వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/23-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

23-ప్రకరణము

నెల్లూరికాపురము - ఋణము

తాతగారికి అఱువదితొమ్మిది సంవత్సరములైనవి. వృద్ధాప్యమువచ్చినది. అచ్చాపీసు విక్రయించివేసిరి. ఇక మదరాసులో నేలయుండవలయును. చేయుచున్నపని విద్యావిషయికము; గ్రంథములు వ్రాయుటయు ముద్రింపించుటయు పోషకులు నెల్లూరనే యున్నారు; శిష్యులును అచటనేకలరు. జన్మభూమి. మరల నెల్లూరుచేరి తమశిష్యబృందము నడుమనుండి, తమనాటకములను వారిచే మునుపటికన్నను చక్కగా నాడించుచు, గ్రంథములు రచించి ప్రకటించుచు నెల్లూరనే కాలము గడుపుకోర్కెజనించినది.

అనంతరము జరిగినవిషయములను మాకుటుంబమునకు మహోపకారముంగావించిన శ్రీ ఏనాదిరెడ్డి గారి మాటలలోనే ముద్రించెద. *"నెల్లూరు వర్ధమాన సమాజమువారి కోరికమెయి, వారి యాజమాన్యమున శాస్త్రులవారు కొన్ని యుపన్యాసములు గావించిరి. ఆముక్తమాల్యదనుగూర్చి యుపన్యసించునపుడు బ్ర.శ్రీ.మైదవోలు చెంగయ్యపంతులు, తూములూరు శివరామయ్యపంతులుగార్లు మొదలగు పెద్దలు శాస్త్రులవారింగూర్చి 'మీరు మాయూరి పండితవర్యులయ్యును మీవలన విశేషవిషయములం దెలిసికొనుట కందుబాటులేని మదరాసులో నివసించితిరి. నెల్లూర నివాస మేర్పఱుచుకొని మాకు


  • శ్రీ గునుపాటి ఏనాదిరెడ్డి గారినివేదిక - వే.వేం. శాస్త్రి సహాయనిధి. మంచి విషయములందెలుపుచు మమ్మాదరింపవలయు^' నని కోరిరి. 'సరి మంచికార్యమే, నాయూర, నాశిష్యుల, మిత్రుల మధ్యను నివసించుటకు నేనును సంతసించెదను. ప్రస్తుతము ఉద్యోగమును మానుకొంటిని కుటుంబభారము నెక్కుడయినది. వృద్ధతయు ఋగ్ణతయు నధిగమించుచున్నవి. మదీయ గ్రంథ విక్రయమున గాలము గడపుచుండు నేను వేలకొలది వ్యయించి యిల్లుగొనుట యెట్లు ఘటిల్లును?' అని శాస్త్రువారు సెలవిచ్చిరి. 'ద్రవ్యమునకై మీరాలోచింపవలదు ఆభారము మాయందున్నది.' అని పెద్దలు వాక్రుచ్చిరి. 'అట్లైన నిల్లు గొనివెట్టు'డని శాస్త్రులవా రిచట నివసించుట కంగీకరించిరి...శ్రీమాన్ నే. తిరువెంగడాచార్యులు గారు రంగనాయకుల పేటయందు రు 4500 ల కొకయింటి నేర్పాటుంజేసి తెలియజేసిరి... విక్రయ ధనమునకుం దొందరకలిగి మొదట వాగ్దానమొనర్చిన మహనీయులను తొందరచేయ సాగితిని. ఈతొందరలో జందాపద్ధతిని ధనమొడ గూర్చుటకు వ్యవధిలేదు. ప్రస్తుత మేబ్యాంకిలోనైన నప్పుచేయించి చెల్లించి నెమ్మదిగ మనము ప్రముఖుల సందర్శించి ధనము గడించి అప్పుతీర్చుట లెస్స' యని మైదవోలు చెంగయ్య పంతులవారు సలహానిచ్చిరి. అందరును సమ్మతించిరి."

