వేదము వేంకటరాయ శాస్త్రులవారి జీవితచరిత్ర సంగ్రహము/19-ప్రకరణము
19-ప్రకరణము
శ్రీ వేంకటగిరి మహారాజా
కీ.శే. శ్రీ రాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరువారు
శాస్త్రులవారికి నెల్లూరిపై నభిమానముమెండు. శృంగారనైషధ ముద్రణానంతరము నెల్లూర నివాసమేర్పఱుచుకొని తమ్ము ఆదినుండియు నాదరించుచున్న శ్రి వేంకటగిరిప్రభువు లేమి, శ్రీ లక్ష్మీనరసారెడ్డిగారివంటి పోషకులేమి, గునుపాటి యేనాది రెడ్డిగారివంటి మిత్రరత్నములేమి ఇంకను శిష్యసమూహమేమి బంధుకోటియేమి నిండియున్న తావున స్వజనమునడుమ నుండం దలంపుగొనియుండిరి. ఇట్లుండగా 1914 సం. న ఐరోపీయ మహాసంగ్రామము ప్రారంభమాయెను. మదరాసునకు సమీపముగా పోవుచుండిన జర్మనునౌక ఎండన్ అనుదానినుండి శత్రువులు చెన్ననగరముపై మూడుగుండ్లనుపేల్చిరి. మదరాసు అపాయకరమైన ప్రదేశమనితలంచి శాస్త్రులవారు, ఎట్లును నెల్లూరికేగ దలంచియుండిరి గాన, అంత పెద్దయచ్చాపీసును నెల్లూరికి మార్చుకొనిరి. ఈమార్పుచే వారికి నష్టమేవచ్చినది. గుమాస్తాలుగా చేరినవారు పలువురు వంచకులై ద్రవ్యమునేమి, పుస్తకముల నేమి, యంత్రభాగములనేమి, పనిముట్లనేమి, పెక్కింటిని హరించిరి.
కుటుంబమునువృద్ధియైనది. శాస్త్రులవారికి వేంకటరమణయ్యగారు ఏకైకసంతానము. వారికి తమమిత్త్రులు కీ.శే.శ్రీ శేషగిరిశాస్త్రులవారి కడగొట్టు కొమార్తె సరస్వతమ్మను వివా హముగావించిరి. శృంగారనైషధ ప్రకటనకాలమునకు 1913 సం. జనవరికి, ఏతజ్జీవితచరిత్రరచయితను నేను జనించి రెండు మూడు నెలలై యుండినవి. శాస్త్రులవారికి అఱువది సవత్సరములై యుండినవి. తాతగారైరి కాని మంచి యారోగ్యము నందుండిరి.
1914 సం. నవంబరు 18 తారీఖున నెల్లూరు, మూల పేటలో నొకగృహమున నచ్చాపీసును స్థాపించిరి. మదరాసులో నున్నంతకాలము అచ్చాపీసు ఎట్లెట్లోజరుగుచుండెను. ఆంధ్ర దేశమందలి విద్వాంసులెల్ల తమతమ గ్రంథములను జ్యోతిష్మతి ముద్రాక్షరశాలయందే ముద్రింపించుకొనుచు వచ్చుచుండిరి, నెల్లూరికి వచ్చినంతనే ఆపని దొరకదాయెను. సొంతగ్రంథములకు మాత్రమేయైనచో ఆయచ్చాపీసు చాలదొడ్డది. వ్యాపారస్తులవలె కనబడిన గ్రంథములనెల్లను తాతగారు ముద్రింపరు. తాము పరిష్కరించి సరిజూచినగ్రంథములే తమ పేరిట నచ్చుకావలయునని నియమము. ఈకారణముచే సొంతప్రచురణముల సంఖ్య తక్కువగానే యుండెను. వాని విక్రయముచే నచ్చాపీసంతయు జరుగునంత వ్యాపారము లేదాయెను. ఇది మొదలు చిక్కులు ప్రారంభమైనది. పెద్దయచ్చాపీసుకు పని పెట్టవలెను, తగిన వరుంబడిలేదు.
