శశాంకవిజయము/పుట104

వికీసోర్స్ నుండి

దగ్గఱ రా నెదుర్కొని, పదంబులకున్ బ్రణమిల్లి, యాత్మలో
నగ్గలమైన భక్తిఁ దగ నర్ఘ్యము పాద్యము నిచ్చి, క్రక్కునన్.

143


క.

కైదండ యొసఁగి, తోడ్కొని
సాదరగతి వచచి, మణిమయాసనమున న
య్యాదిత్యతేజు నునిచి, శు
భోదర్కము గాఁగ సముచితోక్తులఁ బలికెన్.

144


ఆ.

ఓ మహానుభావ! సేమమే మీకు? మీ
మోముఁ జూడఁ జిన్నవోయి యున్న
దేమి కారణంబొ? యేను శిష్యుండనై
యుండ, నింత వంత నొంద నేల?

145


క.

అన విని, యవనతముఖుఁడై
యనిమిషగురుఁ డిట్టు లనియె నమరేంద్రునితో
వినిపింపరానికార్యము
వినిపింపఁగవలసె నైన విను మేర్పఁడగన్.

146


ఉ.

అత్రిమునీంద్రనందనుఁడు, నబ్జభవాంశుఁ డౌ కుముద్వతీ
మిత్రుఁడు, తండ్రిపంపునను మిక్కిలిభక్తిని మమ్ముఁ జేరి, స
చ్ఛాత్రునియట్ల వేదములు శాస్త్రము లన్నియు నేర్చి, ద్రోహియై,
మాత్రధికన్, మదీయసతి, మానితశీలను బట్టె వింటివే?

147


క.

అంతియ కా, దా పాతకి
యెంతయు మది భయము లేక, యే మేమో మ
త్కాంతకు బోధించి, వెసం
జెంతను నే లేని వేళఁ జేకొని యురికెన్.

148


క.

హరిహయుతో గురుఁ డీగతి
హరిణాంకుని కాని నడక లటు దెల్పు తఱిన్
సుర లెల్ల చెవులు మూసుక
‘హరి హరి! యిది యెంత పాప’ మని తమలోనన్.

149


చ.

‘కటకట! యింత పాతకము గన్నది గా’ దనువార, ‘లిప్పు డా
కుటిలుని నాజ్ఞ సేయఁ దగుఁ గొంచక’ యం చనువార, ‘లాపె తా
నెటువలె సమ్మతించె మది నీ పని’ కం చనువార, ‘లింతు లిం
తటి బలు జంతలా!’ యనుచు నాసను వ్రే లిడువార లై రటన్.

150