వెంటనే అయిదువేలరూప్యములకు ఈక్రొత్తయింటిని మామదరాసు ఇంటిని రెంటిని అడుమానము పెట్టించి తెచ్చిన పైకముతో ఆయింటిని కొనిరి. తాతగా రాయింట నివసింప నారంభించిరి. ఆపెద్దలు ధనము వసూలుచేసి ఆయప్పును తీర్చు టకు ప్రయత్నించు చుండిరి. చూచితిరా! విధివిలాసము. అప్పను మాటలేక కాలము గడుపగోరి అచ్చాపీసునే విక్రయించి నిశ్చింతగా కాలము గడుపుచుండిన భ్రాహ్మణునికి దైవము మరల ఋణమును అంటగట్టినది.

ఆసంవత్సరమే జూలైనెలలో తాతగారికి అఖండగౌరవము జరిగినది. పూర్వము వారికి క్రిశ్చియన్కాలేజిలో శిష్యులుగా నుండి అనంతరము సన్న్యసించి అప్పుడు జగద్గురువుగా శ్రీ శంకరాచార్యస్థాపిత శారదాపీఠము నధిష్ఠించిన భారతీకృష్ణ తీర్థస్వాములవారు (ఇప్పుడు పురిస్వాములవారు) తమపూర్వాశ్రమ గురువులైన శాస్త్రులవారికి గొప్పసత్కారముచేసిరి. నెల్లూరిలో సర్వజనీనమగు నిండోలగ మొకటి జరిపి అందు తాతగారికి ఆఱుబిరుదములను 'మహామహోపాథ్యాయ, విద్యాదానవ్రత మహోదధి, పండితరాజ, వేదవేదాంగశాస్త్రజాల మహోదధి, సనాతనధర్మరత్నాకర, సర్వతంత్ర స్వతంత్ర" యను వానిని ఒసంగిరి. పైగా పుత్త్రపౌత్త్ర పారంపర్యముగా నెలకు నూటయేబది రూప్యములు తమ మఠమునుండి పంపుచుండున ట్లేర్పాటు గావించిరి. ఆసభకు దక్షిణ భారతదేశమందలి ప్రముఖు లెందఱో వచ్చియుండిరి.

ఆసంవత్సరమే తాతగారికి చాలజబ్బు చేసినది. ఇంటిలో ప్రవేశించిన ముహూర్తమని కొందఱు తలంచిరి. శాస్త్రులవారు ఈదెబ్బలో చనిపోవుదురని యెల్ల వారును భయపడిరి. కొన్ని నెలలకు ఎట్లో ప్రాణసంశయదశనుండి తప్పించుకొనిరి. దీనిచే వారికేర్పడిన శరీరదౌర్బల్యము మాత్రము తగ్గలేదు. డెబ్బది సంవత్సరములవయసు. మంచి యారోగ్యమునందుండినవారగుట 'నాకుకూడా ముసలితనం వస్తుందని నేననుకోలేదురా' అని నాతోపలుమార్లు వచించువారు కొన్నినెలలలో చాల ముసలివారైపోయిరి. పూర్వముండిన దార్డ్యముపోయినది. దౌర్బల్యమేర్పడినది. చరమదశ ప్రారంభమైనది. రానురాను మంచము మీదనే పరుండి యుండువారే గాని కుర్చీలోకూర్చుండి పనిచేయుశక్తి తగ్గిపోసాగినది. కూర్చుండుట బద్ధకమై క్షౌరమే మానివేయసాగిరి. గడ్డము పెరుగుటకు ఆరంభమైనది. పైగా నిరంతరము చదువుచునేయుండినందు చేతనో ఏమో కంట ఎల్లప్పుడును నీరు కారుటయు దృష్టి మందగించుటయు నేర్పడినవి.