వేంకటరాయశాస్త్రులవారు ప్రారంభించిన గ్రంథముద్రణ వ్యవసాయమునకు ఆటంకము లెట్లువచ్చినవో చూడుడు. ఇట్టిసమయమున శాస్త్రులవారికి, వారిపోషకులును బహుకాల మిత్త్రులునునైన, శ్రీ వేంకటగిరి మహారాజా, కీ.శే. శ్రీ రాజగోపాలకృష్ణయాచేంద్ర బహద్దరువారు సాయపడిరి.
కథాసరిత్సాగరమును తొలుత ముద్రించినకాలముననే (1891 సం.) శాస్త్రులవారికి శ్రీ మహారాజావారి యాదరము లభించినది. అదిమొదలు ఒక్కొకగ్రంథము ముద్రితమైన వెంటనే శాస్త్రులవారొకప్రతి శ్రీ మహారాజావారికి పంపుటయు శ్రీ వారు వానింబఠించి విమర్శ పూర్వకాభిప్రాయములను తెలుపుటయేగాక పారితోషికములంగూడ పంపుచుండిరి.
శ్రీ శాస్త్రులవారి శాకుంతలముంగాంచి శ్రీ రాజాగారు వీరిని సన్మానించిన విధము శాస్త్రులవారి వాక్యములలోనే ముద్రించుట మనోహరము. "నేను నాయాంథ్రాభిజ్ఞాన శాకుంతలమును ప్రకటించి వారికి ఒకప్రతి పంపితిని. అంతటవారు నాతో సమావేశముంగోరి మదరాసు మౌంటురోడ్డు మోతీమహలులో నాకు దర్శనమొసంగి సల్లాపానంతరము నాకు కొంతధనము పారితోషిక మొసంగవచ్చిరి. నేను వారిని ఇట్లు ప్రశ్నించితిని. 'ఈగ్రంథము ముద్రితమైనది. దీనికై యిపుడునేను అధమణున్ండనుగాను. జీవనమునకై నాకు క్రిశ్చియన్కాలేజిలో కొలువున్నది. ఏలఏలినవారు నాకు ఈధనమీయవలయును. ఏలనేను కైకొనవలయును?' అంతట వారు సెలవిచ్చిరి, 'మీకు కాలేజిలో జీతము స్వల్పము. అదిమీకు కుటుంబభరణమునకే చాలదు. మీరువ్రాయవలసినది, మేము ముద్రింపవలసినది. మనమిరువురము పరస్పరసాహాయ్యముతో ఈతీరున లోకోపకారము చేయవలసినది. కావున మీరు ఈలేశమును గ్రహించుట 'యుక్తము.' ఆమాటకును ఆప్రసాదమునకును నేను అత్యంతము సంతుష్టుడనై ఆపైకమును గ్రహించితిని. అప్పటినుండి నేను ప్రకటించిన ప్రతిపుస్తకమునకును, పుస్తకాదినిమిత్త నిరపేక్షముగా సయితము, వారు అప్రార్థితముగా నాకు మెండు ధనమిచ్చుచుండిరి."
ఈప్రభువు విద్వత్పోషకుడేగాక స్వయము విద్యావంతుడు.
శాస్త్రులవారి యాంథ్రాభిజ్ఞాన శాకుంతలముపై వారి యభిప్రాయము-"ఆంధ్ర గీర్వాణములయందు తమకుగల సరసపాండిత్యము స్ఫుటంబయ్యె. మూలగ్రంథభావము పోకుండనున్నయది. ఒకానొకచోట భావభేదంబున్నను దెనుంగున కయ్యది మేఱుంగు పెట్టినట్లే కానంబడుచున్నది."
ప్రతాపరుద్రీయము వీరికే అంకిత మొసంగబడినది. దీనింగూర్చి వీరియభిప్రాయము, కొన్నిపుటలది, అముద్రిత గ్రంథచింతామణి యందు ప్రకటింపబడినది. ఇయ్యది ఏలినవారి వైదుష్యమును చాటుచున్నది. అందలివాక్యములు రెండుదాహరించెద.
