్రభావాన కన్నదా అన్నట్లున్న ఓ మంచి తేజోవంతమైన ఏనుగుపిల్లను కన్నది. మందారమాల ప్రభావం అంతటిది. శ్రీ విష్ణుదేవునికి సమర్పించిన ప్రసాదాన్ని గాని, నిర్మాల్యాన్ని గాని అలక్ష్యం చేయరాదని అంటారందుకే.