ఈయుత్సవమైన కొన్ని నెలలకు తాతగారికి గొప్పదు:ఖము వాటిల్లినది. కలిమి లేములును సుఖదు:ఖములును కావడి కుండలుగగా. వ్యాధిగ్రస్తులుగా నుండిన మానాయనగారు, తాతగారికి ఏకైకసంతానము, 1922 సం డిసంబరు 14 తేది నెల్లూరి రంగనాయకులపేటలోని యింటిలో పరమపదించిరి. వార్థక్యమున కలిగిన యీదు:ఖముచే తాతగారు క్రుంగిపోయిరి. మానాయన గారిని తాతగారు అచ్చాపీసుపనిలో నియోగించిరి. చాలకాలము జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను వారు నిర్వహించుచుండిరి. వారిది చక్కని అపరంజిని బోలిన శరీరచ్ఛాయ. వ్యాయా మాదులలో చాలకుశలులు. బాల్యములో లెక్కలేని ఆటపందెములలో ప్రసిద్ధినందిరి. సాండోపద్ధతి నవలంబించి శరీర వ్యాయామమొనరించి మహాబలిష్ఠులుగాను బలవంతులుగా నుండిరి: మదరాసులో నుండిన జెట్టీలును మల్లురును వీరికి దాసులు. గుఱ్ఱముల పిచ్చియొకటి అధికముగా నుండెడిది. గుఱ్ఱపుస్వారి నేర్చుటయేగాక వానిని పందెములకు తయారుచేసిరి. ఏకకాలమున ఇంట మూడునాలుగు ఉత్తమాశ్వములను సిద్ధముగా నుంచుకొని యుండువారు. వీరపురుషోచితమైన జీవితమునుజరిపిరి. ఒకపాటి సంస్కృతాంధ్రములలో ప్రవేశముండినది. తాతగారి ఆముక్తమాల్యదా వ్యాఖ్యకు, తాతగారు చిత్తుగావ్రాసిన దాని నంతయు మరల ముద్రణోచితముగా నకలువ్రాయుచుండిరి. మొదటి నాలుగై దాశ్వాసములకు వీరువ్రాసిన దంతయు పదిల పరచియున్నాడను. తాతగారి వ్రాతకును వీరివ్రాతకును తటాలున భేదముకనిపట్టుట కష్టము. ఇంగ్లీషు వ్రాతయు నట్టిద కాని వీరివ్రాత తాతగారి వ్రాతకన్నను సుందరము. అరేబియన్‌నైట్సు ఎంటర్టేన్‌మెంట్సు కథలను సమగ్రముగా తెనుగులోనికి తర్జుమాచేసి ఏకారణముచేతనో వ్రాతప్రతిని చింపివేసిరి. కృష్ణ లీలాతరంగిణి వీరికి గుడ్డిపాఠము. కంఠస్వరము అతిమనోహరము. ఏమైననేమి, కొంతకాలమైన తర్వాత, విశేష శరీర వ్యాయామమొనరించువారికి అభ్యాసమగునట్టివికొన్ని వీరికలవడినవి. క్రమముగా అభినియలవాటైనది. 'ఎల్లమందుల గెలుపొందు నల్లమందు.' తొలుత ఇదిదేహదార్డ్యమున కుపకరించి నను క్రమముగా శరీరమును క్రుంగదీసినది. ఏపనిచేయుటకును ఇచ్చలేకపోయినది. మఱపు అధికమైనది తుదకు అచ్చాపీసు వ్యవహారములయందు అశ్రద్ధ యెక్కువయైనది. ఈకాలమునందే తాతగారు సూర్యరాయనిఘంటు సంపాదకత్వమును వహించుట. తాతగారికి తుదిదినములలో కుమారునింగూర్చిన చింతయొకటి యేర్పడినది. మానాయనగారికి క్రమముగా శరీరమందు దౌర్బల్యమేర్పడి తుదకు నెల్లూరికేగుకాలమునకు ప్రాణాంతికమైనది.

తాతగారికి అనారోగ్యము వృద్ధికాజొచ్చినది. పాదములు రెండును వాచినవి. ఈవాపుమాత్రము చనిపోవువరకు నుండినది. స్వాములవారు అసహాయోద్యమములో పాల్గొని జెయిలుకు పోయినందున వారిసహాయము నిలిచిపోయినది. అప్పు ఒకటి క్రొత్తగానేర్పడినదిగదా యనుచింత హృదయశల్యమై బాధించుచుండెను. ఈకష్టపుదినములలో శ్రీ గునుపాటి ఏనాదిరెడ్డిగారు వారిఋణవిముక్తికి తాముపాటుపడగలమని చెప్పుచు అందులకై ప్రయత్నములు చేయుచు వారిని ఓదార్చు చుండిరి.