"తమరంపిన ప్రతాపరుద్రీయనాటకము తెనుగుచూడబడియె. మిగులరసవంతముగా నున్నది.... కథాసంవిధాన చతు రతయందు అష్టమాంకము...చూడగా లక్షణవేత్తృతయు రసికవిద్వత్కవితయు భోధ్యమానము లగుచున్నవి."
ఉషానాటకముంగూర్చి - ఉషానాటకము సాంగముగా చిత్తగింపబడియె. అందు ప్రథమాంకములో 21 వది 'సరవిన్ వేడికిడస్సి' యనుపద్యము షడృత్వభివ్యంజక శబ్దజాలంబుతో నుత్తరాంకార్థసూచ కాంకాస్యనామకసూచ్య లక్షణత్వ సంపన్నంబై యత్యంతరసవంతంబై యపూర్వకల్పనాకల్పంబయి యున్నయది. తృతీయాంకమందున్న పద్యము 'సంజవేళ లేతజాజొంది' యనునదియు 'చందునకాత్మ బింబసదృశంబుగ' అను నదియు నీరెండు పద్యములును నసంభూతోపమాలంకారము గల్గి యస్మద్దేశ కవికల్పనా సంప్రదాయాను రూపములై హౌణ కవీశ్వర షేక్స్పియర్ ప్రముఖ వర్ణనాస్వభావ సంపన్నంబులై సొంపుగ సహృదయదయానందంబుగా నున్న యవి."-
శాస్త్రులవారి శృంగారనైషధవ్యాఖ్యను వారు చిత్తగించినవిధముంగూర్చి శాస్త్రులవారే యిట్లు తెలిపియున్నారు. "మదీయ శృంగారనైషధవ్యాఖ్యను ఆదొర చిత్తగించి దాని నిస్తనశల్యపరీక్షగావించి చదివి శోధించి, తమ్ముదర్శించుటకు నాకు నాలుగుమాసములు తీఱనందున ఆనాలుగుమాసములును వేచియుండి, అనంతరము మౌంటురోడ్డు మోతీమహలులో దర్శనమనుగ్రహించి, రెండుగంటలకాలము ఆగ్రంథమునందలి మదీయసంస్కరణ వివరణాదులను పెక్కింటిని ఉద్ఘాటించి ఉగ్గడించి, తుదకు నాకు రు 400 లు పసదన మొసంగిరి. అందు లకునేను వారితో 'ఈగ్రంథమును ముద్రించుటకు నాకు ధనము రేబాల లక్ష్మీనరసారెడ్డిగారు దయచేసినారు. గ్రంథము ముద్రితమైనది. ఏల ఏలినవారు నాకు ఈధనమిప్పుడీయవలయును?" అని యడిగితిని. అంతటవారు "మీరు, గురువులు, మేముశిష్యులము, శూన్యహస్తముతో గురుదర్శనము చేయగూడదని మీరే ధర్మమేర్పఱిచితిరి. మీయనుశాసనమును మీయెడనైన మేము నెఱవేర్పవలదా? అందుకై ఇది ఆచారము జరుపుటగాని యొండుగాదు" అనిరి ఆప్రతిభకును ఆప్రసన్నతకును సంతుష్టుడనై కృతజ్ఞతాపూర్వకముగా ఆధనమును స్వీకరించితిని"*
శ్రీ మహారాజావారి యౌదార్యముంగూర్చియు, పాండిత్యాతిశయములంగూర్చియు లెక్కలేని యుదంతములను శ్రీ తాతగారు చెప్పగా వినియున్నాడను. నైషథాది గ్రంథములలోని సంస్కరణములంగూర్చి వారడిగిన ప్రశ్నలును తాతాగారొసంగిన యుత్తరములును వినోదముగానుండును. విద్యావిషయములయందు వారికి వీరే ప్రమాణము. తాతగారికి వారు రచించిన జాబులతో నొక ప్రత్యేకగ్రంథము వ్రాయదగును.
