శివపురాణము/ఉమా ఖండము/ఉమా సౌందర్యం
"నేడు మనం, ఉమాదేవీ సౌందర్యారాధనతో ఈ ఉమా ఖండము ప్రారంభిద్దాం.
ఉమా సౌందర్యం
ఉమ అనగా ఎవరు? సాక్షాత్తు ఆది పరాశక్తి. జగదంబిక. వాస్తవానికి ఆమె వర్ణనాతీతురాలు.
సృష్టిలోని సౌందర్యం అంతా సమీకృతం చేసి, ఓ చోట కుప్ప బోసినా ఆ కాత్యాయనీ దేవి కాలిగోటికి సైతం సరికాదు.
పది మంది వాచస్పతులు కలిసి ఆమె అందాన్ని వర్ణించినా, వర్ణన ప్రారంభించినది మొదలు వంద ఏళ్ళు గడిచినా సంపూర్ణమైన వర్ణన సాధ్యపడదు. ఎంతో కొంత మిగిలిపోతూనే ఉంటుంది.
ఉమాదేవిని చూడ - వసంతుడు సిగ్గుపడతాడు. మలయపవనుడు ఆమెను తాక జంకుతాడు. కోకిలలకు గానం పూర్తిగా సాధ్యం కాదు. హంసలే ఆమె గమనాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటాయి. చంద్రుని వెన్నెల ఆమె ముఖ దీధితుల (కాంతుల) ముందు వెలవెల బోవల్సిందే!
అంబిక, కాళిక, చండిక, చాముండిక, మృడాని, దుర్గ, భగవతి, కామేశ్వరి, జయంతి, కాళి, సర్వమంగళ, కాత్యాయని, గౌరి, హైమవతి, భవాని, రుద్రాణి..ఇవన్నీ ఆమె అద్భుత నామధేయాలే! ఆవిడ లీలా విలాసాల రీత్యా ఆయా నామాలు కలిగాయి.
ప్రళయ సముద్రంలో ప్రాణకోటి సమస్తం నశించిపోగా; సూర్యచంద్ర గ్రహ నక్షత్రాదులన్నీ అంతరించగా ; రాత్రీ పగలూ అనేవి అస్సలు లేకపోగా ఏ గాఢాంధకారమైతే కమ్మేసి ఉంటుందో - అదే 'మహాప్రకృతి' అని మీకు ఇదివరకే చెప్పి ఉన్నాను.
అట్టి తరుణమందు - ప్రాకృత రూప నామ విశేష గుణాలకు అతీతంగాను ; స్థూల సూక్ష్మ కృశత్వాది పరిణామ రహితంగాను ; కేవల సత్య జ్ఞాన అనంతానంద సుందర స్వప్రకాశంగాను వెలసి ఏదైతే భావించబడుతున్నదో, అదే శివ మని ప్రకటించబడుతోందన్న సంగతి కూడ మీకు ఇతః పూర్వమే స్పష్టపరిచి ఉన్నాను కదా!
ఇంతవరకూ చెప్పిన యావత్ వాజ్మయమూ ఘోషిస్తున్నది అదే! ఈ రీతిన ప్రకటింపబడిన 'పరముడు' సృష్టి నిమిత్తం...ఒక మూర్తిని కల్పించి, ఆ మూర్తికి స్వయంభువు లేక సదాశివుడు అను పేరిట వర్దిల్ల వలసిందనీ - ఏమరుపాటున కూడ తననెడబాయక సహకరించే శక్తితో జట్టు కట్టవలసిందని ఆనతిచ్చాడు.
అదే! ఆ శక్తి - ప్రకృతి. మాయ. నిత్య. త్రిదేవ/మూర్తి జనని. ప్రధానంగా అంబిక. సకలేశ్వరి. మూలకారణ. ఆమెయే ఉమ.
ఈ సకలేశ్వరి ఏకముఖి. సదాశివుడు పంచముఖుడు.
ఉమ అష్ట భుజి. శివుడు దశభుజుడు. ఈమె సహస్ర పూర్ణేందు వదనారవింద. నానాభరణ శోభిత. ఆయుధ ధారిణి. ప్రపుల్ల పంకజలోచన. ఊహాతీత తేజోమూర్తి. సౌందర్యాతిశయ విలాసిని. సర్వ జనయిత్రి. శంకరుడు భసితోద్ధూళిత కర్పూర గౌరవర్ణ దేహుడు. త్రిశూలధారి. దిగంబరుడు.
కాలస్వరూపిణి అయిన పరాంబతో కూడిన అర్ధనారీశ్వరుడు.
శ్లో|| యో ధత్తే భవనాని - సప్త గుణ
వాన్ - స్రష్టా రజః సంశ్రయః ||
సహర్తా తను సా న్వితో గుణతీం
మాయ మతీ త్య స్థితః ||
శ్లో|| సత్యానంద మనంత బోధ మమలం
బ్రహ్మాది సంజ్ఞాస్పదం జ్ఞానదం
నిత్యం సత్త్వ సమన్వయా దధి
గతం - పూర్ణం శివం ప్రజ్ఞాం ధీ మహి ||
అని, పరిపూర్ణమైన శివతత్త్వం మనం గ్రహించుగాక! కనుక ఇది 'సచ్చిదానంద స్వరూపం'. స్త్రీ పురుష సమరసీభూత సంయోగమూర్తి మంతం అయినది.
అందువల్ల 'ఉమ' యే ప్రకృతి. ఈమె మరొక రూపమే కాళిక. ఈమె శివుని పూర్ణావతారమైన రుడ్రుడిని అంటిపెట్టుకొని ఉంటుంది.
బ్రహ్మ తన మనోసంకల్ప శక్తిచేతనే ఈ కాళీసహిత రుద్రుని ప్రభవింపజేశాడు.
ఆ అర్ధనారీశ్వర రూపాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక, తిరిగి బ్రహ్మ శివుని ప్రార్థించి వేర్వేరు రూపాల్ని ధరించమని కోరగా, ఇంతకు మూందే మనం (లింగ వైభవ ఖండంలో) చెప్పుకున్న కపాలి మొ|| పదకొండు రూపాలను ; శాంకరి - వైష్ణవి మొ|| పదకొండు శక్తిరూపాలను విభజించుకున్నాడు.
వీటిలో కొన్ని శ్వేత వర్ణ రూపాలు, కొన్ని కాలవర్ణ రూపాలు. కొన్ని రౌద్రాలు. కొన్ని శాంతములు. ఈ ప్రకారం ఇన్ని రూపాలతో తానై ఉమామహేశ్వరుడు ఈ లోకమంతా వ్యాపించి ఉన్నాడు.