శశికళ/ఎండిమియాన్

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎండిమియాన్

(1) కొండతిరిగీ కోనతిరిగీ
      కోన మధ్యను కొండవాగును
      బండరాళ్లను పతనమయ్యే
      పండువెన్నెల పరుగులెత్తే,

                      లోయ చేరానే !
                      ఓనా వెన్నేలా బాలా !
                      సోయగాల లోయ చేరానే !

(2) అడివి చెట్లూ నిడివి లతలూ
     జడుల రాలే కడిమి పూలూ
     కడిమి పూవుల కధల వింటూ

                     నడక సాగితినే !
                     ఓ కడలివెన్నల ఒడలుదానా,
                     గండశిలపై విడిది చేశానే !

(3) గండశిలలను కొండవాగూ
      నిండుగొంతుక నినదమిస్తూ

                    పదములాడుతు పరుగు లెత్తేనే !
                    ఓ ఉదయకమలం పెదవిదానా,
                    నదిని చేరే శిలను డాసితినే !

(4) చెట్లమీదే చంద్రబింబం
      చెట్లకొమ్మల చంద్రకిరణం
      చెట్లపూవుల వెన్నెల వియ్యాలే

                    ఓ చిత్రకంఠము పలుకుదానా.
                    పూలతేనెల వెన్నేల కలిసేనే !

(5) గండశిలపై మేనువాల్చితి
      కొండవాగూ పాట పాడెను
      వెండి వెలుగులు నన్ను ముంచెను

                    ఓ నిండువెన్నెల నీటులాడీ
                    పండుకొనుచూ నిదుర కూరితినే !

(6) పరిమళాలూ దెసల నిండెను
      పరుగులెత్తే వాగు పాడెను
      వాగుపాటతొ చిన్నిపులుగులు

                    మూగ గొంతుల శ్రుతులు కలిపినవే
                    ఓ తామరపూవూ మోముదానా
                    తోగుపాటలు జోలపాడినవే !

(7) మూడువేలా ఏళ్ల వెనకే
      ఈడువచ్చిన గ్రీకు బాలుడు
      ఆడుకొనెనే గ్రీసుదేశానా

                 ఓ అడవిమల్లెల అందందానా
                 గ్రీకు బాలుడు ఎండీమియానంటా !

(8) ఎండీమియాను అందకాడూ
      అందమునకే అందకాడూ
      గంధములు తావిందులిడు అర
      వింద ముఖమువాడు కందునిపోలే

                సుందరుడు ఆ ఎండిమియానంటా
                ఓ చెందమ్మీ మోముదానా
                ఎండీమియానూ గ్రీకుబాలకుడే !

(9) ఆలమందల తోలుకుంటూ
      చేలదాపుల ఏటిఒడ్డుల
      తేనెపాటల పాడుకుంటూ

                తానె తిరిగెనె ఎండీమియానంటా
                ఓ మీనుకన్నుల మించుబోడీ
                కోనలోనే ఆవులకాసే గొల్లవాడే గ్రీకుబాలకుడూ !

(10) వెలిగిపోయే కలువ రాజూ
       కలిమిలల్లిన కడలి రాజూ

      బలము పొదిగిన పర్వత రాజేనే !
                   ఓ బొగడపూవుల ఊర్పుదానా !
                   ఆలకాసే ఎండిమియాను ఏటిలో నే,
                   పెద్ద రాయిని నిద్దుర జోగేనే !

(11) కొండపక్కా వాగులోనే
      గండ శిలపై నిదురపోయే
      ఎండిమియాన్ని నువ్వు చూశావే

                  ఓ నిండువెలుగుల నిశల రాణీ
                  ఎండిమియాను సుందర రూపము
                  నీదు చూపుల తళుక్కు మన్నాదే !

(12) నిదురపోయే ఎండీమియానూ
       కన్ను తెరచీ నిన్ను చూసెను

                 ఇరువురి చూపులు కలిసిపోయెను
                 ఇరువురి మనసూ లేకమయ్యెను
                 ఓ వలపుల వెన్నేల పడుచా
                 నింగినువ్వూ నేలపై నే ఎండిమియానంటా !

(13) నేలపై అత డందగాడూ
       నింగిపై నీ వందకత్తెవు

                ఇద్దరి అందాలేకమైతే
                ఏడులోకా లందాల వెలుగునే

                     ఓ దివ్యసుందరీ వెన్నెల బాలా !
                     దివ్య సుందరుడతడు లోకంలో !

(14) నీవు వలచిన ఎండీమియాను
       నిన్ను వలచిన ఎండీమియానూ
       నీవుతప్పా ఇతరం లేదా అందాలవానికి

                     నీవె బ్రతుకూ నీవే సర్వం
                     నీవే నీవేనే
                     ఓ నిండువెలుగుల నింగి సుందరీ
                     నీవేహృదయం నీవేప్రాణం నీవే నీవేనే !

(15) కన్నులందూ వెన్నేల వెలుగూ
       వెన్నె లేసే ఆతని ఊర్పూ

                    వెన్నెల లేనీ చీకటి రోజుల
                    కన్నులువాడీ కఱ్ఱబారి తా
                    మూర్చ మునిగెనే
                    ఓ శీతలాత్మా చిత్ర దేవీ !
                    వెన్నవలె నీమనసూ కరిగిందే !

(16) ఆతని ప్రేమకు పొంగిపోతివి
       ఆతని సొగసుకు అలరిపోతివి
       ఆతని అందం, అందం నీదీ
       అలలూ అలలా కలసిపోయితివే !

                    ఓ వెన్నేలా చిన్నారి పడుచా
                    మీ కలియక దేవులు మెచ్చరే !

(17) జలజల పోయే వాగు మధ్యను
       శిలాతల్పం పవ్వళించీ
       కలలుకంటూ నిదురపోతిని

                    నిదురపోయే నాపై వాలితివే !
                    ఓనా వెన్నే వన్నేల రాణీ
                    నిదురలో నన్ను కౌగిలి చేర్చితివే !

(18) నిదురపోయే నన్ను చూచీ
       నాపై వాలిన నిన్ను చూచీ
       గురువు "కూల్డ్రే" చిత్రం లిఖియించె
   
                   ఓనా బ్రతుకు తెరువుల ప్రవిమలాంగీ
                   "ఎండిమియానని" చిత్రం పేరుంచే !

(19) చిత్రం చూచిన పెద్దలంతా
       చిత్రమెంతో గొప్పదనిరీ
       చిత్రం వ్రాసిన చిత్రకారుడు
       ఎండీమియాన్ని చూచేనన్నా రే

                    ఓనా నిత్య ప్రణయినీ
                    చూచిన సత్యం నీకే తెలుసునే !