తాతగారు ఆర్థికదురవస్థపాలైన కాలమున తమ ప్రాపకవరేణ్యులైన యావిద్వత్ప్రభువున కొకజాబువ్రాసిరి. ఆ జాబులో తమజీవితచరిత్రను సంగ్రహముగావ్రాయుచు తమ క్లేశ
- ఆముక్త - ఉపోద్ఘాతము. ములను ప్రభువునకు తెలుపుకొనిరి. ఆజాబునుండి కొంతయుదాహరించు చున్నాడను.
"నావేతనము గ్రంథక్రయమునకును జీవనమునకును రెంటికిని చాలకున్నందున అపఠిత గ్రంథ సంపాదనార్థముగాను వైద్యార్థముగాను ధనాపేక్షినై ధనమలవడునను నభిలాషచేతను విక్రమార్కాది పురాతనరాజర్షి చరిత్రాభిమానిత చేతను తచ్చరిత్రపుస్తకములను సంస్కరించి సటిప్పణములనుగా ముద్రించితిని. ఇట్టి యుద్యమమువలన మున్నున్నలేమికి, తోడు ఋణములు సయితము సంభవించినవి.
"వానిని శమమొందించుటకై ముద్రాక్షరశాల నొక దానిని నిర్మించుకొని కథాసరిత్సాగరమును కొంత ముద్రించితిని. కొంతఋణమును వెంటనే ముద్రాక్షరశాలా సామగ్ర్యసర్వస్వవిక్రయముచేత తీర్చి, శిష్టఋణమును క్రమక్రమముగా నాజీతమువలననే తీర్చుచుంటిని.......
"ఆయతి చాలనందునను తదర్థమై యూనివర్సిటీ యాశ్రయముంగోరి నాగానంద శాకుంతలాది నాటకాంధ్రీకరణముంగావించితిని. ఒకానొక కారణంబున నాగానందము ఎఫ్.ఏ. పరీక్షకిడియు ఒకానొకరి కారణంబున పరీక్షా గ్రంథనియమనాధికారులు కడమ మదీయ గ్రంథములను పరీక్షలకిడకుండిరి. ఇప్పటికిని నాగ్రంథముల నిడుటయరుదే యని శ్రీ శ్రీ యేలిన వారికి విశదమే.
ఇట్లుండగా శ్రీమంతులు అష్టాదశ భాషాధురంధరులునగు ప్రొఫెసరు శేషగిరిశాస్త్రులవారు నన్ను ఎఱుకచేసికొని నాకు మిత్త్రధేయమై తాముగా యత్నించియు శ్రీ మిల్లరు దొరవారిని హెచ్చరించియు యూనివర్సిటీ పరీక్షాధికారమును నాకు ఇప్పించినారు. ఆమూలమున నాకు ప్రతిసంవత్సరము కలిగిన యాయతిచేత పూర్వఋణములను దీర్చికొని మగత ఆర్బతునట్టు నిధిలో వైచుచుండి క్రమక్రమముగా రు 2750 (2750)ల మొత్తముకాగానే నిధిమునుకలో దానింగోల్పోయితిని. ఆ మొత్తము మూలధనముగా అచ్చుకూట మేర్పఱచుకొనను వార్ధకమున పెన్షను నొసంగని యానౌకరిని మానుకొనను సంకల్పించుచుండగానే ఆధనము నష్టమయినందున నౌకరియందే నిలిచి కాలక్షేపము చేయుచుంటిని.
"ఇట్లెల్ల కాలమును తత్తత్కాలదీనతం దొలగించుకొను యత్నములచేత వ్యాపృతుడనైనందున భూలోకావతీర్ణ యుష్మద్రూపవిద్వత్కల్పకముయొక్క కరుణామరందలహరీ బహుళమైన కాదంబర్యాంధ్రీకరణాజ్ఞప్తి పుష్పము మచ్చిరముననే వ్రాలినను దానిని కైసేసికొనలేకయు ఫలమును తలయెత్తిచూడలేకయునుంటిని. ఇందఱుండగా నన్నేచేయుమని సర్వజ్ఞసిం హాసనమునధిష్ఠించియున్న పుంభావరూప భారతి ముదలయిడుటకన్న నాకు మహాభాగ్యమొండు గల్గునా? అంతకన్నను భాగ్యముండునేని అది యాముదల నెఱవేర్చుటయేగాని యొండుగాదు.
