వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/21-ప్రకరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

21-ప్రకరణము

జ్యోతిష్మతీవిక్రయము

సూర్యరాయనిఘంటువును వదలినవెనుక రెండుమూడు సంవత్సరములు తాతగారికి గ్రంథరచన కవకాశము దొరకలేదు. బొబ్బిలియుద్ధ నాటకమును 1916 సం. మున ప్రకటించిరి. దానిని శ్రీ మహారాజావారికి పంపుకొనుభాగ్యము వారికి లభింపలేదు. ఆ వెనువెంటనే 1918 సం. పిబ్రవరిలో నిఘంటువుతో సంబంధము వదలిపోయినది. అప్పులవారు చుట్టవేసికొనిరి. శ్రీ మహారాజావారికడ నప్పుగాతీసికొనిన ద్రవ్య మింకను చెల్లింపలేదు. ఈరెండేండ్లును గుమాస్తాలు చేసిన ద్రోహమునకు మితములేదు. దాదాపు ఐదాఱువేల రూప్యముల ఋణ మేర్పడియుండెను. రెండేండ్లు ఎట్లో అచ్చాపీసును నిలుపుకొన వలయునని తాతగారు ప్రయత్నించిరిగాని సాధ్యము కాలేదు. తుదకు జ్యోతిష్మతీ ముద్రాక్షరశాలను విక్రయించివైచి, ఆ ఋణములనెల్ల నిశ్శేషముగా తీర్చివైచిరి. వారికి మదరాసులోని యిల్లును తామదివరకు ముద్రించియుండిన పుస్తకముల కట్టలును మిగిలినవి. పుస్తకవిక్రయముచే నేర్పడిన ద్రవ్యముచే కుటుంబమును నిర్వహించుకొనుచు, కొంత మనశ్శాంతినంది, 1919 సం మునుండి మరల గ్రంథరచనకు ప్రారంభించిరి.
Vedhamu Venkataraya Shastrula Vari Jeevitha Charitra Sangrahamu.pdf
అచ్చాపీసును విక్రయించుట కిష్టములేకపోయినను తప్పని సరి యైనందున విక్రయించిరి. విక్రయించిన ప్రథమమున చింతాకులులై యుండిరి. కాని వెనుక కొంతమనశ్శాంతి చేకూరినది. జోరువర్షముకురిసి వెలిసినట్లైనది. శృంగారనైషధము వెలువడినప్పుడే 'చేసెదనింక దత్పరతసేవలు చూడికుడుత్తదేవికిన్‌' అని వ్రాసియుండిరి. తాతగారు మరల నద్దానిని ప్రారంభించి కృషి సలుపసాగిరి. శ్రీ పిఠాపురము మహారాజావారు ఒక జాబులో నిట్లు వ్రాయించిరి:-

About Amukta - Malyada the Rajah wants me to write to you to say that he would like to have it just like your విజయవిలాసం in size (if possible even a little smaller), type and get up. If necessary he says it may be split up into two volumes, Naishadha, he considers to be very ponderous and unwieldy. He would be glad know your views.

తాతగా రిట్లువ్రాసినారు. "వ్యాఖ్య ఈపాటి విపులమగునని ఆదిలో నేను ఊహించుకొనలేదు. రెండాశ్వాసములకు వ్రాసిచూడగా, బావిత్రవ్వగా బేతాళములు వెలువడినట్టులయినది. గ్రంథనకెల్ల జీర్ణోద్ధారమే కావలసివచ్చినది. అందులకై సమగ్రసంస్కరణ - సాధుపాఠనిర్ధారణ - కువ్యాఖ్యా విషహరణ - సమంజసార్థావిష్కరణపూర్వక విపులవ్యాఖ్యానమును వ్రాయ నుద్యమించితిని." ఈవ్యాఖ్యవ్రాయుచు నడుమ విశ్రాంతికై 'అధికమనో వ్యాపారము శక్యముకాని వేసవిదినములలో విష్ణుచిత్తీయ టీకారచనను కొంత నిలిపి, కాలయాపనకొఱకు మాళవికాగ్ని మిత్ర ఉత్తరరామచరిత్రములను అనువదించిరి. పిదప రత్నావళి విక్రమోర్వశీయముల నాంధ్రీకరించిరి. వ్యాఖ్యరచన కష్టమని తోచినప్పుడు మఱియేదేని చిన్నపుస్తకములను వ్రాయుటయో ఉపన్యాసముల నిచ్చుటయో చేయుచుండిరి. ఈకాలమున రచించినవే తిక్కనసోమయాజివిజయమును విమర్శవినోదమును.