శ్రీ రెడ్డిగారు తమనివేదికయం దిట్లువ్రాసియున్నారు. "ధనసంపాదనకై తొలుత వాగ్దానమొనర్చిన పెద్దలను పలుమార్లు సందర్శించి వారు నిర్ణయించు వాయిదాలకెల్ల హాజరగు చుంటిని.... ధనసంపాదనము జరిగినది కాదు. దినదినమునకును వడ్డి పెరుగుచుండెను. ఋణప్రదాతలు త్వరపెట్టసాగిరి. తొలుతటి వాగ్దాతలకును మిత్రులకును శిష్యులకును శాస్త్రులవారు జాబులు వ్రాయసాగిరి ప్రత్యుత్తరములు వ్రాసినవారు కొందఱును వ్రాయనివారు కొందఱునుగ పరిణమించెను. స్వస్థలమున నివాస మేర్పఱచుకొంటిమని సంతసించుటకు బదులు శాస్త్రులవారికి ఋణశల్యమేర్పడెను."

తాతగారి తుదిదినములు ఈవిధముగా పరిణమించినవి. ఏదైనను ద్రవ్యము వచ్చిన వెంటనే దానికి రెండింతలు ఖర్చు కాచుకొనియే యుండెడిది. ఎన్నడును జీవితమున సత్కారములకై నానారాజ సందర్శనములకేగు నలవాటు బొత్తిగా లేని వారైనను శ్రీగద్వాల సంస్థానప్రభువులు శ్రీ సీతారామ భూపాలరావు బహద్దరు వారిని దర్శించుటకై 1924 సం. గద్వాలకుపోయిరి. అచ్చట మంచి సత్కారమే జరిగినది. ఆస్థానపండితులు ఎక్కువగా నభినందించిరి. ఆపండితులు వీరవైష్ణవులు. విద్యావిషయములలో శాస్త్రులవారితో ప్రసంగించుచు దినదినమునకు శాస్త్రులవారిమీది భక్తి అధికమగుచుండగా నొకదినము వారుచెప్పిన విషయములకు ఆశ్చర్యపడి "మేము ఎన్నడును స్మార్తులకు నమస్కరించినది లేదు; ఇదుగో సరస్వత్యంశ సంభూతులకు తమకు నమస్కరించుచున్నాము" అని పాదానతులైరి.

శ్రీ పుల్లగుమ్మి వేంకటాచార్యులవారు శాస్త్రులవారివంటి పండితుని కనివిని యెఱుగమని యిట్లు శ్లోకమును వ్రాసిరి

శ్లో. ఈదృగధీతీశాస్త్రే గైర్వాణగ్రంథ జాలేచ
   అంధ్రగ్రంథేషుతథా నహిదృష్ట: శ్రుతచరోవాపి

ఇంకను పలువురు శ్లోకములను పద్యములను వ్రాసి యున్నారు. శ్రీమహారాజావారు తాతగారిని తమ యాస్థానమునందు కొంతకాలముంచుకొని 600 రూప్యములును బంగారుతోడా జోడుశాలువలు నొసంగి మార్చి 26 తారీఖున వీడ్కొలిపిరి.

నెల్లూరిలో తాతగారికి శిష్యులు సంపాదించిన గృహము చాలపాతది. అందులో వారు చేరిన క్రొత్తలో తలుపులు లేవు. పైనదూలములు అడవికొయ్యలు వానకాలమున బొత్తిగా నిలువచోటుండదు. ఎంతమాత్రము నివాసయోగ్యముగా నుండలేదు. గద్వాలనుండి వచ్చినవెంటనే పైకప్పునెత్తిన పడకుండ ఇంటిని కాపాడుకొనుటకు ఆడబ్బు ఖర్చైనది. ఇట్లే వచ్చిన ద్రవ్యమంతయు వ్యయమగుచుండినది. ఇట్టివానికి పోగా మిగిలినది ఇంటికి చెల్లుచుండినది.


__________