అర్ధకృతములైన పనులనుమందముగా నేనియు సమాప్తి కావించుకొనుటకై చేయచున్న ప్రయత్నములలో ఊబిలోబడిన యేనుగు చందమున మఱియుమఱియు నష్టిజంబాలముననేమునింగి, ఋణములపాలై రోగపీడుతుడనై తుదకు ఎమ్‌డన్‌నౌకవలని యత్యాహితసమయంబున కర్మకరులు కొలది దినములు పలాయితులగుడు తద్వ్యాజమున ముద్రాక్షరశాలను మూసివైచితిని ...... ముద్రాక్షర వ్యాపారమునకన్న జీవనాంతరము లేనివాడను, తద్వ్యాపారసాధనముకూడ కోలుపోవలసిన దశ ఈనెలలో ప్రాపించియున్నది. ఇంకనుం గ్రంథములు రచింపందలపులుంగలవు.
ఈసమయమున నన్ను శ్రీశ్రీశ్రీ యేలినవారు నిలువంబెట్టి కడచినసంవత్సరము నామీద మదరాసులో దర్పణ ప్రాసాదమందు, పొలయించిన వాక్ప్రసాదమును చిత్తమున నవధరించి, నాకు కొంచెముఋణమును రూప్యపంచసహస్రీపరిమితమును వృద్ధిరహితముగా సముచిత ప్రత్యర్పణకాల నిర్దేశపూర్వకముగా దయచేసిన నాకుంగలిగియున్న యీ సకలక్లేశ ములనుం దొలంచుకొని, ఇదిమొదలుగా మూడుమాసములకు కాదంబర్యాంధ్రీకరణమునకు ధృతదీక్షుండనై అవిలంబితముగా దానిని ముగించి జగద్విశ్రాంతమయిన భవత్కీర్తిచంద్రికను సాంద్రతరీకరించెద.
(1) ఈభాషకు సమగ్రమైన వ్యాకరణములేదు.
(2) అట్టి యలంకారశాస్త్రమునులేదు. ఉన్నట్టి యలంకారగ్రంథములు ధనార్థులచే దొరలం బొగడుటకు సాధనములుగా వ్రాయబడినవేగాని విషయమునెల్ల విపులముగా సుబోధముగా చర్చించి విశదీకరించుటకు వ్రాయబడినవి కావు.
[ఈచోట ప్రసక్తానుసారము స్మృతిగోచారమయిన విషయమొకటి విన్నవించెద, - ఈనడుమ బ్ర.శ్రీ వెల్లాల సదాశివశాస్త్రులవారును శేషశాస్త్రిగారును సరసభూపాలీయమునుగూర్చి వ్రాతమూలకముగా కావించిన చర్చలో ఆచర్య ముగింపునకు రాకముందే మదరాసులో వారితోడి సంభాషణలో నాకుందెలియవచ్చిన దేమనగా, - వారు మత్కృతాక్షేపములను మదీయసిద్ధాంతములుగా భావించి అట్లే శ్రీమత్సన్నిధిలో ప్రకాశపఱిచిరను విషయము. నాసిద్ధాంతమని వారు తలంచినది నాసిద్ధాంతముగాదు. ఆయాతావుల వారు అవలంబించిన మార్గమువలన వాస్తవసిద్ధాంతస్థానమును ఆపాదించునట్టి తద్విపరీతమును నేను హెచ్చరించితిని. వారావిషయమును ఒండుగా భావించినందున ఆచర్చనువారి యిచ్చచేత అంతటితో విరమించితిని. ఈవిషయము శ్రీమత్సన్నిధిని విన్నవించుటకు నాకు అవకాశములేనందున ఇచ్చోటం దెలుపుకొంటిని.]