ఆముక్తమాల్యద వ్యాఖ్యరచన తేది 24-6-1920 నాడు ప్రారంభించి తేది 28-10-20 నాటికి పూర్తిగావించిరి. కొన్నికొన్ని భాగములను ముద్రణవశమున వ్రాసికొనవచ్చును గదా యని వదలియుండిరి. నాలుగుపుటలు వచనమునకు వ్యాఖ్య తర్వాత మదరాసులో 1926 సం. మున వ్రాసినవిషయము నేనెఱుగుదును. నేను నిరంతరము తాతగారిచెంతనే యుండువాడను. ఆగదిలోనే నిద్రించువాడను. ఎప్పుడైనను నేను నిద్రమేల్కొని చూచునప్పుడు తాతగారు వ్రాయుచునే యుండువారు. రాత్రి పదుకొండు గంటలకు, అర్ధరాత్రి, రెండుగంటలయప్పుడు, తెల్లవాఱుజామున, నెప్పుడుచూచినను వ్రాయుచునేయుండిరి. వారెప్పుడు నిదురబోవువారో తెలియదు. 'అవిదితగత యామా రాత్రిరేవ వ్యరంసీత్.' తాతగారి నాటిచర్య నాకు ఇప్పుడు ఆశ్చర్యకరముగానున్నది. 'ఆముక్తమాల్య దకు వ్యాఖ్య వ్రాయుటకై కొన్నిసంవత్సరములు చదివితిని; వ్యాఖ్యనుమాత్రము ఆఱునెలలలో వ్రాసితిని' అని నాకొకమారు చెప్పినారు. ఒకదినము నిదురలేచినదిమొదలు వ్రాయుచునేయుండి మధ్యాహ్నముమీద నిదురబోయి సాయంకాలము ఆఱుగంటలకులేచి అప్పుడే తెల్ల వాఱినదని తలంచి దంతథావనము చేసికొనుట కారంభించిరి. 'తాతగారూ, ఇప్పుడు సాయంకాలముగదా. ఇంక క్షణముండిన చీకటిపడును' అని నేను హెచ్చరించితిని. చీకటిపడినవెనుక వారికి బోధపడినది.

ఒకమారు పరథ్యానముగా పోవుచు వెనుకవచ్చు ట్రాము కారును సైతము తెలిసికొనక ఆట్రాము తన్ను తాకునంతదూరము వచ్చినవెనుక నులికిపడి తప్పించుకొనిరి. ఆసమయమున వారేదో గ్రంథమును థ్యానించుచుండిరి.

ఆవెనుక సాహిత్యదర్పణము నాంధ్రీకరించుటకు 2-2-21 నాడు ప్రారంభించి 11-4-21 తారీఖున పూర్తిగావించిరి. ఈకాలముననో లేక కొంతముందో శారదాకాంచిక, షష్ఠకింకిణి, ఆంధ్ర వ్యాకరణసర్వస్వవిమర్శను వ్రాసినట్లు తోచుచున్నది. ఐదవకింకిణి యేదియో నాకును ఇంకను తెలియలేదు. బహుస: శ్రీ ధర్మవరము రామకృష్ణమాచార్యులవారి మోచాకుసుమముపై వ్రాసిన 'మోచాకుసుమామోదవిచారము' అగునేమో. ఆంధ్ర హితోపదేశచంపువును సయితము ఇప్పుడేవ్రాసిరి. నెల్లూరికేగిన వెనుక గ్రంథరచనచేయలేదు.


__________