(3) మన్ముద్రితగైర్వాణ ప్రియదర్శికానాటిక ముద్రణమార్గమున సంస్కృతనాటకములను పెక్కింటిని శాకుంతల మాలతీమాధవ మహావీరచరి త్రోత్తరరామచరిత్రాదులను మూల విరుద్ధార్థముగా నాంధ్రీకృతములైనట్టివానిని - వాస్తవార్థబోధకముగా వ్యాఖ్యాసమేతముగా... ప్రకటింపవలసి యున్నది.
(4)వ్యుత్పత్తులనొసంగునట్టి నిఘంటు వొకటి నిర్మింపవలసియున్నది.
(5) శ్రీమదాంధ్ర మహాభాగవతమును* సాధుపాఠనిర్ణయ పూర్వకముగాను గూడార్థబోధనపూర్వకముగాను ప్రకటింప వలసియున్నది.
(6) ఇంకను ఎల్లవారికిం బఠనీయముగా సకలనాటక కథావళి రచింపవలసియున్నది. ఇప్పుడున్న నాట కాంధ్రీకరణములలో కథయుంజెడియున్నది.
(7) శిశుపాలవధాది కావ్యములను సంస్కృతాంధ్ర వ్యాఖ్యా నాంధ్రటీకాసమేతముగా ముద్రింపవలయును.
(8) అమరకోశమునకు ఆంధ్రగైర్వాణమయమైన సుబోధ వ్యాఖ్య రచింపవలయును.
(9) కాశీఖండ సోమహరివంశ పాండురంగ మాహాత్మ్యాది దివ్యప్రబంధములను విషమపదటీకలతో సుముద్రిత
- భారతముగానుండునా? ములంజేయవలయును.- ఇత్యాదికృత్యము లెన్ని యోకలవు. ఆయుశ్శేషమును వీనిచే కొంత సఫలీకరించుకొనుట యొప్పును. ఆప్రాప్తి నేను పైని నివేదించిన మదీయమనోరథము శ్రీమత్కటాక్షాంకితమయినం గలుగును. ముందుగా కాదంబరి నాంధ్రీకరించెద; నావేడినఋణమును మదీయ బహుగ్రంథసంచయ విక్రయముచేతను, పయి నేనువ్రాసిన గ్రంథరచనలచేతను ఇట నాకు అచ్చుపనులను మన్మిత్రు లనేకులు సమకూర్పం గడంగి యున్నారు. కావున ఆపనుల యాయతి చేతనుందీర్చెదను. నావ్యాపారము ప్రకృతమున నదీమాతృకమయిన సుకృష్ట సుక్షేత్రము విత్తనములేక చల్లకము మానినందున కంపతంపరమయిన రీతింబొందియున్నది.
శ్రీశ్రీ యేలినవారు పరిషత్తునకు మహాధనమొసంగి యున్నారు. నెల్లూరు హైస్కూలు నిర్వహించుచున్నారు. ఆంధ్రదేశమందు ఎచటివారు రచించినదైనను ఆ నూతనగ్రంథమునకు పోషకులరై యున్నారు. నాకు నిరంతరము ఏకాశ్రయులు........ పరిషదాదులు ఏమిచేసినవో ఏమిచేయగలవో దివ్యచిత్తమునకు విసదమైయేయున్నది. శ్రీశ్రీశ్రీ యేలినవారు అనుగ్రహించు ప్రత్యుత్తరమును ఎదురుచూచుచున్నాడను.
- వేదము వేంకటరాయశాస్త్రి
- [జ్యోతిష్మతీ ముద్రాక్షరశాల, నెల్లూరు.] ఈజాబునకు శ్రీమహారాజావారు, హృదయము కరగి, 1915 సం. ఏప్రిలునెల 25 తేది వేయిరూప్యములు బహుమతిగాను రెండువేల యైదువందలరూప్యములు అప్పుగాను నొసంగిరి. శాస్త్రులవారు శ్రీ మహారాజావారికి కృతజ్ఞులై తమ చిక్కులను సడలించుకొని వ్యాపారమును సాగించుటకు ప్రారంభించిరి.
ఇక్కాలమున శ్రీ మహారాజావారి చిత్తము రంజింపగోరి వెలమవీరుల గొప్పతనము ప్రకటించునదైన బొబ్బిలి యుద్ధనాటకమును వ్రాసిరి. అందు సూత్రథారునిచే శ్రీ మహారాజావారిని ప్రశంసింపించిరి. ఈగ్రంథము ప్రకటించుటకు కొంతముందే శాస్త్రులవారు సూర్యరాయాంధ్రనిఘంటు సంపాదకులగుటయు, తన్మూలమున మరల నచ్చాపీసుతోగూడ శాస్త్రులవారు చెన్న పట్టణమునకు నివాసము వచ్చుటయు జరిగినవి. శ్రీ మహారాజావారు కోరిన కాదంబర్యాది గ్రంథముల రచనసాగుటకు కొంతయాలస్యము కాజొచ్చెను. శాస్త్రులవారు నిఘంటు సంపాదకత్వము నంగీకరించుటకు ప్రోత్సహించినవారిలో శ్రీ రాజాగారు ప్రథానులు.
ఈవిధముగా కొంత కుదురుపాటుతో శాస్త్రులవా రుండిన కాలమున శాస్త్రులవారి కొక పిడుగుదెబ్బ తగిలినది; వారికి ఆధారముగానుండిన కల్పవృక్షము కూలిపోయినది; శ్రీ మహారాజావారు ఆకస్మికముగా పరమపదించిరి. శాస్త్రిగారికి కొంత కాలము వఱకును ఇతికర్తవ్యతాజ్ఞానము లేకయుండినది. అట్టి విద్వత్ప్రభువును పోగొట్టుకొని నందులకు చింతింపనివా రుం దురా ? ఆముక్తమాల్యదను ప్రకటించు సందర్భమున వారిని స్మరించుచు నిట్లు శాస్త్రులవారువ్రాసిరి. "వారు జీవించియున్న నాకేమియు కొఱతయుండదు. దిగులులేక గ్రంథములు రచించుచు, ప్రకటించుచు, ఈయంత్యకాలమున లేమికి బొమ్మగట్టి ఋణమన్న మాట యెఱుగక సంపన్నుడనై నిశ్చింతుడనుగా నుందును. ఈ యల్పపుణ్యునికి అట్టియదృష్టము ఏలకలుగును!"
శ్రీ గునుపాటి యేనాదిరెడ్డి గారు ఆంధ్రప్రకాశికలో శ్రీ రాజాగారింగూర్చి ఇట్లువ్రాసిరి - "ఈమహారాజుగారి పరిచయము ఇరువది సంవత్సరములుగ గలిగియుంటిని. విద్యావిషయముగ నే నెపు డేమివ్రాసినను వెంటనే సాదరముగా సమాథానము వ్రాయుచుండిరి .....వీరు సంస్కృతాంధ్రములయందు అసదృశపాండిత్యము కలవారయి రసౌచిత్యగ్రహణమునందు నిపుణులయి విద్వద్వరేణ్యుల ప్రశంసాపాత్రులయి యుండిరి. మహాకవుల నెక్కువగ గారవమున ఆదరించుచుండిరి. ఆంధ్రసాహిత్య పరిషత్ప్రథాన పోషకులయియుండిరి. ఇట్టి భాషాపోషకులు మనదేశమున అరుదుగాగలరనుట సాహసముకాదు.
వీరు రచించిన తైర్థికవినోదిని మొదలగు గ్రంథములం జదివిన వీరికల్పనావైదగ్ధ్యము విశదమగును....."అని.
వీరి యకాలమరణముచే భాధితులైన వారలలో శ్రీ శాస్త్రులవా రొకరు.
'చింతిలనేమిగల్గు విధిచేత బలీయము.'
- ____________